
Vladimir Putin : వ్లాదిమిర్ పుతిన్.. 2 దశాబ్దాలకు పైగా రష్యాను తన కనుసైగతో శాసిస్తున్న నేత. కుప్పకూలిన సోవియట్ యూనియన్ తర్వాతి రోజుల్లో రష్యా పలుకుబడిని తిరిగి పెంచి, దాని ఆధిపత్యాన్ని నిలబెట్టిన నేత. మధ్యతరగతి పేద కుటుంబంలో పుట్టి, లా చదువుకుని, సినిమాల ప్రభావంతో గూఢచారిగా మారి, ఆనక దేశాధ్యక్ష పదివినీ రెండుసార్లు చేపట్టి సమర్థనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. శత్రువులకు శత్రువు, మిత్రులకు మిత్రుడిగా అంతర్జాతీయ ప్రపంచంలో గుర్తింపు పొందిన పుతిన్ వ్యక్తిగత జీవితం, వ్యూహ ప్రతివ్యూహాలు గానీ ఒక పట్టాన అంతుబట్టవు. ఆయన వ్యక్తిగత జీవితం, సాధించిన విజయాల్లో అంతులేని నాటకీయత, అంచనా వేయలేనంత మార్మికత ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేయక మానవు. తన విమర్శకుల నోళ్లను తనదైన శైలిలో మూయిస్తూ.. పాశ్చాత్య ప్రపంచాన్ని తనవైపు తిప్పుకునేలా చేసుకున్న పుతిన్.. జీవిత విశేషాలు
నేపథ్యం
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పుట్టిన పుతిన్ ఒక సింగిల్ బెడ్రూంలో పెరిగాడు. తండ్రి సైన్యంలో పనిచేసేవాడు. తల్లి ఓ ఫ్యాక్టరీ ఉద్యోగి. బాల్యంలోనే తన ఇద్దరు సోదరులను కోల్పోయిన పుతిన్.. టీనేజీలో సినీ మాయలో పడ్డాడు.
సినిమాలు చూసి.. ‘గూఢచారిగా పనిచేస్తా… అవకాశం ఇవ్వండి’ అంటూ 1968లో దరఖాస్తు పట్టుకుని నేరుగా కేజీబీ ఆఫీసుకు పోయాడు. అక్కడి అధికారులు పుతిన్‌ను చూసి నవ్వుకుని ‘బాగా చదువుకుని రారా అబ్బాయ్.. అప్పుడు చూద్దాం’ అనటంతో పెద్దగా పోటీలేని లా కోర్సులో చేరాడు.
అయినా.. గూఢచారి ముచ్చట తీరక.. కేజీబీ(రష్యా గూఢచర్య సంస్థ)లో టాన్స్‌లేటర్‌గా చేరి, తర్వాతిరోజుల్లో సోవియట్ యూనియన్ కనుసన్నల్లోని తూర్పు జర్మనీ కేజీబీ కార్యాలయంలో పనిచేశాడు. 1989లో జర్మనీ గోడను కూల్చినవేళ.. ఆందోళనకారులు అక్కడి సోవియట్ ఆఫీస్‌ను చుట్టుముట్టగా.. నిమిషాల్లో అక్కడి ఫైల్స్ అన్నీ తగలబెట్టించాడు. ఆందోళనకారులెవరైనా అడుగు ముందుకేస్తే.. కాల్పులు తప్పవంటూ హెచ్చరికలు చేసి.. వారిని కట్టడిచేసి రష్యా వ్యాప్తంగా ‘దమ్మున్నోడు’ అనే పేరు సంపాదించాడు.
రాజకీయ సోపానంలో పైపైకి..
1991 డిసెంబరు 26న సోవియట్ యూనియన్ పతనం తర్వాత అధికారం మిఖాయిల్ గోర్భచేవ్ నుంచి బోరిస్ ఎల్సిన్‌కు వెళ్లింది. ఆ తర్వాత అవినీతి ఆరోపణలతో ఎల్సిన్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ టైమ్‌లోనే పుతిన్ రాజకీయంగా అడుగులు వేశాడు. తొలినాళ్లలో లెనిన్‌గ్రాడ్ నగర మేయరు వద్ద పనిచేశారు.
