MLA Aravinda Babu: ఎన్నికల ముందు వరకు సైలెంట్‌గా ఉన్న ఆ నేత ఎన్నికలలో గెలవగానే అధిష్టానానికి షాక్ ఇచ్చేటంత వైలెంట్‌గా తయారయ్యారు. నియోజవర్గంలో తోటి నేతలతో వైరం పెట్టుకోవడమే కాదు అధికారులపై కూడా వీరంగం వేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి నానా యాగీ చేస్తూ నెగిటివ్ ఇమేజ్ పెంచుకుంటున్నారు.. అదేమంటే క్యాడర్ సంక్షేమం కోసమంటూ విచిత్రమైన వాదన వినిపిస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? అసలు ఆయన అంత దూకుడు ప్రదర్శించడానికి కారణమేంటి?
రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పిన నరసరావుపేట నేతలు
ఫ్యాక్షన్ రాజకీయాలకి పెట్టింది పేరైన పల్నాడు జిల్లాలోని అత్యంత ముఖ్యమైనటువంటి నియోజకవర్గాల్లో నరసరావుపేట ఒకటి. ఫ్యాక్షన్ రాజకీయాలు ఓకే కానీ ఈ నియోజకవర్గంలో గెలిచిన నేతలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పి ఫోకస్ అయ్యారు. నరసరావుపేట నియోజవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు చాలా పేరు ప్రతిష్టలే తెచ్చుకున్నారు. అందులో మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వారసుడైన కాసు వెంకట కృష్ణారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి పదవులను అనుభవించిన కాంగ్రెస్ నేతగా పేరుగాంచారు. నరసరావుపేటలో కాసు కుటుంబ హవాకు చెక్ పెట్టి అంతకు మించిన పేరుపేరు తెచ్చుకున్న నేత డాక్టర్ కోడెల శివప్రసాద్. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, స్పీకర్‌గా పనిచేసిన కోడలు శివప్రసాద్ టిడిపిలో అత్యంత కీలక నేతల్లో ఒకరిగా వెలుగొందారు.
మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన చదలవాడ అరవింద్ బాబు
నరసరావుపేట అంటే కాసు, కోడెల గుర్తొచ్చేంతగా ఈ నేతల పేరు రాష్ట్రంలో మారుమోగింది. అలాంటి నియోజకవర్గంలో టిడిపి తరఫు మొదటి సారి పోటీ చేసి ఓడిపోయిన చదలవాడ అరవింద్ బాబుకి మళ్లీ అధిష్టానం సీట్ ఇచ్చింది. 2024లో జరిగిన ఎన్నికల్లో అరవింద్ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై విజయం సాధించారు. రెడ్డి, కమ్మ సామాజికవర్గాలకు కాకుండా బీసీ నేతకు టకెట్ ఇచ్చిన టీడీపీ ఈక్వేషన్ నరసరావుపేటలో వర్కౌట్ అయింది. అరవింద్‌బాబు నరసరావుపేటలో చాలా సైలెంట్ నేతగా పేరు ఉండేది. వివాదాలకు దూరంగా ఉండే సాధుస్వభావిగా ప్రజల్లో పేరుండేది.
జిల్లాలో వివాదాస్పదుడిగా పేరు తెచ్చుకుంటున్న ఎమ్మెల్యే
అరవిందు బాబుకి సీటు ప్రకటించి సమయంలో ఆయన అమాయకుడు . గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లాంటి కీలక నేత పై ఎలా గెలవగలడు అన తెలుగు తమ్ముళ్లే అనుమానాలు వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత అరవింద్‌బాబు తన సాఫ్ట్ నేచర్‌తో మంచి పేరు తెచ్చుకుంటారని అందరూ భావించారు. అలాంటి అరవింద్ బాబు ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరిలోనే కాదు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేల్లోనే అత్యంత వివాదాస్పదుడిగా తయారవుతున్నారు.
మద్యం షాపు దక్కించుకున్న టీడీపీ నేతపై దాడి
అరవింద్ బాబు గెలిచిన రోజు నుంచే పార్టీలో ఓ వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ మరో వర్గానికి ప్రాధాన్యత లేకుండా చూస్తున్నారని సొంత పార్టీలోనే పలువురు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం వేలం పాటలో వైన్ షాప్ దక్కించుకున్న టిడిపి నేతపై అరవింద్ బాబు వర్గం దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ అంశం అధిష్టానం దృష్టికి సైతం వెళ్లి పంచాయతీ జరిగింది.
