Kia Syros EV vs Tata Nexon EV: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారు ముందుగా చూసేది దాని రేంజ్ ఎంత అనేదే. కంపెనీలు ప్రకటించే లెక్కలు ఒకలా ఉంటే, రోజువారీ వినియోగంలో వచ్చే రేంజ్ మరోలా ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో పోటీ పడుతున్న కియా సైరోస్ EV, టాటా నెక్సాన్ EV విషయంలోనూ ఇదే ఆసక్తి నెలకొంది. సైరోస్ EVలో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉంది. మరి అది నిజంగానే నెక్సాన్ EV కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తుందా? తాజాగా నిర్వహించిన రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
కియా సైరోస్ EVలో 42kWh, 51.4kWh బ్యాటరీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో పెద్ద బ్యాటరీ వెర్షన్ గరిష్టంగా 526 కిలోమీటర్ల MIDC రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. మరోవైపు, టాటా నెక్సాన్ EVలో 30kWh, 45kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. పెద్ద బ్యాటరీ వెర్షన్ MIDC రేంజ్ 489 కిలోమీటర్లు. పెద్ద బ్యాటరీ వెర్షన్లను పోలిస్తే, సైరోస్ EVలో 51.4kWh బ్యాటరీ, 171hp పవర్, 255Nm టార్క్ ఉన్నాయి. నెక్సాన్ EVలో 45kWh బ్యాటరీతో 144hp పవర్, 215Nm టార్క్ లభిస్తాయి.
ధర విషయానికి వస్తే, సైరోస్ EV ధర రూ.17 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉండగా, నెక్సాన్ EV ధర రూ.14.34 లక్షల నుంచి రూ.17.69 లక్షల మధ్య ఉంది.
రియల్ వరల్డ్ రేంజ్ టెస్ట్ లో సైరోస్ EV సిటీ ప్రయాణాల్లో 489 కిలోమీటర్లు, హైవేపై 316 కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ రెండింటి సగటు రేంజ్ 402 కిలోమీటర్లుగా నమోదైంది. నెక్సాన్ EV నగరంలో 355 కిలోమీటర్లు, హైవేపై 345 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చింది. దీని సగటు రేంజ్ 350 కిలోమీటర్లుగా ఉంది. అంటే, నగర ప్రయాణాల్లో సైరోస్ EV స్పష్టమైన ఆధిక్యం చూపించింది. కానీ, హైవే ప్రయాణాల్లో మాత్రం నెక్సాన్ EV 29 కిలోమీటర్లు ఎక్కువ దూరం ప్రయాణించింది. అయినప్పటికీ, మొత్తం సగటు రేంజ్‌లో సైరోస్ EV 52 కిలోమీటర్ల ఆధిక్యాన్ని సాధించింది.
ఈ రెండు కార్లను Eco మోడ్‌లో పరీక్షించారు. నగరంలో సైరోస్ EV 9.52 కి.మీ/kWh సామర్థ్యం చూపగా, నెక్సాన్ EV 7.90 కి.మీ/kWh నమోదు చేసింది. హైవేపై మాత్రం నెక్సాన్ EV 7.67 కి.మీ/kWhతో ముందుండగా, సైరోస్ EV 6.14 కి.మీ/kWh మాత్రమే సాధించింది. సిటీ ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి, ఎక్కువ సగటు రేంజ్ కోరుకునేవారికి సైరోస్ EV బాగుంటుంది. హైవే ప్రయాణాల్లో మెరుగైన సామర్థ్యం కోరుకునేవారికి నెక్సాన్ EVని తీసుకోవడం మంచిది.
Read Also: క్రాష్ టెస్టులో దుమ్మురేపిన మహీంద్రా XEV 9S.. టాటా సఫారీని కూడా వెనక్కి నెట్టినట్టేనా?