India vs Pakistan: ఉట్టి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందంట..! పాకిస్తాన్ ప్రధాని మాటలు కూడా అచ్చుగుద్దినట్లు అలాగే ఉన్నాయి. పోనీలే బహిరంగ సభలో బీపీ పెరిగిందని అనుకోడానికి కూడా లేకుండా.. ఒకటికి రెండు సార్లు అదే పదాన్ని రిపేట్ చేసి మరీ చెప్పారు. ఎంత స్ట్రాంగ్‌గా అంటే.. పోడియం పగిలిపోద్దేమో అన్నట్లు బల్ల గుద్ది మరీ.. గొంతు చించుకున్నారు. ‘భారత్‌ను అధిగమించకపోతే.. నా పేరు షెహబాజ్ షరీఫే కాదంటూ’.. పాపం, ఆవేశంగా కమిట్ అయిపోయారు. ఇప్పుడు, షెహబాజ్ పేరు మారుతుందో..? లేందంటే, పేరే లేని ప్రధానిగా పాక్ చరిత్రలో నిలిచిపోతారో ఏమో గానీ.. ఇప్పుడు పాక్ ప్రధాని మాటలు రెండు దేశాల్లోనూ తీవ్రమైన చర్చకు దారి తీసాయి. ఇంతకీ ఆయన ఇంతగా ఎందుకు ఆవేశపడ్డారు..? అసలు, షెహబాజ్ శపథం నెరవేరడానికి ఛాన్స్ ఉందా..?
భారత్‌ను అధిగమించి చూపిస్తానన్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
చూసారుగా.. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు’ అనుకున్నారో ఏమో గానీ.. పాకిస్తాన్ ప్రధాని ఆవేశంతో అలివిగాని శపథం చేసేశారు. పాకిస్తాన్ వాస్తవ పరిస్థితిని మర్చిపోయి నోటికొచ్చినట్లు ప్రతిజ్ఞలు చేశారు. 73 సంవత్సరాల వయసున్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తాను బతికున్నప్పుడే అన్ని రకాలుగా భారత్‌ను అధిగమించి చూపిస్తానని అన్నారు. లేకపోతే, తన పేరు షెహబాజ్ షరీఫే కాదంటూ కమిట్ అయ్యారు.
పాక్ ప్రజలను రెచ్చగొట్టడానికి భారత్ పేరువాడిన షెహబాజ్
ఇటీవల, పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌ని సందర్శించిన ప్రధాని షెహబాజ్.. డేరా ఘాజీఖాన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ప్రజలను రెచ్చగొట్టే క్రమంలో భారత్ పేరు వాడినట్లు స్పష్టంగానే తెలుస్తోంది. ఈ క్రమంలో.. పిడికిలి పైకెత్తడం, గాలిలో చేతులు ఊపడం, ఛాతీపై కొట్టుకోవడం, పోడియం బల్లను గుద్దడం వంటి విన్యాసాలు చేస్తూ.. ప్రేక్షకుల్ని అలరించడానికి ప్రయత్నించారు.
తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న పాకిస్తాన్
నిజానికి పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతోంది. మరోవైపు, వేర్పాటు వాదం, ఉగ్రవాదం సమస్యలు పాకిస్తాన్‌ను పట్టి పీడిస్తున్నాయి. ఆ దేశంలో రాజకీయ పరిస్థితులు కూడా సక్రమంగా లేవు. ఎప్పుడు దేశం మిలటరీ చేతుల్లోకి వెళుతుందో అనే భయాలు లేకపోలేదు. ఒక విధంగా, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం స్క్రీన్ పైనే గానీ.. పాకిస్తాన్‌ని వెనకుండి పాలిస్తుంది మిలటరీనే అనే అభిప్రాయాలు ఉన్నాయి.
చైనాకు అమ్ముడుపోయి మౌళిక సదుపాయాల ఏర్పాటు
ఇక, పాకిస్తాన్ ప్రస్తుతం అమెరికా దయతో.. ప్రపంచ బ్యాంక్ అప్పులతోనే కడుపునింపుకుంటోంది. మరోవైపు, చైనాకు అమ్ముడుపోయి మౌళిక సదుపాయాలు పెంచుకుంటుంది. ఈ పరిస్థితుల్లో.. తన పెద్దన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌పై ప్రమాణం చేసి మరీ.. ఇంత వింతగా మాట్లాడటంతో ప్రపంచమంతా ముక్కుల వేలేసుకుంటోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భారత్‌ను వెనక్కు నెట్టకపోతే..
ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు చెప్పుకోవడం పాకిస్తాన్‌కు కొత్తేమీ కాదు. భారత్ విషయంలో అయితే మరింత ఓవరాక్షన్ చేయడం పాక్‌కు పార్టీషన్‌తో పెట్టిన విద్య. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఎప్పుడు చూసినా భారత్‌తో పోల్చుకుంటూ పోటీకి దిగుతుంది. ఇదే క్రమంలో ఇప్పుడు పాక్ ప్రధాని షెహబాజ్ డాంభికాలు పలికారు.
పేరు మార్చుకుంటానని శపథం చేసిన పాక్ ప్రధాని షెహబాజ్
“పాకిస్థాన్ ప్రస్తుతం ఎదుర్కుంటున్న సమస్యలను అధిగమించడానికి మనం పగలు రాత్రిళ్లు కష్టపడాలనీ.. అదృష్టం ఎల్లప్పుడూ మనవైపే ఉంటుందనీ.. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భారత్‌ను వెనక్కు నెట్టకపోతే నా పేరు మార్చుకుంటానని” షెహబాజ్ ప్రగల్భాలు పలికారు. “పాకిస్తాన్‌లో ప్రజల పరిస్థితిని మెరుగుపరచడానికి అంతా పగలు, రాత్రి పని చేయాలని.. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ.. మనందరం కలిసికట్టుగా పోరాడి, భారత్‌ను ఓడిద్దాం” అని పంజాబ్ ప్రావిన్స్ ప్రజలను రెచ్చగొట్టారు.
ఆచరణకు సాధ్యం కాని ప్రకటనలు చేసిన ప్రధాని షెహబాజ్
షెహబాజ్ షరీష్ గొంతు చించుకొని ఇచ్చిన హామీకి గ్రౌండ్లో చప్పట్లు మోగాయి కానీ.. మీడియాలో.. ముఖ్యంగా సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ఆచరణకు సాధ్యం కాని ప్రకటనలతో ప్రధాని షెహబాజ్ పాకిస్తాన్ ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఇక, స్వదేశంలో అయితే.. దమ్ముంటే సాధించి చూపించండి గానీ.. మాటలతో కోటలు కట్టొదంటూ ఎద్దేవా చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పాకిస్తాన్ పరిస్థితి ఎలాగుందో ప్రజలకు చెప్పకుండా.. ఇష్టమొచ్చినట్లు హామీలిస్తే.. ఎవ్వరూ నమ్మరంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు.. షెహబాజ్ పేరు మార్చితే.. కొత్తగా ఏం పేరు పెట్టాలా అని రకరకాల పేర్లతో ఇంటర్నెట్‌ని ముంచెత్తుతున్నారు.
పాకిస్తాన్ కామెడీలో భారత్‌ను అధిగమించిందని ఎద్దేవా
ఇంకొందరు చూస్తే.. పాకిస్తాన్ కామెడీలో భారత్‌ను అధిగమించిందనీ.. అందులో భారతీయులు వెనుకబడి ఉన్నారని అన్నారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే, భారత్ కంటే కనీసం 30 సంవత్సరాలు వెనుకబడి ఉందనీ.. అది కూడా ప్రపంచ సహాయం ఉండబట్టేననీ.. లేకపోతే, ఈ గ్యాప్ 100 సంవత్సరాలకు మించే ఉంటుందని ఎగతాళి చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక సవాళ్లతో పోరాడుతూనే ఉందనీ.. అంతర్జాతీయ ద్రవ్య నిధి, చైనా-అరబ్ దేశాలకు భారీగా రుణపడి ఉందనీ.. ఇలాంటి హామీలు ఎన్ని ఇచ్చినప్పటికీ, పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందుల ఇప్పుడప్పుడే పరిష్కారం కావని విమర్శకులు వాదిస్తున్నారు.