తర్వాత.. 1997లో అధ్యక్షుడి వద్ద డిప్యూటీ చీఫ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ స్టాఫ్ పదవిలో ఉంటూ.. 1999 నాటికి డిప్యూటీ ప్రధాని అయ్యాడు. పుతినే తన వారసుడని ఎల్సిన్ బలంగా నమ్మటంతో, తాను 1999 డిసెంబర్ 31న రాజీనామా పోతూ, రష్యా పగ్గాలను పుతిన్‌కు అప్పజెప్పారు. ఎల్సిన్‌తో ఉన్న ఒప్పందం ప్రకారం పుతిన్.. ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
ఇక.. 1999 – 2008 వరకు రష్యాకు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే.. రెండుసార్లకు మించి ఎవరూ అధ్యక్షుడు కారాదనే రష్యా రాజ్యాంగ నియమాన్ని తప్పించుకొనేందుకు 2008లో ప్రధాని పదవి చేపట్టి, అధ్యక్ష పదవిని అనుచరుడైన దిమిత్రీ మెద్వెదేవ్‌కు అప్పగించి, పాలన అంతా తన గుప్పిటపెట్టుకున్నాడు. ఇలా.. రాజ్యాంగ పరిమితిని అధిగమించి, 2012 ఎన్నికల్లో ఆయన మళ్లీ అధ్యక్ష పదవి చేపట్టి, ప్రధానిగా మెద్వెదేవ్‌ను నియమించారు.
ఎదురులేని విజేతగా ప్రజల ముందుకెళ్లి 2018 ఎన్నికల్లో మళ్లీ భారీ మెజారిటీతో గెలిచారు. రష్యాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయించి.. 78 శాతం రష్యన్ల మద్దతు సంపాదించి, 2036 వరకు తానే అధ్యక్షుడిగా కొనసాగేలా రాజ్యాంగంలో మార్పులు చేసుకొన్నారు.
విజయాలు.. విమర్శలు
‘కంట్రీ ఫస్ట్’ అన్నరీతిలో రష్యా విదేశాంగ విధానంపై పుతిన్ చెరగని ముద్ర వేశారు. సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన 14 స్వతంత్రదేశాల్లో మైనారిటీలుగా మారిన రష్యా మూలవాసుల ప్రయోజనాలు కాపాడేందుకు బలమైన జాతీయవాద ధోరణితో ముందుకు సాగి.. ‘ఏనాటికైనా మీరు తిరిగి రావాల్సిందే’ అనే సందేశాన్ని ఆయా దేశాలకు పంపారు.
అలాగే.. ఆ 14 దేశాల్లో అమెరికా కాలుపెట్టకుండా చూసుకున్నారు. ఇందుకు అంగీకరించని ఉక్రెయిన్ మీద దూకుడుగా చర్యలు తీసుకుని స్వదేశంలో మద్దతు పెంచుకున్నారు. చమురు తరవాత ఆయుధ ఎగుమతుల ద్వారా సిరియా యుద్ధకాలంలో తన ఆయుధపాటవాన్ని ప్రపంచానికి చూపి ఆయుధ వ్యాపారం పెంచుకున్నారు. అమెరికా నాయకత్వంలో పాశ్చాత్య కూటమి రష్యాను చిన్నచూపు చూడటం తట్టుకోలేక.. అయిష్టంగానే.. చైనాతో సయోధ్యను ఏర్పరుచుకున్నాడు.
ప్రపంచీకరణ తర్వాత భారత్ అమెరికా వైపు పూర్తిగా మొగ్గకుండా తన మిత్రపక్షంగా నిలుపుకోగలటమూ పుతిన్ చతురతకు ఉదాహరణే. భారత్ ప్రస్తుతం దిగుమతి చేసుకునే ఆయుధాల్లో నేటికీ సగం రష్యా నుంచే వస్తున్నాయంటే నమ్మాల్సిందే. అలాగే.. భారత్‌కు మార్కెట్ ధరకంటే చౌకగా చమురు అందిస్తున్నారు. తన పాలనా కాలంలోనే.. చెచెన్ వేర్పాటు వాదులను అణచివేయటం, చెచెన్యాను రిపబ్లిక్‌గా ప్రకటించటం, అక్కడి తనకు నమ్మకస్తుడైన రంజాన్ కడ్యరోవ్ చేతికి పగ్గాలు వచ్చేలా చేయటంపై పలు విమర్శలూ ఎదుర్కొన్నారు.
