జెన్‌జీ గురించి నిన్నటిదాకా చెప్పుకున్నాం. రాజకీయాల ప్రమేయం లేకుండా.. రాజ్యాధినేత తలొగ్గేలా చేసే సత్తా ఉందని జంతర్‌మంతర్ వేదికగా జెన్‌జీ కాక్రోచ్ పార్టీ పేరుతో చేపట్టిన ఉద్యమాన్ని చూసి దేశం నివ్వెరపోయింది. నేటి యువత అల్లాటప్పాగా తిరిగేవాళ్లు కారని ఇది నిరూపించింది. ఉడుకు రక్తం వయస్సులో పోకిరీ వేశాలు వేసే రకం కాదని, జులాయిగా తిరిగేవాళ్లు కాదు.. ప్రభుత్వాలనే గడగడలాడించి గల్లా ఎత్తుకు తిరిగే సత్తా ఉందని నిరూపించుకున్నారు.
జెన్‌జీ ఉద్యమాలు ఏదైనా సాధించగలవనే కొత్త నిర్వచనాన్నిచ్చింది ఆ జంతర్ మంతర్ ఉద్యమం. దీన్నిస్పూర్తిగా తీసుకుని జెన్ అల్ఫా ఊపిరి పోసుకుంటున్నది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఇలాంటి ఉద్యమాలు పురుడుపోసుకున్నాయి. ఇప్పుడిది తెలంగాణకూ పాకింది. ఇక్కడా గవర్నమెంట్ స్కూల్ పోరగాళ్లు రోడ్డెక్కుతున్నారు. మాకు సౌకర్యాలు కావాలె.. టీచర్లు కావాలె.. సౌలతులేవీ? అంటూ నిరసనబాట పడుతున్నారు. ఓటు హక్కు లేకున్నా.. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని అలుపెరగని పోరాటానికి ఓనమాలు దిద్దుతున్నారు. జెన్‌జీనే మాకు స్పూర్తి అంటున్నారు.
తాజాగా సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరంలో జడ్పీహెచ్ఎస్ పదవ తరగతి పిల్లలు ధర్నాకు దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. టీచర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్న విషయాన్ని జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లేందుకు పోరాట బాట పట్టారీ పోరగాళ్లు. డెబ్బై మంది పదో తరగతి పిల్లలకు ఒక్క మ్యాథ్స్ టీచర్ దిక్కు ఇక్కడ. ఇక్కడ పనిచేసే టీచర్లను డిప్యూటేషన్‌పై ట్రాన్స్‌ఫర్ చేయడంతో భగ్గుమన్నారు ఈ విద్యార్థులు. పరీక్షలు దగ్గరపడుతుంటే పాఠాలు కాకుంటే, మా చదవులేం గాను అని సర్కార్‌ను నిలదీసినంత పనిచేశారీ పిల్లలు.
తెలంగాణలో ఈ మధ్య ఇలాంటి ఆందోళనలు ఊపిరి పోసుకుంటున్నాయి. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలోని జడ్పీహెచ్‌ఎస్‌లో ఇటీవల పదవ తరగతి పిల్లలు క్లాసులను బహిష్కరించి అక్కడే ధర్నాకు దిగారు. సబ్జెక్టు టీచర్ల కొరత, పూర్తికాని సిలబస్‌పై ఆందోళనకు దిగారు. దీనిపై అధికారులు స్పందించి సమస్య పరిష్కరించారు కూడా.
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని మునిగడపలో తెలుగు పండిత్ పోస్టు భర్తీ చేయాలని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల విద్యార్థులు గ్రామ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. ఆదిలాబాద్ జిల్లాలోని దోష్టాలలో డిప్యూటేషన్‌పై వెళ్లిన టీచర్ కోసం పోరాడారు అక్కడి విద్యార్థులు. మా టీచర్ మాకే కావాలి అని ధర్నా చేశారు.
ఈ రకమైన వినూత్న విద్యార్థి ఆందోళనలను జెన్ అల్ఫా ఉద్యమాలుగా అభివర్ణిస్తున్నారు. 2010 తరువాత జన్మించిన పదిహేనేళ్ల లోపు పిల్లలను ఈ పేరుతో సంబోధిస్తున్నారు. గత నాలుగైదు నెలలుగా అంటే.. జంతర్ మంతర్ వద్ద జెన్ జీ ఆందోళన తరువాత జెన్ అల్ఫా ఆందోళనలు ఊపందుకున్నాయి. ప్రధానంగా పాఠశాలల దుస్థితి, లోపాలు, సౌకర్యాలపై ఆందోళనలు జరుగుతున్నాయి.
దేశంలోని కనీసం 10కి పైగా రాష్ట్రాల్లో 25కు పైగా జిల్లాల్లో ఇలాంటి పాఠశాల విద్యార్థుల నిరసనలు జరిగాయి. వీటిపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కూడా స్పందించారు. కొన్ని పాఠశాలలను ఆయన కూడా సందర్శించి వెంటనే మౌళిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల ఈ పాఠశాలల దర్శనను బీజేపీ శ్రేణులు అడ్డుకోవడం, గొడవకు దారి తీయడం, ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం చర్చకు దారి తీసింది.
ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో, మహారాష్ట్రలోని పార్లి వైద్యనాథ్ విద్యాలయ విద్యార్థులు, బిహార్ లోని సిమువరా గ్రామంలోని పాఠశాల పిల్లలు ఆందోళన బాట పట్టారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా జెన్ అల్ఫా విద్యార్థులు పాఠశాలల బాగుకోసం రోడ్డెక్కుతున్నారు.
కేవలం టీచర్ల కొరత మాత్రమే కాకుండా.. పాఠశాలల్లో తాగునీరు, విద్యుత్, బెంచీలు లేకపోవడం, కూలిపోతున్న భవనాలు, సరైన రోడ్లు లేకపోవడం వంటి ప్రాథమిక హక్కుల కోసం జెన్ అల్ఫా పోరాట పంథాను ఎంచుకున్నది.
జెన్‌జీ మాదిరిగానే వీరి వెనుక ఎలాంటి రాజకీయ శక్తులు లేకపోవడం, కనీసం సంప్రదాయ విద్యార్థి సంఘాల తోడు కూడా లేకుండానే స్వచ్చంధంగా పోరాట బాట పట్టడంతో వీరి ఆందోళనలకు సత్వర స్పందన లభిస్తోంది. వెంటనే ఉన్నతాధికారులు స్పందిస్తున్నారు. అందుకే అల్ఫా ఉద్యమాలు కూడా ఇక దేశంలో విరివిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.