Palamuru Congress: పదవెప్పుడొస్తుంది బాబూ. మేము కళ్లు కాయలు కాచేలా చూస్తున్నాము బాబూ. ఇదీ ప్రస్తుతం పాలమూరు కాంగ్రెస్ లీడర్లు పాడుతోన్న పాట. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం.. ఎమ్మెల్యేల గెలుపుకోసం.. పని చేశాం. ఇప్పుడు పదవులు ఆశించడంలో తప్పు లేదుగా? అంటూ వీరు లాజిక్కులు లాగుతున్నారట. ఇంతకీ వారి వాదనేంటి.. ఆవేదన ఎలాంటిది? చూద్దాం..
పదవులపై ఆశల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ లీడర్లు
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు త్వరలో నియామకాలు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో.. కార్పొరేషన్ పదవులపై ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారట. ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో ఏపీ జితేందర్ రెడ్డి, డాక్టర్ చిన్నారెడ్డి, శివసేన రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు నామినేటెడ్ పోస్టులకు ఎంపికయ్యారు. వారు వారు వారి వారి బాధ్యతల్లో మునిగిపోయారు కూడా. ఈ టైంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం.. ఎమ్మెల్యేల గెలుపు కోసం కృషి చేసిన పలువురు నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారట.
సీతాదయాకర్ రెడ్డికి చైల్డ్ ప్రొటెక్షన్ చైర్ పర్సన్ ఖరారు?
గత అసెంబ్లీ ఎన్నికల్లో దేవరకద్ర ఎమ్మెల్యే జీఎంఆర్ గెలుపుకోసం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతాదయాకర్ రెడ్డికి చైల్డ్ ప్రొటెక్షన్ చైర్ పర్సన్ పదవి దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. రాజకీయ అనుభవంతో పాటు విద్యావంతురాలు కూడా కావడంతో.. ఆమెకు ఈ పదవి ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే నియామక ఉత్తర్వులు జారీ కాబోతున్నాయని సమాచారం.
దాదాపు 50 కార్పొరేషన్ల డైరెక్టర్ పోస్టుల కోసం తీవ్ర యత్నాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో పార్టీ కోసం పని చేసిన సీనియర్ లీడర్లు కొందరుంటే.. జనాదరణ కలిగిన పాపులర్ లీడర్స్ మరికొందరున్నారు. వీరంతా రాష్ట్ర స్థాయిలో పదవులు దక్కించుకోడానికి తీవ్ర యత్నాలు సాగిస్తున్నారట. దాదాపు 50 కార్పొరేషన్లలో డైరెక్టర్ పోస్టుల కోసం అలుపెరుగని యత్నాలు సాగిస్తున్నారట. ఈ మేరకు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, అర్హులైన నాయకులు.. కార్యకర్తల పేర్లు అధిష్టానానికి సిఫార్సు చేశారట.
మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ డైరెక్టర్ల నియామకాలు పెండింగ్ లో..
మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథార్టీకి చైర్మన్ పదవి నియామకం జరిగి నాలుగు నెలలు కావస్తున్నా.. డైరెక్టర్ల నియామకాలు ఇప్పటి వరకూ జరగనే లేదు. మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకద్ర ఎమ్మెల్యేలు డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కొందరి పేర్లను అధిష్టానానికి పంపినట్టు సమాచారం. ఇప్పటి వరకూ నియామకాలు.. ఎంతకీ తెమలక పోవడంతో ఆ పోస్టులపై ఆశలు పెట్టుకున్న ఆశావహులు తీవ్ర నిరాశా నిస్పృహల్లో ఉన్నారట.
ఎంతకీ తెమలక పోవడంతో తీవ్ర నిరాశలో ఆశావహులు
పూర్తి స్థాయిలో భర్తీ అయ్యే అవకాశాలున్నాయనీ.. అధికార పార్టీ ముఖ్య నేతలు తెగ చర్చించు కుంటున్నారట. రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ పదవులు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు దక్కక పోయినప్పటికీ డైరెక్టర్ పదవులు పెద్ద ఎత్తున లభించే అవకాశాలున్నాయని.. వీరు ఎదురు చూస్తున్నారట. ఏది ఏమైనా.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ నియామకాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.
Also Read: ఈటల ఆశ నిరాశే..? బండికే ఢిల్లీ పెద్దలు జై
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు త్వరలో నియామకాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ జిల్లాల డీసీసీ చైర్మన్లుగా ఉన్న డాక్టర్ వంశీకృష్ణ, మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యేలుగా గెలిచానా.. వారింకా ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. వనపర్తి, నారాయణపేట జిల్లాలకు మాత్రమే ఏడాది క్రితం డీసీసీ అధ్యక్షులను నియమించారు. జోగులాంబ గద్వాల జిల్లాకు ఇప్పటి వరకూ డీసీసీ అధ్యక్షుడ్ని కేటాయించలేదు. ఈ జిల్లాలతో పాటు మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకాలు కూడా త్వరలో జరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఖాళీగా ఉన్న పదవులు ఎవర్ని వరించబోతున్నాయో తేలాల్సి ఉంది.