తాజా క్రికెట్ మ్యాచ్ ముందు కూడా షెహబాజ్ కవ్వింపు మాటలు
అయితే, రెండు రోజుల క్రితం భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ ముందు కూడా పాక్ ప్రధాని ఇలాంటీ కవ్వింపు మాటలే మాట్లాడారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని సంచలన వ్యాఖ్యలు చేశారు. చాంపియన్స్ ట్రోఫీ కప్పును సొంతం చేసుకుంటే సరిపోదని.. చిరకాల ప్రత్యర్థి టీమిండియానూ తప్పకుండా ఓడించాలని షెహ్‌బాజ్ షరీఫ్ అన్నారు. కప్పు కంటే భారత్‌ను ఓడించడమే ముఖ్యం అనే అర్థం వచ్చేలా పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. 2021 టీ20 వరల్డ్ కప్ ఓటమి తప్పితే పాక్‌తో ఐసీసీ టోర్నీల్లో ఆడిన ప్రతిసారి టీమిండియానే గెలిచింది.
కప్పు కంటే భారత్‌ను ఓడించడమే ముఖ్యం అనే అర్థం వచ్చేలా వ్యాఖ్య
అలాగే, టీ20 ప్రపంచ కప్-2024లోనూ ఆ టీమ్‌ను రోహిత్ సేన చిత్తు చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో చరిత్ర మరిచిపోయి పాక్ ప్రధాని ఓవరాక్షన్ చేయడంపై స్వదేశంలోనూ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పాకిస్తాన్‌ను స్వయం సమృద్ధిగల దేశంగా మార్చడం, విదేశీ రుణాలపై ఆధారపడటాన్ని తగ్గించడం, ప్రపంచ వేదికపై పాకిస్తాన్ ఆర్థిక స్థితిని పెంచడం పక్కన పెట్టీ… ప్రజల్ని రెచ్చ గొడుతూ పబ్బం గడుపుకుంటున్న ప్రధాని షెహబాజ్ వైఖరిపై అంతర్జాతీయ సమాజం విమర్శలు గుప్పిస్తోంది.
భారత్‌తో ఉన్న అన్ని సమస్యలను సంప్రదింపుల ద్వారా…
ఇటీవలే… దాయాది పాకిస్థాన్ శాంతి మంత్రం వల్లించింది. కశ్మీర్ అంశం సహా భారత్‌తో ఉన్న అన్ని సమస్యలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. ఐక్యరాజ్యసమితిలో చేసిన వాగ్దానాలను భారత్ నెరవేర్చి, చర్చలకు ముందుకు రావాలంటూ పిలుపునిచ్చారు. ఫిబ్రవరి ప్రారంభంలో… “కాశ్మీర్ సంఘీభావ దినోత్సవం” సందర్భంగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని భారత్ ఎన్నో సందర్భాల్లో స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇతరుల జోక్యాన్ని సహించబోమని ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ వేదికలపై వెల్లడించింది.
దెబ్బతిన్న తమ సంబంధాలను సరిదిద్దుకోవాలని పిలుపు
అయినప్పటికీ.. ‘కశ్మీరీలకు స్వయం నిర్ణయాధికార హక్కు లభించే వరకు పాకిస్థాన్ దృఢమైన నైతిక, దౌత్య, రాజకీయ మద్దతును అందిస్తూనే ఉంటుంది’ అని పాక్ ప్రధాని షెహబాజ్ అన్నారు. 1999లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌ను సందర్శించినప్పుడు సంతకం చేసిన లాహోర్ డిక్లరేషన్‌లో పేర్కొన్నట్లుగా, భారత్, పాకిస్తాన్‌లు దెబ్బతిన్న తమ సంబంధాలను సరిదిద్దుకోవడానికి సంభాషణలే ఏకైక మార్గం అని షరీఫ్ అన్నారు. అయితే, ఉగ్రవాదం, శత్రుత్వం, హింస లేని వాతావరణంలో పాకిస్తాన్‌తో సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటామని భారతదేశం స్పష్టం చేసింది.
