Ambani- Adani: భారత కుబేరుల సంపద సన్నగిల్లుతోంది. అంబానీ, అదానీల నికర సంపదలో డౌన్‌ఫాల్ మొదలయ్యింది. కొంతకాలంగా భారత స్టాక్ మార్కెట్ సూచీలు పతనం అవుతుండగా… దిగ్గజ కంపెనీలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్ స్టాక్స్ పెద్ద మొత్తంలో పడిపోతున్నాయి. ఈ క్రమంలో దిగ్గజ పారిశ్రామిక వేత్తల నికర సంపద భారీగా తగ్గుతోంది. దేశీయ కుబేరుల జాబితాలో ఎప్పుడూ ముందువరుసలో ఉండే రిలయన్స్ అధినేత ముకేశ అంబానీ… అదానీ గ్రూప్ ఓనర్ గౌతమ్ అదానీ.. ఇద్దరూ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ వంద బిలియన్ డాలర్ల క్లబ్ నుండి బయటకొచ్చేశారు. ఎందుకిలా..?
100 బిలియన్ డాలర్ల క్లబ్ నుండి అదాని, అంబాని ఔట్
భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో అగ్ర స్థానంలో నిలవడమే గాక, ఆసియాలోనే ధనికులుగా గుర్తింపు పొందినవారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ. కొద్ది నెలల క్రితం నికర ఆదాయం భారీగా పెరిగిన వీరు, ఇప్పుడు మాత్రం బ్లూమ్ బర్గ్ 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో చోటు దక్కించుకోలేకపోయారు. వారి వ్యాపారాలతోపాటు వ్యక్తిగత సంపద విషయంలోనూ ఇద్దరూ సవాళ్లు ఎదుర్కోవడం వల్లే ఈ క్లబ్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని తాజాగా విడుదలైన ‘బ్లూమ్‌బర్గ్’ నివేదిక పేర్కొంది.
ముఖేష్ అంబానీ 17వ స్థానానికి పరిమితం
అంబానీ ఎనర్జీ, రిటైల్ వ్యాపారాల ప్రదర్శన అనుకున్నంతగా లేకపోవడం కూడా ఈ క్లబ్ నుంచి బయటకు రావడానికి ఒక కారణమని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది. ఇప్పుడు, ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-10లో ఇద్దరిలో ఏ ఒక్కరూ లేకపోవడం గమనార్హం. సెప్టెంబరు 2022లో గౌతమ్ అదానీ.. ప్రపంచంలోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉండగా.. ఇప్పుడు 19వ స్థానానికి పడిపోయారు. ముఖేష్ అంబానీ 17వ స్థానానికి పరిమితమయ్యారు. తాజాగా.. ఇద్దరి సంపద 100 బిలియన్ డాలర్ల మార్క్ దిగువకు చేరినట్లు బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది.
అంబానీ కుమారుడు వివాహానికి $600 మిలియన్స్ ఖర్చు
ఇక, జులైలో, తన కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి సమయంలో అంబానీ సంపద దాదాపు 120.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత కరెన్సీలో ఇది రూ. 10.25 లక్షల కోట్లు. అదే సమయంలో అంబానీ కుమారుడు వివాహానికి దాదాపుగా 600 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. అంబానీ ఇటీవల డిజిటల్ ప్లాట్‌ఫాంలు, రిటైల్ బ్రాండ్లపై దృష్టి సారించారు. రిటైల్ వ్యాపారంలో ఇటీవల వృద్ధి, లాభాలు మందగించాయి. ఇక, కేసులతో కొత్త చిక్కులు ఎదుర్కుంటున్నఅదానీ కూడా డౌన్‌ఫాల్‌ను ఎదుర్కుంటున్నారు.
