Big Stories

Parents: తల్లిదండ్రులారా మేల్కొండి.. ప్లీజ్..!

wake up parents: మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి తల్లిదండ్రులూ మారాలనీ, ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నేటి సైకాలజిస్టులు మొత్తుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారి దృష్టికి వస్తున్న కొన్ని కేసుల ఆధారంగా వారు తల్లిదండ్రుల కోసం చేస్తున్న సూచనల వివరాలు.. మీకోసం..

- Advertisement -

వేగంగా మారుతున్న సామాజిక, సాంస్కృతిక మార్పులకు నేటి తరం పిల్లలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఏది మంచి, ఏది చెడు అనేది తెలుసుకోలేకపోతున్నారు. వారి వేషధారణలో, ప్రవర్తనలోచాలా వేగంగా మార్పులు వస్తున్నాయి. ముఖ్యంగా రోజులో 8 గంటలు విద్యార్థులు గడిపే స్కూల్లోనే పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. తప్పు చేస్తే పిల్లలను మందలించే స్వేచ్ఛ కూడా టీచర్లకు ఉండటం లేదు.

- Advertisement -

క్రమశిక్షణ అనేది ఒట్టి మాటలు, ఉపదేశాలతో రాదు. కొద్దిపాటి భయభక్తులు ఉంటేనే వస్తుంది. నేటి తరం బడి పిల్లలకి స్కూలులో గానీ ఇంటిలో గానీ భయం లేకుండా పోయింది. స్కూలులో కొందరు స్టూడెంట్స్ వద్ద పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు, తెచ్చుకోరు. కనీస బాధ్యత, క్రమశిక్షణ లేని వీరిని మందలించినా.. పెద్దల నుంచి టీచర్లకు ఫోన్లు రావటంతో వారూ పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. టీచర్లంటే భయంగానీ, గౌరవం గానీ లేకపోవటం, దీనికి తోడు ‘మా పిల్లవాడిని కొట్టొద్దు.. తిట్టొద్దు’ అని తల్లిదండ్రులే టీచర్లను బెదిరించటం వల్ల వారు స్కూలు, ఇంటి బయట కూడా నియంత్రణలేకుండా ప్రవర్తిస్తున్నారు. చివరకు స్కూలుకు ఎందుకు రాలేదని గట్టిగా అడిగేందుకు గానీ, హోం వర్క్ ఎందుకు చేయలేదని గానీ గట్టిగా అడిగే పరిస్థితి లేదు.

Read More: సీమ ముద్దుబిడ్డ.. ఉయ్యాలవాడ..!

ఏడో తరగతి నుండే నచ్చిన హెయిర్ స్టైల్, చిరిగిన జీన్స్ వేసుకుని సినిమాలో హీరోలు చేసే పనులన్నీ చేయటం, ఇదే జీవితం అనే భ్రమలో బతకటం, క్రమంగా సంఘ వ్యతిరేకశక్తుల చేతిలో పడి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి, చివరికి పోలీసు స్టేషన్లలో కేసులు, కోర్టుల్లో శిక్షల పాలు కావటం నానాటికీ పెరిగిపోతూ ఉంది. నేటి తరం పిల్లలకు చిన్న చిన్న ఇంటిపనులు చెప్పేందుకు కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఉంది. నేటి పిల్లలలో మెజారిటీ పిల్లలు కనీసం తమ స్కూలు బ్యాగ్, లంచ్ బ్యాగ్ సర్దుకోవటానికి కూడా చిరాకు పడుతున్నారు. రాత్రి పొద్దుపోయేదాకా ఫోన్లతో కాలక్షేపం, ఉదయం ఓ గంట ముందు లేచి హడావుడిగా రెడీ కావటం, గట్టిగా నిలదీస్తే ఎదురు తిరగటం, ఇంకాస్త ఒత్తిడి చేస్తే.. చేతిలోని వస్తువులను విసిరి కొట్టటం పరిపాటిగా మారుతోంది.

