E-Paper
Advertisement

Yashaswini Reddy: యశస్విని రెడ్డి కథ రివర్స్..

Yashaswini Reddy: యశస్విని రెడ్డి కథ రివర్స్..

Yashaswini Reddy: పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు హస్తం పార్టీ గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ పెరిగింది. కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ సీనియర్లకు ఈ ఎన్నికలు వార్నింగ్ ఇచ్చాయి. మేం చెప్పిందే శాసనం అన్నట్లు వ్యవహరిస్తున్న వారికి పల్లె ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలలో అందరి దృష్టినీ ఆకర్షించిన పాలకుర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ బలపర్చిన అభ్యర్థుల కంటే ప్రతిపక్ష, రెబెల్ అభ్యర్థులకే మెజారిటీ ఓట్లు రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం మొత్తం హస్తం పార్టీ జోరు కొనసాగితే… పాలకుర్తిలో సీన్ రివర్స్ ఎందుకైందనే చర్చ జోరుగా సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన గ్రామాలు

పాలకుర్తి నియోజకవర్గంలోని 6 మండలాలలో 188 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మూడు విడతల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి దశలో రాయపర్తి మండలంలోని 40 గ్రామ పంచాయతీలకు, రెండవ దశలో తొర్రూరు, పెద్దవంగర మండలాల్లోని 57 గ్రామపంచాయతీలకు, మూడో విడతలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పల మండలాల్లోని 91 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. కీలకమైన పెద్ద మండలాలు తొర్రూరు, పాలకుర్తి, దేవరుప్పుల, రాయపర్తి మండలాలలో ఫలితాలు మాత్రం అధికార పార్టీకి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. 35 మేజర్ గ్రామ పంచాయతీలలో అధికార పార్టీ ఓట్లను, ప్రతిపక్ష పార్టీలు, రెబల్ అభ్యర్థులు క్రాస్ చేశారు.

7 చోట్ల రెబల్స్‌గా గెలిచిన ఝాన్సీ వ్యతిరేకులు

పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి సొంత మండలం తొర్రూరులో 15 సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. తొమ్మిది పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఏడు సర్పంచ్ స్థానాలను కాంగ్రెస్ రెబెల్స్ సొంతం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన 15 సర్పంచ్ స్థానాల్లో 15,228 ఓట్లు దక్కించుకోగా, బీఆర్ఎస్ గెలిచిన 9 సర్పంచ్ స్థానాల్లో 15,111 ఓట్లును సాధించింది. ఏడు చోట్ల గెలిచిన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులకు 5173 ఓట్లు పడ్డాయి. మొత్తంగా తొర్రూరు మండలంలో 15 సర్పంచ్ స్థానాల గెలిచిన కాంగ్రెస్ కు, 9 సర్పంచ్ స్థానాలు గెలిచిన బిఆర్ఎస్ కు 117 ఓట్లు మాత్రమే డిఫరెన్స్.

తొర్రూరు మండలంలో కాంగ్రెస్‌తో సమానంగా బీఆర్ఎస్‌

కాంగ్రెస్ పార్టీతో సమానంగా బీఆర్ఎస్ తొర్రూరు మండలంలో ఓట్లను సాధించింది. అధికార ప్రతిపక్ష పార్టీల బలాలు పక్కన పెడితే, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గం నా అడ్డా అని చెప్పుకునే ఝాన్సీ రెడ్డిని వ్యతిరేకిస్తున్న రెబల్ అభ్యర్థులు 7 చోట్ల గెలుపొందగా.. ఆ ఏడుగురు సాధించిన ఓట్లు 5173. అంటే 58 శాతం ఓటర్లు ఝాన్సీరెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన పంచాయతీలన్నీ 300 నుండి 1500 లోపు ఓటర్లు ఉన్న మైనర్ పంచాయతీలు మాత్రమే. మండలంలో 9 మేజర్ పంచాయతీలు ఉండగా అమ్మాపురం, మాటేడు, హరిపిరాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా…మడిపల్లి, చెర్లపాలెం, గుర్తూరు, సోమారంలలో కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు గెలుపొందారు. కేవలం ఒకే ఒక్క మేజర్ పంచాయతీ నాంచారి మడూరులో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. అంటే కీలకమైన 9 పెద్ద పంచాయతీల్లో ఝాన్సీరెడ్డి గెలిపించుకోగలిగింది ఒకే ఒక్క స్థానం అన్నమాట.