ప్రస్తుతం ముకేశ్ అంబానీ సంపద $96.3 బిలియన్లు
సౌరశక్తి సరఫరా ఒప్పందాలు పొందడం కోసం భారతీయ అధికారులకు ముడుపులు ఇచ్చిన వ్యవహారంలో అమెరికాలో కేసు నమోదైన తర్వాత అదానీ సంపదలో క్షీణత మొదలైంది. జూన్‌లో అదానీ సంపద 122.3 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. అమెరికాలో ఆరోపణలు, కేసులు.. అంతకుముందు హిండెన్‌బర్గ్ నివేదిక నేపథ్యంలో అదానీ సామ్రాజ్యానికి సవాళ్లు ఎదురయ్యాయి. ఫలితంగా అదాని సంపద 100 బిలియన్ డాలర్ల కంటే దిగువకు పడిపోయింది. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం, ప్రస్తుతం ముకేశ్ అంబానీ సంపద 96.3 బిలియన్ డాలర్లు కాగా… గౌతం అదానీ సంపద 80.8 బిలయన్ డాలర్లుగా ఉంది.
2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్
ఇక, రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థలోని ప్రధాన వ్యాపారాలైన రిటైల్, ఇంధన రంగాలు ఇటీవల మెరుగైన పనితీరు కనబర్చకపోవడమే ముఖేష్ అంబాని పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. చమురు, రసాయన విభాగంలో డిమాండ్ తగ్గడం, రిటైల్ వినియోగదారుల వ్యయాలు తగ్గడం, చైనా ఎగుమతుల నుంచి పోటీ వంటివి అంబాని సంపదకు ఎసరు పెట్టాయి. ఈ క్రమంలో, కంపెనీకి పెరుగుతున్న అప్పులపైనా ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. రిలయన్స్ షేర్లు తగ్గుతూ వచ్చింది. అలాగే, ఇటీవల మీడియా, ఏఐ కంప్యూటింగ్‌లో ఆధిపత్యం కోసం అంబానీ పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టడం కూడా సంపద డౌన్‌ఫాల్‌కు కారణమయ్యింది.
ఆరోపణలు, దర్యాప్తులతో అదాని కంపెనీల షేర్లపై ప్రభావం
మరోవైపు, గౌతమ్ అదానీ సంపద గత కొన్నేళ్లుగా తీవ్ర హెచ్చుతగ్గులకు గురవుతోంది. 2023 జనవరిలో హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వెలువడగా.. గరిష్ట స్థాయిల నుంచి సంపద భారీగా తగ్గింది. మధ్యలో మళ్లీ పుంజుకున్నప్పటికీ.. ఇటీవల వరుస ఆరోపణలు, దర్యాప్తులతో మళ్లీ షేర్లపై ప్రభావం పడినట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు వచ్చే ఏడాది కూడా ఆ సంస్థ మార్కెట్ విలువపై ప్రభావం చూపే అవకాశం ఉందని నివేదికలు అంచనా వేస్తున్నాయి. అయితే, గతంలోలాగా మళ్లీ మదుపరుల విశ్వాసం పొందేతే తప్ప ఈ ఇద్దరు కుబేరులు కష్ట కాలం నుండి బయటపడే అవకాశం ఉంది.
యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్
గత నెలలో US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌తో సంబంధం ఉన్న ముఖ్య సహచరులపై సెక్యూరిటీల మోసం, వైర్ ఫ్రాడ్, అవినీతి నిరోధక ఆరోపణలు ఫైల్ చేయడంతో అదానీకి ఎదురుదెబ్బలు ఎక్కువయ్యాయి. అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ ప్రభావం మాత్రం గట్టిగా పడింది. గతంలో అదాని అవినీతిపై హిండెన్‌బర్గ్ నివేదికలో స్ట్రాంగ్ వాదనలను తిరస్కరించింది.
ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, అదానీ గ్రూప్ ఆర్థికంగా మెరుగుపడినట్లు బెర్న్‌స్టెయిన్ నివేదిక చెప్పింది. ప్రమోటర్ షేర్ హామీలు గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. దీనితో, మొత్తం రుణం మార్చి 2023లో ₹2.41 లక్షల కోట్ల నుండి సెప్టెంబరు 2023లో ₹2.38 లక్షల కోట్లకు కొద్ది మేద తగ్గింది. హిండెన్‌బర్గ్ నివేదికకు ముందు 3.8 రెట్లు ఉన్న పరపతి నిష్పత్తులు 2.5 రెట్ల కంటే తక్కువకు తగ్గాయి.
రిలయన్స్ స్టాక్ 2024లో భారతదేశ ఈక్విటీ మార్కెట్లలో..
మరోవైపు, ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాని సొంత అడ్డంకులను ఎదుర్కొంది. రిలయన్స్ స్టాక్ 2024లో భారతదేశ ఈక్విటీ మార్కెట్లలో.. నిఫ్టీ 50-ఇండెక్స్ 14% లాభంతో పోలిస్తే.. ఇటీవల 1.5% పడిపోయింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, విశ్లేషకుల ధర లక్ష్యాలు, ప్రస్తుత స్టాక్ వాల్యుయేషన్ మధ్య ఈ అసమానత నాలుగేళ్లలో భారీ గ్యాప్‌కు దారితీసింది. ఇంధనం, టెలికమ్యూనికేషన్స్, రిటైల్‌లో పెట్టుబడుల కారణంగా రిలయన్స్ బుల్లిష్ అంచనాలను ఆకర్షిస్తూనే ఉంది.
అయితే, పెరుగుతున్న రుణాలు, ప్రతికూల మనీ ఫ్లో అంచనాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనికి తోడు, రిలయెన్స్ సంస్థాగత పెట్టుబడిదారులు తమ వాటాలను తగ్గించుకున్నారు. దీనితో, విదేశీ సంస్థాగత యాజమాన్యం 2020లో 25% నుండి సెప్టెంబర్ 2024లో 20.17%కి క్షీణించినట్లు తెలుస్తోంది.
దేశంలోని టాప్-20 బిలియనీర్ల సంపద..
గౌతం అదానీ, ముకేశ్ అంబానీ వ్యక్తిగత సంపద నష్టపోయినప్పటికీ… భారతదేశంలోని టాప్-20 బిలియనీర్ల సంపద 2024 జనవరి నుంచి 67.3 బిలియన్ డాలర్లు వృద్ధి చెందినట్లు బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. వారిలో ప్రముఖ పారిశ్రామికవేత్త, HCL టెక్నాలజీ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ 10.8 బిలియన్ డాలర్లు, ఉక్కు పారిశ్రామికవేత్త సావిత్రి జిందాల్ 10.1 బిలియన్ డాలర్ల సంపద పెంచుకున్నారు.
మరోవైపు, ఎలన్ మస్క్ కంపెనీ స్టార్ లింక్ భారత్‌లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. దీనితో, స్టార్ లింక్, భారత్‌లో శాటిలైట్ ఆధారిత వాయిస్, డేటా కమ్యూనికేషన్ వంటి సేవలు ప్రారంభిస్తే.. ఎయిర్‌టెల్‌తో పాటు అంబానీ సంస్థ జియో కూడా గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది, అంబానీ సంపదకు మరో సవాలుగా మారే ఛాన్స్ ఉంది.
డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, రెన్యువబుల్ ఎనర్జీ…
ఇద్దరు భారత కుబేరులు డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పటికీ.. రిలయన్స్ భవిష్యత్తును తిరిగి ఫాంలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ముఖేష్ అంబానీ యాక్టీవ్‌గా పనిచేస్తున్నట్లు బిజినెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా.. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, రెన్యువబుల్ ఎనర్జీ, ఎంటర్‌టైన్మెంట్‌లో భారీగా పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. తగ్గుతున్న తన సంపదను తిరిగి పుంజుకునేలా చేయడం కోసం అంబానీ ఇప్పటికే.. వాల్ట్ డిస్నీ కార్పెరేషన్‌తో కలిసి ఓ జాయింట్ వెంచర్ కూడా చేస్తున్నారు.
