BRS Committees: స్వేచ్చ బ్యూరో: పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన నేతలకు పదవులు ఎప్పుడు దక్కుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ వివిధ స్థాయిల్లో బాధ్యతలు ఆశిస్తున్న నాయకులకు నిరీక్షణ తప్పడం లేదు. సుమారు 8 ఏళ్లుగా రాష్ట్ర కమిటీతోపాటు అనుబంధ సంఘాలు, విభాగాల కమిటీల ఏర్పాటులో కొనసాగుతున్న జాప్యం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందా? లేక ఆశలతోనే కాలం గడపాల్సి వస్తుందా? అన్న ప్రశ్నలు క్షేత్రస్థాయి నాయకుల్లో వ్యక్తమవుతున్నాయి. యువనేతలు ఈ విషయంలో కొంత అసంతృప్తితో ఉన్నారు. పార్టీ నిర్మాణంలో యువతకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నప్పటికీ, ఆచరణలో మాత్రం వారికి బాధ్యతలు అప్పగించే విషయంలో స్పష్టత కనిపించడం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో పార్టీకి ఒక వ్యవస్థాగత రూపు ఇవ్వడంతోపాటు, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో క్రియాశీలకంగా పనిచేసే నాయకులకు బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందని పలువురు నేతలు బహిరంగంగానే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్‌ఎస్‌లో పార్టీ పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకుల సంఖ్య తక్కువేమీ కాదు. ఉద్యమ కాలం నుంచి పార్టీతో కొనసాగుతున్నవారు, అధికారంలో ఉన్నప్పుడు వివిధ హోదాల్లో పనిచేసినవారు, ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమించినవారు.. ఇలా అనేక వర్గాలకు చెందిన నాయకులు తమకు ఏదో ఒక స్థాయిలో గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నారు. గతంలో పదవులు దక్కని ద్వితీయ శ్రేణి నాయకులు, యువ నాయకులు ఈసారి తమకు అవకాశం వస్తుందని భావిస్తున్నారు.పార్టీలో రాష్ట్రస్థాయి బాధ్యతలతోపాటు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిల్లో పదవులు ఆశిస్తున్నవారు ఉన్నారు. యువజన, విద్యార్థి, మహిళా, కార్మిక, రైతు విభాగాలకు కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తే తమకు అవకాశం వస్తుందని పలువురు ఎదురుచూస్తున్నారు. అయితే నియామకాల ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది? ఎవరికి ఏ బాధ్యతలు దక్కుతాయి? అనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో ఆశావహుల్లో అనిశ్చితి నెలకొంటోంది.
అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలు, పాలనాపరమైన వ్యవహారాలతో పార్టీ కార్యకలాపాలు సాగించిన బీఆర్‌ఎస్.. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కొత్త రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించడం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయడం వంటి బాధ్యతలు పెరిగాయి. ఇలాంటి సమయంలో పార్టీకి పటిష్ఠమైన సంస్థాగత వ్యవస్థ అవసరమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ముఖ్య నాయకులు ప్రభుత్వంపై విమర్శలు, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ, ప్రతి నియోజకవర్గంలో నిరంతరం పార్టీ కార్యక్రమాలను నిర్వహించే నాయకత్వ వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉందని కేడర్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రస్థాయిలో తీసుకునే నిర్ణయాలు గ్రామస్థాయి వరకు చేరాలంటే ప్రతి స్థాయిలో బాధ్యతలు నిర్వహించే నాయకులు ఉండాలని భావిస్తున్నారు.గతంలో రాజకీయ వ్యవహారాల కమిటీ, పొలిట్‌బ్యూరో వంటి కీలక సంస్థాగత విభాగాలు క్రియాశీలంగా లేకపోవడంపై కూడా పార్టీలో చర్చ జరిగింది.
