BigTV English

Article 142: ఎవరు సుప్రీం.? ఆర్టికల్ 142 పై చర్చ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశం..!

Article 142: ఎవరు సుప్రీం.? ఆర్టికల్ 142 పై చర్చ రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఆదేశం..!

Article 142 : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇటీవలి తీర్పుల చుట్టూ ఒక కొత్త చర్చ మొదలైంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై అణుక్షిపణిని ప్రయోగించేలా చేయడం ఏంటని ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ ఖర్ ప్రశ్నించడంతో మరోసారి ఈ మ్యాటర్ చర్చనీయాంశమైంది. శాసన, న్యాయవ్యవస్థల మధ్య సంఘర్షణ దేశంలో ఇవాళ కొత్తగా వచ్చిన చర్చ అయితే కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ప్రభుత్వ నిర్ణయాల్లో సుప్రీం కోర్టు జోక్యం చేసుకున్నప్పుడు కూడా హాట్ డిబేట్ గా మారింది. ఇప్పుడు పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ విషయంలో సుప్రీం తీర్పుతో మరోసారి దేశంలో ఎవరు సుప్రీం అన్న చర్చ తెరపైకి వస్తోంది.


శాసన, న్యాయవ్యవస్థల సంఘర్షణపై చర్చ

దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సుప్రీం కోర్టు తీర్పులు నిర్ణయాలపై చర్చ జరుగుతోంది. అది శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సంఘర్షణ గురించే. ఎందుకంటే ఈ రెండు వ్యవస్థల మధ్య సున్నితమైన సరిహద్దు ఉంది. భారత రాజ్యాంగం ఎవరివి వారికే హక్కులు, అధికారాలు కల్పించింది. సో మ్యాటర్ ఏంటంటే సుప్రీం కోర్టు తనకున్న కాన్ స్టిట్యూషనల్ పవర్స్ ను వాడుతూ ఒక అడుగు ముందుకేసిందా అన్నది ఇప్పుడు రాజ్యాంగ నిపుణులు, శాసన వ్యవస్థల్లో చర్చకు దారి తీసింది.


తాజాగా తమిళనాడు పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన లాండ్ మార్క్ జడ్జిమెంట్ చుట్టూ కథ నడుస్తోంది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లుల్ని గవర్నర్, రాష్ట్రపతి ఆమోదించకపోతే 3 నెలల్లో వాటిని ఆమోదించినట్లుగానే చూడాలని తీర్పు ఇవ్వడంపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్ మాట్లాడడంతో మ్యాటర్ మరో టర్న్ తీసుకుంది.

ప్రతి వ్యవస్థ గౌరవాన్ని కాపాడుకోవాలన్న రాజ్యాంగం

భారత రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థకు అత్యున్నత సంస్థ సుప్రీం కోర్టు. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పులు రాజ్యాంగ విలువలను, చట్టాన్ని, అలాగే ప్రజా ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా ఉంది. అయితే తాజాగా తమిళనాడు పెండింగ్ బిల్లులపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, రాష్ట్రపతి 3 నెలల్లో క్లియర్ చేయాలన్న విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మన దేశంలోని కీలకమైన వ్యవస్థలకు రాజ్యాంగం సున్నితమైన హద్దులు గీసింది. ప్రతి వ్యవస్థ తమ గౌరవాన్ని కాపాడుకుంటూనే ఇతర వ్యవస్థలను గౌరవించాలి.

సంఘర్షణ తలెత్తినప్పుడు వ్యవస్థలకు పవర్స్

అలాగని తప్పు జరిగితే చూస్తూ ఉండొద్దని కూడా చెప్పింది. అదే సమయంలో ఒకరి అధికారాల్లోకి మరొకరు దూసుకెళ్లడంపైనా స్పష్టత రాజ్యాంగంలో ఉంది. సో ప్రజాస్వామ్యం నిలబడాలి, సంపూర్ణ న్యాయం జరగాలి. సంఘర్షణ తలెత్తినప్పుడు వ్యవస్థలకు పవర్స్ కూడా ఇచ్చింది రాజ్యాంగం. పవర్స్ ఇచ్చిన ఆ ఆర్టికల్స్ చుట్టూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