ఎమ్మెల్యే సమక్షంలో రెండు వర్గాల ఘర్షణ
ఎమ్మెల్యే కార్యాలయంలోనే రెండు వర్గాలు ఘర్షణపడి ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని తలకాయలు పగల కొట్టుకున్న ఘటన కలకలం రేపింది. ఆ సమయంలో అక్కడే ఉన్న చదలవాడ అరవింద్‌బాబు కళ్ల ముందే ఆ ఘర్షణ చోటు చేసుకోవడం గమనార్హం. ఆ అంశంలో అరవింద్‌బాబు మరోసారి అధిష్టానానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. జనసేన, బీజేపీలతో పాటు టీడీపీలో కూడా అందర్నీ కలుపుకుని పోకుండా.. తన అనుకున్న వారికి మాత్రమే అరవింద్‌బాబు ప్రాధన్యత ఇస్తున్నారని కూటమి శ్రేణులు ఆరోపించడం కామన్ అయిపోయింది. అదే కాకుండా ఒక ప్రధాన సామాజికవర్గానికి పూర్తిస్థాయిలో అరవింద్ బాబు దూరంగా ఉంటున్నారనేది పార్టీలో అంతర్గతంగా వివాదాలకు దారితీస్తుంది.
ఎక్సెజ్ కమిషనర్ కార్యాలయంలో ఎమ్నెల్యే రచ్చ
అదంతా ఒక ఎత్తు అయితే ఇటీవల అరవింద్ బాబు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో చేసిన రచ్చ పెద్ద కలకలే రేపింది. ఎమ్మెల్యే అరవింద్‌బాబు నరసరాపుపేటఎక్సైజ్ కమిషనరేట్‌లో 3 గంటల పాటు రచ్చ రచ్చ చేశారు. ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్‌కుమార్ లేని సమయంలో ఆయన ఛాంబర్‌లోకి ప్రవేశించి రభస చేశారు. తొలుత రూమ్ లోపలికి వెళ్లి దిండ్లు తెచ్చుకున్నారు. ఛాంబర్‌లో కొంతసేపు సోఫాపై కూర్చున్న ఆయన ఆ తర్వాత నేలపై పడుకొని తాను చెప్పినట్లుగా ఆదేశాలివ్వాలంటూ భీష్మించారు.
పార్టీ ముఖ్య నేతలు ఫోన్ చేసినా స్పందించని అరవింద్ బాబు
ఎక్సైజ్ ఉన్నతాధికారులు పదేపదే ఆయనకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినలేదు. దీంతో ప్రభుత్వ, పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయం వెళ్లింది. ఆయన్ను ఎక్సైజ్ కమిషనరేట్ నుంచి వెనక్కి రావాలని చెప్పేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, మంత్రులు ఫోన్ చేసినా అరవిందబాబు స్పందించలేదు. దాదాపు మూడు గంటల పాటు ఆయన హడావుడి, రభస కొనసాగాయి. నరసరావుపేటలోని ఏపీఎస్‌బీసీఎల్‌కు చెందిన ఐఎంఎల్ డిపోలో పని చేస్తున్న 10 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో తాను చెప్పిన వారిని నియమించాలంటూ ఎక్సైజ్ కమిషనర్‌కు ఎమ్మెల్యే వినతిపత్రమిచ్చారు. తాను మళ్లీ గంటలో వస్తానని అప్పటివరకు కొత్త వారికి నియామక ఉత్తర్వులు సిద్ధం చేయాలని ఆదేశించారు. వినతిని పరిశీలిస్తామని కమిషనర్ చెప్పినా లెక్కచేయకుండా బయటకు వెళ్లిపోయారు.
Also Read: టార్గెట్ ఫిక్స్.. కోటం రెడ్డి మాస్టర్ స్కెచ్
ఐఎంఎల్ డిపోలో తన వారిని నియమించాలని వినతిపత్రం
ఆ తర్వాత కొద్ది సేపటకి ఎమ్మెల్యే మళ్లీ కమిషనరేట్‌కు వచ్చారు. ఆ సమయంలో కమిషనర్ అందుబాటులో లేరు. సిబ్బంది అదే విషయాన్ని అరవిందబాబుకు చెప్పినా ఆయన వినకుండా ఛాంబర్ లోపలికి వెళ్లి రచ్చరచ్చ చేశారు. చివరికి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలంటూ నరసరావుపేట డిపో మేనేజర్‌కు ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాలు పంపించడంతో శాంతించి ఛాంబర్ నుంచి అరవిందబాబు బయటకు కదిలారు.
లిఖిలపూర్వ వివరణ ఇవ్వాలని ఆదేశించిన సీఎం
డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు స్పందించి లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారంటే అరవింద్ బాబు చేసిన రచ్చ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. సైలెంట్ గా ఉంటే ఆ నేత అంత వైలెంట్‌గా ఎందుకు మారారు అనేది నరసరావుపేట వాసులకు అంతుపట్టకుండా తయారైంది. అయితే అరవింద్‌బాబు వర్గం మాత్రం నరసరావుపేట రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే సొంత క్యాడర్ని నిలుపుకోవాల్సి ఉంటుందని.. తన క్యాడర్ని కాపాడుకోవడానికే ఎమ్మెల్యే అంత దూకుడుగా వెళ్తున్నారని సమర్ధించుకుంటుంది. మరి చూడాలి మున్ముందు నరసరాపుపేట ఎమ్మెల్యే వ్యవహారతీరు ఎలా ఉంటుందో?