Big Stories

Munugodu : రోడ్ రోలర్ రచ్చ.. మునుగోడులో మాయ! ఆర్వోపై ఈసీ యాక్షన్

Munugodu : రోడ్ రోలర్. అధికార టీఆర్ఎస్ కు నిద్ర లేకుండా చేసిన గుర్తు. సేమ్ టు సేమ్ కారు సింబల్ లానే ఉండటంతో.. తమ ఓట్లు అటు పడతాయనే టెన్షన్. గతంలో పలు చోట్లు రోడ్ రోలర్.. కారు ఓట్లను బాగా డ్యామేజ్ చేసింది. కొన్నిచోట్ల తాము ఓడిపోవడానికి ఆ గుర్తే కారణమనేది గులాబీ పార్టీ వాదన. లేటెస్ట్ మునుగోడు ఎలక్షన్లో మళ్లీ రోడ్ రోలర్ ఫికర్ పట్టుకుంది కారు పార్టీకి. అసలే టఫ్ ఎలక్షన్. ట్రయాంగిల్ వార్ లో గెలిచేదెవరో చెప్పడం చాలా కష్టం. ఎవరు గెలిచినా.. తక్కువ మెజార్టీతోనే గట్టెక్కుతారని టాక్. అలాంటిది.. మునుగోడులో రోడ్ రోలర్ గుర్తు.. కారు ఓట్లకు యాక్సిడెంట్ చేస్తే..! టీఆర్ఎస్ కు తీరని నష్టం.. కష్టం తప్పదు. మునుగోడులో ఓడితే.. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ కు వీఆర్ఎస్సే అనే చర్చ నడుస్తోంది. అందుకే, ఎలాగైనా రోడ్డు రోలర్ గుర్తుతో పాటు కారును పోలిన కెమెరా, ట్రక్ లాంటి సింబల్స్ ను అడ్డుకోవాలని అధికార పార్టీ గట్టి ప్రయత్నమే చేసింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా, హైకోర్టులో పిటిషన్ వేసినా.. లాభం లేకుండా పోయింది. కానీ.. అంతలోనే ఏమైందో ఏమో కానీ.. మునుగోడు పోలింగ్ గ్రౌండ్ నుంచి రోడ్ రోలర్ మాయమైంది.

- Advertisement -

యుగ తులసీ పార్టీ అభ్యర్థి శివకుమార్ కు లాటరీలో కేటాయించిన రోడ్ రోలర్ గుర్తును రిటర్నింగ్ అధికారి మార్చేశారు. ఆయనకు బేబీ వాకర్ గుర్తు కేటాయించారు. హమ్మయ్యా.. అంటూ గులాబీ దళం ఊపిరి పీల్చుకుంది. ఇక తమ ఓట్లు తమకేనని తెగ ఖుషీ అయింది. కానీ, అంతలోనే వారి ఆశలు ఆవిరయ్యాయి. కారుకు మళ్లీ కష్టం వచ్చి పడింది. నిబంధనల ప్రకారం కేటాయించిన రోడ్ రోలర్ సింబల్ ను రిటర్నింగ్ ఆఫీసర్ మార్చడంపై ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది.

- Advertisement -

రోడ్ రోలర్ గుర్తు మార్చడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. రోడ్‌ రోలర్‌ గుర్తును ఎందుకు తొలగించారో వివరణ ఇవ్వాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి సీఈసీ లేఖ రాసింది. వెంటనే వివరణ ఇవ్వాలంటూ రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు జారీ చేసింది. గుర్తుల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని సీఈసీ అభిప్రాయపడింది. రిటర్నింగ్ ఆఫీసర్ జగన్నాథరావుపై వేటు వేసింది.

అధికార పార్టీ ఒత్తిడితోనే రోడ్ రోలర్ గుర్తును మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే అనేక రకాలుగా అధికార వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉండగా.. ఇప్పుడు ఏకంగా ఎన్నికల గుర్తునే సైడ్ చేయడం కాంట్రవర్సీగా మారింది. ఓటమి భయమో ఏమోగానీ.. ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో.. గులాబీ దళం మునుగోడులో అడ్డదారులు తొక్కుతోందంటూ ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

రోడ్ రోలర్ గుర్తుపై సీఈసీ జోక్యం టీఆర్ఎస్ కు ఊహించని షాకే అంటున్నారు. ఈసారి ఆ గుర్తు లేదని సంబరపడుతుండగా.. ఎన్నికల సంఘం ఎంట్రీతో అధికార పార్టీ ఉలిక్కిపడింది. యుగ తులసీ పార్టీ అభ్యర్థి శివకుమార్ కు తిరిగి రోడ్ రోలర్ గుర్తును కేటాయించడంతో.. తమ ఓట్లకు భారీగా గండి పడుతుందని గులాబీ దళంలో టెన్షన్ మొదలైంది. 2011లోనే రద్దు చేసిన రోడ్ రోలర్ గుర్తును తిరిగి తీసుకురావడం ఎన్నికల స్పూర్తికి విరుద్దమంటూ మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. బీజేపీ కుటిలనీతి అంటూ మండిపడ్డారు.

ఇక, యుగ తులసీ పార్టీ పేరుతో నామినేషన్ వేసిన శివకుమార్.. హిందుత్వ భావజాలం ఉన్న నేత. గోమాత సంరక్షణ కోసం గతంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు. బీజేపీ వాళ్లే ఆయనతో మునుగోడులో నామినేషన్ వేయించారనే ప్రచారం ఉంది. ఆయనకే రోడ్డు రోలర్ గుర్తు రావడం సంథింగ్ ఇంట్రెస్టింగ్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News