BigTV English

Mood Of The Nation: 2025 పొలిటికల్ దంగల్.. మూడ్ ఆఫ్ ది నేషన్.. క్లారిటీ రాబోతుందా?

Mood Of The Nation: 2025 పొలిటికల్ దంగల్.. మూడ్ ఆఫ్ ది నేషన్.. క్లారిటీ రాబోతుందా?

కొత్త ఏడాదిలో జోరుగా పొలిటికల్ సినిమా

కొత్త ఏడాదిలో జరిగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కథ మార్చబోతున్నాయా.. దేశం భవిష్యత్ ను డిసైడ్ చేయబోతున్నాయా అంటే కచ్చితంగా అవునన్న సమాధానమే వస్తోంది. ఎందుకంటే కొత్త ఏడాది పొలిటికల్ సినిమా మామూలుగా ఉండేలా లేదు. అది దేశ రాజధాని ఢిల్లీ నుంచే అసలైన దంగల్ షురూ కాబోతోంది. అవును 2025 ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే ఏడాది నవంబర్ లో బిహార్ అసెంబ్లీ పోల్స్ ఉంటాయి. ఈ రెండింటి ఫలితాలు మూడ్ ఆఫ్ ది నేషన్ సంగతి తేల్చనున్నాయి. ఇక 2026 మేలో అసోం, బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇవైతే భవిష్యత్ ఎన్నికలపై పెద్ద ఎఫెక్టే చూపబోతున్నాయి.


మొన్నటిదాకా ఒక లెక్క, కొత్త ఏడాది మరో లెక్క

సో మొన్నటిదాకా ఒక లెక్క. కొత్త ఏడాది మరో లెక్క అన్నట్లుగా పొలిటికల్ సీన్ తయారైంది. జనం కూడా కన్ఫ్యూజన్ తో లోక్ సభలో ఒకలా.. అసెంబ్లీ ఎన్నికల్లో మరోలా తీర్పులు ఇచ్చిన ఘటనలు చూశాం. కానీ భవిష్యత్ ఎన్నికలు అలా కాదు. కేంద్ర ప్రభుత్వం పట్టుబట్టి మరీ జమిలి ఎన్నికలను ముందుకు తెస్తోంది. ఇప్పటికే బిల్లు కూడా పెట్టారు. జేపీసీకి దీన్ని రివ్యూ కోసం పంపారు. అక్కడ నిర్ణయం ప్రకారం అడుగులు పడబోతున్నాయి. సో దాన్ని కూడా జనం మైండ్ లో పెట్టుకుని తీర్పులు ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏవైనా ఎన్నికలు వస్తే జాతీయ అంశాలు, ప్రాంతీయ అంశాలు తెరపైకి వస్తుంటాయి. వీటితో పాటు చాలా ఫ్యాక్టర్స్ పని చేస్తుంటాయి. కానీ జమిలి ఉంటే కథ మరోలా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే 2025, 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు కొత్త గేమ్ కు తెర తీయబోతున్నాయి.

ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ట్రయాంగిల్ వార్

ఫస్ట్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వ్యవహారం చూద్దాం. 2025 ఫిబ్రవరిలో జరగబోయే ఈ ఎన్నికల కోసం పార్టీలన్నీ కసరత్తు పెంచాయి. ఓవైపు అధికార పార్టీ ఆప్, ఇంకోవైపు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. అభ్యర్థుల ప్రకటనలో బిజీగా ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ అయితే రోజుకో స్కీం ప్రకటిస్తున్నారు. స్పీడ్ పెంచేశారు. కాంగ్రెస్ తో పొత్తు ఉండదని ముందే చెప్పేశారు. సో ఢిల్లీలో ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. అక్కడి 70 అసెంబ్లీ స్థానాల చుట్టూ మ్యాటర్ తిరుగుతోంది. రాజధాని ఓటర్ల ఆదరణ తనకు ఇంకా ఉందని నిరూపించుకోవాలంటే కేజ్రీవాల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తీరాలి.

