ఈ దక్షిణాది రాష్ట్రాల్లోని సీఎంలు జనాలకు భయపడాల్సిందేనట. జవాబుదారీ పాలన అందించకపోతే అంతే సంగతులట. వారు అనుకున్న మార్పు జరిగితే ఓకే. మరో టర్ము కూడా ఉంటారు. అంటే పదేళ్ల పాటు సీఎంగా ఉంటారన్నమాట. లేదంటే ఒక్క టర్ముతో సరి. అందుకే ఒకసారి అవకాశం వచ్చిందా? దాన్ని రెండోసారికి కంటిన్యూ కావాలన్నా.. మరోసారి ఆ పార్టీ అధికారంలో ఉండాలన్నా.. భయంతో పనిచేయాలి. పాలనలో జవాబుదారీతనం కనిపించాలి. అభివృద్ధిలో మార్కు ఉండాలి. విద్య, ఉపాధిలో స్పష్టమైన ప్రభావం ఆ పాలనలో కనిపించాలి.
ఇలాంటి ప్రజా తీర్పు దేశ మంతటా ఉండదట. కేవలం దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలోనే ఇది ఎక్కువగా ఉందట. అంటే ఇక్కడ ప్రజల్లో ఒక అవగాహన, రాజకీయ చైతన్యం కూడా ఇందుకు కారణంగానే చెబుతున్నారు. మరి మిగిలిన రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటీ? అక్కడ ఎందుకు ఒక్కరే, ఒక్క పార్టే ఎక్కువ కాలం అధికారంలో ఉండగలుగుతుంది..? అంటే కులం, మతం ఆధారంగానే జరిగే రాజకీయాలే అక్కడ ఎక్కువ పాతుకుపోయి ఉన్నాయట. అంతేకాదు… ఫ్రీ రేషన్, తదితర ఉచిత పథకాలిస్తే చాలు మళ్లీ మళ్లీ వారినే ఎన్నుకుంటారట.
అందుకే అక్కడ విద్య, ఉపాధి అవకాశాలకు పెద్దగా చోటుండదు. అభివృద్ది అంతంత మాత్రమే. ఎన్నేళ్లైనా ఆ పథకాలస్తే చాలు.. రేషన్ తదితరాలు ఫ్రీగా అందిస్తున్నారా? లేదా? ఇవే ప్రామాణికాలుగా, ఎన్నికలను ప్రభావితం చేసేవిగా ఉంటున్నాయట. ఈ మాటలన్నది బీహార్‌కు చెందిన జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్
ఇటీవల ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడాయన. ఆర్థికంగా ఆయా రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయంటే.. విద్య, ఉపాధి అవకాశాలు, పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్నదంటే.. అక్కడి నేతల్లో ఆ ప్రజల భయం వెంటాడుతుందనే విధంగా ఆయన కామెంట్ చేశారు. ఒకసారి అధికారం ఇచ్చాం.. రెండోసారీ కావాలా? అయితే ఇవీ మీరు చేయాల్సివని.. అని వారికి కావాల్సిన పనులు, పురోగతిని అంచనా వేసుకుంటారట.
ఆ జనం నాడి ఎరిగి.. దానికి తగ్గట్టుగా జవాబుదారీ పాలన ఉంటేనే.. అనుకున్నవి పట్టాలెక్కితేనే.. రెండోసారికి ఆలోచన.. లేదంటే మార్పే. అధికారం నుంచి దించేసి ఇంకొకరిని ఎక్కించడమే. అలాంటి చైతన్యం ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్నాయని, అక్కడ ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే సీఎంగా చాన్స్ ఇస్తారని, ఆ తరువాత కచ్చితంగా మార్పు ఉంటుందనేది సుస్పష్టమని ఇక్కడి రాజకీయ చరిత్రే నిదర్శనంగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు పీకే.
ఇక్కడ తెలంగాణలో కూడా ఇదే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతూ వస్తున్నారు. అందరికీ రెండు రెండు సార్లు అధికారం ఇచ్చారు. ఇక్కడ తెలంగాణలో కూడా మరోసారి కాంగ్రెస్‌కు కచ్చితంగా ప్రజలు అధికారం ఇస్తారు..’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలన ను కూడా జనం తిరస్కరించి మార్పు కోరుకున్న విషయం తెలిసిందే. ఏపీలో జగన్‌కు మాత్రం ఒక్కసారే అవకాశం ఇచ్చారు అక్కడి జనం. సీఎం పదవిని ‘పది’ కాలాలు కాపాడుకోవాలంటే.. భయం, భక్తి, బాధ్యత కలిగిన పాలన ఉండాల్సిందేనని ఇక్కడి ప్రజల తీర్పు ఎప్పుడూ నిరూపిస్తూనే ఉంది.