E-Paper
Advertisement

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్ నుంచి పాక్ అవుట్.. టోర్నీ నుంచి తప్పుకుంటే లాభమా? నష్టమా?

T20 World Cup: టీ20 వరల్డ్‌ కప్ నుంచి పాక్ అవుట్.. టోర్నీ నుంచి తప్పుకుంటే లాభమా? నష్టమా?
Advertisement

T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ మొదలవడానికి ముందే.. క్రికెట్ వరల్డ్‌లో హీట్ బాగా పెరిగిపోయింది. ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న ఈ మెగాటోర్నీ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటుందా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే.. పాకిస్థాన్ ఇప్పుడు తప్పుకోవడం వల్ల.. ఏమైనా లాభం ఉంటుందా? ఒకవేళ పాక్ గనక టోర్నీని బాయ్‌కాట్ చేస్తే.. ఐసీసీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది?

టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందు.. క్రికెట్ ప్రపంచంలో మునుపెన్నడూ లేని స్థాయిలో రాజకీయంగా, క్రీడాపరంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీ నుంచి పాకిస్థాన్ తప్పుకుంటుందా? లేదా? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీ మొదలయ్యేందుకు.. ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఆడకుండా.. బంగ్లాదేశ్‌పై ఇప్పటికే ఐసీసీ వేటు వేసింది. దాంతో.. బంగ్లాదేశ్‌కు మద్దతుగా ఈ మెగా టోర్నీని బాయ్ కాట్ చేయాలనే పాకిస్థాన్ ఆలోచిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే డైలమాలో పడిపోయింది. ఈ వివాదానికి.. సెంటర్ పాయింట్ బంగ్లాదేశ్. భద్రతా కారణాల రీత్యా భారత్‌లో ఆడేందుకు నిరాకరించడంతో, ఐసీసీ ఆ జట్టును టోర్నీ నుంచి తొలగించింది. రీప్లేస్‌మెంట్‌గా స్కాట్లాండ్‌ను గ్రూప్-సీలోకి చేర్చింది. ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బంగ్లాదేశ్‌కు మద్దతుగా తాము కూడా టోర్నీని బాయ్‌కాట్ చేస్తామని, లేకపోతే.. భారత్‌తో జరిగే మ్యాచ్‌ని బహిష్కరిస్తామని హెచ్చరిస్తోంది. పాక్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ, తమ ప్రభుత్వం ఆదేశిస్తే టోర్నీ నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు.

Advertisement

టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల పాకిస్థాన్‌కు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువుందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే.. పాక్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఎప్పుడో దాటిపోయింది. బంగ్లాదేశ్‌కు అండగా నిలిచామని చెప్పుకోవడానికి తప్ప.. ఇదీ ఏరకంగానూ పాక్‌కు మేలు చేసే నిర్ణయం కాదనే వాదనలు వినిపిస్తున్నాయ్. అంతేకాదు.. ఐసీసీ రెవెన్యూలో కీలకమైన భారత్-పాక్ మ్యాచ్ జరగకపోతే.. ఐసీసీకి ఆర్థికంగా నష్టం వాటిల్లుతుంది. ఆ భయంతో.. ఐసీసీని తమ దారికి తెచ్చుకోవచ్చనేది పీసీబీ వ్యూహం. కానీ.. ఇది బూమరాంగ్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయ్. పాక్ గనక ఇప్పుడు టోర్నీ నుంచి తప్పుకుంటే.. ఐసీసీ కఠిన చర్యలు తీసుకునేందుకు అస్సలు వెనుకాడదు. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇప్పటికే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడాలా? వద్దా? అనే దానిపై తుది నిర్ణయం.. ఫిబ్రవరి 2న చెబుతామని తెలిపింది పీసీబీ. అయితే.. లోలోపల జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.. పాకిస్థాన్ బాయ్‌కాట్ చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయనే వాదనలు వినిపిస్తోంది. కేవలం.. ఐసీసీపై ఒత్తిడి పెంచడానికే ఈ డ్రామా నడుస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.

పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్‌ని ఐపీఎల్ నుంచి తప్పించినందుకు నిరసనగా బంగ్లాదేశ్, భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడకూడదని నిర్ణయించింది. అంతేకాదు.. వేదికను శ్రీలంకకు మార్చాలని పదే పదే కోరింది. ఇందుకు ఐసీసీ నిరాకరించడంతో.. చేసేదేమీ లేక వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంది. మరోవైపు పాకిస్థాన్ జట్టు, తమ ప్రభుత్వ జోక్యంతో టీ20 వరల్డ్‌కప్ బహిష్కరిస్తే.. ఆ బోర్డుపై వేటు పడుతుంది. దీనినుంచి తప్పించుకునేందుకు.. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా భారత్‌లో.. టీమిండియాతో జరిగే మ్యాచ్‌లని బాయ్‌కాట్ చేసి, దాని వెనుక ప్రభుత్వ నిర్ణయం ఉన్నట్లు చెప్పుకుంటే చాలని పీసీబీ భావిస్తోంది. అప్పుడు.. పీసీబీపై వేటు పడినా, ఆర్థిక నష్టాల లాంటి ఆంక్షల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత.. ఐసీసీ నియమించే కమిటీ సాయంతో.. యథావిధిగా మ్యాచ్‌లు ఆడుకొవచ్చనే వ్యూహంతో ఉంది పీసీబీ.

Advertisement

ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా, భారత్-పాక్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఒకవేళ పాక్ ప్రభుత్వం గనక భారత్‌తో ఆడొద్దని చెబితే, ఐసీసీ ఏం చేస్తుందనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ టోర్నీ కోసం సల్మాన్ అలీ ఆఘా నాయకత్వంలో.. పాక్ ఇప్పటికే వరల్డ్‌కప్ టీమ్‌ని ప్రకటించింది. మరి మొహ్సిన్ నఖ్వీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందుతారా? లేక లతీఫ్ చెప్పినట్టు భారత్‌తో మ్యాచ్‌ను మాత్రమే బహిష్కరిస్తారా? అనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పాకిస్తాన్ గనక టోర్నీ నుంచి తప్పుకొంటే.. తాము టీ20 వరల్డ్ కప్ ఆడతామని ఉగాండా ప్రకటించింది. టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీలో ఓ స్థానం ఖాళీ అయితే దాన్ని భర్తీ చేయడానికి రెడీగా ఉన్నామని తెలిపింది. క్రికెట్ కిట్లు, ప్యాడ్లు, పాస్‌పోర్టులు అన్నీ సిద్ధంగా ఉన్నాయంటోంది. ప్రత్యర్థి జట్ల నుంచి వచ్చే ఎలాంటి ఒత్తిళ్లు తమను భయపెట్టలేవని, బోల్డ్ కిట్‌తో.. బోల్డ్ క్రికెట్ ఆడతామని ప్రకటించింది.

బంగ్లాదేశ్.. తమకు ద్రోహం జరిగిందని.. టీ20 వరల్డ్‌కప్‌ని బహిష్కరించింది. మరి.. పాకిస్థాన్‌కు ఏమైంది? బంగ్లాదేశ్‌కు మద్దతుగా.. టీ20 టోర్నీ నుంచి ఎందుకు తప్పుకోవాలనుకుంటోంది? పాక్ గనక.. ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకుంటే.. పాక్ క్రికెట్ బోర్డుకు ఎంత నష్టం వాటిల్లుతుంది? రాబోయే టోర్నీలు ఆడకుండా ఐసీసీ కూడా చెక్ పెట్టేస్తుందా? పాకిస్థాన్ లీగ్‌లో విదేశీ ఆటగాళ్లు పాల్గొనేందుకు ఎన్వోసీలు ఇవ్వకుండా అడ్డుకోవాలని ఐసీసీ చూస్తోందా?

