Mulapeta Port: మూలపేట పోర్టు కేంద్రంగా మరోసారి శ్రీకాకుళంలో రాజకీయం రక్తి కడుతోంది. పోర్టును తామే అభివృద్ధి చేశామని వైసీపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే క్రెడిట్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ రెండు పార్టీల కీలక నేతలు మూలపేట పోర్టు కేంద్రంగా డ్రామాలాడుతున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. మూలపేటలో జరుగుతున్న భూ దందాను డైవర్ట్ చేయడానికి ధర్మాన ప్రసాద్ అక్కడ మీటింగ్ పెట్టారని, దువ్వాడ చేసిన హాట్ కామెంట్స్ జిల్లా పాలిటిక్స్‌ను మరోసారి కుదిపేస్తున్నాయి.
దువ్వాడ శ్రీనివాస్.. శ్రీకాకుళం రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే వివాదాస్పద నాయకుడు. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో జడ్పీటీసీగా గెలిచి కాంగ్రెస్ హయాంలో జడ్పీ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. అంతే ఆ తర్వాత పీఆర్పీ నుంచి ఒక సారి, వైసీపీ నుంచి రెండు సార్లు టెక్కలి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మధ్యలో వైసీపీ అధికారంలోకి వచ్చే ముందు జరిగిన ఎన్నికల్లో జగన్ ఆయనకు ప్రమోషన్ ఇచ్చి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేయించినా దువ్వాడును దురదృష్టం వెక్కిరించింది. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టలేక పోతున్న దువ్వాడ శ్రీనివాస్‌ని జగన్ ఎమ్మెల్సీ చేశారు.
ఎమ్మెల్సీ పదవిలో ఇంకా కొనసాగుతున్న దువ్వాడ శ్రీనివాస్‌ను వైసీపీ నుంచి గత ఏడాదే సస్పెండ్ చేశారు. పార్టీ క్రమశిక్షణావళిని ఉల్లంఘించారనే ఫిర్యాదులు రావటంతో దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ నుంచి సస్పెండ్ అయ్యే నాటికే భార్య దువ్వాడ వాణితో పాటు పిల్లలకు దూరమయ్యారు. కుటుంబం నుంచి దూరం జరిగిన తర్వాత దివ్వెల మాధురితో కలిసి ప్రయాణిస్తున్నారు. ఏదైమైనా దివ్వెల మాధురితో కలిసే ఉంటానని స్పష్టం చేశారు కూడా.
రాజకీయంగా అవకాశం దొరికిన ప్రతిసారి వైసీపీలో ధర్మాన, టీడీపీలో కింజరాపు కుటుంబాలపై విమర్శలు చేస్తూ ఉంటారు. ఈ రెండు ఫ్యామిలీల వల్లే తన పొలిటికల్ గ్రాఫ్ పడిపోయిందని దువ్వాడ వాదన. అందుకే అచ్చం నాయుడు, ధర్మాన ప్రసాద్ ను విమర్శించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఆయన మిస్ చేసుకోరు. ఇటీవల ‘మనం మూలపేటకు పోదాం పద’ అంటూ వైసిపి నిర్వహించిన కార్యక్రమంపై తనదైన శైలిలో రెచ్చిపోయారాయన. అసలు ఆ సభ ప్రజలను మభ్యపట్టే కార్యక్రమం అని విమర్శలు గుప్పించారు. ధర్మాన, కింజరాపు కుటుంబాలు ఆడిన గొప్ప నాటకంగా అభివర్ణించారు.