చిట్టెలుక లాంటి ఉక్రెయిన్‌ను ఉక్కపోతకు గురిచేసి మారణహోమానికి దిగారనే ఆరోపణలూ పుతిన్ మీద ఉన్నాయి. తొలిసారి అధ్యక్షుడి ఉన్నకాలంలో దేశంలో కావాలనే బాంబు పేలుళ్లు జరిపించి, ఆ నెపాన్ని వేర్పాటువాదుల మీదకు నెట్టి, వారిని క్రూరంగా అణచివేశాడనే ఆరోపణలనూ ఎదుర్కొన్నారు.
కుటుంబ జీవితమూ రహస్యమే..
పుతిన్ కుటుంబం గురించి ప్రపంచానికి నేటికీ ఎక్కువగా తెలియదు. ఆయన భార్య పేరు.. ల్యడమిలా షెక్రబెనోవాన. 1983లో వీరి వివాహం అయింది. పుతిన్ దంపతులకు మారియా, కేథరినా అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వీరిలో మారియా వైద్యురాలు కాగా.. కేథరినా ఏషియన్ స్టడీస్‌లో పట్టభద్రురాలు. వీరిద్దరూ మారుపేర్లతో విశ్వవిద్యాలయంలో చదువుకొన్నారు.
పుతిన్ అధ్యక్షుడయ్యాక.. వీరిని రహస్యంగా ఉంచి చదివించారు. పుతిన్ తన కుమార్తెలను ఎప్పుడూ మీడియా కంటపడనీయరు. వారి వ్యక్తిగత జీవితాలు చాలా గోప్యంగా ఉంటాయి. మారియా మెడికల్ రీసెర్చ్ వైపు వెళ్లారు. డీఎన్‌ఏ పరిశోధనల్లో ఆమె పేరు బయటకు వచ్చింది. ఒక చెవిటి జంట కోసం జన్యుమార్పులు చేసి సంతానం ఇచ్చే ప్రాజెక్టుకు ఆమె మద్దతు తెలపగా, అది వివాదాస్పదమైంది.
ఇక చిన్న కూతురు.. కేథరినా ఆక్రోబాట్ నృత్యకారిణి. రష్యన్ బిలియనీర్ కెర్రిల్ షమలోవ్‌ను 2013లో ఈమె పెళ్లి చేసుకుంది. కానీ, త్వరలోనే వారు విడిపోయారు. ప్రస్తుతం ఈమె అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోందనే వార్తలున్నాయి. 2013లో భార్య నుంచి పుతిన్ విడాకులు తీసుకొన్నారు. ఆ తర్వాత ఓ జిమ్నాస్టిక్ క్రీడాకారిణితో సన్నిహితంగా ఉన్నారు. 2015లో ఆమె ద్వారా పుతిన్‌కు మరో కుమార్తె పుట్టినట్లు వదంతులు వచ్చాయి గానీ.. పెద్దగా ఆధారాలు లేవు.
ఎదురుదాడి వీరుడు
కొవిడ్ సమయంలో రష్యా ‘స్పుత్నిక్-వీ’ అనే టీకాను తీసుకొచ్చింది. అయితే.. దాని పనితీరుపై పలు పాశ్చాత్య దేశాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. ‘ నా కూతురికి తొలి టీకా ఇచ్చి పనితీరు నిర్ధారణ అయ్యాకే.. అందరికీ ఇస్తున్నా’ అని ప్రకటించి పాశ్చాత్య దేశాల నోళ్లు మూయించాడు.
