Mahindra XEV 9S Crash Test: భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, వాటి భద్రతకు కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ విషయంలో మహీంద్రా మరోసారి తన సత్తా చాటింది. సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ SUV XEV 9S, భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) క్రాష్ టెస్టుల్లో కంప్లీట్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. పెద్దలు, పిల్లల భద్రతలో మంచి స్కోర్ సాధించింది.
BNCAP పరీక్షల్లో మహీంద్రా XEV 9S వయోజన ప్రయాణికుల రక్షణ (AOP) విభాగంలో 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు సాధించింది. ఇక పిల్లల రక్షణ(COP)లో 49 పాయింట్లకు 45 పాయింట్లు దక్కించుకుంది. ఈ రేటింగ్ కారు అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. మహీంద్రా నుంచి వచ్చిన ఈ SUV, తన ICE మోడల్ XUV 7XOతో పాటు టాటా సఫారీ కంటే కూడా అద్భుతమైన స్కోర్లు సాధించింది. XUV 7XO పెద్దల రక్షణలో 30.76, పిల్లల రక్షణలో 44.97 పాయింట్లు పొందగా.. టాటా సఫారీకి 30.08, 44.54 పాయింట్లు వచ్చాయి.
ఫ్రంటల్ ఆఫ్ సెట్ క్రాష్ టెస్టులో డ్రైవర్ తల, మెడ, ఛాతీ, కాళ్లతో పాటు ఇతర కీలక శరీర భాగాలకు XEV 9S మంచి రక్షణ అందించింది. కో-డ్రైవర్ విషయంలోనూ దాదాపు అన్ని భాగాలకు మంచి ప్రొటెక్షన్ లభించింది. అయితే, ఛాతీ భాగానికి మాత్రం తగినంత రక్షణ ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్, సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్షల్లోనూ ఈ SUV మంచి ఫలితాలు సాధించింది. పరీక్షించిన అన్ని శరీర భాగాలకు మంచి రక్షణ అందించినట్లు BNCAP వెల్లడించింది.
పిల్లల భద్రతా పరీక్షల్లో XEV 9S డైనమిక్ టెస్టులో 24కి 24, చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ (CRS) ఇన్‌స్టాలేషన్ పరీక్షలో 12కి 12 పాయింట్లు సాధించింది. అయితే, వెహికల్ అసెస్ మెంట్‌లో 13కి 9 పాయింట్లు మాత్రమే రావడంతో మొత్తం స్కోరు 45కి చేరింది. 18 నెలలు, మూడేళ్ల చిన్నారుల డమ్మీలతో నిర్వహించిన ఫ్రంటల్, సైడ్ క్రాష్ పరీక్షల్లోనూ ఈ కారు పూర్తి పాయింట్లు సాధించడం విశేషం.
XEV 9Sలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ మౌంట్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP) వంటి ఫీచర్లు ఉన్నాయి. కొన్ని టాప్ వేరియంట్లలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అందిస్తున్నారు. అంతేకాకుండా, టాప్-స్పెక్ మోడళ్లలో ADAS ఫీచర్లు ఉన్నాయి. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్ లాంటి టెక్నాలజీలు డ్రైవింగ్‌ను మరింత సేఫ్ గా మార్చేందుకు ఉపయోగపడతాయి.
Read Also: టాటా నెక్సాన్ EVకి కొత్త పోటీ.. 370 కి.మీ రేంజ్‌తో విన్‌ఫాస్ట్ VF5 వచ్చేస్తోంది!