కాంగ్రెస్ ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టనున్న రాములమ్మ
విజయశాంతి ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లీడింగ్ హీరోయిన్‌గా వెలుగొంది లేడీ అమితాబ్ అనిపించుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో, ఉద్యమకారిణిగా తనకంటూ ఓ ప్రత్యేక స్ధానం సంపాదించుకున్నారు. 2009లో టీఆర్ఎస్ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి మళ్లీ ఇంత కాలానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీగా చట్టసభలో అడుగుపెట్టబోతున్నారు. 16 ఏళ్ల తర్వాత పొలిటికల్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.
సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన విజయశాంతి
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి ఆ తర్వాత ఎక్కడా పెద్దగా కనిపించలేదు. గాంధీభవన్‌లో జరిగిన పార్టీ కార్యక్రమాలకు సైతం హాజరైన సందర్భాలు చాలా తక్కువే. రేవంత్ రెడ్డి సర్కారు మహిళలకు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల విషయాలపైనా ఆమె ఎక్కడా మాట్లాడలేదు. దీంతో యాక్టివ్ పాలిటిక్స్‌కు విజయశాంతి దూరంగా ఉంటున్నారని అందరూ భావించారు. దానికి తగ్గట్లే ఆమె సినిమాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నట్లు కనిపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో మరోసారి అనూహ్యంగా తెరపైకి వచ్చారు.
కేబినెట్ విస్కరణపై అధిష్టానంతో ప్రభుత్వం పెద్దల చర్చలు
ఢిల్లీ స్ధాయిలో ఉన్న పరిచయాలతో రాములమ్మ ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్నారనే టాక్ పార్టీలో ఉంది. తాజాగా కేబినెట్ విస్తరణ జరగనున్న నేపథ్యంలో మరోసారి రాములమ్మ పేరు చర్చకు వస్తోంది. తెలంగాణ లేడీ సూపర్‌స్టార్ కేబినెట్‌లోకి రాబోతున్నారనే చర్చ హాట్ టాపిక్‌గా మారిందట.16 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చట్టసభల్లోకి అడుగుపెట్టబోతున్న రాములమ్మ.. తన మార్క్ చూపించుకోవాలనే భావనలో ఉన్నారట. తన పొలిటికల్ కేరీర్‌లో లాంగ్ ఇన్నింగ్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. అందుకు తగ్గట్లుగానే తన యాక్షన్ ప్లాన్ రూపొందించుకున్నారంటున్నారు.
ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్న విజయశాంతి
కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమర్‌రెడ్డిలు చర్చలు జరుపుతున్నారు. ఢిల్లీలో చర్చలు జరుగుతున్న నేపధ్యంలో రాములమ్మ కూడా ఢిల్లీ స్థాయిలో మంత్రాంగం నడుపుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవి కోసం లాబీయింగ్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం 12 మంది ఉన్నారు. కేబినెట్‌లో గరిష్టంగా 18 మంది వరకు ఉండొచ్చు. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు ఖాళీలను భర్తీ చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ వివిధ నాయకుల పేర్లను పరిశీలిస్తోంది.
సోనియా గాంధి, రాహుల్ గాంధీలతో సన్నిహిత సంబంధాలు
హైకమాండ్ పరిశీలనలో విజయశాంతితో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, సుదర్శన్ రెడ్డి వంటి పేర్లు కూడా ఉన్నాయంటున్నారు. వీళ్లలో రాములమ్మకు మాత్రం బెర్త్ కన్ఫామ్ అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె కాంగ్రెస్ హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. విజయశాంతి తన రాజకీయ అనుభవం.. సోనియా గాంధీ,రాహుల్ గాంధీలతో ఉన్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించి మంత్రి పదవి సాధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
కేసీఆర్ ని ప్రశ్నించే గొంతు అవుతారనా
ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న చర్చల్లో వివిధ సమీకరణాలను బెరీజు వేసుకుంటూ కేబినెట్‌లో సమతుల్యం ఉండేలా చూడటానికి హైకమాండ్ మంతనాలు సాగిస్తోంది. విజయశాంతికి రాజకీయ అనుభవం, తెలంగాణ ఉద్యమంలో ఆమె పాత్ర, సినీ గ్లామర్ రేసులో ముందుండేలా చేస్తున్నాయంటున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో బీఆర్ఎస్ నేతలైన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను ఎదుర్కొనే సమర్థమైన నేతలు లేరని కాంగ్రెస్ అధి నాయకత్వం భావిస్తోందట. విజయశాంతి లాంటి వ్యక్తిని మంత్రిగా నియమిస్తే కేసీఆర్‌ను ప్రశ్నించే గొంతు అవుతారని కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయంగా కనిపిస్తోంది. మరి ఢిల్లీలో రాములమ్మ లాబీయింగ్ ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.