గత అమెరికా అధ్యక్ష ఎన్నికల పరోక్ష జోక్యంతో ఓటింగ్ యంత్రాలను హ్యాక్ చేయించి.. ట్రంప్‌ను ఓడించాడనే ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయం గురించి ముందుగానే ట్రంప్‌కు సూచించి, సవాలు విసిరాడనే వార్తలూ వచ్చాయి. తద్వారా.. నేటికీ రష్యా ప్రపంచశక్తేనని పరోక్షంగా ప్రపంచానికి తెలిపాడు.
అడవిలో పులిని పట్టుకొని, మార్షల్ ఆర్ట్స్ చేస్తూ, చేపలు పడుతూ, గుర్రపు స్వారీ, కత్తియుద్ధాలు, వెయిట్ లిఫ్టింగ్ విన్యాసాలతో మీడియాలో సందడి చేస్తూ.. నేనింకా యువకుడిలా దేశం కోసం పనిచేస్తూనే ఉన్నాననే భావనను కలిగించి, విపక్షాలను చిత్తుచేస్తుంటాడు. రష్యాలో ఎన్నికలు, ప్రజాభిప్రాయ సేకరణలు బూటకమని పాశ్చా్త్య దేశాలు విమర్శించినా.. ‘మీ గుట్టుమట్లు కూడా బహిరంగంగా చెప్పమంటారా?’ అంటూ తనదైన శైలిలో వారి నోరు మూయించిన చతురుడిగా పేరు గడించాడు.
వైఫల్యాలు
పుతిన్ రెండు దశాబ్దాలుగా రష్యాను ఏలుతున్నా.. నేటికీ రష్యా ఆర్థికంగా గొప్ప దేశంగా ఎదగలేదు. అపారమైన సహజ వనరులు, పారిశ్రామిక పునాది ఉన్నప్పటికీ.. అభివృద్ధిలో అద్భుతాలేమీ సాధించలేకపోయిందనేది అక్కడి విమర్శకుల మాట. కేవలం దేశం చమురు అమ్మకాల మీదే బతుకుతోందని, పాత పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు.. గుది బండలుగా మారుతున్నా.. నేటి టెక్నాలజీకి అనుగుణంగా దేశ యువతను సిద్ధం చేయలేకపోయారనే విమర్శ కూడా పుతిన్ మీద ఉంది.
20 ఏళ్ల పాటు దేశానికి పుతిన్ అందించిన రాజకీయ సుస్థిరత.. ఏ కోశానా ఆర్థిక ప్రగతికి దారితీయలేదనేది ఆయన వైఫల్యాల్లో అతి పెద్దదని నేటికీ చెబుతుంటారు. అయితే.. తన వ్యక్తిగత, వృత్తిగత జీవితం, పనితీరు, నిరంకుశ విధానాల మీద ఎన్ని ఆరోపణలున్నా.. పుతిన్ వాటిని పెద్దగా పట్టించుకోరు. స్పందించరు.
ముగింపు
రాజకీయాల్లో ఒక్క వారం కాలమే సుదీర్ఘమైనదని రాజకీయ పండితులు చెబుతుంటారు. అలాంటిది పుతిన్ ఏకంగా రెండు దశాబ్దాలు అధికారంలో ఉంటూ, నైతిక స్థైర్యాన్ని కోల్పోయిన దేశాన్ని తిరిగి నిలబెట్టారనే విషయాన్ని ఎవరూ కొట్టిపారేయలేరు.
పేద కుటుంబంలో పుట్టి దూకుడు కలిగిన నేతగా, సోవియట్ పతనానంతరం అష్టకష్టాలు పడిన తమను ఒక దారికి తెచ్చిన హీరోగా, రేపటి రష్యాను మరింత బలమైన దేశంగా తీర్చిదిద్దగలవాడిగా పుతిన్‌ను నేటికీ రష్యన్లు భావిస్తూనే ఉండటం ఆశ్చర్యమే.
ఆర్థికంగా బలహీన పడినా.. భౌగోళికంగా, సైనిక పరంగా రష్యాను కాదనలేని ఒక అనివార్య శక్తిగా అంతర్జాతీయ సమాజం ముందు నిలపటంలోనూ పుతిన్ సక్సెస్ అయ్యారు.