పాక్‌లో సైనిక తిరుగుబాటు?
ఆర్మీ-ఐఎస్‌ఐ చేతికి అధికారం??
ప్రధాని షెహబాజ్ సైలెంట్ మోడ్!
ఆర్మీ- ఐఎస్ఐ వైలెంట్ మోడ్!!
NSA చీఫ్ గా ఐఎస్ఐ చీఫ్..
ఆర్మీ చీఫ్ కి NSA రిపోర్ట్..
పాకిస్థాన్ లో సైనిక తిరుగుబాటు జరుగుతోందా అంటే అవుననే తెలుస్తోంది. ప్రధాని షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కకు నెట్టేశారా అంటే అదే నిజమనిపిస్తోంది. పెహల్గాం దాడి తర్వాత భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో పాకిస్థాన్ ప్రజాస్వామిక ప్రభుత్వం సైలెంట్ మోడ్ లోకి వెళ్లి.. పాక్ సైన్యం, ఇంటెలిజెన్స్ వర్గాలు వైలెంట్ మోడ్ లోకి వచ్చేశాయా? అంటే అదే జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా సంభవించిన పరిణామ క్రమాలను బట్టీ చూస్తుంటే పాకిస్థాన్ లో ప్రధానిషెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని దాదాపు పక్కకు పెట్టేసినట్టే కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పాకిస్థాన్ లో ఇప్పటికే సైనిక తిరుగుబాటు మొదలైనట్టు కనిపిస్తోంది.
2024 అక్టోబర్ లో ఐఎస్ఐ డీజీగా మాలిక్
పాక్ లో ప్రజాస్వామిక ప్రభుత్వం పని ఇక అయిపోయినట్టుగానే భావిస్తున్నారు. ఇప్పటికే బలహీన ప్రధానిగా పేరు సాధించిన షెహబాజ్ తొలి నుంచి సైన్యం చెప్పినట్టే చేస్తున్నారు. అందులో భాగంగానే ఐఎస్ఐ చీఫ్ అసీమ్ మాలిక్ పాకిస్థాన్ జాతీయ రక్షణ సలహాదారుగా నియమితులయ్యారు. రెండు కీలక పదవులు ఒకే వ్యక్తికి ఇవ్వడం ఇదే తొలిసారి.
పైకే ప్రజాస్వామ్యం.. అధికారమంతా సైన్యానిదే
మాలిక్ ఐఎస్ఐ డీజీగా 2024 అక్టోబర్ లో నియమితులయ్యారు. 2022లో ఇమ్రాన్ ప్రభుత్వం దిగిపోయినప్పటి నుంచి NSA పదవి ఖాళీగా ఉంది. తాజా నియామకంతో ఆర్మీ- ఐఎస్ఐ సంయుక్తంగా దేశ పాలనలో పట్టు సాధించే దిశగా అడుగులు వేసేలా కనిపిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో పైకి మాత్రమే ప్రజాస్వామ్య ప్రభుత్వం. అధికారమంతా సైన్యం గుప్పెట్లో ఉన్నట్టు చెబుతున్నారు పాక్ వ్యవహారాల నిపుణులు.
విపక్ష నేత సైతం జైల్లో ఉన్న వైనం
ఇదిలా ఉంటే, గత కొన్నాళ్లుగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ బయట ఎలాంటి కార్యక్రమాల్లో కనిపించడం లేదు. యుద్ధానికి సంబంధించి కీలక ప్రకటనలు సైతం పాక్ పీఎం నుంచి వెలువడక పోవడం చూస్తుంటే.. ఇప్పటికే ఆయన పాత్ర కనుమరుగైనట్టు తెలుస్తోంది. ఇక విపక్ష నేత సైతం జైల్లో ఉండటంతో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆడింది ఆట- పాడింది పాటగా తెలుస్తోంది. దీన్నిబట్టీ చూస్తే జాతీయ భద్రత, భారత్ పై ప్రతిచర్యల వంటి అంశాలు.. జనరల్ అసిఫ్ మునీర్, అసిమ్ మాలిక్ చేతుల్లోకి వెళ్లినట్టు తెలుస్తోంది.