కేజ్రీవాల్ ఫ్యూచర్ డిసైడ్ చేయనున్న పోల్స్

లేదంటే ఆయనతో పాటు ఆప్‌ ఫ్యూచర్ కూడా గందరగోళంలో పడుతుంది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేసినా ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో ఒక్క సీటునూ గెలవలేకపోయాయి. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ ఒంటరిగా బరిలో దిగాలని డిసైడ్ అయింది. దీంతో దళిత, ముస్లిం ఓట్ల విషయంలో ఆప్‌ నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఆప్‌ పాలనపై ఈ రెండు వర్గాల్లో ఉన్న అసంతృప్తి కాంగ్రెస్, బీజేపీల్లో దేనికి ప్లస్ అవుతుందోనన్న ఉత్కంఠ కనిపిస్తోంది. నిజానికి ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్‌ పార్టీ ఓటింగ్‌ శాతం 10శాతానికి పడిపోయింది. ఇది ఆ పార్టీకి పెద్ద సవాలే. పుంజుకుని నిలబడేలా ప్లాన్ చేసుకుంటోంది.

బీజేపీకి 38శాతం, కాంగ్రెస్‌ కు 4 శాతం ఓట్లు

మరోవైపు ఢిల్లీ ఓటర్లు అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వేర్వేరుగా తమ రిజల్ట్ ఇస్తున్నారు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీకి 53శాతం ఓట్లు రాగా, బీజేపీకి 38శాతం వచ్చాయి. కాంగ్రెస్‌ ఓట్లు నాలుగు శాతానికి పడిపోయాయి. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు 54, బీజేపీకి 32, కాంగ్రెస్‌కు 9 శాతం ఓట్లు వచ్చాయి. మరోవైపు ఢిల్లీ పరిధిలోని లోక్ సభ సీట్లలో మాత్రం బీజేపీ మొదటి నుంచి డామినేషన్ పొజిషన్ లో ఉంది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 54శాతం ఓట్లు రాగా, ఆప్‌కు 24, కాంగ్రెస్‌కు 18శాతం ఓట్లు లభించాయి.

ఢిల్లీలో 10 – 15 శాతం మంది తటస్థ ఓటర్లు 

ఢిల్లీ ఓటర్లలో 32శాతం మంది మొదటినుంచీ బీజేపీ వెనక కాన్ స్టంట్ గా నిలుస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీకి 18 శాతం గ్యారెంటీ ఓట్ బ్యాంక్ కనిపిస్తోంది. మరో 10 నుంచి 15 శాతం మంది తటస్థ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీవైపు షిఫ్ట్ అవుతూ కనిపిస్తున్నారు. దీంతోనే అసెంబ్లీ వరకు ఆప్, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యం సాధిస్తున్నాయి. రాష్ట్రంలో పాలన, నేషనల్ ఇష్యూస్ ఢిల్లీ ఓటర్లను ప్రభావితం చేస్తున్నాయి.

ఆప్ నుంచి దళితుల మద్దతు కాంగ్రెస్ వైపు షిఫ్ట్

ఢిల్లీలో కొన్ని నియోజక వర్గాల్లో ముస్లిం ఓటర్లదే మెజారిటీ ఉంది. ఎన్నికల రిజల్ట్స్ ను ప్రభావితం చేసే కెపాసిటీ వారికి ఉంది. కాంగ్రెస్, ఆప్‌ల మధ్య పొత్తు లేక ముస్లిం ఓటర్లు ఆ రెండు పార్టీల మధ్య చీలతారన్న అభిప్రాయం ఉంది. అటు మొదటి నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉన్న దళితులలో చాలామంది ఆప్‌ వైపు మళ్లినా, ఇటీవలి పరిణామాలు వారిలో పునరాలోచన కలిగేలా చేస్తున్నాయి. ఢిల్లీ మాజీ మంత్రి, ప్రముఖ దళిత నాయకుడు రాజేంద్రపాల్‌ గౌతమ్‌కు 2022 అక్టోబర్ లో కేజ్రీవాల్ తప్పించారు. దాంతో ఆప్ పై దళితుల ఆగ్రహం పెరిగింది. గౌతమ్‌ తర్వాత సామాజిక సంక్షేమ శాఖ మంత్రిగా నియమితుడైన రాజ్‌కుమార్‌ ఆనంద్‌ కూడా 2024 ఏప్రిల్‌లో ఆమ్‌ఆద్మీపార్టీకి రాజీనామా చేశారు. పార్టీ దళిత వ్యతిరేక విధానాలు పాటిస్తుండడంతోనే రిజైన్ చేస్తున్నానని ఆనాడు చెప్పుకొచ్చారు. మరికొందరు దళిత నాయకులు కూడా ఆప్‌ను వదిలి కాంగ్రెస్‌లో చేరారు. సో ఇదొక కీలక పరిణామం.

