Rajiv Yuva Vikasam Scheme: ఎట్టకేలకు రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి మార్గ దర్శకాలు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ పథకం కింద జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈ బీసీ జనాభా ప్రాతిపదికన ఖరారు చేయాలని నిర్ణయించింది. కేటాయించిన లక్ష్యాలను కలెక్టర్లు.. మున్సిపాలిటీలు, మండలాల్లో సంక్షేమ వర్గాల జనాభా మేరకు యూనిట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.
మార్గ దర్శకాలు రెడీ
రేవంత్ సర్కార్ ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి కీలక అడుగు పడింది. లబ్ధిదారుల ఎంపికపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. చివరకు వాటికి ఫుల్‌స్టాప్ పెట్టేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రత్యేక పోర్టల్ (https://tgobmms.cgg.gov.in/) ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తోంది. వచ్చే నెల ఐదు వరకు వాటిని స్వీకరించనుంది. ఏప్రిల్ ఆరు నుంచి మే 20 వరకు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది.
ఎంపికైన లబ్ధిదారులకు తెలంగాణ ఆవిర్భావం రోజు జూన్ 2 నుంచి మంజూరు పత్రాలను లబ్దిదారులకు అందజేయనుంది ప్రభుత్వం. ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
ఈ స్కీమ్‌కు సంబంధించి యువతీ యువకుల అర్హతలు, వయో పరిమితి, ఆదాయ పరిమితి, యూనిట్లకు ఇచ్చే రాయితీలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం వంటి అంశాలపై మార్గదర్శకాలను జారీ చేసింది. రూ.50 వేలలోపు యూనిట్‌కు 100 రాయితీ ఇవ్వనున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. మిగతా యూనిట్లకు కూడా 70 నుంచి 90 వరకు రాయితీ ప్రకటించింది.
ALSO READ: ఆస్తి పన్నుదారులకు గుడ్ న్యూస్, భారీ డిస్కౌంట్
ఎవరు అర్హులు
రాజీవ్ యువ వికాసం పథకం కుటుంబంలో ఒక్కరికే మాత్రమే వర్తించనుంది. ఎంపికైన అర్హుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు. ఆధార్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే.
దరఖాస్తుతో పాటు రేషన్ కార్డు వివరాలు కచ్చితంగా నమోదు చేయాల్సిందే. రేషన్‌కార్డు లేకుంటే మీ-సేవ ద్వారా జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ పత్రం ఉండాలి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పాటైన తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు. దరఖాస్తు సమయంలో పాస్‌పోర్టు సైజు ఫొటోను అప్‌లోడ్ చేయాలి.
ట్రాన్స్‌పోర్టు విభాగానికి చెందినవారైతే డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి. అదే వ్యవసాయ అనుబంధ యూనిట్లకు పట్టాదారు పాసు పుస్తకం తప్పనిసరి. దివ్యాంగులు అయితే సదరు సర్టిఫికెట్‌ను సమర్పించాలి. వ్యవసాయేతర స్కీమ్‌కు జులై 1, 2025 నాటికి 21-55 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. వ్యవసాయ, దాని ఆధారిత పథకాలకు 21-60 ఏళ్లు ఉండాలి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ ఫెడరేషన్ల సభ్యులు, ఈ బీసీ వర్గాల వారు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే వారి వయసు 21 నుంచి 55 ఏళ్లు ఉండాలి.
రాయితీల మాటేంటి?
రాయితీలు యూనిట్ విలువను బట్టి మారుతూ ఉంటోంది. రాయితీపోగా మిగతా మొత్తాన్ని బ్యాంకు రుణం ద్వారా లబ్దిదారుడికి అందజేస్తారు. లబ్ధిదారుడి వాటా అనేది ఉండదు. యూనిట్ విలువ రూ.50 వేలలోపు ఉంటే ప్రభుత్వమే 100 శాతం రాయితీ ఇస్తుంది. అదే రూ.50,001 నుంచి రూ.లక్ష వరకు 90 శాతం రాయితీ, రూ.1,00,001-రూ.2లక్షలకు 80 శాతం రాయితీ ఇవ్వనుంది. ఇక రూ.2 లక్షలపైన విలువ వాటికి 70 శాతం రాయితీ లభించనుంది.