ప్రజాస్వామ్య ముసుగు తొలిగిందన్న కామెంట్లు
అసలే పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం అంతంత మాత్రం. ఇటీవల పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ చేసిన ప్రకటన, హెచ్చరికలను బట్టీ చూస్తే అక్కడ ప్రభుత్వం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. జరుగుతున్న పరిణామాలను బట్టీ చూస్తుంటే పాకిస్తాన్ లో ఉన్నది ప్రజాస్వామ్యం కాదనీ.. ఇప్పటి వరకూ ఉన్న ఆ ముసుగు కూడా తొలగి పోయిందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
పాక్ మిలటరీ తిరుగుబాట్లు కొత్తేం కాదు..
స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పాకిస్థాన్ లో మిలిటరీ తిరుగుబాట్లు కొత్తేం కాదు. మొదటి నుంచి ఇక్కడ సైనిక వర్గాలే ఆధిపత్య పాత్రను పోషిస్తూ వస్తున్నాయి. ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిచినపుడు కూడా విదేశాంగ విధానం, అంతర్గత భద్రత, వ్యూహాత్మక నిర్ణయాల విషయంలో ఆర్మీ- ఐఎస్ఐలే కీలక పాత్ర పోషిస్తుంటాయి.
భారత్ సరిహద్దుల్లో సైన్యం మొహరింపు
భారత్ తమ మీద దాడులు చేయొచ్చన్న భయంతో సరిహద్దుల వద్ద తన బలగాలను మొహరించింది పాక్ ఆర్మీ. మరో వైపు తన ప్రధాన యుద్ధ విమానాలతో సాధన సైతం మొదలు పెట్టింది. సైనికుల శిక్షణ కూడా ప్రారంభించింది. విమానాశ్రయాల దగ్గర భారీ స్థాయిలో భద్రతా సిబ్బందిని నియమించింది. రాజస్థాన్ లోని లాంగేవాలా సెక్టార్ దగ్గర పాక్ రాడార్ వ్యవస్థను, సైనిక వైమానిక బలగాలను మొహరించినట్టు చెబుతున్నాయి ఇంటెలిజెన్స్ రిపోర్టులు. ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. తన సైనిక దళాలను , నౌకా దళాలను సరిహద్దులకు తరలిస్తోంది పాకిస్థాన్. మొత్తం వ్యవహారాన్ని తన కంట్రోల్లోకి తీస్కుని ఇటు పాలన అటు సైనిక నిర్ణయాల ను పర్యవేక్షిస్తోంది.
రాజస్థాన్- లాంగేవాలా సెక్టార్ దగ్గర పాక్ రాడార్ వ్యవస్థ
భద్రతా కారణాల దృష్ట్యా ఈ నెల మొత్తం కరాచీ, లాహోర్ గగన తలాల వినియోగంపై పాకిస్థాన్ పాక్షిక ఆంక్షలు విధించినట్టు ఒక మీడియా రిపోర్ట్ వెలుగు చూసింది. భారత్ తో యుద్ధ వాతావరణం ఏర్పడ్డంతో.. పాకిస్థాన్ ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. నిషేధిత గగన తలంపై ప్రతిరోజూ కొన్ని గంటల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారిక ప్రకటన విడుదల చేసింది. వాణిజ్య విమానాల రాకపోకలకు ఈ ఆంక్షలు వర్తించబోవని పౌర విమానయాన సంస్థ తెలిపింది. ఆంక్షల సమయంలో వాణిజ్య విమానాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లిస్తామని ప్రకటించింది పాకిస్థాన్.
మరో ముషారఫ్ కానున్న మునీర్ అసీం?
