BigTV English

NASA Find Alien Life: భూమికి దగ్గర్లో ఏలియన్స్.. శాస్త్రవేత్తలకు దొరికిన ఆధారాలు

NASA Find Alien Life: భూమికి దగ్గర్లో ఏలియన్స్.. శాస్త్రవేత్తలకు దొరికిన ఆధారాలు

మరో భూమిగా కనిపిస్తున్న కే2-18బీ గ్రహం

ఈ అనంతమైన విశ్వంలో భూగోళంపై కాకుండా ఇంకెక్కడైనా జీవజాలం ఉందా? జీవులు మనుగడ సాగించే వాతావరణ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? దీనికి సమాధానం కనిపెట్టేందుకు.. శతాబ్దాలుగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇతర గ్రహాలపై జీవుల ఉనికి ఉండొచ్చని అంచనా వేస్తున్నప్పటికీ.. అందుకు కచ్చితమైన ఆధారాలైతే దొరకలేదు. ఏలియన్స్ ఉన్నారనే వార్తలు కూడా కల్పితాలకే పరిమితమయ్యాయ్. కానీ.. మన సౌర వ్యవస్థ వెలుపల ఉన్న కే2-18బీ అనే గ్రహంపై.. జీవం ఉందని చెప్పడానికి బలమైన సాక్ష్యాధారాలు లభించాయని.. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ గ్రహం మన భూమి నుంచి 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. భూగోళంతో పోలిస్తే రెండున్నర రెట్లు పెద్దగా ఉందని తేల్చారు. అదే.. ఇప్పుడు మరో భూమిగా కనిపిస్తోంది.


ఏ గ్రహంలోనూ లేని మనుషులు, ఇతర జీవులు

భూమిపై సమస్త కోటి జీవరాశి నివాసముంటోంది. అంతరిక్షంలో మనకు తెలిసి.. ఏ గ్రహంలోనూ మనుషులు గానీ, ఇతర జీవులు గానీ మనుగడ సాగించట్లేదు. గ్రహాంతరవాసులున్నారనే వార్తలు అప్పుడప్పుడు వినిపించినా.. వాటికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. రోజురోజుకు భూమిపై ఉన్న సహజ వనరులు తగ్గిపోతుండటంతో.. భవిష్యత్‌లో భూమిపై మానవుడి మనుగడకు అవసరమైన వనరులు సరిపోవనే అంచనాలున్నాయ్. దాంతో.. మనుషులు నివసించేందుకు అనువైన ఇతర గ్రహాల కోసం పరిశోధనలు జరుపుతున్నారు. ఇతర గ్రహాలపై ఎక్కడైనా మనుషులున్నారా? జీవం మనుగడకు అవసరమైన అనుకూలమైన వాతావరణం ఉందా? అని విస్తృతంగా శోధిస్తున్నారు. ఈ క్రమంలో.. భూమి లాంటి కే2-18బీ అనే మరో గ్రహం కనిపించింది.

జీవానికి మూలమైన ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తింపు

సౌర కుటుంబం ఆవల ఉన్న ఈ గ్రహంపై.. జీవానికి మూలమైన ఆనవాళ్లు ఉన్నట్లు భారత సంతతి శాస్త్రవేత్త ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ గుర్తించారు. ఆయన నేతృత్వంలోని.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ విషయాన్ని తేల్చింది. జీవుల మనుగడ సాధ్యమయ్యే మరో గ్రహం దొరికిందని చెప్పడానికి ఇది తొలి సంకేతంగా చెబుతున్నారు. సౌర వ్యవస్థకు బయట జీవం ఉనికిని పరిశోధించే విషయంలో.. ఇదో కీలకమైన మలుపుగా భావిస్తున్నారు. మనం ఒంటరివాళ్లం కాదని.. ఇతర గ్రహాలపై మన సహచర జీవులున్నాయని కచ్చితంగా చెప్పే రోజు.. ఇంకొన్ని సంవత్సరాల్లోనే వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు.

కే2-18బీ ఎలా ఏర్పడిందనేది ఇప్పటికే మిస్టరీనే!