అనుకూల తీర్పులు, ప్రతికూల తీర్పుపై చర్చ

సుప్రీం కోర్టు ప్రభుత్వాలకు అనుకూలంగా తీర్పులు ఇస్తే కరెక్ట్.. చెంపపెట్టు తీర్పులు ఇస్తే రాంగ్ అవుతుందా అన్నది మరికొందరి న్యాయనిపుణుల వాదన. సో లేటెస్ట్ గా తమిళనాడు పెండింగ్ బిల్లులపై జరిగిందేంటో చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద సుప్రీం కోర్టు తన అధికారాలను వినియోగించి 3 నెలల్లో రాజ్ భవన్, రాష్ట్రపతి భవన్ పెండింగ్ బిల్లుల్ని క్లియర్ చేయాల్సిందే అన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు ఒక ప్రత్యేకమైన, విశేషమైన అధికారాన్ని ఇచ్చింది. అదేంటంటే… కొన్నిసార్లు చట్టం లేదా శాసన వ్యవస్థ ఏదైనా కష్టమైన సమస్యకు పరిష్కారాన్ని అందించకపోతే పూర్తి న్యాయం చేసేలా… కేసు వాస్తవాలను పరిగణలోకి తీసుకుని వివాదాన్ని ముగించడానికి సుప్రీం తన పరిధిని విస్తరించి తీర్పు ఇవ్వొచ్చు.

బిల్లుల్ని 3 నెలల్లో క్లియర్ చేయాలని డెడ్ లైన్

ఆ ప్రకారంగా తమిళనాడు గవర్నర్ పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీం కోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రయోగించి సంచలన తీర్పు అయితే ఇచ్చింది. అంటే గవర్నర్ అధికారాలపై ఆర్టికల్ 200 చెప్పినట్లు.. సాధ్యమైనంత త్వరగా బిల్లుల్ని క్లియర్ చేయాల్సి ఉండగా.. అది 3 నెలలు అని సుప్రీం కోర్టు తాజాగా డెడ్ లైన్ విధించింది. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రపతికే గడువు నిర్దేశిస్తారా అని జగ్‌దీప్ ప్రశ్న

ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్.. సుప్రీం తీర్పుపై కీ కామెంట్స్ చేశారు. రాష్ట్రపతికే గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదని,.ప్రజాస్వామ్య శక్తులపై అణు క్షిపణిని సుప్రీంకోర్టు ప్రయోగించరాదన్నారు. సూపర్‌ పార్లమెంటులా వ్యవహరిస్తారని, వారికి మాత్రం ఎలాంటి జవాబుదారీతనం ఉండదన్నారు. ఇది చాలా పెద్ద స్టేట్ మెంట్. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఉద్దేశమేంటంటే.. రాష్ట్రపతి, గవర్నర్ 3 నెలల్లో ఏదైనా బిల్లును ఆమోదించకపోతే అది ఆటోమేటిక్ గా డీమ్డ్ టు బి క్లియర్డ్ అని నిర్ణయం జరిగిపోతే ప్రమాదం కాదా అంటున్నారు. స్క్రూటెనీ ఎవరు చేయాలి.. చేయకపోతే బాధ్యత ఎవరు వహిస్తారు.. ఇలాంటి ప్రశ్నలన్నిటినీ సంధిస్తున్నారాయన.