కేజ్రీవాల్ పార్టీని గద్దె దింపేలా బీజేపీ యత్నాలు

ఇప్పటివరకూ ఆప్‌ నుంచి ఢిల్లీని చేజిక్కించుకోలేకపోయిన బీజేపీ.. కేజ్రీవాల్‌ను గద్దె దింపేందుకు ఏ అవకాశాన్నీ వదలడం లేదు. సో సవాళ్లు చాలానే ఉన్నా… తన మార్క్ సంక్షేమ పథకాలను ఆప్ కొనసాగిస్తోంది. ఇప్పుడు ఎన్నికలకు ముందు హామీల వర్షం కురిపిస్తున్నారు కేజ్రీవాల్. ఇళ్లకు ఫ్రీ కరెంట్ కొనసాగింపు, మహిళలకు ఆర్థిక సహాయం అందించే ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్‌ యోజన, సీనియర్‌ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య సంరక్షణ అందించే సంజీవని యోజన, ఆటో రిక్షా డ్రైవర్లకు బెనిఫిట్స్, విద్య, ఆరోగ్య సంరక్షణపై కేజ్రీవాల్‌ దృష్టి సారించడం కూడా ఆయన రాజకీయ విజయానికి కీలకంగా మారాయి.

స్కీముల మీద స్కీములు ప్రకటిస్తున్న కేజ్రీవాల్

అటు పూజారులకు నెలకు 18 వేలు ఇస్తామని తాజాగా హామీ ఇచ్చారు. ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఉచిత హామీలకు పెద్ద పీట వేస్తున్నారు కేజ్రీవాల్. 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేజ్రీవాల్‌ చౌరస్తాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యర్థి పార్టీలు ఎక్కువ పట్టుదలగా ఉన్నాయి. పైగా సవాళ్లు పెరిగాయి. బీజేపీ దూకుడు ప్రచారం, కేజ్రీవాల్ చుట్టూ వివాదాలు, అంతర్గత పార్టీ వ్యవహారాల్లో లుకలుకలు, సంకీర్ణ రాజకీయాల సంక్లిష్టత ఇవన్నీ కేజ్రీవాల్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కచ్చితంగా దేశ రాజకీయాల మూడ్ ఎలా ఉందో చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు.

బిహార్ లో బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం

2025లో ఎన్నికలు జరగబోయే మరో కీలక రాష్ట్రం బిహార్. ఇక్కడ బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ సంక్లిష్టంగానే ఉంటాయి. జేడీయూ ఎప్పుడు ఎవరితో ఎలా జట్టుకడుతుందో చెప్పలేని పరిస్థితులు ఉంటాయి. జంపింగ్ పాలిటిక్స్ తో కూటములు అధికారాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది. అయితే కేంద్రంలో నితీష్ కుమార్ పార్టీ సపోర్ట్ కచ్చితంగా అవసరం పడుతోంది. దీంతో బిహార్ లో నితీష్ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిన పరిస్థితి బీజేపీకి ఉంది.

ప్రస్తుతం కేంద్రానికి నితీష్ సపోర్ట్ చాలా కీలకం

అందుకే ఇంకా 10 నెలలు ఎన్నికలకు టైమ్ ఉన్నప్పటికీ నితీష్ కుమార్ సారథ్యంలోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తామని బీజేపీ క్లారిటీ ఇచ్చింది. బిహార్ లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సభ గడువు 2025 నవంబర్ తో ముగియనుంది. సో అప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి. నిజానికి ఈ ఫలితం కూడా ఎన్డీఏకు ఎలాంటి ఫ్యూచర్ ఉండబోతోందో క్లారిటీ ఇవ్వబోతోంది. ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతోనే నితీష్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామని ఇప్పటి నుంచే బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ RV సిగ్నల్స్ ఇస్తున్నాయి.