35 మేజర్ గ్రామ పంచాయతీలలో ఝాన్సిరెడ్డికి షాక్

పాలకుర్తిలోని మరో కీలకమైన మండలం దేవరుప్పుల. దేవరుప్పుల మండలంలో 32 గ్రామపంచాయతీలు ఉండగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 14 మంది, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 17 మంది, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఒకరు గెలుపొందారు. కాంగ్రెస్ తరపున గెలిచిన సర్పంచ్ లకు 12,310 ఓట్లు రాగా, బీఆర్ఎస్ తరఫున గెలిచిన సర్పంచులకు 12,141 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా మండల కేంద్రమైన దేవరుప్పులలో పోటీచేసిన పెద్ది కృష్ణమూర్తి గౌడ్ కు 1895 ఓట్లు పోలయ్యాయి. ఇతర అభ్యర్థుల కంటే, ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థులకు 1726 ఓట్లు తక్కువగా రావడం చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్యే తీరుపై 53.27 శాతం ఓటర్లలో వ్యతిరేకత

ఈ ఓట్లను బట్టి చూస్తే దేవరుప్పుల మండలంలో స్థానిక ఎమ్మెల్యే తీరుపై 53.27శాతం ఓటర్లు వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టమైంది. దేవరుప్పుల మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలైన కోలుకొండ, పెద్దమడూరు, పెద్ద తండా, కడవెండి, చిన్నమడూర్ సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మండల కేంద్రమైన దేవరుప్పుల మేజర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ఘన విజయం సాధించారు. మేజర్ గ్రామపంచాయతీలలో ఒకే ఒక్క చోట మాదాపురంలో ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. ప్రధాన పంచాయతీలన్నీ ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగానే ఓటు వేశాయని ఈ రిజల్ట్ చూస్తుంటే ఎవరికైనా అర్థమైపోతుంది.

పాలకుర్తిలో కాంగ్రెస్ ఆధిక్యం…

నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తి మండలంలో 38 గ్రామపంచాయతీలు ఉండగా 19 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. 17 చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, రెండు చోట్ల కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు గెలుపొందారు. 19 మంది కాంగ్రెస్ తరపున గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు 21,948 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ తరపున గెలిచిన 17మంది సర్పంచ్ అభ్యర్థులకు 20,002 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు పోలైన ఓట్లలో వ్యత్యాసం 1946 ఓట్లు మాత్రమే. ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా పడిన ఓట్లు, ఆమె బలపర్చిన అభ్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ.

పాలకుర్తిలో బీఆర్ఎస్ ఘన విజయం

పాలకుర్తి మండలంలోని 7 మేజర్ పంచాయతీలలో, నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తిలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. మేజర్ పంచాయతీలైన ముత్తారం, దర్దేపల్లి, తొర్రూరు సర్పంచ్ స్థానాలలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. గూడూరు, చెన్నూరు, బొమ్మెర మేజర్ గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం ఓట్లలో 54 శాతం ఓట్లు ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా పోలయ్యాయి.

మేజర్ గ్రామపంచాయతీలన్నీ బీఆర్ఎస్ కైవసం

నియోజకవర్గంలోని రాయపర్తి, పెద్దవంగర, కొడకండ్ల మండలాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు చెప్పుకోదగ్గ ఓట్లు పోలయ్యాయి. పెద్ద వంగర మండలంలో 26 గ్రామపంచాయతీలు ఉండగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 18 మంది గెలుపొందారు. 8 చోట్ల మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు 11,255 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులకు 8,596 ఓట్లు పోలయ్యాయి. పెద్ద వంగర మండలంలోని మేజర్ గ్రామపంచాయతీలన్నీ ప్రతిపక్ష బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.

ఝాన్సీ రెడ్డికి షాక్

మండల కేంద్రమైన పెద్ద వంగర పంచాయతీ స్థానంలో మాత్రమే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారు. రాయపర్తి మండలంలోని 40 సర్పంచ్ స్థానాలలో 25 స్థానాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, పది చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, రెండు చోట్ల కాంగ్రెస్ రెబెల్స్, మూడు చోట్ల స్వతంత్రులు గెలుపొందారు. రాయపర్తి మండల కేంద్రమైన పంచాయతీ స్థానాన్ని సైతం రెబల్ అభ్యర్థి గెలుపొందడం.. ఝాన్సీ రెడ్డికి షాక్ ఇచ్చిందనే చెప్పాలి. కొడకండ్ల మండలంలోని 21 పంచాయతీలలో 16 స్థానాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, నాలుగు చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, ఒకచోట ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. నియోజకవర్గ వ్యాప్తంగా చూసుకుంటే ఝాన్సీ రెడ్డి బలపరిచిన అభ్యర్థులతో సమానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థులు ఓట్లు సాధించారు.

ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజలు

అసెంబ్లీ ఎన్నికల్లో ఝాన్సీ రెడ్డిని నమ్మి ఓట్లు వేసిన ప్రజలు ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా నిలబడ్డట్లు ఓటింగ్ సరళి తెలుపుతోంది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు బలంగా ఉన్న నేతలంతా రెబెల్ వర్గంగా మారి, ఝాన్సీ రెడ్డికి పంచాయతీ ఎన్నికల్లో భారీ షాక్ ఇచ్చారు. కీలకమైన మేజర్ గ్రామపంచాయతీలన్నిట్లో ఓవైపు బీఆర్ఎస్, మరోవైపు ఝాన్సీ రెడ్డి వ్యతిరేకవర్గం బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. నియోజకవర్గంలోని ఆరు మండలాలలో తొర్రూరు, దేవరుప్పుల, పాలకుర్తి మండలాలలో… అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యర్థిపై సాధించిన మెజారిటీ ఓట్లను సైతం రాబట్టుకోలేకపోయారు. దీన్ని బట్టి చూస్తే రెండేళ్లలోనే పాలకుర్తిలో సీన్ తారుమారైనట్లు కనిపిస్తోంది.

అవసరం లేదనే నిర్ణయం.. ఓట్ల రూపంలో

అసెంబ్లీ ఎన్నికల్లో ఝాన్సీరెడ్డి, యశస్వినిరెడ్డిలు ప్రజాసేవ మాత్రమే చేస్తారని భావించి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావుని కాదని ఆ అత్తాకోడళ్లను నెత్తిన పెట్టుకున్న పాలకుర్తి నియోజకవర్గం ప్రజలు, ఇప్పుడు తమకు అవసరం లేదనే నిర్ణయాన్ని పల్లెపోరులో ఓట్ల రూపంలో తెలియజేశారా అనే చర్చ జరుగుతోంది. ఏడాది క్రితం వరకు, పాలకుర్తి నియోజకవర్గం వదిలేసి, తన సొంత నియోజకవర్గం వర్ధన్నపేటకు మకాం మార్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి సైతం తిరిగి పాలకుర్తిలో తన పట్టు నిలుపుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారనినియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మినహాయిస్తే… అసెంబ్లీ ఎన్నికలకు ముందు పాలకుర్తి ప్రజలకు ఝాన్సీ రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క వ్యక్తిగత హామీ నెరవేర్చలేదు.

ఉపాధి నుంచి అభివృద్ధి వరకు హామీల అమలు శూన్యం.

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలంటూ ఊరించి… స్కిల్ సెంటర్ హామీని అటకెక్కించారు. నియోజకవర్గ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాల ఊసే లేదు. చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కల్పన పత్తా లేకుండా పోయింది. ప్రతి ఒక్కరికి తన స్వంత ఖర్చులతో స్వంత ఇల్లు అన్న హామీకి…. ఇందిరమ్మ ఇండ్ల పథకం మాత్రమే దిక్కైంది. గ్రామాల అభివృద్ధి, తండాలలో మద్యం మత్తు పదార్థాల నిర్మూలన హామీలన్నీ నీటి మూటల్లాగే మిగిలాయనే అసంతృప్తి నియోజకవర్గ ఓటర్లలో కనిపిస్తోంది. ప్రజలకిచ్చిన హామీలు పక్కన పెడితే, తన కోసం పని చేసిన కాంగ్రెస్ సీనియర్లు అందరినీ పక్కనపెట్టడం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను చేరదీయడం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడడం లేదు.

కాంగ్రెస్ శ్రేణులను ఇబ్బందులు పెడుతున్న ఝాన్సీరెడ్డి

మూడు దశాబ్దాల తర్వాత తమ కష్టంతో పాలకుర్తి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తే, అధికార గర్వంతో అవినీతిపరులను పక్కన పెట్టుకొని అసలు సిసలైన కాంగ్రెస్ శ్రేణులను ఝాన్సిరెడ్డి ఇబ్బందులు పెడుతున్నారంటూ రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. ఇవన్నీ స్థానిక సంస్థల ఎన్నికలలో ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేసేలా చేశాయని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు పాలకుర్తిలో మండలానికి రెండు మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ సర్పంచ్ లు గెలుపొందేవారు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా బీఆర్‌ఎస్ భారీగా పంచాయతీలు దక్కించుకోవడం నాయకత్వ వైఫల్యమే అన్న చర్చ జరుగుతోంది. పార్టీ అధిష్టానం ఇంకా చూసీచూడనట్లు వ్యవహరిస్తే, MPTC, ZPTC ఎన్నికల్లో కాంగ్రెస్ మరింత పతనం కావడం ఖాయమన్న డిస్కషన్ పాలకుర్తిలో ఇప్పటికే జోరుగా సాగుతోంది.

Story by Ramireddy, Big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×