ఇలా ఎటు నుంచి ఎటు చూసినా పాకిస్థాన్ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పాలన పోయి, సైనిక పాలన వచ్చినట్టే తెలుస్తోంది. అన్ని అధికారాలూ ఆర్మీ కనుసన్నల్లోకి వెళ్లినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్ల పాటు లేని జాతీయ భద్రతా సలహాదారు నియామకం.. దాని రిపోర్టింగ్ మొత్తం ప్రధానికి కాక ఆర్మీ చీఫ్ కి చేసేలా జరగటం చూస్తుంటే పాకిస్థాన్ లో సైనిక పద ఘట్టనలు ఖంగుమంటున్నాయి. మునీర్ మరో ముషారఫ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు విదేశాంగ నిపుణులు.
పాకిస్థాన్ లో ఇప్పటి వరకూ ఎన్నేసి సైనిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి?
కుక్క తోకను ఊపాలా? లేక తోకే కుక్కను ఊపాలా? అన్న సామెత వినే ఉంటాం. అలా ప్రభుత్వం సైన్యాన్ని నడపాలా- లేక సైన్యమే ప్రభుత్వాన్ని నడపాలా? అన్నది పాకిస్థాన్ లో చిరకాలంగా వినిపించే మాట. కారణం ఇక్కడ పదే పదే సైనిక తిరుగుబాట్లు జరుగుతుంటాయి. ఇందుకు కారణమేంటి? పాకిస్థాన్ లో ఇప్పటి వరకూ ఎన్నేసి సైనిక ప్రభుత్వాలు ఏర్పడ్డాయి? పాకిస్థాన్ ప్రధాని కన్నా ఆర్మీ చీఫ్ పేరు ఎందుకంత ప్రముఖంగా వినిపిస్తుంది?
పాక్ ప్రధాని ఎవరు అంటే టక్కున చెప్పలేం
పాక్ ప్రధాని ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ పెద్దగా తెలీక పోవచ్చు. కానీ పాక్ ఆర్మీ చీఫ్ ఎవరు? అంటే మాత్రం అసీం మునీర్ అని టక్కున చెప్పేస్తారు. దటీజ్ పవరాఫ్ ఆర్మీ చీఫ్. కారణం పెహల్గాం దాడి తర్వాత నుంచి మునీర్ పేరు మరింత ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పుడు మునీర్ కి తోడు అసీం మాలిక్ పేరు సైతం వెలుగులోకి వచ్చింది. ఇతడు ప్రస్తుతం ఐఎస్ఐ చీఫ్ గా పని చేస్తుండగా.. తాజాగా NSA చీఫ్ గానూ నియమితులయ్యారు. ఏకకాలంలో రెండు కీలక పదవులను పొందిన వ్యక్తిగా ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. దీంతో మాలిక్ బయోగ్రఫీ కోసం సెర్చింగ్ మొదలైంది.
ISI చీఫ్ గా నియమితులైన తొలి PHD హోల్డర్
అసీం మాలిక్ ఒక త్రీ స్టార్ జనరల్. ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ గా నియమితులైన తొట్ట తొలి పీహెచ్డీ హోల్డర్. ఈయన తండ్రి గులాం మాలిక్ సైతం సైన్యంలో పని చేసిన వారే. అసీం మాలిక్ పాకిస్తాన్ మిలటరీ అకాడమీ 80వ లాంగ్ కోర్సులో డిగ్రీ తీస్కున్నారు. స్వోర్డ్ ఆఫ్ ఆనర్ అవార్డు కూడా అందుకున్నారు. 1989లో 12వ బలూచ్ రెజ్మెంట్ కి నియమితులయ్యారు. ఇస్లామాబాద్ నేషనల్ డిఫెన్స్ వర్శిటీ చీఫ్ ఇన్ స్ట్రక్టర్ గానూ పని చేశారు. క్వెట్టాలోని పాకిస్తాన్ కమాండ్ స్టాఫ్ కాలేజీలో ఇన్ స్ట్రక్టర్ గానూ నియమితులయ్యారు. 2021 అక్టోబర్ లో మేజర్ జనరల్ నుంచి లెఫ్టినెంట్ జనరల్ హోదా పొందారు.
