కొందరు చనిపోయారు.. ఇంకొందరు అదృశ్యమైపోయారు.. మరికొందరు వలసెళ్లిపోయారు.. మొత్తంగా బెంగాల్‌లో 58 లక్షల మందికి పైగా ఓటర్లను తొలగించింది ఎలక్షన్ కమిషన్. ఈ దెబ్బతో.. బెంగాల్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ఇంత భారీ స్థాయిలో ఓట్లు తొలగించడం దేశం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో.. దీని ఎఫెక్ట్ ఎవరిపై ఉంటుందనే చర్చ మొదలైంది. సీఎం మమతా బెనర్జీ ఏం చేయబోతున్నారు? సర్‌పై.. కాంగ్రెస్ ఏమంటోంది?
ఇంకొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. పశ్చిమ బెంగాల్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా.. ఎన్నికల సంఘం 58 లక్షలకు పైగా ఓట్లను తొలగించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత.. డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుని కూడా రిలీజ్ చేశారు. పేర్లు తొలగించిన ఓటర్లలో.. 24 లక్షల మంది చనిపోయారని, దాదాపు 20 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని, 12 లక్షల మంది తప్పిపోయారని, లక్షా 38 వేల మంది బోగస్ ఓటర్లు ఉన్నారని తెలిపింది ఈసీ. ఇతర కారణాలతో మరో 57 వేల మంది పేర్లను తొలగించారు. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్.. బెంగాల్‌లో రాజకీయంగా గందరగోళాన్ని పెంచింది. రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారింది. ఇది.. ఎన్నికలకు ముందు బెంగాల్‌లో పొలిటికల్ తుఫాన్ సృష్టించే అవకాశం ఉందనే మాటలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు 58 లక్షల ఓటర్ల తొలగింపు అన్యాయం అంటున్నారు. బెంగాల్ లిస్టు నుంచి ఓటర్లను తొలగించేందుకు.. ఇది బీజేపీ చేసిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ కూడా ఈ ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా తారుమారు చేసేందుకే.. బీజేపీ, ఎన్నికల సంఘం కుట్ర పన్నాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం.. బెంగాల్ నుంచి ఎవరినీ పంపడానికి అనుమతించబోదని స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తే.. వీధుల్లోకి వచ్చి పోరాడాలని కొన్ని రోజుల కిందటే.. సీఎం మమత పిలుపునిచ్చారు. సర్ పేరుతో బెంగాల్ ప్రజల హక్కుని లాగేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో.. ఢిల్లీ నుంచి బలగాలను తీసుకొచ్చి బెదిరిస్తారని చెప్పారు.
మరోవైపు.. బీజేపీ కూడా సీఎం మమతా బెనర్జీపై తీవ్ర ఆరోపణలు చేసింది. అక్రమ వలసదారులతో కూడిన తన ఓట్ బ్యాంకును రక్షించుకునేందుకే.. ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించింది. చనిపోయిన వారి పేర్లు, బోగస్ ఓటర్లను తొలగించడంతో.. ఈసారి అధికారం కోల్పోతామనే భయంతోనే మమతా బెనర్జీ గందరగోళం సృష్టిస్తున్నారని చెబుతున్నారు. బీజేపీకి, తృణమూల్‌కు కేవలం 22 లక్షల ఓట్ల తేడా మాత్రమే ఉందన్నారు. అయితే.. సర్‌పై ప్రస్తుతం నడుస్తున్న రాజకీయ వివాదం దుమారంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. రాష్ట్రం మొత్తం మీద 58 లక్షలకు పైగా ఓట్లని తొలగిస్తే.. సీఎం మమతా బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న భబానీపూర్ నియోజకవర్గంలో 44 వేల 787 ఓట్లను తొలగించింది ఎన్నికల సంఘం. ఈ సెగ్మెంట్‌లో జనవరి నాటికి లక్షా 61 వేల మంది ఓటర్లు ఉంటే.. అందులో నుంచి 44 వేల మందికి పైగా పేర్లను తొలగించింది. మరణాలు, వలసలు, డూప్లికేట్ ఓట్లు ఉండటం లాంటి కారణాలతో.. ఓటర్ల పేర్లను తొలగించింది.
ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి ప్రాతినిథ్యం వహిస్తున్న నందిగ్రాం నియోజకవర్గంలోనూ 10 వేల మందికి పైగా ఓటర్ల పేర్లను తొలగించారు. టీఎంసీ కంచుకోటలుగా పేరున్న చౌరింగీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 74 వేలకు పైగా ఓట్లను తీసేశారు. కోల్‌కతా పోర్టు నియోజకవర్గంలో 63 వేల మంది, టాలీగంజ్‌లో 35 వేల మంది పేర్లను అధికారులు తొలగించారు. బీజేపీ ఎమ్మెల్యేలున్న అసన్ సోల్ సౌత్‌లో 39 వేలు, సిలిగురిలో 31 వేల మంది పేర్లను తీసేశారు. జిల్లాలవారీగా చూస్తే.. సౌత్ 24 పరగణాల జిల్లాలో అత్యధికంగా 8 లక్షల మందికి పైగా ఓటర్లను ఎన్నికల సంఘం తొలగించింది. వలసవచ్చిన వారి సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే.. ఎక్కువ మంది పేర్లు తొలగించారు. బెంగాల్‌లో.. 2002లో చివరిసారిగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించారు. ఇన్నేళ్ల తర్వాత.. మళ్లీ ఇప్పుడు ఓటరు జాబితా సవరణ చేపట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. బెంగాల్‌లో నవంబర్ 4న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ని ప్రారంభించారు. దీనికోసం మొదట నెల రోజుల గడువు విధించగా.. తర్వాత మరో 10 రోజులు గడువు పొడిగించారు. మొత్తానికి.. అన్ని సరిచేసి ముసాయిదా ఓటరు లిస్ట్ రిలీజ్ చేశారు. జనవరి 17 వరకు వీటిలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు తెలిపేందుకు ఓటర్లకు అవకాశం ఇవ్వనున్నారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్రవరి 2026లో ప్రచురిస్తారు. ఆ తర్వాత.. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
బెంగాల్ లాంటి రాష్ట్రంలో.. 58 లక్షల మంది ఓటర్లను తొలగించడం చిన్న విషయం ఏమీ కాదు. ఈ తొలగింపు వెనుక ప్రధానంగా మూడు కారణాలున్నాయ్. ఒకటి.. ఓటర్ లిస్టులో ఉండి.. భౌతికంగా లేని వారి పేర్లను తొలగించారు. ఉపాధి కోసం, ఇతర కారణాలతో.. రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారున్నారు. ఇక.. ఒకే వ్యక్తికి రెండు, మూడు చోట్ల ఓటు హక్కు ఉన్న వారి పేర్లను కూడా తొలగించారు. ఓటర్ జాబితా ప్రక్షాళన కోసమే.. ఇదంతా చేశామని అధికారులు చెబుతున్నారు. కానీ.. ఈ అంశం రాజకీయంగా రగడకు దారితీసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సీఎం మమతా బెనర్జీ.. తమ ఓట్ బ్యాంకుని దెబ్బతీసేందుకు.. బీజేపీ పన్నిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా.. ముస్లింలు, వెనుకబడిన వర్గాల ఓట్లను టార్గెట్ చేశారని టీఎంసీ నేతలు వాదిస్తున్నారు. అర్హులైన ఓటర్ల పేర్లను తొలగిస్తే.. సహించేది లేదని, దీనిపై క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తామని దీదీ హెచ్చరించారు. మరోవైపు కాంగ్రెస్ కూడా ఈ విషయంలో.. ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరించకూడదని డిమాండ్ చేస్తోంది. ఈ భారీ తొలగింపుపై.. డేటా ఆధారిత వివరణ కోరుతోంది కాంగ్రెస్.
