‘కరువు’ పనులకు పల్లెలు క్యూ కట్టాయి. కూలీల సంఖ్య ఈనెలలో గణనీయంగా పెరిగింది. గత ఏడాది ఇదే సమయానికి ఓ యాభైవేల మంది కూడా ఉపాధి పనులకు వెళ్లలేదు. ఏడాదిలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఏకంగా ఈ నెలలో 5 లక్షల మందికి పైగా కూలీలు ఉపాధి పనులకు బారులు తీరారు. ఇది ఆల్‌టైమ్ రికార్డుగా చెబుతున్నారు. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. ఎక్కువగా ఉపాధి పనులకు కూలీలు హాజరవుతున్న జిల్లాల్లో ఉమ్మడి నల్లగొండ టాప్‌లో ఉన్నది.
కరువు వేళ.. ఉపాధి కూలీ పనులకు భలే డిమాండ్ పెరిగింది. గత ఏడాదితో పోల్చితే 15 రెట్లు ఎక్కువగా కూలీ పనులకు వెళ్తున్నారు తెలంగాణ జనం. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తాండవిస్తుండటంతో.. సాగు పనులు దొరకడం లేదు. ఇప్పటికే వరి కోతలు ముగిసినా.. కొత్తగా వరినాట్లు వేసే పరిస్థితులు లేవు. సర్కార్ వరి వేయొద్దని ఇప్పటికే రైతాంగాన్ని చైతన్య పరిచింది. దీనికి తోడు .. బోర్లలో ఇప్పటికే నీరు వట్టిపోవడంతో సరిగ్గా పారడం లేదు. భూగర్భజలాలు ఇంత ఘోరంగా ఈ సమయంలోనే అడుగంటి పోయిన సంఘటనలు చాలా అరుదు.
ఈ పరిస్థితులను, పరిణామాలను స్వయంగా గమనిస్తున్న రైతు వరి వేయాలంటేనే జంకుతున్నాడు. అందుకే తనంతట తానుగా వరి వేయొద్దని డిసైడ్ అయిపోయాడు. అందుకే వరి నార్లకు పోవడం లేదు. ఆరుతడి పంటలు వేసుకున్నా.. కూలీలతో పెద్దగా పని పడదు. అందుకే కూలీ పనుల కోసం ప్రత్యామ్నాయ మార్గంగా ఉపాధి పనులను ఎంచుకున్నది పల్లె జనం. గత నెలలో 2.16 లక్షల మందే ఈ పనులకు హాజరయ్యారు. కానీ ఈ నెల 3 తేదీన అనూహ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి పైగా జనం కూలీ పనులకు హాజరై రికార్డు నెలకొల్పారు.
నిత్యం కూలీ మూడొందల రూపాయల వరకు గిట్టుబాటు అవుతున్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పనులు చేసుకుని ఇండ్లకు వస్తున్నారు. వేసవి కాలాన్ని తలపించిన చందంగా ఉదయం నుంచే ఎండ చుర్రుమనిపిస్తుంది. అందుకే సూర్యోదయానికే పనులకు వెళ్తున్నారు. మధ్యాహ్నం వరకు తిరిగి వస్తున్నారు. తెలంగాణ సర్కార్ కూడా పని దినాలు ఎక్కువగా కల్పించాలని దాదాపుగా రూ. 19 కోట్ల పనులు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
పల్లెల్లో ఇతర మేస్త్రీ పనులు, కూలీ పనులు కూడా తగ్గిపోతున్నాయి. బీడీలు చుట్టే పని కూడా చాలా మంది మహిళలు తగ్గించుకున్నారు. బీడీ కంపెనీలు ఎత్తేసి.. వర్ది బీడీలను చుట్టేందుకే అవకాశం ఉండటంతో.. ఇది మహిళలకు గిట్టుబాటు కావడం లేదు. పొద్దంతా నడుములు పోయేదాకా కూర్చుని బీడీలు చుట్టినా.. రెండు వందలు కూడా సంపాదన ఉండటం లేదు. అందుకే ఉపాధి పనులకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
ఈ పనులను బాగా వినియోగించుకున్న జిల్లాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉండగా, వరుసగా నిజామాబాద్, సిద్దిపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యపేట, ఖమ్మం, జగిత్యాల, నాగర్‌కర్నూల్, కామారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో పనులు ఎక్కువగా చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇంకా మున్ముందు పల్లెల్లో పనులు దొరకడం మరింత కష్టతరం అవుతాయని, ఇంకా ఎక్కువ మంది జనం ఉపాధి పనులు బారులు తీరే అవకాశం ఉందని చెబుతున్నారు.