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ. టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ బహిష్కరణ, పాకిస్థాన్ ఆడుతుందా? లేదా? అనే సందిగ్ధత.. క్రికెట్ ఫ్యాన్స్‌ని తెగ తొలిచేస్తోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఆసియా దేశాల మధ్య నెలకొన్న రాజకీయ, క్రీడా ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. బంగ్లాదేశ్ ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకోగా, పాక్ కూడా అదే బాటలో నడుస్తుందా? ఒకవేళ తప్పుకుంటే ఆ దేశ క్రికెట్ భవిష్యత్ ఏమవుతుంది? అనేది ఇప్పుడు చర్చకు వస్తోంది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీని పాక్ బాయ్‌కాట్ చేస్తే.. ఐసీసీ నుంచి ఆ దేశ క్రికెట్ భవిష్యత్‌ని దెబ్బతీసే నిర్ణయాలు వెలువడే ఛాన్స్ ఉంది. ఐసీసీ టోర్నమెంట్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్ ప్రకారం.. చివరి నిమిషంలో తప్పుకుంటే.. పాకిస్థాన్‌కు రావాల్సిన వార్షి ఆదాయం సుమారు 35 మిలియన్ డాలర్లు నిలిచిపోయే అవకాశాలున్నాయి. భవిష్యత్తులో జరిగే ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్ నుంచి కూడా పాక్‌ని బహిష్కరించే అవకాశం ఉంది. ఇతర క్రికెట్ బోర్డులతో పాక్ ఆడే సిరీస్‌లపైనా.. ఐసీసీ ఆంక్షలు విధించొచ్చు. పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం.. విదేశీ ఆటగాళ్లకు ఇచ్చే ఎన్వోసీలను ఐసీసీ అడ్డుకునే ఛాన్స్ ఉంది. దీనివల్ల.. పీఎస్ఎల్ క్రేజ్ పూర్తిగా తగ్గిపోతుంది. పాక్ తప్పుకుంటే.. వారి స్థానంలో ఉగాండా లాంటి జట్టుని.. ఐసీసీ గ్రూప్-ఏలోకి తీసుకొస్తుంది. ఇది.. పాక్ క్రికెట్ టీమ్‌కు ఘోర అవమానంగా మిగిలిపోతుంది.

దీని వెనుక మరో కోణం కూడా ఉంది. ఐపీఎల్ 2026 నుంచి బంగ్లా స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను బీసీసీఐ తొలగించడంపై బంగ్లాదేశ్ గుర్రుగా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లా ప్రభుత్వం తమ జట్టును పంపకూడదని నిర్ణయించడంతో, ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించి, ఆ స్థానంలో స్కాట్లాండ్‌ను ఎంపిక చేసింది. ఇప్పుడు పాక్ కూడా బంగ్లాదేశ్ బాటలోనే నడిస్తే.. అది ఆ దేశ క్రికెట్‌కు మరణశాసనమే అవుతుంది. ఐసీసీ నుంచి ఏటా వచ్చే 290 కోట్ల ఆదాయాన్ని పీసీబీ కోల్పోతుంది. ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత వ్యూయర్‌షిప్ వచ్చే.. భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే.. బ్రాడ్‌కాస్టర్లు 320 కోట్లకు పైనే నష్టపోయే ఛాన్స్ ఉంది. దాంతో.. నష్టపరిహారం కోరుతూ.. పీసీబీపై కోర్టులో కేసులు వేసే అవకాశం ఉంది. పార్టిసిపేషన్ కింద ప్రతి జట్టుకు అందే 4 కోట్ల 20 లక్షల ఫీజుని కూడా పాక్ క్రికెట్ బోర్డు వదులుకోవాల్సి వస్తుంది. వాస్తవానికి.. ఐసీసీ రూల్స్ ప్రకారం.. ఒకసారి సంతకం చేసిన తర్వాత టోర్నీ నుంచి తప్పుకోవడం ఒప్పంద ఉల్లంఘనే అవుతుంది. అప్పుడు.. ఐసీసీ పాకిస్థాన్‌ని భవిష్యత్ ఈవెంట్ల నుంచి నిషేధించే అవకాశం ఉంది. దీనివల్ల.. పాక్ క్రికెట్ అంతర్జాతీయంగా ఏకాకి అవుతుంది.