2024 నాటికి $3,889 బిలియన్లతో భారత జిడిపి
అయితే, ప్రధాని షెహబాజ్ తాజా ప్రకటన.. మరింత పోటీతత్వాన్ని సూచిస్తున్నట్లే కనిపిస్తోంది. పాకిస్తాన్ ఆర్థిక, రాజకీయ సవాళ్ల మధ్య ఇది ఎంత వరకూ సాధ్యమనే ప్రశ్నను లేవనెత్తుతోంది. 2024 నాటికి , $3 వేల 889 బిలియన్ డాలర్లతో.. భారతదేశ జిడిపి, పాకిస్తాన్ జిడిపి కంటే దాదాపు 10.38 రెట్లు ఎక్కువ. పాక్ జిడిపి కేవలం $375 బిలియన్లు మాత్రమే. ఇక, భారతదేశంలో ఆర్థికంగా అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్ర జిడిపి $454 బిలియన్ డాలర్లు.. ఇది పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువ. అలాగే, ఇండియాలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న తమిళనాడు జిడిపి$298 బిలియన్లు.. ఇది పాకిస్తాన్‌కు దాదాపు దగ్గరగా ఉంది.
పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ర్యాంకింగ్ 44వ స్థానం
ఇది పక్కన పెడితే.. ఇప్పటికే, భారతదేశం ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇక, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ-PPP ప్రకారం చూస్తే.. త్వరలోనే ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు రేసులో స్పీడుగా పరుగెత్తుతోంది. అదే తరుణంలో.. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ర్యాంకింగ్ 44వ స్థానంలో ఉంది. ఇక, దాని PPP ర్యాంకింగ్ 26వ స్థానంలో ఉంది. అంటే, భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారే సమయానికి పాక్ 26వ స్థానంలో ఉంటుంది. దీనికి, సుమారు మరో 25 ఏళ్లు టార్గెట్ ఉంది. దీని ప్రకారం చూస్తే.. పాకిస్తాన్, భారత్ స్థానాన్ని చేరుకోడానికి.. అంటే, 26 స్థానం నుండి 3 స్థానాన్ని చేరుకోడానికి ఎన్నేళ్లు పడుతుందో అర్థం చేసుకోవచ్చు.
2024లో భారత తలసరి ఆదాయం మారకపు రేటు..
నిజానికి, 2024లో, భారతదేశ తలసరి ఆదాయం మారకపు రేటు ఆధారంగా.. పాకిస్తాన్ కంటే 1.7 రెట్లు ఎక్కువగా ఉంది. ఇది ఆల్ టైమ్ హై కూడా. ప్రపంచ తలసరి జిడిపి ర్యాంకింగ్‌లో రెండు దేశాలు చాలా తక్కువ స్థానంలో ఉన్నప్పటికీ.. భారతదేశంతో పోల్చుకుంటే.. పాకిస్తాన్ అధ:పాతాళంలో ఉందనే చెప్పాలి. ఒక విధంగా చూస్తే.. 33 భారతీయ రాష్ట్రాల్లో 29 రాష్ట్రాలు పాకిస్తాన్ కంటే ధనిక రాష్ట్రాలుగా ఉన్నాయి. అలాగే 7.021% జిడిపి వృద్ధితో, భారతదేశం పాకిస్తాన్ కంటే 2.377% కంటే చాలా ఎక్కువ స్థాయిలో ఆర్థికంగా అభివృద్ధి చెందుతోంది.
2020లో రికార్డు స్థాయిలో మైనెస్ -1.27%
2001-2019 కాలంలో భారతదేశ GDP వృద్ధి రేటు పాకిస్తాన్ కంటే ఎక్కువగా ఉంది. భారతదేశం 2021లో గరిష్ట జిడిపి వృద్ధి రేటు 9.69% కాగా.. 2020లో కనిష్టంగా -5.78% సాధించింది. అదే, పాకిస్తాన్ 1970లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 11.35% కాగా.. 2020లో రికార్డు స్థాయిలో మైనెస్ -1.27%కి చేరుకుంది. ఇక, ఇటీవల కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మెరుగవుతూనే ఉంది. కరోనా కాలాన్ని కూడా దాటుకొని భారత్ నిలదొక్కుకుంది. ప్రపంచంలో చాలా దేశాలు కరోనా దెబ్బకు చతికిలపడితే, భారత్ మాత్రం అనుకూలమైన ఆర్థిక విధానాలను అమలు చేసి, అగ్రదేశాలకు పోటీగా అభివృద్ధి చెందుతోంది.