ISI, NSA పదవులు ఏమంత సామాన్యమైనవి కావు
మాలిక్ గురించి అంత సెర్చింగ్ ఎందుకు? అని చూస్తే.. ఇక్కడ ISI, NSA పదవులు ఏమంత సామాన్యమైనవి కావు. అలాంటిది ఏకకాలంలో ఈ రెండు పదవులు పొందడం అంటే మాములు విషయం కాదు. కారణం ఐఎస్ఐ చీఫ్ గా ఉండగానే టెర్రరిస్టు సంస్థలతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయ్. తర్వాత వారు ఆర్మీ చీఫ్ గా ఎంపికవుతారు. ఈ ఉగ్ర సంబంధాలతో పహెల్గాం తరహా దాడులకు పాల్పడతారు. తర్వాత ఒక యుద్ధ వాతావరణం వచ్చేలా చేస్తారు. ఆపై ప్రభుత్వాన్ని తమ గుప్పెట్లోకి తీసుకుంటారు. ఇక్కడ ఇదొక పవర్ఫుల్ కారిడార్.
ముషారఫ్ అధ్యక్షుడైంది కూడా ఇలానే
పాక్ ఆర్మీ చీఫ్ గా చేసిన ముషారఫ్, అధ్యక్షుడైంది కూడా సరిగ్గా ఇలాగే ఉంటుంది. ముషారఫ్ మొదట ఆర్టిలరీ, పదాతి దళం, కమాండో యూనిట్లలో అనేక పదవులు నిర్వహించారు. క్వెట్టా స్టాఫ్ కాలేజీ, నేషనల్ డిఫెన్స్ కాలేజీ వార్ వింగ్ లో బోధనలు సైతం చేశారు. 1965, 71 లో జరిగిన భారత్ పాక్ యుద్ధాల్లోనూ పాల్గొన్నారు. 1998 అక్టోబర్ లో ఆయన్ను సాయుధ దళాల అధిపతిగా నియమించారు నాటి ప్రధాని నవాజ్ షరీఫ్.
మునీర్ విషయంలోనూ ఇలా జరిగే ఛాన్స్?
ముషారఫ్ అధ్వర్యంలోని పాక్ దళాలు వివాదాస్పద కాశ్మీర్ లో ప్రవేశించాయి. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ముషారఫ్ కీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ ఒత్తిళ్ల కారణంగా భారత్ తో పోరాడుతున్న పాక్ సైనికులను వెనక్కు పిలిపించారు షరీఫ్. దీంతో సైన్యం ఆగ్రహానికి గురైంది. ఆ వెంటనే పరిణామ క్రమాలు తీవ్ర తరమయ్యాయి. ముషారాఫ్ ను పదవి నుంచి తొలగించారు షరీఫ్. ఈ సమయంలో విదేశాల్లో ఉన్న ముషారఫ్ ను కరాచీ ఎయిర్ పోర్టులో దిగకుండా ఆదేశాలు జారీ చేశారు షరీఫ్. కానీ సాయుధ దళాలు విమానాశ్రయం ఇతర ప్రభుత్వ సంస్థలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఏకంగా షరీఫ్ నే పదవి నుంచి తొలగించాయి. దీంతో ముషారాఫ్ సైనిక ప్రభుత్వానికి అధిపతి అయ్యారు.
ఆర్మీ చీఫ్ అత్యంత పవర్ఫుల్
రేపటి రోజున మునీర్ విషయంలో ఇలా జరగదనడానికి వీల్లేదు. ఇలాంటి అవమాన భారాలు భరించడం ఎందుకన్న కోణంలో షెహబాజ్ వంటి బలహీన ప్రధానులు వారంతట వారే తప్పుకుంటారు. ఇక్కడ మరో పోలిక ఏంటంటే షెహబాజ్ షరీఫ్ మరెవరో కాదు.. నవాజ్ షరీఫ్ సోదరుడే. తన సోదరుడు నవాజ్ షరీఫ్ ముషారాఫ్ చేతుల మీదుగా అధికారాన్ని కోల్పోతే.. షెహబాజ్ షరీఫ్.. మునీర్ చేతుల మీదుగా అధికారం కోల్పోయేలా కనిపిస్తున్నారు. యుద్ధం రాక ముందునుంచే ఆయన ఆర్మీ చీఫ్ కనుసన్నల్లో నిర్ణయాలు తీసుకుంటారనే పేరుంది. ప్రస్తుతం యుద్ధం వస్తుందన్న అనుమానాల దృష్ట్యా ఆయన ప్రభుత్వం పూర్తి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోగా.. ఆర్మీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసింది.
