MLA Danam Nagender: బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి దానం నాగేందర్ ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.. పార్లమెంట్ ఎన్నికలో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అంత చేసినా పార్టీలో తగిన ప్రాధాన్యత దొరకడం లేదని తెగ ఫీలై పోతున్నారంట.. అందుకే ఏఐసీసీ పిలుపు ఇచ్చిన కార్యక్రమాలకు, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గాంధీభవన్ లో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలకు సైతం దూరంగా ఉంటున్నారంట? దాంతో ఇప్పుడు మాజీ మంత్రి దానం రాజకీయ భవితవ్యంపై పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద చర్చ జరుగుతోందిప్పుడు.
ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్
ఫైర్ బ్రాండ్‌గా పేరుంది.. అధికార పార్టీ లో ఉన్నా.. ప్రతిపక్ష లో ఉన్న ఆయన తీరే సెపరేటు.. ఏది రైట్ అనిపిస్తే అదే మాట్లాడుతారు…ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారు.. ఆ దూకుడుతోనే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా.. ఓవర్‌నైట్ కాంగ్రెస్‌లోకి వచ్చేశారు .. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్‌పై ఎంపీగా కూడా పోటీ చేశారు.. ఇంతకీ ఎవరి గురించి మాట్లుడుకుంటున్నామో మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది.. ఎస్ ఆయన ఎవరో కాదో ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్.
సడన్‌గా సైలెంట్ అయిపోయిన మాజీ మంత్రి దానం
హైదరాబాద్‌లో దానం నాగేందర్ హవా మాములుగా ఉండేది కాదు. ఏ కార్యక్రమం చేపట్టినా? ఏం మాట్లాడినా? దానం మార్క్ కనబడుతుండేది.. అలాంటి దానం సడన్ గా సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోవడం హాట్‌టాపిక్‌గా మారిందిప్పుడు
టీడీపీ ఎమ్మె్ల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానం
గత ఎన్నికల్లో ఖైరాతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో కాంగ్రెస్‌లోకి వచ్చేశారు. 2004లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి అప్పుడు కాంగ్రెస్ పవర్‌లోకి రావడంతో పార్టీ మార్చేసిన చరిత్ర ఆయనది. తర్వాత కాంగ్రెస్‌లో ఉంటూ గులాబీ పార్టీ అధికారంలోకి రాగానే పార్టీ మార్చేశారు. అదే సీన్ మళ్లీ రిపీట్ చేసి మళ్లీ కాంగ్రెస్ పంచకు చేరారు. కాంగ్రెస్ బీ ఫామ్‌పై ఎంపీగా పోటీ చేస్తే అనర్హత పడుతుందని తెలిసినా సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు.
దానం ప్రతిపాదనలను పట్టించుకోవడం మానేసిన కాంగ్రెస్ పెద్దలు
గెలిస్తే ఓకే.. ఓడిపోయినా పార్టీలో పరపతి పెరిగి, అనుకున్నది సాధించుకోవచ్చని ఆయన లెక్కలు వేసుకున్నారంట. తీరే చూస్తే దానం నాగేందర్ ఏది అడిగినా పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోవడం లేదంట. ఎలాంటి ప్రపోజల్స్ పెట్టినా పట్టించుకోవడం లేదట. దీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు హైదరాబాద్ సిటీ పరిధిలో మాత్రం ఎమ్మెల్యే లేరు. ఆ లెక్కలతో పార్టీలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదనే చర్చ దానం వర్గీయుల్లో నడుస్తోంది.
హైడ్రా పనితీరుపై దానం బహిరంగ విమర్శలు
ఆ క్రమంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకొని హైడ్రాకి రూపకల్పన చేసింది. హైడ్రా పనితీరు పై దానం బహిరంగంగానే ఘాటుగా విమర్శలు చేశారు. పేద ప్రజల జోలికి వస్తే ఊరుకోబోమని… ఎమ్మెల్యేగా అది తన బాధ్యతంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. హైడ్రా విషయంలో దానం దూకుడు ప్రభుత్వానికి కొంత మైనస్ అయిందనే టాక్ ఉంది. దానికి తగ్గట్లే దానం వ్యాఖ్యల తర్వాత మరికొందరు హైడ్రాకు వ్యతిరేకంగా నోరు విప్పారు.
నోటి దూకుడు వల్లే కాంగ్రెస్ పెద్దలు దానంను పట్టించుకోవడం లేదా?
ఆ నోటి దూకుడు వల్లే కాంగ్రెస్ పెద్దలు దానం నాగేందర్‌ను పట్టించుకోవడం మానేశారంట. ఒక దశలో దానం తిరిగి బీఆర్ఎస్ గూటికి వెళ్తారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాలో వినిపించింది. అదలా ఉంటే సిటీలో విఐపీల కార్యక్రమం ఏది జరిగినా దానం నాగేందర్ నేనున్నానంటూ ముందుకొచ్చేస్తారు. హోర్టింగులు, ఫ్లెక్సీలతో తెగ హడావుడి చేస్తారు. పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి నానా పాట్లు పడతారు. దివంగత వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసినప్పటి నుంచి ఆయన హడావుడి అలాగే ఉండేది.
దేశ వ్యాప్తంగా ధర్నా నిరసన కార్యక్రమాలకు ఏఐసీసీ పిలుపు
అయితే తాజాగా ఏఐసిసి పిలుపు ఇచ్చిన కార్యక్రమానికి దానం నాగేందర్ దూరంగా ఉన్నారు. నేషనల్ హెరల్డ్ పత్రిక వివాదం కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జషీట్లో చేర్చింది. దానికి వ్యతిరేకంగా ఏఐసీసీ దేశ వ్యాప్తంగా ధర్నా, నిరసన కార్యక్రమాలకు పిలుపు ఇచ్చింది. అందులో భాగంగా హైదరాబాద్ లో ఈడీ కార్యాలయం ముందు తెలంగాణ కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఆ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి వక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా మంత్రులు, ఎమ్మెల్యే లు పాల్గొన్నారు . కానీ దానం మాత్రం ఆ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు.
సికింద్రాబాద్ సమీక్షా సమావేశానికి హాజరు కాని నాగేందర్
మరోవైపు మీనాక్షి నటరాజన్, మహేష్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యం లో గాంధీభవన్లో పార్లమెంట్ సెగ్మెంట్ల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశం కూడా జరిగింది ఈ సమావేశానికి కూడా దానం నాగేందర్ అటెండ్ అవ్వలేదు. సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేశారు. ఈ సమావేశాలకు కాంటెస్టెడ్ అభ్యర్థులతో పాటు, ముఖ్యనాయకులు హాజరు కావాలని పార్టీ చెప్పింది కానీ అలాంటి కీలక సమావేశానికి సైతం దానం దూరంగా ఉన్నారు.
Also Read: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రాబోయే మూడు రోజులు జాగ్రత్త..!
పార్టీలో కొనసాగుతారా? ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా
దాంతో దానం నాగేందర్ వైఖరి కాంగ్రెస్‌లో హాట్ టిపిక్‌గా మారింది. దానం కిదర్ హై అన్న చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా దానం నాగేందర్ పార్టీపై అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారానికి మరింత బలం చేకుర్చిన్నట్లైంది. మరి చివరకు దానం దారేటు? పార్టీ లో కొనసాగుతారా… లేక మరోసారి ఏదైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా? అన్న ఆసక్తి పొలిటిక్స్ సర్కిల్స్‌లో నెలకొంది.