Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ మారబోతుందా? ఇప్పటివరకు ఏపీ పైన ఫోకస్ పెట్టి హండ్రెడ్ పర్సెంటట్ స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుపొందిన జనసేన పార్టీని, తెలంగాణలో విస్తరించాలని పవన్ నిర్ణయించుకున్నారా? తాజాగా తెలంగాణలోని అన్ని కమిటీలు రద్దుచేసి కొత్త కమిటీలు వైపు పవన్ ఎందుకు అడుగులు వేస్తున్నారు? జీహెచ్ఎంసీ ఎన్నికలపై పవన్ ప్లాన్ ఏంటి ? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సెటిలర్స్‌పై జనసేన కన్నేసిందా? పవన్ రెండు రాష్ట్రాల వ్యూహం సక్సెస్ అవుతుందా? బేడిసి కొడుతుందా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఏపీలోనే ఫోకస్ పెట్టారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది, కూటమిలో కీలక నేతగా ఎదిగి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.. మొన్నటి వరకు ఏపీలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని భావించిన పవన్… ఇకపై ఏపీతోపాటు తెలంగాణలో కూడా పార్టీ బలోపేతం పై ఫోకస్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2022 తర్వాత పూర్తిగా ఏపీ మీదే ఫోకస్ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఏపీలో అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత తెలంగాణ మీద పూర్తిస్థాయి ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే తెలంగాణలోని అన్ని కమిటీలను రద్దుచేసి వాటి స్థానంలో కొత్త కమిటీలు వెయ్యబోతున్నట్లు సమాచారం. తెలంగాణ లోని జీహెచ్ఎంసీ, వీరమహిళ, యువజన, విద్యార్థి విభాగ కమిటీలను రద్దు చేసి, వాటి స్థానంలో కొంతమంది సభ్యులతో తాత్కాలికంగా అడ్ హాక్ కమిటీలను నియామించాలని జనసేనాని నిర్ణయించారంట. 30 రోజుల పాటు అడ్ హాక్ కమిటీ లు పనిచేయనున్నట్లు తెలుస్తోంది . ఈ కమిటీలు ప్రతి నియోజకవర్గం, జీహెఛ్ఎంసీ పరిధిలోని 300 డివిజన్లలో పర్యటించి నుంచి కనీసం ఐదుగురు సభ్యులతో జాబితాను సిద్ధం చేసి పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకురావాలని సూచించాంట. అంతేకాదు త్వరలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా నూతన కమిటీలను కూడా ప్రకటించడానికి జనసేన పార్టీ సిద్ధమవుతుంది.. ఏపీతో పాటు తెలంగాణ పార్టీ వ్యవహారాలు, కమిటీ నియామకాలను స్వయంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి చూస్తున్నారు..
వాస్తవానికి తెలంగాణలో జనసేన పార్టీ పై పవన్ ఫోకస్ ఆపేసి చాలా రోజులైంది.. ఏపీలో కూటమితో జతకట్టడానికి, జగన్ని అధికారం నుండి దూరం చేయడానికి ఎక్కువగా అక్కడే రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్.. తాజాగా ఏపీతోపాటు తెలంగాణలో కూడా సమాంతరంగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.. దానికి ప్రధాన కారణం, జనసేన పార్టీ తెలంగాణలో ఫోకస్ పెట్టకపోయినప్పటికీ గత నెలలో జరిగిన తెలంగాణ స్థానిక సంస్థలు ఎన్నికల్లో జనసేన మద్దతుదారులు విజయం సాధించడం, జనసేనకు ఇప్పటికీ అక్కడ మద్దతుదారులు ఉండడం ఒక కారణంగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు..