2026లో అసోం, బెంగాల్, పుదుచ్చేరి

2026 మే నెలలో ఏకంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అసోం, బెంగాల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ. ఈ రాష్ట్రాలన్నీ కీలకమే. అసోంలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. అక్కడ హిమంత బిశ్వశర్మ కథేంటో తేలిపోనుంది. ఇక బెంగాల్ లో 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ దీదీ శకం మరోసారి కంటిన్యూ అవుతుందా లేదంటే బీజేపీ లీడ్ లోకి వస్తుందా అన్నది కూడా క్లారిటీ రావడం ఖాయమే. ఇక పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్, బీజేపీ సవాల్ ఏంటో తేలిపోనుంది.

ఎన్డీఏ, ఇండియా కూటముల్లో గెలిచేదెవరు?

మరోవైపు కీలకమైన తమిళనాడులో 234 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్యే టఫ్ ఫైట్ ఉంటుంది. కొత్తగా విజయ్ పార్టీ కూడా అక్కడి పాలిటిక్స్ లో యాడ్ అయింది. సో ఈ పొలిటికల్ వార్ ఎటు దారి తీస్తుందన్న ఉత్కంఠ ఉంది. అక్కడ ఏ కూటమి పార్టీ గెలిస్తే ఆ పార్టీకి ఢిల్లీ లెవెల్ లో మరింత బూస్టప్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇక కీలకమైన కేరళలో 140 సెగ్మెంట్లు ఉన్నాయి. అక్కడ మళ్లీ వచ్చేది లెఫ్ట్ పార్టీనా.. మరొకటా అన్నది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. పైన చెప్పిన 5 రాష్ట్రాల్లోనూ ఒక్క పుదుచ్చేరి తప్ప మిగితా 4 రాష్ట్రాలు అసెంబ్లీ ఫలితాలు దేశ రాజకీయాలపై ఎఫెక్ట్ చూపడం ఖాయంగా కనిపిస్తోంది.

మహారాష్ట్రలో మారిన ఓటరు మైండ్ సెట్

ఓటరు నాడి ఎప్పుడు ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఎందుకంటే 2024 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు కాంగ్రెస్ కూటమికి అక్కడ పట్టం కట్టారు. సీన్ కట్ చేస్తే మొన్నటికి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమికే ఓటు వేశారు. 5 నెలల గ్యాప్ లోనే కథ మొత్తం మారిపోయింది. ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది. గత మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 48 ఎంపీ సీట్లలో కేవలం 17 మాత్రమే గెలుచుకున్న మహాయుతి.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎక్కువ సీట్లను గెలుచుకుంది. లోక్‌సభ ఎన్నికల్లో 28 చోట్ల పోటీచేసిన బీజేపీ 9 సీట్లు మాత్రమే గెలిచింది.

2025, 2026లో జరిగే ఎన్నికలు కొత్త టర్న్ తీసుకుంటాయా?

17 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 13 సీట్లు కైవసం చేసుకుంది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లెక్క తప్పింది. హర్యానాలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని అంతా అంచనాలు కట్టారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే విషయం చెప్పాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ చాలా ఉద్యమాలు జరిగిన తర్వాత కూడా బీజేపీనే హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. అయితే ఇవే ఓటములు వరుసగా ఉండవు కదా. సో  2025, 2026లో జరిగే ఎన్నికలు కూడా ఏదైనా కొత్త మలుపు తీసుకుంటాయా అన్నది హాట్ టాపిక్ గా మారింది. కొత్త ఏడాదిలో అదృష్టం ఎలా ఉంటుందోనన్న టెన్షన్ తో పొలిటికల్ పార్టీలు ఉన్నాయి.

2024 ఎన్నికల్లో మిత్రపక్షాల సపోర్ట్ తో ప్రభుత్వ ఏర్పాటు

2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు సాధించింది. ఆ పార్టీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీకి సొంతంగా మెజార్టీ చాలకపోవడం వల్ల ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు ప్రధానంగా టీడీపీ, జేడీయూకి ఇంపార్టెన్స్ పెరిగింది. 2014, 2019లో బీజేపీ కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా మెజార్టీ సాధించలేకపోవడానికి ప్రధాని మోడీకి ప్రజాదరణ తగ్గడమే కారణమన్న అభిప్రాయాలు వినిపించాయి.