అయితే మత ప్రభుత్వాలు, లేదంటే సైనిక ప్రభుత్వాలు..
ఒక్కో దేశంలో ఒక్కో పదవి అత్యంత క్రియాశీలకంగా ఉంటుంది. అమెరికాలో అధ్యక్షుడు క్రియాశీలక పాత్ర పోషిస్తారు. అదే భారత్ లో ప్రధానిది ప్రధాన పాత్రగా ఉంటుంది. పాక్ లో ప్రధాని పాత్ర ఉంటుంది కానీ అది నామ మాత్రంగా ఉంటుంది. ఆర్మీ చీఫ్ అత్యంత పవర్ఫుల్ గా ఉంటారు. పైకి ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తున్నట్టు కనిపించినా.. లోలోన సైనికాధిపతులే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందుకే ఇక్కడ ప్రజాస్వామిక విలువలు అంత గొప్పగా ఉండవని చెబుతుంటాయి మానవహక్కుల గణాంకాలు. అయితే మత ప్రభుత్వం లేదంటే, సైనిక ప్రభుత్వాలు ఇక్కడ అత్యంత దారణంగా ప్రజస్వామ్య విలువలను పతనం దిశగా తీస్కెళ్తుంటాయని చెబుతుంటారు.
యుద్ధం వస్తే రేషన్ సరుకులు సహా సైన్యం గుప్పెట్లోకి
పాకిస్థాన్ లో మాములుగానే సైన్యం పవర్ఫుల్. ఇక యుద్ధ వాతావరణం వస్తే.. రేషన్ సరుకులతో సహా పాలనాధికారాలన్నీ సైనికుల గుప్పెట్లోకి వెళ్లి పోతాయి. పాకిస్తాన్ లో సైనిక కుట్రలకు సుమారు 7 దశాబ్దాల చరిత్ర ఉంది. యాభైల కాలం నుంచీ ఇక్కడ సైనిక తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. భారత్ పాక్ పాలనా పరమైన వ్యవహారాలు రాజ్యాంగ విధానాల్లోని స్థితిగతులే.. ఇందుకు కారణం.
పాక్ ఐదుగురు ప్రధానులు దోషులుగా నిర్దారణ, జైలు పాలు
1958లో సైనిక సైన్యాధిపతి ముహమ్మద్ అయూబ్ ఖాన్, అధ్యక్షుడు ఇస్కందర్ అలీ మీర్జాను పడగొట్టి బహిష్కరించడంతో పాకిస్తాన్‌లో సైనిక తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. 1947లో దేశం ఏర్పడినప్పటి నుంచి, పాకిస్తాన్ అనేక దశాబ్దాలుగా సైనిక పాలనలో ఉంది. 1958–1971, 1977–1988, 1999–2008లో ఇక్కడ సైనిక ప్రభుత్వాలే నడిచాయి. వారి పదవీకాలాల తర్వాత, పాకిస్తాన్ ఐదుగురు ప్రధానులు దోషులుగా నిర్ధారించబడ్డారు. లేదా జైలు శిక్ష అనుభవించారు. ఈ ధోరణి పాకిస్తాన్ రాజకీయ ముఖచిత్రంలో అత్యంత కీలకంగా కనిపిస్తుంది. పాకిస్తాన్ చరిత్ర అంతటా, సైనిక పాలన ప్రముఖ పాత్ర పోషించింది. కొన్ని సార్లు ప్రజాస్వామిక ప్రభుత్వం ముసుగులో.. మరికొన్ని సార్లు నేరుగానే తమ పాలనాధికారాలను చెలాయించడం కనిపిస్తుంది. ఇక్కడిది సర్వసాధారణ పాలనా దృశ్యం.