E-Paper
Advertisement

ఈ సారీ చేపలు కరువే.. 9 లక్షల మంది ఉపాధికి గండం?

ఈ సారీ చేపలు కరువే.. 9 లక్షల మంది ఉపాధికి గండం?
Advertisement

Fish Production: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో చేపల కొరత ముంచుకొస్తోందా? చెరువులు, కుంటల్లో నీటిమట్టాలు పడిపోతుండటంతో చేపల ఉత్పత్తికి గండం ఏర్పడనుందా? ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితులు మారడం, వర్షపాతం లోటు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా జలవనరులు అడుగంటితే ఆ ప్రభావం నేరుగా మత్స్యరంగంపై పడనుంది. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో నీటి వనరులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లలో నీరు తగ్గితే చేపల పెంపకం, సహజసిద్ధమైన చేపల లభ్యత రెండింటిపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఫలితంగా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి తగ్గి, వినియోగదారులకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే చేపలే ఆధారం కానున్నాయి. సరఫరా తగ్గి డిమాండ్‌ పెరిగితే మార్కెట్‌లో చేపల ధరలు కూడా పెరిగే అవకాశముంది.

ఎల్‌నినో ఎఫెక్ట్..

ఎల్‌నినో ప్రభావం తో రాష్ట్రంలోని జలవనరుల పరిరక్షణ అత్యంత కీలకంగా మారింది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోవడం, ఎండల తీవ్రత పెరగడం, నీటి ఆవిరి కావడం వంటి పరిణామాలు చెరువులు, కుంటల్లో నీటిమట్టాలను తగ్గిస్తాయి. ఇప్పటికే నీటి నిల్వలు తక్కువగా ఉన్న చెరువుల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. చేపల ఉత్పత్తికి చెరువులు, కుంటలు, రిజర్వాయర్లే ప్రధాన ఆధారం. రాష్ట్రంలో వేలాది నీటి వనరులు మత్స్యకార కుటుంబాలకు జీవనాధారంగా ఉన్నాయి.

సహకార సంఘాల్లో..

Advertisement

రాష్ట్రంలో 25,628 చెరువులు, రిజర్వాయర్లు ఉండగా, వాటి మొత్తం నీటి విస్తీర్ణం 7.08 లక్షల హెక్టార్లకు పైగా ఉంది. వీటిపై ఆధారపడి 5,856 మత్స్యకార సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. సహకార సంఘాల్లో 4.10 లక్షలకు పైగా సభ్యులున్నారు. నీటి నిల్వలు తగ్గితే చేపలకు అవసరమైన సహజ ఆహారం, ఆక్సిజన్‌ లభ్యతపైనా ప్రభావం పడుతుంది. నీటి పరిమాణం తగ్గడంతో చేపలు పరిమిత ప్రాంతంలోనే ఉండాల్సి వస్తుంది. దీంతో చేపల పెరుగుదల మందగించడం, వ్యాధులు ప్రబలడం, కొన్ని సందర్భాల్లో చేపలు సామూహికంగా మృత్యువాత పడటం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది. తక్కువ లోతు ఉన్న చిన్న చెరువులు, కుంటల్లో ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది.

Also Read: ఇదేం తల్లి ప్రేమరా బాబూ… కొడుకు గెలుపు కోసం పాపనే లేపేసే ప్లాన్… ఓటీటీలోకి క్రేజీ స్పోర్ట్స్ థ్రిల్లర్

ఉత్పత్తి తగ్గితే.. దిగుమతులే దిక్కు..

Advertisement

రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగింది. తెలంగాణ ఆర్థిక గణాంకాల ప్రకారం 2014-15లో 2.60 లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి 2023-24 నాటికి 4.39 లక్షల టన్నులకు చేరింది. మరోవైపు 2024-25లో తెలంగాణ చేపల ఉత్పత్తి 4.77 లక్షల టన్నులుగా నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.ఈస్థాయిలో ఉత్పత్తి సాగుతున్న నేపథ్యంలో నీటి వనరులు తగ్గితే ఆ ప్రభావం రాష్ట్ర మత్స్యరంగంపై తీవ్రంగా పడే అవకాశముంది. స్థానిక చెరువుల్లో చేపల పెంపకం తగ్గితే మార్కెట్‌ అవసరాలను తీర్చడానికి ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చే చేపల సరఫరాపై ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇతర రాష్ట్రాల నుంచి రవాణా ఖర్చులు, సరఫరా పరిస్థితులు కూడా ధరలపై ప్రభావం చూపుతాయి.

