KCR: గులాబీ పార్టీ ఎన్నికల ఫండ్ వ్యవహారం అధినేతకు తలనొప్పిగా మారిందట.. పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు పంచి గెలవాలనుకున్న బీఆర్ఎస్ పార్టీకి నేతల మధ్య విభేదాలతో మిశ్రమ ఫలితాలు వచ్చాయి.. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతాప్‌రెడ్డి వర్గానికి పార్టీ ఫండ్ ఇచ్చి, తమకు మొండి చూపించారని ఎమ్మెల్సీ యాదవరెడ్డి రాజీనామా చేస్తాను అనడంతో పంచాయతీ రచ్చకు ఎక్కిందంట.. అసలు గజ్వేలు నియోజకవర్గం బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో డబ్బుల లొల్లి స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కొత్త తలనొప్పిగా మారిందట. సొంత నియోజకవర్గం నేతల్లో లుకలుకలు… సర్పంచ్ ఎన్నికల్లో పార్టీ ఫండ్ పంపకాలపై గొడవలు అయనకు చికాకు తెప్పిస్తున్నాయంట. గజ్వేల్ సెగ్మెంట్లోప్రతాప్ రెడ్డి వర్సెస్ యాదవ రెడ్డి మధ్య పార్టీ ఫండ్ డబ్బు ల విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయట. ఇరువురి మధ్య డబ్బులు పంపకాల విషయంలో తేడాలు రావడంతోనే మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచుల సన్మాన కార్యక్రమం సభాను వాయిదా వేయాల్సి వచ్చిందనే టాక్ జోరుగా నడుస్తుందట.
ప్రతాప్‌రెడ్డి, యాదవరెడ్డిల మధ్య వార్ నేపథ్యంలోనే సర్పంచుల సన్మాన సభ వాయిదా పడడంతో.. గజ్వేల్ బీఆర్ఎస్‌లో అసమ్మతి సెగలు నివురు గప్పిన నిప్పులా రాజకుంటున్నాయంట. ఆ క్రమంలో పార్టీలో ఉంటూ ఆగం చేస్తున్న వారికి పగ్గాలు అప్ప జెప్పిందని అధిష్టానం వైఖరిపై కొంతమంది నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. పార్టీ కోసం పని చేస్తున్న తనకు ప్రాధాన్యాత ఇవ్వకుండా….నిందలు మోపడం ఎంతవరకు సమంజసమని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో యాదవ రెడ్డి, ఒంటేరు ప్రకాష్ రెడ్డిల మధ్య తీవ్ర మనస్పర్ధలు ఏర్పాడినట్లు చెప్తున్నారు. సర్పంచ్ ఎన్నికలకు పార్టీ రూ.2 కోట్లు ఫండ్ ఇచ్చినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. కానీ, ఆ మొత్తాన్ని ప్రతాప్‌రెడ్డి తన వర్గంలో ఇష్టం వచ్చిన వారికి మాత్రమే ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. యాదవరెడ్డికి ఈ ఫండ్ వచ్చినట్లు సమాచారం లేదు. అయితే ఆయన ప్రచారానికి వెళ్లిన గ్రామాలలో నాయకులు, కార్యకర్తలు అడిగిలే పార్టీ ఫండ్ రాలేదని చెప్పినట్లు సమాచారం. ఆ క్రమంలో ఎమ్మెల్సీకి ఈసమాచారం లేకపోవడంతో ఆయన ప్రాధాన్యతపై రకాల ప్రచారాలు మొదలయ్యాయట.
హరీశ్ రావు ముందు ఆవేదన వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తాను అని ఎమ్మెల్సీ యాదవ రెడ్డి చెప్పినట్లు చర్చ నడుస్తుందట. ఈ మధ్య గెలిచిన సర్పంచుల సన్మాన కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు. అయితే, దీనిపై ఎమ్మెల్సీ యాదవ రెడ్డికి సమాచారం లేదు. మనస్థాపానికి గురైన ఆయన సూజీ మంత్రి హరీశ్ రావు ముందు ఆవేదన వ్యక్తం చేసుకున్నట్లు సమాచారం. తాను సభకు రానని, తనకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని, పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తున్న తనను పక్కన పెట్టి వెన్నుపోటు పొడిచే వారికి ప్రాధాన్యత ఇస్తుండటలో అధిష్టానం వైఖరి అర్థం కావడం లేదని ఆయన మధన పడుతున్నారట. తన సేవలు పార్టీకి అనవసరం అనుకుంటే తనను తప్పుకోమంటే రాజీనామా చేసి పక్కకు వెళ్తానని ఆవేదన వ్యక్తం చేశారట. హరీశ్ రావు ఎంత సముదాయించి సన్మాన సభకు రావడానికి ఆయ ససేమీరా రానడంతో అప్పటికప్పుడు సభను రద్దు చేసి వాయిదా వేశారంట
తనపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ప్రతాప్‌రెడ్డి తీరుపై అసహనంలో ఉన్న యాదవ రెడ్డి, హరీశ్ రావు ముందు తన ఆవేదనను వ్యక్తం చేశాక ఆయన పార్టీ మారతారన్న ప్రచారం ఊపందుకుందట. దానిపై ఆయన స్పందించారు. తాను పార్టీ మారుతాను అనడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. అది తన వ్యతిరేకులు బురదజల్లే ప్రయత్నమేనని, పార్టీ కోసం నిస్వార్థంగా పని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. పార్టీని వెన్నుపోటు పొడిచే వారిని చూస్తూ ఊరుకున్న వారుకూడా ద్రోహం చేసిన వారే అవుతారనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
మొత్తానికి పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఫండ్ వ్యవహారం యాదవ రెడ్డి, ప్రతాపరెడ్డిల మధ్య పెద్ద చిచ్చే రాజేసిందంటున్నారు. ఇద్దరు నేతల వైఖరితో గజ్వేల్ నియోజకవర్గం గులాబీ శ్రేణుల్లో అయోమయం నెలకొందట. డబ్బు కొందరికి ఇవ్వడం ఏంటని సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్ధులు, వారి కార్యకర్తలు నేతలపై ఫైర్ అవుతున్నారంట. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకపక్ష ధోరణి అవలంభించడం ఎంత వరకు సమంజపమని ఆవేదన చెందుతున్నారంట. దాంతో అందరినీ పిలిపించుకొని ఫామ్ హౌస్ లో త్వరలో ఒక మీటింగ్ పెట్టుకుందామని, ఈ విషయమై ఎక్కువ రచ్చ జరగకుండా కట్టడి చేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, మాజీ మంత్రి హరీష్ రావులు కార్యకర్తలతో చెప్పారంట. అయినా కేసీఆర్ సొంత నియోజకవర్గం బీఆర్ఎస్‌లో అగ్గి చల్లారకపోవడం గమనార్హం.