కానీ మహారాష్ట్ర, హర్యానా వంటి చోట్ల గెలుపు ఈక్వల్ చేశాయి. అయితే తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల రూపంలో మోడీకి పెద్ద సవాలే ఉంది. హర్యానా, మహారాష్ట్రలో ప్రతిపక్షాలు గెలిచి ఉంటే కేంద్రంలో మోడీ ప్రభుత్వం బలహీనపడి ఉండేది. అలాగే ఎన్డీఏలో బీజేపీ ప్రభావం కూడా తగ్గిపోయుండేది. కానీ అలా జరగలేదు. అయితే 2025, 2026లో సీన్ మారుతుందని విపక్షాలు అంచనాతో ఉన్నాయి. పైగా జమిలి వ్యవహారాన్ని మోడీ ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. ఇది దేశ రాజకీయ లెక్కలను ఎలా మారుస్తుందన్నది చాలా ఆసక్తికరంగా మారింది.

జమిలి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న మోడీ సర్కార్

జమిలి ఎన్నికల వెనుక మోడీ సర్కార్ ఏదో స్కెచ్చులు వేస్తోందని విపక్షాలు అనుకుంటున్నాయి. అందుకే వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. జమిలి ఎన్నికల బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్‌ ముందుకు రాగా, విపక్షాలు వ్యతిరేకించడం వల్ల జేపీసీకి పంపడానికి తమకేం అభ్యంతరం లేదని పేర్కొంది కేంద్రం. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఎన్డీఏ మిత్ర పక్షాలు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించగా, కాంగ్రెస్‌ సహా విపక్షాలు అన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లు ప్రకారం, దేశంలో జమిలి ఎన్నికలు 2034 నుంచి జరిగే అవకాశముంది.

జమిలిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న విపక్షాలు

129వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టరూపం సంతరించుకున్నాక జరిగే సాధారణ ఎన్నికల అనంతరం ఏర్పడే లోక్‌సభ తొలి సిటింగ్‌ డేకు రాష్ట్రపతి నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. అపాయింటెడ్‌ డేగా పిలిచే ఆ రోజు తర్వాత ఏర్పడిన అన్ని అసెంబ్లీలు కూడా లోక్‌సభ కాలపరిమితితోపాటే ముగుస్తాయి. ఆ తర్వాత నుంచి లోక్‌సభ, అసెంబ్లీల ఎన్నికలన్నీ ఏకకాలంలో జరుగుతాయి. లోక్‌సభగానీ, అసెంబ్లీగానీ పూర్తికాలం ముగియక ముందే రద్దయితే వాటికి 5 ఏళ్ల కాలంలో మిగిలిన సమయానికే ఎన్నికలు జరుగుతాయని బిల్లు పేర్కొంది. అందువల్ల జమిలి విధానం 2029 సార్వత్రిక ఎన్నికల తర్వాతే ఆచరణలోకి వచ్చేలా కనిపిస్తోంది.

బిల్లు ప్రకారం 2034 నుంచి జమిలి జరిగే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. 2004 నుంచి కూడా వాటి ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలతో పాటే జరుగుతున్నందున 2029, 2034లోనూ అదే ప్రాసెస్ కొనసాగుతుంది. మిగితా రాష్ట్రాల అసెంబ్లీ గడువులే ఎఫెక్ట్ అవుతాయి. రాష్ట్రపతి పాలన విధించడమా.. ఆపద్ధర్మ ప్రభుత్వాలను కొనసాగించడమా అన్నది అప్పుడు తేలే విషయం. ఒకవేళ దేశం జమిలికి మారే క్రమంలో ఇది కూడా దేశ రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతుంది. చాలా ఎఫెక్ట్ చూపుతుంది. ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉంటుందో గెస్ చేయడం కష్టంగా మారుతుంది. అందుకే 2025, 2026 ఎన్నికల మూడ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందన్నది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారింది.

 

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×