AI కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మాణం
భారతదేశ స్ట్రీమింగ్ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయించడానికి $8.5 బిలియన్ డాలర్ల మీడియా పవర్‌హౌస్‌ను సృష్టించడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ పనిచేస్తోంది. అలాగే, భారతదేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నిర్మించడానికి కూడా రిలయన్స్ ఎన్‌విడియా కార్ప్‌తో సహకర ప్రాజెక్ట్ నడుస్తోంది. ఈ చర్యలు.. దేశ సాంకేతిక పర్యావరణ వ్యవస్థలో అంబానీ స్థానాన్ని పటిష్టం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
రసాయనాల సెక్టార్‌లో ప్రపంచ డిమాండ్ క్షీణత
అయితే, అంబానీ తిరిగి నిలదొక్కుకోడానికి చేస్తున్న ఈ వ్యూహాలు దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. అయితే, ఈ మధ్యలో కొనసాగుతున్న స్వల్పకాలిక అడ్డంకుల్ని ఎలా ఎదుర్కుంటారన్నది ప్రశ్నగా ఉంది. రిలయెన్స్ రిటైల్ వ్యాపారంలో లాభాల వృద్ధి మందగిస్తున్న పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా, డిజిటల్ పోటీదారులు అగ్రశ్రేణి నగరాల్లో రిలయెన్స్‌కు షాకిస్తున్నాయి. మరోవైపు, ఒకప్పుడు రిలయన్స్ లాభాలకు పునాదిగా ఉన్న చమురు-రసాయనాల సెక్టార్‌లో ప్రపంచ డిమాండ్ క్షీణించడం..
చైనా ఎగుమతుల నుండి పెరిగిన పోటీ
మరోవైపు, చైనా ఎగుమతుల నుండి పెరిగిన పోటీ కారణంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి దీని నుండి ముఖేష్ అంబానీ ఎలా బయటపడతారన్నది మునుముందు తెలియాల్సి ఉంది. ఇక, గౌతమ్ అదానీ వ్యహారంలోనూ పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలను ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ.. కాలం కలిసొస్తుందా అనే సందేహం కూడా లేకపోలేదు.
భారతదేశ బిలియనీర్ క్లాస్‌లో భారీ అనిశ్చితి
నిజానికి, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఎదుర్కొంటున్న సవాళ్లు భారతదేశ బిలియనీర్ క్లాస్‌లో భారీ అనిశ్చితి అద్దం పడుతున్నాయని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. డిమార్ట్ రిటైల్ చైన్ వ్యవస్థాపకుడు రాధాకిషన్ దమానీ కూడా ఇటీవల కాలంలో తన సంపదలో భారీగా క్షీణతను చవిచూసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అక్టోబరు 2021లో ఒకప్పుడు $27.8 బిలియన్ డాలర్ల విలువ కలిగిన దమానీ సంపద.. ఇప్పుడు $17.1 బిలియన్లకు చేరుకుంది. డిమార్ట్ కొత్త స్టోర్‌లలో తక్కువ ఫుట్‌ఫాల్ ఉన్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
టాటా కంపెనీలకు కూడా తప్పని కష్టాలు
అలాగే, ఆన్‌లైన్ రిటైలర్‌లు పెరుగుతున్న నేపధ్యంలో డిమార్ట్ తీవ్రమైన పోటీని ఎదుర్కుంటుంది. మరోవైపు, తాజా బ్లూమ్ బర్గ్ నివేదికలో టాటా కంపెనీలు కూడా కష్టాలను ఎదుర్కుంటున్నట్లు వెల్లడించారు. ఇవన్నీ చూస్తుంటే.. రాబోయే కొన్ని సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే లక్ష్యం ఇంకాస్త దూరం జరుగుతుందా అనే సందేహాలు వస్తున్నాయి.