2048 నాటికి ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
గతంలో భారతదేశం రాబోయే దశాబ్దంలో అంటే, 2048 నాటికి ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడుతుందని అంచనా వేయగా.. గతేడాది, రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ అభిప్రాయం ప్రకారం.. 2031 నాటికి భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటుందనీ.. 2060 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే ఛాన్స్ ఉందని అన్నారు. దీన్ని బట్టి, రాబోయే 25 సంవత్సరాల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ అమెరికాను కూడా దాటేస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది.
జర్మనీ, జపాన్‌లను దాటి చైనా తర్వాత 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్
ఇప్పటికే చైనాతో పోటీ పడుతున్న భారత్, మూడు నాలుగు స్థానాల్లో ఉన్న జర్మనీ, జపాన్‌లను మించి చైనా తర్వాత మూడో ఆర్థిక వ్యవస్థగా నిలబడాలనే ఆశయానికి ఇది మరింత ప్రేరణ ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే పదేళ్లలో భారతదేశం సంవత్సరానికి 9.6 శాతం చొప్పున వృద్ధి చెందగలిగితే.. దిగువ మధ్య ఆదాయ ఉచ్చు నుండి బయటపడి, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనాలున్నాయి.
Also Read: ట్రంప్ కొత్త ఆఫర్.. పౌరసత్వం కోసం గోల్డ్ కార్డ్
2023లో పాకిస్తాన్ సంస్కరణలను చేపట్టడంలో వైఫల్యం
మరోవైపు పాకిస్తాన్‌లో పరిస్థితులన్నీ అల్లకల్లోలంగానే కనిపిస్తున్నాయి. 2023లో పాకిస్తాన్ నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టడంలో దీర్ఘకాలిక వైఫల్యం కారణంగా ఆర్థిక, రాజకీయ, భద్రతా సంక్షోభాలను ఎదుర్కొంది. పాకిస్తాన్ ప్రమాణాల ప్రకారం చూసినా.. పరిస్థితిని చక్కదిద్దే మార్గాలు కనిపించట్లేదు. దేశానికి పేరుకుపోయిన అప్పులు, మిలటరీ ఎప్పుడు స్వాధీనం చేసుకుంటుందో అనే భయం కారణంగా కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ ఆదాయంలో కనీసం 40% వడ్డీలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక మాంద్యాన్ని, డిఫాల్ట్ ముప్పును ఎదుర్కొంటోంది.
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌తో పలుమార్లు సమీక్షలు ఫెయిల్
అలాగే తీవ్రమైన ద్రవ్యోల్బణంతో విదేశీ నిల్వల లోటు రాబోతున్న తరుణంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌తో పలుమార్లు సమీక్షా సమావేశాలు జరిగాయి. అయినప్పటికీ, డీల్ కుదరకపోవడంతో పాకిస్తాన్‌కు తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. అయితే, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కొన్ని దేశాలు పాకిస్తాన్‌కు సహాయం చేస్తున్నప్పటికీ, పాకిస్తాన్‌కు కావాల్సిన కొత్త అవసరాల కోసం ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌ని ఆశ్రయించక తప్పట్లేదు. దీనికి తోడు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇటీవల పాకిస్తాన్‌కు తాత్కాలికంగా సహాయాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
పాకిస్తాన్‌కు తాత్కాలికంగా సహాయాన్ని రద్దు చేసిన అమెరికా
అమెరికా నిధులు సమకూర్చే అనేక అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేశారు. అమెరికా నిధులను నిలిపివేయడం వల్ల బహుళ రంగాలపై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది. అలాగే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కఠినమైన నిబంధనలకు అనుగుణంగా పాకిస్తాన్ వనరుల పునర్వ్యవస్థీకరణ, నిర్వహణపై తీవ్రమైన ప్రభావాలు పడనున్నాయి.