Kotamreddy Sridhar Reddyఓసారి ఎమ్మెల్యే అయితే చాలు అనుకునే నేతలు ఎందరో ఉంటారు. గెలిచిన నియోజకవర్గంలో పాతుకుపోవాలని మరి కొందరు ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ ఎమ్మెల్యే తన సెగ్మెంట్లో శాశ్వతంగా గెలవడానికి రచిస్తున్న వ్యూహాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా విలక్షణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ పాటు విభిన్నమైన వైఖరితో ముందుకు వెళ్తున్నారు ఆ ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే? నియోజకవర్గంలో ఆయన గీస్తున్న స్కెచ్ ఏంటి? ఎక్కడా ఆ జిల్లా చూడాలంటే వాచ్ దిస్ స్టోరీ.
వైసీపీకి చుక్కలు చూపించిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఈ పేరు చెప్తేనే ఇప్పుడు వైసీపీ ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. వైసీపీ అధికారంలో ఉండగా ఎన్నికలకు సుమారు ఏడాది ముందు అధికార పార్టీలో ఉండి అసమ్మతి బావుట ఎగురవేశారు ఆయన. దాంతో అప్పటి అధికార పార్టీ సందిగ్ధంలో పడింది. కోటంరెడ్డి విమర్శలను కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఎట్టకేలకు కోటంరెడ్డి టీడీపీలో చేరడంతో.. పార్టీ ఫిరాయింపు చట్టం కింద ఆయనపై ఎన్నికల ముందు అనర్హత వేటు వేయించింది. సీన్ కట్ చేస్తే ఆయన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఘన విజయం సాధించారు.
అభివృద్ధే అజెండాగా పెట్టుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే
ఎన్నికలకు ముందు వరకు వైసీపీపై ఓ రేంజ్‌లో విమర్శలు వినిపించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఆ తర్వాత అభివృద్ధి తన అజెండా అంటూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గాల్లో కార్యకర్తలను ఆప్యాయంగా పలంకరించడం, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కావాల్సిన చర్యలు చేపడుతూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న ఆయన దేశంలో మొట్టమొదటిసారిగా రికార్డు సృష్టించబోతున్నారు.
ఒకేరోజు 105 పనులకు శంకుస్థాపనలు
ఏ ఎమ్మెల్యే చేయని విధంగా మొదటిసారిగా 105 పనులకు శంకుస్థాపనలు చేసేందుకు మార్చి 9 న ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి రాత్రి 10 గంటల వరకు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. మరొ వారం రోజుల్లో 198 పనులకు శ్రీకారం చుట్టి మొత్తం 303 అభివృద్ధి పనులకి సంఖస్థాపన చేయబోతున్నారు. 60 రోజుల్లో పనులు పూర్తి చేయించి.. మే 20న ప్రజలకు అంకితం ఇస్తామంటున్నారు.. అభివృద్ధి పనులకు ఈ స్థాయిలో శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే ఇప్పటివరకు దేశంలో ఎవరూ లేరని చెప్పవచ్చేమో. అలాంటి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోవడానికి ఇటు ప్రభుత్వ పెద్దలు, అటు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
నెల్లూరు రూరల్‌లో తనకు ఎదురులేకుండా చేసుకోవడానికి స్కెచ్
ఒకసారి కాదు రెండుసార్లు కాదు నాలుగు సార్లు కూడా ఎమ్మెల్యేగా పనిచేసిన చాలామంది నేతలు నెల్లూరు జిల్లాలో ఉన్నారు. అప్పటి ఉమ్మడి జిల్లాలో కోటంరెడ్డిలా హ్యాట్రిక్ కొట్టిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఎమ్మెల్యేగా వరుస విజయాలను అందుకుంటున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భవిష్యత్తులో నెల్లూరు రూరల్ సెగ్మెంట్లో తనకు ఎదురులేకుండా చేసుకునేందుకు ఫౌండేషన్ పటిష్ట పరుచుకునే పనిలో పడ్డట్లు కనిపిస్తున్నారు.
రూరల్ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మార్చడానికి పావులు
స్వపక్షంలో ఉండి విపక్షాన్ని ఇరుకున పెట్టే నేతలు ఎంతోమంది ఉంటారు. అయితే స్వపక్ష నేతలను తన పనితీరుతో సందిగ్ధంలోకి నెట్టే నేతలు కొందరే ఉంటారు. అటువంటి వారిలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒకరు అని రాజకీయ వర్గాల్లో ఎవరైనా టక్కున చెప్పే విధంగా ఆయన వైఖరి ఉంటుంది. ఎమ్మెల్యే పదవిని సుదీర్ఘకాలం చేపట్టాలని, ఆ పదవి తనను విడిచి వెళ్ళకుండా ఉండాలంటే ప్రజాక్షేత్రంలో చేయాల్సిన పనులన్నీ చేయడంతో పాటు, నియోజకవర్గాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చాలని కోటంరెడ్డి భావిస్తున్నారంట. మొత్తానికి అభివృద్దికి సంబంధించి ఆయన గీస్తున్న భారీ స్కెచ్‌తో మిగిలిన ఎమ్మెల్యేలపై ప్రజల నుంచి తీవ్ర వత్తిడి పెరగడం ఖాయంగా కనిపిస్తుంది.