ఈ ఓటర్ల జాబితా సవరణలో ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం ఒకటే. అదే.. అక్రమ వలసదారులు. బెంగాల్ రాజకీయాల్లో కొన్ని దశాబ్దాలుగా ఈ సమస్య ఉంది. బెంగాల్ ఓటర్ లిస్టులో.. లక్షలాది మంది బంగ్లాదేశీయులను అక్రమంగా చేర్చారని.. బీజేపీ సుదీర్ఘకాలంగా ఆరోపిస్తోంది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు దొడ్డిదారిన ఓటర్ కార్డులు పొందారని.. వారంతా అధికార పార్టీకి ఓట్ బ్యాంకుగా మారారని.. ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. అంతేకాదు.. సరిహద్దు జిల్లాల్లో జనాభా పెరుగుదల రేటు అసాధారణంగా ఉండటం వెనుక.. అక్రమ వలసదారుల ప్రమేయం ఉందంటున్నారు. తొలగించిన 58 లక్షల మందిలో నిజమైన భారతీయులు ఎంతమంది? అక్రమంగా చేరిన వారు ఎంతమంది? అనే చర్చ కూడా మొదలైంది. ఈ ఓట్ల తొలగింపులో అక్రమ వలసదారులు కూడా ఉన్నారని, దీనివల్ల రాష్ట్ర భద్రతకు మేలు జరుగుతుందని.. బీజేపీ సమర్థిస్తోంది. కానీ.. సర్ ఎఫెక్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ.. పార్టీల గెలుపోటములను తలకిందులు చేసే చాన్స్ ఉంది. ఫేక్ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, బోగస్ ఓట్లు తొలగితే.. తమకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. సరిహద్దు జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
అయితే.. సర్ ప్రక్రియలో భాగంగా తమ మద్దతుదారుల పేర్లు గనక తొలగిస్తే.. వారిని తిరిగి నమోదు చేయించడం తృణమూల్ కాంగ్రెస్‌కు చాలా పెద్ద టాస్క్. పొరపాటున నిజమైన ఓటర్ల పేర్లను తొలగిస్తే.. అది ప్రభుత్వంపై వ్యతిరేకతకు దారితీసే ప్రమాదం ఉంది. ఓటర్ జాబితా ప్రక్షాళన అనేది ప్రజాస్వామ్యానికి మంచిదే అయినప్పటికీ.. అది పారదర్శకంగా జరగనప్పుడు వివాదాలకు కేంద్రబిందువు అవుతుంది. బెంగాల్‌లో ఈ 58 లక్షల ఓట్ల తొలగింపు అంశం.. రాబోయే ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారబోతోంది. ఎన్ఆర్‌సీ తరహాలో ప్రజల్ని భయపెట్టేందుకు ఇలాంటి చర్యలు చేపడుతున్నారని టీఎంసీ నేతలు విమర్శిస్తున్నారు. సర్ ఎఫెక్ట్.. బెంగాల్ సరిహద్దు జిల్లాలైన మాల్దా, ముర్షిదాబాద్, నార్త్ 24 పరగణాస్ లాంటి జిల్లాల్లో ఎక్కువగా ఉంది. గతంలో.. క్షేత్ర స్థాయి అధికారులు సరిగ్గా వెరిఫికేషన్ చేయకపోవడం వల్లే.. ఇంత భారీగా ఫేక్ ఓటర్లు చేరారనే విమర్శలున్నాయ్.
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ జాబితా ప్రక్షాళన అనేది కేవలం పరిపాలనాపరమైన ప్రక్రియ మాత్రమే కాదు. అదొక పొలిటికల్ మైన్ ఫీల్డ్. ఒకవైపు దేశ భద్రత, అక్రమ వలసల నియంత్రణ పేరిట చర్చ జరుగుతుంటే.. మరోవైపు సామాన్య పౌరుడి ఓటు హక్కుకు భంగం కలగకూడదనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయ్. ప్రజాస్వామ్యంలో ఓటర్ జాబితా పవిత్రంగా ఉండాలే గానీ.. అది ఏ రాజకీయ పక్షానికి ప్రయోజనం చేకూర్చేలా ఉండకూడదు. ఇప్పుడు 58 లక్షల ఓట్లని తొలగించడమంటే.. బెంగాల్‌లోని మొత్తం ఓటర్లలో 7 శాతం పైనే. ఇది.. ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలదు. రాబోయే.. అసెంబ్లీ ఎన్నికల్లో దీని ఎఫెక్ట్ తృణమూల్ కాంగ్రెస్‌పై పడుతుందా? బీజేపీ అనుకుంటున్నట్లుగా.. తమకు మేలు జరుగుతుందా? లేదా? అనేది.. ఇంకొన్ని నెలల్లో తేలిపోతుంది.