మూలపేట పోర్టు సందర్శనకు వెళ్తామని చెప్పిన వైసీపీ నేతలు పోర్టుకు ఏడు కిలోమీటర్ల దూరంలో సభను నిర్వహించి వెనుతిరిగారు. నిజానికి అనుమతి లేకపోయినా పోర్ట్ లోకి వెళ్తారేమో? అన్న అనుమానంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. వైసీపీ శ్రేణులు కూడా తమ నేతలు పోర్ట్ లోకి వెళ్తారని పెద్ద ఎత్తున తరలివచ్చారు. కానీ పోస్టులోకి వెళ్లడం లేదని, మరోసారి ఆ కార్యక్రమాన్ని పెట్టుకుందామని ధర్మాన ప్రసాద్ తాపీగా సెలవివ్వడంతో.. కార్యకర్తలు సహా పోర్టుకు భూములు ఇచ్చిన స్థానికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
దాన్నే దువ్వాడ శ్రీనివాస్ అవకాశంగా మార్చుకొని మరోసారి ధర్మానపై విమర్శలు గుప్పించారు. ఇంత పెద్ద ఎత్తున సభ నిర్వహించి మూలపేట పోర్ట్ లోకి వెళ్ళకపోవడం ఏంటని ప్రశ్నించారు? పూర్తి స్థాయిలో సందర్శన చేయలేనప్పుడు ఈ సభ ఉద్దేశం ఏంటో చెప్పాలని నిలదీశారు. పోర్ట్ లోపలికి వెళ్లడానికి 40 మందికి పోలీసుల అనుమతి ఉన్నప్పటికీ ధర్మాన ఎందుకు వెళ్లలేదని దువ్వాడ శ్రీనివాస్ నిలదీస్తున్నారు.
ఈ విషయంలో ధర్మాన ప్రసాద్ వివరణ మాత్రం మరోలా ఉంది. సభ పెట్టుకోవడానికి అనుమతినిస్తున్నాం కాబట్టి, పోర్ట్ లోకి వెళ్లాలనే ఆలోచనను విరమించుకోవాలన్న పోలీసులను గౌరవించి వెనక్కి తగ్గామనేది ధర్మాన వాదన. అసలు పోర్ట్ లోకి వెళ్లాలని ఆలోచన ధర్మానకు లేదని దువ్వాడ శ్రీనివాస్ విమర్శ. పోర్ట్ కోసం మరో 25 వేల ఎకరాల భూ సేకరణ జరుగుతోందని.. ఈ కార్యక్రమం వెనక ధర్మాన, కింజరాపు కుటుంబాలు ఉన్నాయని దువ్వాడ ఆరోపిస్తున్నారు. ఈ భూ సేకరణను డైవర్ట్ చేయడం కోసమే మూలపేట పోర్టుకు పోదాం పద అనే కార్యక్రమం నిర్వహించారని దువ్వాడ మండిపడ్డారు.
నిజంగా పోర్టు అభివృద్ధి, నిర్వాసితుల బాగోగలే ధర్మాన లక్ష్యమైతే.. భూములు ఇచ్చిన వారి గురించి సభలో ప్రస్తావించారా? అని ప్రశ్నించారు. ఈ పోర్టు కోసం భూములు ఇచ్చిన విష్ణు చక్రం, మూలపేట గ్రామస్తులు నిరాశ్రయులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ధర్మాన వారి గురించి ఎందుకు ప్రస్తావించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.ధర్మాన, కింజరాపు డ్రామాలను జిల్లాలో ఇక సాగనివ్వనని దువ్వాడ వార్నింగ్ ఇచ్చారు. గతంలో కాకరాపల్లి పవర్ ప్లాంట్‌ను పోరాటం చేసి అడ్డుకున్నట్టే, ఇకపై కూడా ఆ రెండు కుటుంబాల ఆగడాలను అడ్డుకుంటానని దువ్వాడ హెచ్చరించారు.
రైతులు ఎవరు భూసేకరణకు ల్యాండ్స్ ఇవ్వొద్దని దువ్వాడ సూచించారు. మొత్తానికి ధర్మాన, కింజరాపు కుటుంబాలపై శ్రీనివాస్ చేసిన కామెంట్స్ మరోసారి హాట్‌టాపిక్ గా మారాయి. నిజంగానే వైసీపీ నిర్వహించిన సభ వెనక భూసేకరణ అంశం దాగి ఉందా? లేకపోతే పొలిటికల్ పాపులారిటీ కోసం దువ్వాడ శ్రీనివాస్ ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారా? అన్నది సందేహాస్పదంగా తయారైంది.
Also Read:సీఎం సొంత జిల్లాపై వరాల జల్లు.. నాగర్‌కర్నూల్‌కు కొత్త హంగులు.. రాజేష్ రెడ్డి క్లారిటీ!
Story by: Apparao, Big Tv