Gudem Vs Congress Leaders: ఆ నేత.. పార్టీని నమ్ముకుని కష్టపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ప్రయాసలకు ఓర్చి పనిచేశారు. అప్పటివరకూ ప్రత్యర్థిగా ఉన్న లీడర్ ఎంట్రీతో.. మరింత ఇబ్బందులూ ఎదుర్కొన్నా విధేయతతో మౌనమునిలా మారారట. చివరకు కార్యకర్తలు, శ్రేణులు కలుగుచేసుకుని పోరాటాలు చేసే వరకూ వచ్చింది. ప్రత్యర్థి పార్టీ నుంచి వచ్చిన నేత అధికారం కోసమే వచ్చారు తప్ప.. ఆయనలో పాత వాసన ఇంకా పోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఎవరా నేతలు.. ఏమా కథ. వాచ్ దిస్ స్టోరీ
పటాన్‌చెరులో కాంగ్రెస్ పాత నేతలు వర్సెస్ గూడెం మహిపాల్‌రెడ్డిలా సిట్యువేషన్ మారింది. వారి మధ్య మొదలైన వివాదం కాస్తా.. ముదురుపాకాన పడటంతో హస్తం శ్రేణులు, కార్యకర్తలు రోడ్డెక్కారు. సేవ్ కాంగ్రెస్.. సేవ్ పటాన్‌చెరు స్లోగన్‌తో.. నిరసనకు దిగారు. మహిపాల్ రెడ్డి తమను బూతులు తిట్టారని బొల్లారం కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారికి, కొత్తగా చేరిన వారికి… ఇబ్బందులు లేకుండా చూడాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కాట శ్రీనివాస్‌గౌడ్‌కు ప్రత్యేక పేరుంది. ఎంత కష్టమొచ్చినా పార్టీ కోసం నిలబడి.. క్యాడర్‌కు తానున్నానంటూ భరోసా ఇచ్చేవారట. పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ అధికారంలో ఉండి.. ఇబ్బందులు పెట్టినా ఓర్చుకున్నారట. అప్పటి మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కలసి.. శ్రీనివాస్‌గౌడ్‌ను ఇబ్బందుల పాటు చేసినా.. ఓర్చుకుని పార్టీ కోసం పనిచేశారనే పేరుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎవరైతే తనను ఇబ్బందుల పాలు చేశారో అదే నేత.. పార్టీలోకి ఎంట్రీ ఇవ్వటంతో.. పెద్దల నిర్ణయాన్ని శిరసా వహించారు. కారు పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరినా.. మహిపాల్ రెడ్డి ఇంకా బీఆర్‌ఎస్ నాయకునిగానే కొనసాగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గూడెం మహిపాల్‌రెడ్డిపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదన్న వాదనలూ ఉన్నాయి. ఆయన అధికారిక క్యాంపు కార్యాలయంలో.. మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఫోటో ఉండడం.. సీఎం రేవంత్ చిత్రపటం లేకపోవడంతో హస్తం క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేసిందట. చివరకు పార్టీ ఆఫీసులోనూ గులాబీ రంగు కుర్చీ వేయించుకున్న నేత.. తమపై పెత్తనాలు చెలాయిస్తున్నారంటూ వారంతా ఫైర్ అవుతున్నారట. సీఎం ఫోటో పెట్టడం ఇష్టం లేకపోతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి.. కాంగ్రెస్ కేడర్ హితవు పలుకుతోందట.
Also Read: పంచాయతీపై నజర్.. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే..!
గతంలో కాట సర్పంచ్ పదవిని కూడా నాడు అధికారపార్టీలో ఉన్న గూడెం తొలగించేలా చేశారట. బీఆర్‌ఎస్ పాలనలో.. తనను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా.. సొంత ఆస్తులు అమ్ముకుని.. అప్పుల పాలై మరీ క్యాడర్‌ను కాపాడుకున్నారు కాట శ్రీనివాస్ గౌడ్. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందారు. మూడుసార్లు BRS నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గూడెం మహిపాల్ రెడ్డి.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. ఆస్తులు కాపాడుకోవడానికి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారనే టాక్ ఉంది. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న శ్రీనివాస్ గౌడ్‌కు సమాచారం లేకుండా కాంగ్రెస్‌లో చేరారట. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మహిపాల్ రెడ్డి రాకను.. కాట శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు వ్యతిరేకిస్తూనే ఉన్నారట.
గూడెం మహిపాల్‌రెడ్డి చేరికతో పటాన్‌చెరులో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం లేదనేది అక్కడ నేతల మాటగా తెలుస్తోంది. పైగా.. మాజీమంత్రి హరీష్‌రావుకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. పేరుకే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా.. ఆయనకు కారుపార్టీ వాసన పోలేదనేది కాంగ్రెస్ క్యాడర్ మాటగా తెలుస్తోంది. ఆయన పార్టీ కార్యక్రమాల్లో అయిష్టంగానే పాల్గొంటున్నారు తప్ప.. ఇంకా BRS నాయకునిగానే కొనసాగుతున్నారనే విమర్శలున్నాయి. వివాదం కాస్తా ముదరటంతో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఉత్కంఠగా మారింది.