వినియోగదారుల జేబులకు చిల్లు

చేపల ఉత్పత్తి తగ్గితే దాని ప్రభావం మార్కెట్‌పై పడటం ఖాయం. ప్రస్తుతం స్థానికంగా లభించే చేపలు తగ్గి, బయట రాష్ట్రాల నుంచి వచ్చే చేపల వాటా పెరిగితే ధరలు పెరిగే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు, మధ్యవర్తుల ప్రమేయం, సరఫరాలో అంతరాయాలు తోడైతే వినియోగదారులపై అదనపు భారం పడుతుంది. ముఖ్యంగా సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చేపలు అందుబాటులో ఉండటం కష్టంగా మారవచ్చు.చేపల విక్రయాలపై ఆధారపడే చిన్న వ్యాపారులు, రిటైల్‌ విక్రేతలు కూడా నష్టాలను ఎదుర్కొనే ప్రమాదముంది. చేపల ధరలు పెరిగినా ఉత్పత్తి తగ్గినా మత్స్యకారులకు ప్రయోజనం దక్కుతుందన్న హామీ లేదు. నీటి కొరతతో చేపల పెంపకమే దెబ్బతింటే వారి ఆదాయానికి గండిపడుతుంది.

మత్స్యకారుల ఉపాధికి ముప్పు..

రాష్ట్రవ్యాప్తంగా 4.10లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో5లక్షల మంది మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. చేపల వేట, పెంపకం, రవాణా, విక్రయాలు, వలల తయారీ వంటి అనేక ఉపాధి మార్గాలు ఈ రంగంతో ముడిపడి ఉన్నాయి. చెరువుల్లో నీరు లేక చేపల పెంపకం నిలిచిపోతే మత్స్యకార కుటుంబాలు ఉపాధి కోసం ఇతర పనులవైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.మత్స్యకార సహకార సంఘాలకు కేటాయించిన చెరువుల్లో నీరు లేకపోతే చేప పిల్లల విడుదల ఇప్పటికే నిలిచిపోగా, ప్రస్తుతం ఉన్న చేపల పెంపకం, చేపల వేట ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోతుంది. ఇప్పటికే చేప పిల్లల కొనుగోలు, రవాణా, వలలు, ఇతర సామగ్రి కోసం పెట్టుబడులు పెట్టిన మత్స్యకారులు నష్టపోతున్నట్లు సమాచారం.

ముందస్తు కార్యాచరణ ఏదీ?

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో మత్స్యరంగాన్ని కాపాడేందుకు మత్స్యశాఖ ముందస్తు కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది.నీటి నిల్వలు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో చేపల పెంపకానికి ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రోత్సహించాలి. నష్టపోయే మత్స్యకారులకు పరిహారం లేదా ఆర్థిక సహాయం అందించే అంశంపైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.ఇతర రాష్ట్రాల నుంచి చేపల దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తే ముందుగానే సరఫరా వ్యవస్థను సిద్ధం చేసుకోవాలి. వినియోగదారులకు నాణ్యమైన చేపలు అందేలా పర్యవేక్షణ పెంచాలని పలువురు కోరుతున్నారు.

నీటి నిల్వలు..

వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ రంగంతోపాటు మత్స్యరంగంపైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో విస్తారమైన చెరువులు, కుంటలు ఉన్నప్పటికీ నీటి నిల్వలు తగ్గితే అవి మత్స్యకారులకు ఉపయోగపడని పరిస్థితి ఏర్పడుతుంది. చేపల ఉత్పత్తి తగ్గిన తర్వాత ప్రత్యామ్నాయాలను వెతకడం కంటే ముందుగానే కార్యాచరణ చేపట్టడం మేలని రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మత్స్యకారుల జీవనోపాధి, చేపల లభ్యత, ధరల నియంత్రణ.. ఈ మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని మత్స్యశాఖ ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది.

Also Read: ఓటీటీలో మలయాళ విందు రెడీ… ఈ వీక్ మైండ్ బ్లాక్ చేసే క్రేజీ మూవీస్ ఇవే

Tags

Related News

టీజీఎంఎస్ఐడీసీలో.. స్పెషల్ ఆఫీసర్ గ్యాంగ్ బ్లాక్‌మెయిల్ దందా!

సొంత నిధులతోనే రైతులకు తక్షణ సాయం..! రూ. 1250 కోట్లు విడుదల..! తక్షణ సాయంగా రూ. 2500..!

కేంద్ర కేబినెట్ ప్రక్షాళన తప్పదా.. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే భేటీపై ఉత్కంఠ!

‘భారత్ సమ్మిట్’ వేదికగా.. కేంద్రం తీరుపై మంత్రులు, మేధావుల విమర్శలు!

ఏపీ నుంచి తెలంగాణకు భారీగా అక్రమ ఇసుక రవాణా.. పట్టించుకోని మైనింగ్ అధికారులు!

సోనియా 544 పేజీల ఆత్మకథా.. లేక రాజకీయ రణరంగమా..?

మెక్రాన్ రొమాన్స్‌.. రాజకీయాల్లో రచ్చ.. ఈ పలకరింపుల వెనుక కథేంటి?

Big Stories

Advertisement
×