ఇక.. డబ్బు పొదుపు గురించి అవగాహనే లేదు. పది పూర్తి కాగానే బైకు కావాలని, ఎవరో కొన్న యాపిల్ ఫోన్ తనకూ కొనివ్వమని డిమాండ్ చేయటం కనిపిస్తోంది. ఇంత జరుగుతున్నా.. తల్లిదండ్రులు సైతం తమ కుటుంబ బాధ్యతలు, ఆదాయ పరిమితుల గురించి పిల్లలతో చర్చించటానికి ముందుకు రావటం లేదు. మైనర్లకు బైకులు కొనివ్వటం, వారు యాక్సిడెంట్లు చేసి కేసులు కావటం, తోటి పిల్లలతో గ్యాంగులుగా తయారై తిరగి చదువును నిర్లక్ష్యం చేయటం సాధారణమై పోయాయి.

కాలేజీ పిల్లలయితే సరిగ్గా ఒక పిడికిలి పట్టేంత టిఫిన్, లంచ్ చిన్న బాక్సు రైస్.. చాలామంది ఫ్రూట్స్ అసలు తినరు. పెరుగు మజ్జిగ తినటం మానేస్తున్నారు. ఇలాంటి ఆహారం, లైఫ్ స్టయిల్ వల్లనే మూడవ తరగతి పిల్లాడికి సోడాబుడ్డి లాంటి కళ్ళద్దాలు, అయిదో తరగతి పిల్లవాడికి అల్సర్, బీపీలు. ఇలా పదిలోపు ఎంతో ఆరోగ్యంగా ఎదగాల్సిన పిల్లలు అనారోగ్యం పాలైపోతున్నారు.

సంస్కృతి సాంప్రదాయం పేరుతో పిల్లలకు ప్రార్థనా మందిరాలకు తీసుకుపోతున్నారే తప్ప సామాజిక,కుటుంబ బాధ్యతల గురించి తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడటం తగ్గిపోతోంది. ముఖ్యంగా బాధ్యత, మర్యాద, గౌరవం, కష్టం, నష్టం, ఓర్పు, సహనం, దాతృత్వం, ప్రేమ, అనురాగం, సహాయం, సహకారం, నాయకత్వం, మానసిక స్థైర్యం, కుటుంబ బంధాలు, వంటి వాటి గురించి పిల్లలతో చర్చించాల్సిన అవసరం ఉంది.

Read More: ప్రపంచంలో దుమ్మురేపుతున్న ఇండియన్ టూ వీలర్స్.. ఆఫ్రికాలో 160 చైనా కంపెనీలు పరార్!

మీడియా, సినిమాలు, స్నేహాల కారణంగా పదో తరగతి నాటికే ప్రేమ, దోమ అనటం, బెట్టింగ్స్, బైక్ రేస్‌లు, మందు, సిగరెట్, డ్రగ్స్ వంటి వాటి ప్రభావాలలో పడిపోవటం పట్టణాలు, సిటీల్లో వేగంగా పెరుగుతోంది. కొందరు వీటికోసం డబ్బు లేక.. దొంగతనాలకూ పాల్పడుతున్నారు. పిల్లలను తల్లిదండ్రులు క్షమించి వదిలేస్తారు గానీ.. ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే చట్టాలు, న్యాయస్థానాలు క్షమించి వదిలేయవు. దీనివల్ల వారి జీవితమే నాశనమై పోతోంది.

ఈ మొత్తం వ్యవహారంలో పిల్లల కంటే తల్లిదండ్రులే దోషులని అటు సైకాలజీ నిపుణులూ నిర్ధారిస్తున్నారు. ఏది మంచి, ఏది చెడో తెలియని విద్యార్థులను సరైన దారిలో నడపాల్సిన బాధ్యత ముమ్మాటికీ తల్లిదండ్రులదేనని వారి అభిప్రాయం. కనుక పిల్లలతో రోజూ కాసేపు సమయం గడిపేందుకు తల్లిదండ్రులు కేటాయించుకుని, వారికి కుటుంబ, సామాజిక బాధ్యతలు అర్థమయ్యేలా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News