జడ్జి ఇంట్లో కాలిన నోట్ల కేసుపైనా ఉపరాష్ట్రపతి ప్రశ్నలు

నిజానికి ఒక బిల్లుకు సాధ్యమైనంత త్వరగా ఆమోదించాలి అని రాజ్యాంగంలో ఉంటే.. సుప్రీం తాజాగా 3 నెలల డెడ్ లైన్ పెట్టింది. అయితే మాటకు బదులు.. రాజ్యాంగంలో సాధ్యమైనంత త్వరగా అన్న మాటను చట్టసభలో సవరణ చేయండి అని సూచనలు ఇచ్చినా బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సమన్వయం సమతుల్యతతో ఉండేదన్న భావనలున్నాయి. కానీ 3 నెలలు అని డిసైడ్ చేయడం అన్న మాట చుట్టూ ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఉపరాష్ట్రపతి చెప్పిన మరో ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇటీవలే ఓ జడ్జి ఇంట్లో గుట్టలుగా కాలిపోయిన నోట్లు దొరికాయి కదా.. ఆ కేసు ఏమైందని ధన్ కర్ ప్రస్తావించారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి, గవర్నర్లకు మాత్రమే విచారణ నుంచి మినహాయింపు ఉంది. మరి ఈ కేసులో న్యాయవ్యవస్థ స్వతంత్రతకు, జడ్జిపై విచారణకు సంబంధం లేదు కదా అని క్వశ్చన్ చేస్తున్నారు.

ఒకరి అధికారాల్లోకి మరొకరు వస్తే సంఘర్శణేనా?

సో రాజ్యాంగంలో చెప్పినట్లు.. తప్పులు జరుగుతుంటే రాజ్యాంగ సవరణలు చేయాలని సుప్రీం సూచించాలి. శాసన వ్యవస్థలు పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలా అన్న చర్చ జరుగుతోంది. అలా కాకుండా ఒకరి అధికారాల పరిధిలోకి మరొకరు వస్తే రాజ్యాంగ ప్రతిష్టంభనకు దారి తీసే అవకాశాలుంటాయన్న వారూ ఉన్నారు.

న్యాయవ్యవస్థలో పారదర్శకత, స్వతంత్రత చాలా కీలకంగా ఉంటాయి. అందుకే రాజ్యాంగం సుప్రీం కోర్టుకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. అదే సమయంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలకు చట్టాలు చేసే సంపూర్ణ హక్కులు కల్పించింది. ఎవరి బాధ్యతలు వారికి ఇచ్చింది. అయితే కాన్ స్టిట్యూషన్ ఫ్రేమ్ వర్క్ ప్రకారం వ్యవస్థలు నడుచుకుంటున్నాయా లేదా అన్న పాయింట్ చుట్టూ రాజ్యాంగ నిపుణులు, రాజకీయ, న్యాయ నిపుణుల మధ్య చర్చ జరుగుతోంది.

ప్రజాహక్కు్ల్ని కాపాడడమే లక్ష్యమన్న వాదన

కోర్టు తీర్పులు ప్రజల హక్కులను కాపాడటానికి, ప్రభుత్వ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికే ఉన్నాయని, సుప్రీం కోర్టు రాజకీయ ఒత్తిడుల నుండి స్వతంత్రంగా పనిచేస్తుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంటుందన్నది న్యాయనిపుణుల వాదన. కొన్ని తీర్పులు ప్రగతిశీలంగా, సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించేవిగా ఉంటాయి. మరికొన్ని తీర్పులు సాంప్రదాయక విలువలను, రాజకీయ సమతుల్యతను కాపాడటానికి ప్రయత్నిస్తాయి. అన్నీ కీలకమే. ఇంపార్టెంట్ ఇష్యూస్ లో బ్యాలెన్స్ గా ఉండడం కత్తి మీద సామే.

నియామకాలు, పదోన్నతులు, బదిలీలు అంతా కొలీజియమే

న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. నియామకాలు, పదోన్నతులు, బదిలీలు అన్నీ సుప్రీంకోర్టు కొలీజియమే చూసుకుంటుంది. చివరకు జడ్జిల మీద ఆరోపణలు వచ్చినా సరే సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థల్ని ఎంటర్ కానివ్వని పరిస్థితి ఉందన్న చర్చ ఉంది. కొలీజియం స్థానంలో నేషనల్ జుడిషియల్ కమిషన్ ఏర్పాటుకు కేంద్రం ప్రతిపాదించిన బిల్లును సుప్రీంకోర్టు కొట్టేసింది. కేంద్రం ఎంత ప్రయత్నించినా జడ్జిల నియామకంలో మార్క్ చూపించలేకపోయింది. ఒక దశ వరకు ప్రయత్నించి ఆగిపోయింది కేంద్రం.