ఈ కే2-18బీ గ్రహం సబ్ నెప్య్టూన్ క్లాస్‌కు చెందింది. అంటే.. ఇలాంటి గ్రహాలు.. భూమి వ్యాసం కంటే ఎక్కువ. నెప్ట్యూన్ వ్యాసం కంటే తక్కువగా ఉంటాయి. అయితే.. ఈ కే2-18బీ గ్రహం ఎలా ఏర్పడిందన్నది ప్రస్తుతానికి మిస్టరీగానే ఉంది. దీనిపై మిథేన్, కార్బన్‌డయాక్సైడ్, డైమిౖథెల్‌ సల్ఫైడ్, డైమిౖథెల్‌ డైసల్ఫైడ్‌ వాయువులు సమృద్ధిగా ఉన్నట్లు.. రెండేళ్ల క్రితమే కనిపెట్టారు. 1990 నుంచి ఇప్పటివరకు.. సౌర వ్యవస్థ బయట దాదాపు 6 వేల గ్రహాలను గుర్తించారు. వీటిని ఎక్సోప్లానెట్స్‌ అని, హైసియన్‌ వరల్డ్స్ అని కూడా అంటున్నారు. వీటిలో చాలావరకు ద్రవరూపంలోని సముద్రాలతో కప్పి ఉన్నాయని, ఎక్సోప్లానెట్స్‌పై హైడ్రోజన్‌తో కూడిన వాతావరణం ఉందని చెబుతున్నారు. అందువల్ల.. ఆ గ్రహాలపై జీవులు ఉండేందుకు ఆస్కారముందని కచ్చితంగా చెబుతున్నారు.

జీవం ఉనికి ఉందని.. ఎలా నిర్ధారణకు వచ్చారు?

భూమి లాంటి మరో గ్రహం అనే ఊహే అద్భుతంగా ఉంటుంది. అలాంటిది.. కే2-18బీ గ్రహానికి.. భూమితో దగ్గరి పోలికలు ఉన్నాయంటే.. అంతరిక్ష పరిశోధనల్లో మనిషి మరో అడుగు ముందుకు వేసినట్లే. అసలు.. సౌర వ్యవస్థకు ఆవల ఉన్న ఈ గ్రహంపై.. ఖగోళ శాస్త్రవేత్తలు ఏం గుర్తించారు? జీవం ఉనికి ఉందని.. ఎలా నిర్ధారణకు వచ్చారు?

2017లోనే కే2-18బీ గ్రహం గుర్తింపు

కే2-18బీ గ్రహాన్ని.. కెనడాకు చెందిన వ్యోమగాములు 2017లోనే గుర్తించారు. అప్పట్నుంచే.. దీనిపై అనేక పరిశోధనలు సాగుతున్నాయ్. ఇప్పుడు.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు.. జీవానికి మూలమైన కణజాలం ఈ గ్రహంపై ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు.. కే2-18బీ గ్రహంపై జీవం ఆన‌వాళ్లు కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. భూమిపై చిన్న చిన్న జీవాలు ఉత్పత్తి చేసే క‌ణాల‌కు చెందిన సిగ్నల్స్.. ఆ గ్రహంపై గుర్తించిన‌ట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. దీనికి సంబంధించి.. ది ఆస్ట్రోఫిజిక‌ల్ జ‌ర్నల్ లెటర్స్‌లో.. ప‌రిశోధ‌న అంశాల‌ను ప‌బ్లిష్ చేశారు. జీవంతో సంబంధం ఉన్న ర‌సాయ‌నాల‌ను.. కే2-18బీ ప్లానెట్‌పై రెండోసారి గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

కే2-18బీపై జీవం ఉన్నట్లు చెప్పేందుకు బలమైన ఆధారాలు

నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా.. ఆ గ్రహంపై ఉన్న వాతావార‌ణంలో కెమికల్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నట్లు నిర్ధారించారు. అయితే.. ఆ కెమికల్స్‌పై స్టడీ చేసేందుకు మరింత డేటా అవసరమవుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గ్రహానికి సంబంధించి త్వరలోనే మరింత ఆసక్తికరమైన సమాచారం వస్తుందని ఆశిస్తున్నారు. కే2-18బీపై జీవం ఉన్నట్లు చెప్పేందుకు.. చాలా బలమైన ఆధారం దొరికిందని.. ప్రస్తుతం అందిన సిగ్నల్‌ని ధ్రువీకరించేందుకు.. మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉందంటున్నారు.