Also Read: వైసీపీలోకి విజయసాయిరెడ్డి.. జగన్ రియాక్షన్ ఇదే!

ఇప్పటికే.. పాకిస్థాన్ తన 15 మంది జట్టు సభ్యులని ప్రకటించింది. పాకిస్థాన్ బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఐసీసీ ఆంక్షలకు భయపడి, పాక్ టోర్నీలో పాల్గొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయ్. ఇప్పటికే.. ఉగాండా లాంటి జట్లు పాక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఐసీసీకి సిగ్నల్స్ ఇచ్చాయ్. ఈ పరిస్థితుల్లో.. పాకిస్థాన్ ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన అవసరముంది. పాక్ ఏమీ తేల్చకపోవడంపై.. ఆ దేశ క్రికెట్ అభిమానుల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయ్. ఆడితే ఆడాలి.. లేకపోతే తప్పుకోవాలి గానీ.. ఏమీ చెప్పకుండా ఇలా నాన్చడమేంటి అనే ఆగ్రహావేశాలు కనిపిస్తున్నాయ్. పాక్ మాజీ క్రికెటర్లు, క్రీడా విశ్లేషకులు, అభిమానులు.. సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ.. ఇతర ఐసీసీ టోర్నీల సమయంలో.. పీసీబీ భారత్‌కు వెళ్లం, టోర్నీని బహిష్కరిస్తామని పెద్ద ఎత్తున ప్రకటనలు చేసింది. కానీ.. చివరి నిమిషంలో సాకులు చెప్పి మళ్లీ టోర్నీలో పాల్గొంది. ఈసారి కూడా అలాగే జరుగుతుందని.. పీసీబీ మాటలకు విలువ లేకుండా పోతుందని అభిమానులు విమర్శిస్తున్నారు. బంగ్లాదేశ్ కోసం పాక్ తన క్రికెట్ భవిష్యత్తుని ఫణంగా పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. బంగ్లాదేశ్‌ని సమర్థించడం వల్ల.. పాకిస్థాన్‌కు వచ్చే లాభం జీరో అని, పైగా ఐసీసీ నుంచి వచ్చే నిధులు ఆగిపోతే.. దేశంలో క్రికెట్ పూర్తిగా అంతరించిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Story By Anup, Bigtv

Related News

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

నిరుద్యోగ పెయిడ్ ఆర్టిస్ట్స్! యువ సంగ్రామ సదస్సు పై సెటైర్లు! ఎఫెక్ట్ ఎవరికి!?

చైన్ స్నాచర్లుగా మారండి! స్కూటీలు ఎత్తుకెళ్లండి..! జ‌నాల‌ను దోపిడీ చేయాలంటున్న బీజేపీ ఎమ్మెల్యే ..

ఒక్కో పార్టీకి రెండేసి సార్లు అధికారం.. ఇది ధీమానా, జోస్యమా? చరిత్ర ఇదేననే మైండ్ గేమా!?

సీసీటీవీ ఫుటేజ్ భయమేనా? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ ఆత్మహత్యాయత్నం వెనుక అసలు నిజాలు!

మితిమీరిన కేటీఆర్ భాష‌! చిచోర‌, బేకార్‌.. స‌న్నాసీ..! సీఎంపై ప‌రుష‌ ప‌ద‌జాల ప్ర‌యోగం..!

రేవంత్ రెడ్డి సీక్రెట్ స్కెచ్.. దారికి రాకుంటే టికెట్ కట్! హస్తం పార్టీలో మొదలైన బిగ్ యాక్షన్ ప్లాన్

Big Stories

Advertisement
×