కాస్త మెరుగ్గా 20 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల సంపద
అయితే, ఇక్కడొక ఆశ లేకపోలేదు. భారతదేశంలోని అత్యంత సంపన్నులకు అందరూ ఇలాంటి పరిస్థితుల్లో లేదు. ముందుగా చెప్పుకున్నట్లు… బ్లూమ్‌బెర్గ్ సంపద సూచిక ప్రకారం… భారతదేశంలోని 20 మంది అగ్రశ్రేణి బిలియనీర్ల మొత్తం సంపద కాస్త మెరుగుపడింది. ఇది, ఈ సంవత్సరం ప్రారంభం నుండి $67.3 బిలియన్ డాలర్లకు పెరిగింది. టెక్నాలజీ దిగ్గజం శివ్ నాడార్, జిందాల్ గ్రూప్ ఓనర్ సావిత్రి జిందాల్… వారి సంపదను భారీగానే పెంచుకున్నారు.
$10.8 బిలియన్లు పెరిగిన శివ్ నాడార్ సంపద
శివ్ నాడార్ $10.8 బిలియన్ డాలర్లు పెంచుకోగా.. జిందాల్ సంపద మరో $10.1 బిలియన్ డాలర్లకి పరిగింది. ఒక విధంగా, ఈ ఏడాది అత్యధికంగా లాభం పొందిన వారిలో వీళ్లు ఉన్నారు. ఈ నేపధ్యంలో… ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోడానికి కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవడంపై భారతీయ వ్యాపార సమ్మేళనాలు దృష్టి సారిస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచంలో కనిపిస్తున్న అనిశ్చితి స్థాయిని దృష్టిలో ఉంచుకోని… వ్యవస్థాపకులు తమ కంపెనీలను మరింత సమర్థవంతంగా తయారు చేస్తారని అంటున్నారు.
ఎగుమతులపై కొత్త ట్యాక్స్‌లను మోపుతున్న ట్రంప్
అయితే, తాజా గ్లోబల్, డొమెస్టిక్ సవాళ్లకు కొత్తగా అమెరికా గద్దెనెక్కబోతున్న ట్రంప్ ప్రెసిడెన్సీ కూడా ఒక రకంగా కారణమేనని కొందరు వాదిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌కి తిరిగి ఎన్నికైన తర్వాత భారతీయ ఎగుమతులపై కొత్త ట్యాక్స్‌లను మోపుతున్నారు. దీని వల్ల భారతీయ వ్యాపారాలకు సంభావ్య వాణిజ్య సవాళ్లు ఎదురవుతాయనే భయం కూడా అందరిలో కనిపిస్తోంది. అయితే, దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక, రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ట్రంప్ విధించిన సుంకాలతో భారతదేశ ఎగుమతులు పోటీలో నిలదొక్కుకోలేవని అంటున్నారు.
భారత మధ్యతరగతికి అవకాశాలు అందడం శుభ పరిణామం
ఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థ… దేశంలో అభివృద్ధి చెందుతున్న మధ్యతరగతికి అవకాశాలను అందిస్తూనే ఉండటాన్ని మంచి పరిణామంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే, ఈ పరిస్థితులను అంబానీ, అదానీలు ఎంత మెరుగ్గా అందిపుచ్చుకుంటారన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. అంబానీ, అదానీ నెక్స్ట్ ఫేజ్.. అభివృద్ధి చెందుతున్న వ్యాపార వాతావరణానికి అనుగుణంగా వారి సామర్థ్యాన్ని పెంచుకోవడంపై ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు. ఈ అడుగు, ప్రస్తుత సంక్షోభాల నుండి బయటపడేస్తుందా లేదా అన్నది మాత్రం భవిష్యత్తు నిర్ణయిస్తుంది.