భూమికి 700 ట్రిలియన్ల మైళ్ల దూరంలో కే2-18బీ

కే2-18బీ గ్రహం.. సుమారు 700 ట్రిలియ‌న్ల మైళ్ల దూరంలో ఉంది. అయితే.. ఏ మానవుడు కూడా తన జీవితకాలంలో అంత దూరం ప్రయాణించలేడని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా.. ఆ గ్రహం ఓ చిన్నపాటి ఎర్రటి సూర్యుడి చుట్టూ చక్కర్లు కొడుతోందని గుర్తించారు. ఆ సూర్యుడి నుంచి వెళ్లిన కాంతిన స్టడీ చేసే.. అక్కడి వాతావరణంలో భూమి లాంటి రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా.. జీవానికి సంబంధమైన డైమిథైల్ స‌ల్ఫైడ్‌, డైమిథైల్ డైస‌ల్ఫైడ్‌ అక్కడి వాతావ‌ర‌ణంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తేల్చారు. సాధారణంగా భూమిపై ఈ వాయువులను.. సముద్ర మొక్కలు, బ్యాక్టీరియా రిలీజ్ చేస్తాయ్. కానీ.. కే2-18బీ గ్రహంపై.. భారీ స్థాయిలో ఆ వాయువులు ఉండటమే.. పరిశోధకుల్ని ఆశ్చర్యపరుస్తోంది.

జీవానికి అనువైన వాయువులు ఎలా పుడుతున్నాయ్!

భూమిపై ఉన్న వాయువు కన్నా.. వెయ్యి రెట్లు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కే2-18బీ గ్రహంపై స‌ముద్రం కూడా ఉన్నట్లు ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలుస్తోంద‌ని, దాంతో.. అక్కడ జీవం కూడా ఎక్కవే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. ఇప్పుడే ఎలాంటి విషయాన్ని నిర్ధారించలేమంటున్నారు. జీవానికి అనువైన వాయువులు గనక ఆ గ్రహంపై ఉన్నాయంటే.. అవి ఎలా పుడుతున్నాయో తెలుసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కే2-18 బీ గ్రహంపై జీవసంబంధిత ప్రక్రియలు

సౌర వ్యవస్థకు ఆవల ఉన్న ఈ గ్రహానికి సంబంధించిన పరిశోధనల్లో.. భారత సంతతి ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన సమర్పించిన ఎన్నో పరిశోధన పత్రాలు అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అంతేకాదు.. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ జరుపుతున్న పరిశోధనకు కూడా ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. కే2-18బీ గ్రహంపై అచ్చంగా భూమిపై ఉన్నట్లుగా మనుగడలో ఉన్న ప్రాణులు లేనప్పటికీ.. జీవసంబంధిత ప్రక్రియలు జరుగుతున్నాయనే నిర్ధారణకు వచ్చారు ఖగోళ శాస్త్రవేత్తలు. సాధారణంగా డీఎంఎస్, డీఎండీఎస్ వాయువులు.. జీవ సంబంధమైన ప్రక్రియల ద్వారానే ఉత్పత్తి అవుతాయి. అందువల్ల.. అక్కడ జీవం లేని వాటి నుంచి కూడా ఉత్పత్తి అవుతున్నాయా? లేదా? అన్న కోణంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. దాంతో మరింత పరిశోధన జరగాల్సి ఉందంటున్నారు.

వాతావరణం ఉపరితలం స్వభావంపై సందేహాలు

కే2-18బీ జీవానికి అనుకూలమైన లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యంగా.. నీటి ఆవిరి, హాబిటబుల్ జోన్‌లో ఉండటం, డీఎంస్ వాయువుల్లాంటి బయోసిగ్నేచర్‌లు.. ఆసక్తి రేపుతున్నాయి. అయితే.. దీనిపై ఉన్న వాతావరణం, ఉపరితల స్వభావం గురించి ఇంకా చాలా సందేహాలున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు.. డీఎంఎస్ వాయువుల ఉనికిని నిర్ధారించేందుకు, గ్రహంపై జీవానికి ఉన్న అనుకూలతలను బాగా అర్థం చేసుకునేందుకు సహాయపడతాయ్. మరింత డేటా సేకరణతో, ఇంకొన్ని సంవత్సరాల్లోనే.. కే2-18బీ గ్రహంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×