26 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం తీర్పు

ఇక మమతా బెనర్జీ కూడా ఇటీవలి సుప్రీం తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయంటూ 26 వేల మంది టీచర్ల నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే ఆ తీర్పును వ్యక్తిగతంగా తాను అంగీకరించలేనని, కానీ న్యాయస్థానంపై గౌరవంతో ప్రభుత్వ పరంగా నడుచుకుంటామన్నారు. అక్కడితో ఆగలేదు..

తనను జైలులో పెట్టినా ఖాతరు చేయబోనన్న మమత

ఎవరి ఉద్యోగమైనా తీసేసే హక్కు ఎవరికుంటుంది? ఎవరికీ ఉండదన్నారు. ఈ విషయంలో తమకు ప్లాన్ ఏబీసీడీఈ రెడీగా ఉన్నాయన్నది. ఈ మాట అన్నందుకు తనను జైలులో పెట్టొచ్చని, అయినా ఖాతరు చేయబోనని కుండబద్ధలు కొట్టారు. ఈ నిర్ణయం వెనుక బీజేపీ, సీపీఎం కుట్ర ఉందని కూడా ఆరోపించారు.

జడ్జిని ట్రాన్స్ ఫర్‌తో సరిపెడుతారా అని ప్రశ్న

విద్యావ్యవస్థను నాశనం చేయడమే లక్ష్యమని, అర్హులైన టీచర్లను దొంగలు, అనర్హులుగా ముద్రవేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్ చేశారు. ఒక సిట్టింగ్‌ జడ్జి నివాసంలో నోట్ల కట్టలు దొరికితే కేవలం ట్రాన్స్‌ఫర్‌తో సరిపెడతారా? అదే నియామకాల్లో మోసం జరిగిందని మొత్తం ప్రక్రియనే రద్దు చేస్తారా? అని కూడా ప్రశ్నించారామె. అలాంటప్పుడు అభ్యర్థులను ఎందుకు బదిలీతో సరిపెట్టకూడదన్నారు. కొందరి కారణంగా అంతమందిని శిక్షించడం ఏంటని ప్రశ్నించారామె.

Also Read: వైసీపీ నేతలకు భయం.. భయం..

కేసులను కేటాయించే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అధికారంపై వివాదం

భారత ప్రధాన న్యాయమూర్తి కేసులను కేటాయించే మాస్టర్ ఆఫ్ ది రోస్టర్ అధికారం కూడా అప్పట్లో వివాదాస్పదమైంది. ఇది CJIకి అపరిమిత అధికారాన్ని అనుమతిస్తుందని, సెన్సిటివ్ కేసులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్న చర్చ తెరపైకి వచ్చింది. 2018లో నలుగురు సీనియర్ జడ్జిలు ఇదే విషయంపై ప్రెస్ మీట్ పెట్టడం అప్పట్లో ఓ పెను సంచలనం. తాజాగా వక్ఫ్ పిటిషన్లపై సుప్రీం కోర్టు సంధించిన ప్రశ్నలపైనా సొసైటీలో చర్చ జరుగుతోంది.

స్వతంత్రత, పారదర్శకత బలోపేతం చేయడమే మార్గం

శబరిమల ఆలయ ప్రవేశంపై తీర్పు విషయమే అయినా.. ఆర్టికల్ 370 రద్దుపై ఇచ్చిన తీర్పు అయినా.. ఇలా సుప్రీం కోర్టు చాలా సవాళ్లనే ఎదుర్కొంది. సమాజంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తమైనా.. సుప్రీం పవర్స్ సుప్రీంకు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం ముందుకెళ్లడమే అత్యున్నత న్యాయస్థానం ముందున్న బాధ్యత. కొన్ని సందర్భాల్లో కోర్టు తన రాజ్యాంగ బాధ్యతలను నెరవేరుస్తూ సామాజిక న్యాయాన్ని ప్రోత్సహిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారుతుంది. ఈ విషయంలో విమర్శలు, సమర్థనలు రెండూ సమాజంలోని విభిన్న కోణాలను ఆవిష్కరిస్తాయి. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, పారదర్శకతను బలోపేతం చేయడం ద్వారా ఈ వివాదాలను తగ్గించవచ్చన్న సూచనలు వస్తున్నాయి.

 

 

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×