కేవలం పార్టీ మద్దతిస్తేనే ఈ స్థాయిలో అభ్యర్థులు గెలిస్తే , పార్టీ మీద ఫుల్ ఫోకస్ పెట్టి కమిటీలు ఏర్పాటు చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.. అందులో భాగంగా హైదరాబాద్ మహానగరంతో పాటు మరికొన్ని జిల్లాలలో జనసేన అభిమానులు, మద్దతు దారులు ఎక్కువగా ఉండటంతో తెలంగాణలో రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలు , సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావిస్తున్నారంట.
అయితే ఉన్నపలంగా ఇప్పుడు జనసేన పార్టీ తెలంగాణలో కమిటీలు ఏర్పాటు చేయడానికి మరో బలమైన కారణం ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతుంది..రాబోయే జిహెచ్ఎంసి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కొత్త కమిటీలు వేయడంతో పాటు, తాత్కాలికంగా అడ్‌హక్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు టాక్ వినపడుతుంది.. గ్రేటర్ హైదరాబాదులో ఉన్న 300 డివిజన్లలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాలతో పాటు, జనసేన బలంగా ఉన్న డివిజన్లను ఎంపిక చేసుకుని వాటిలో పోటీ చేయాలని జనసేన భావిస్తున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా సెటిలర్స్ ఎక్కువగా ఉన్న కూకట్ పల్లి, శేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలలో ఎక్కువ డివిజన్లలో జనసేన పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది..
అయితే ఏపీలో బీజేపీ, టీడీపీతో కలిసి కూటమిలో ఉన్న జనసేన.. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేస్తుందా? లేదా ఆ పార్టీలని కలుపుకుని ముందు వెళుతుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి కమిటీలు ఏర్పాటు చేసి జిహెచ్ఎంసి పరిధిలో జనసేన బలాబలాలను బేరీజు వేసుకుని , దానికి అనుగుణంగా ఎన్నికల్లోకి ముందుకే వెళ్లాలని ఆలోచనలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సమాచారం.. అందులో భాగంగా కేవలం జిహెచ్ఎంసి లో మాత్రమే కొత్త కమిటీల ఏర్పాటుకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా కొత్త కమిటీలు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.. ముందు జిహెచ్ఎంసి టార్గెట్గా పెట్టుకుని, తర్వాత అసెంబ్లీ ఎన్నికల పైన ఫోకస్ పెట్టాలనేది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతుంది .. ఈ అంశం పైన ఇప్పటికే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి పార్టీ నాయకులకు కొన్ని కీలక సూచనలు చేసినట్టు తెలుస్తుంది.. తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలపై వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఎజెండాతో ముందుకు వెళ్లకుండా… అంశాల వారీగా , సమస్యల మీద పోరాటం చేసే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పారట.. ఏ పార్టీతో గొడవలు లేకుండా…జనసేన పార్టీ సొంతంగా తెలంగాణలో బలోపేతం కావాలని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తోంది…
ఇక మొన్న జరిగిన పవన్ కొండగట్టు పర్యటనలో కార్యకర్తలు, నాయకులు జోష్ చూసి తెలంగాణ పై ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారట.. దాంతో తెలంగాణతో పాటు, జిహెచ్ఎంసి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి కమిటీల నియామకానికి సంబంధించిన కీలక ప్రకటన పార్టీ నుండి వెలువడిందంట… కొండగట్టులో కార్యకర్తల సమావేశంలో పవన్ చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి.. డబ్బున్న నాయకులు కాదు దమ్మున్న యువత కావాలి, తెలంగాణలో పార్టీ బలోపేతం వాళ్ల చేతుల్లోనే ఉంది అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో పార్టీ బలోపేతానికి అర్థం పడుతున్నాయి అంటున్నారు.. మొత్తానికి ఇటు ఏపీ లో బలమైన శక్తిగా ఎదుగుతూ.. పక్కన ఉన్న తెలంగాణలో భవిష్యత్తులో బలమైన పార్టీగా జనసేన ఉండాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం.. మరి పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యూహాలు, జిహెచ్ఎంసి పై ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.
Story by Vamshi,Big TV