పార్టీలో యువ నాయకత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది. అయితే యువతకు కేవలం ప్రచార కార్యక్రమాలు, ఆందోళనలు, సోషల్ మీడియా బాధ్యతలే కాకుండా నిర్ణయాత్మక హోదాలు కూడా ఇవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం పనిచేస్తున్న యువ నాయకులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తే వారు మరింత చురుగ్గా పనిచేసే అవకాశం ఉంటుందని పలువురుపేర్కొంటున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాని యువనేతలు, పార్టీ కోసం పనిచేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆశలు పెట్టుకున్నారు. పార్టీ పదవులు లభిస్తే తమకు ప్రత్యేక గుర్తింపు రావడంతోపాటు, నియోజకవర్గాల్లో కార్యకర్తలను సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బాధ్యతలు లేకుండా ఎంతకాలం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలన్న ప్రశ్న కూడా కొందరిలో వ్యక్తమవుతుంది.యువ నాయకులకు బాధ్యతలు అప్పగిస్తే రాష్ట్రవ్యాప్తంగా కొత్త నాయకత్వం ఎదిగేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also read: కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చిన బోటు.. 4 మృతదేహాలు లభ్యం.. స్పందించిన మంత్రి డోలా!
మరోవైపు బీఆర్‌ఎస్ అధిష్ఠానం సంస్థాగత పునర్వ్యవస్థీకరణపై దృష్టి సారించినట్లు గతంలో ప్రకటించింది. 2026 ఏప్రిల్ 27న జరిగిన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కమిటీ మినహా మిగిలిన కమిటీలను రద్దు చేసి, సభ్యత్వ నమోదు అనంతరం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీలను దశలవారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మే నెలలోనూ సభ్యత్వ నమోదు, నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తల నియామకం, అంతర్గత కమిటీల ఏర్పాటు అంశాలపై పార్టీ నాయకత్వం చర్చించింది. అయితే ఈ ప్రక్రియలో భాగంగా ఆశావహులకు ఎలాంటి ప్రాధాన్యం లభిస్తుంది? యువ నాయకత్వానికి ఎన్ని అవకాశాలు కల్పిస్తారు? అనుబంధ సంఘాల పునర్వ్యవస్థీకరణ ఎలా ఉంటుంది? అన్న అంశాలపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది. సభ్యత్వ నమోదు, క్షేత్రస్థాయి నిర్మాణం వంటి కార్యక్రమాలు ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో అన్నీ స్థాయిల్లో పదవుల భర్తీ ఎప్పుడు పూర్తవుతుందన్నది నేతల్లో చర్చనీయాంశమైంది.
సీనియారిటీ, పార్టీ పట్ల విధేయత, ఉద్యమ కాలం నుంచి చేసిన సేవలు, క్షేత్రస్థాయిలో ఉన్న బలం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారా? లేక యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకే పదవికి పలువురు ఆశావహులు ఉండే అవకాశం ఉండటంతో నాయకత్వం ఎలాంటి సమతుల్యత పాటిస్తుందన్న చర్చ కూడా సాగుతోంది.పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకు గుర్తింపు ఇవ్వడంతోపాటు, కొత్త తరానికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని కొందరు నాయకులు భావిస్తున్నారు. యువజన, విద్యార్థి, మహిళా, కార్మిక,రైతు, విభాగాలకు సమర్థమైన నాయకత్వాన్ని నియమిస్తే ఆయా వర్గాల్లో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోపాటు, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడం కూడా బీఆర్‌ఎస్‌కు కీలకమైన అంశం. ఇందుకోసం నాయకులకు స్పష్టమైన బాధ్యతలు అప్పగించడం, పార్టీ అనుబంధ విభాగాలను క్రియాశీలం చేయడం, యువతకు అవకాశాలు కల్పించడం అవసరమనే చర్చ సాగుతోంది. సంస్థాగత పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వేగవంతం చేసి పదవుల భర్తీపై స్పష్టత ఇస్తే పార్టీ శ్రేణుల్లో నెలకొన్న అనిశ్చితికి తెరపడే అవకాశం ఉంది.ఏళ్లుగా పదవుల కోసం ఎదురుచూస్తున్న నాయకులకు ఈసారి అవకాశం దక్కుతుందా? యువనేతలకు కీలక బాధ్యతలు అప్పగిస్తారా? రాష్ట్ర కమిటీతోపాటు అనుబంధ సంఘాలకు కొత్త సారథులు ఎప్పుడు వస్తారు? అన్న ప్రశ్నలకు పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. అప్పటివరకు ఆశావహుల ఎదురుచూపులు తప్పదు.
Also Read: కాఫీ తాగడానికి వస్తున్నారా? లేక ఆఫీస్ రన్ చేస్తున్నారా? వైరల్ అవుతున్న కెఫే కష్టాలు!