Paritala- Viveka Murder Mystery: కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ మొదటి సారి బాధ్యతలు చేపట్టినప్పుడు టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు. జగన్ అధికారపగ్గాలు చేపట్టడానికి ముందు ఆయన బాబాయ్ వైఎస్ వివేకా హతమయ్యారు. పరిటాల రవి హత్య కేసు విచారణలో ఉండగానే నిందితులు, సాక్షుల మరణాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడదే సీన్ వివేకా హత్య కేసులోనూ రిపీట్ అవుతుండటం కలకలం రేపుతోంది. ఆ క్రమంలో ఈ మరణాల వెనుక వివేకా హత్య కేసు నిందితుల కుట్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
2005 జనవరి 24న హత్యకు గురైన పరిటాల రవీంద్ర
తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర పెనుగొండ ఎమ్మెల్యేగా ఉంటూ 2005 జనవరి 24న హత్యకు గురయ్యారు. అప్పట్లో ఆ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఆ హత్య కేసులో నిందితుడైన జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శీను 2008లో అనంతపురం జిల్లా జైలులో హత్యకు గురయ్యాడు. మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి 2012లో హైదరాబాద్ జైల్లో హతమయ్యాడు. ఆ కేసుతో ప్రమేయమున్న తగరకుంట కొండారెడ్డిని కూడా హతమార్చారు. మొద్దు శీనుని చంపిన ఓం ప్రకాష్ జైల్లోనే మరణించాడు. ఇక పరిటాల కేసులో ప్రధాన నిందితుడు మద్దెలచెరువు సూరిని అతని అనుచరుడు భాను కిరణ్ 2011 జనవరి 4న హైదరాబాద్‌లో హత్య చేశాడు.
2019 ఎన్నికల ముందు హత్యకు గురైన వైఎస్ వివేకా
2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. పరిటాల రవి హత్య కేసు తరహాలోనే మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక సాక్షులు, అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు. వైసీపీ పాలనా కాలంలో 2019-24 మధ్య నలుగురు మృతి చెందారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు. ఈ ఆరుగురివీ సహజ మరణాలేనని, అనారోగ్య కారణాలతో చనిపోయారని పైకి చెబుతున్నప్పటికీ లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి. అందరూ ఒకే తరహాలో చనిపోవటం అనేక సందేహాలకు తావిస్తోంది.
ప్రధాన సాక్షులు మరణిస్తుంటడటంపై అనుమానాలు
కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న వేళ ప్రధాన సాక్షులు, కేసుతో సంబంధమున్న వ్యక్తులు మరణిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యక్ష సాక్షి వాచ్‌మన్ రంగన్న తాజాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం, తన తండ్రికి అందించిన చికిత్సపై అనుమానాలున్నాయంటూ రంగన్న కుమారుడు కాంతారావు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మరణాల వెనుక వివేకా హత్య కేసు నిందితుల ప్రమేయం, కుట్ర ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మరణాలన్నింటిపై సమగ్ర దర్యాప్తునకు సిద్ధమవుతోంది.
2019లో మరణించిన జగన్ డ్రైవర్ నారాయణయాదవ్
వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి భారతిలను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ 2019 డిసెంబరులో మృతి చెందారు. అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ విచారణ వేగవంతమవుతున్న తరుణంలో ఆయన మరణించటం సందేహాస్పదంగా మారింది.
జగన్, అవినాష్‌ల సంభాషణలు నారాయణ విన్నారని ఫిర్యాదులు
ప్రయాణంలో జగన్, భారతి, అవినాష్‌రెడ్డి, ఇతరుల మధ్య వివేకా మరణానికి సంబంధించి ఫోన్ సంభాషణలు జరిగాయని, అవన్నీ నారాయణ యాదవ్ విన్నారన్న ఫిర్యాదులున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన్ను కీలక సాక్షిగా విచారించాలి. విచారణకు పిలవకముందే ఆయన చనిపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. నారాయణ యాదవ్ మృతిపై పోలీసులు అసలు కేసే నమోదు చేయలేదు. అతని అంత్యక్రియలకు జగన్, భారతి హాజరయ్యారు.
వివేకా నివాసం వద్ద కాపలా ఉన్న వాచ్ మెన్ బి.రంగన్న
వివేకా నివాసం వద్ద కాపలా ఉన్న వాచ్‌మన్ బి.రంగన్న ఆయన హత్యలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా చూశారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్ దస్తగిరి, సునీల్ యాదవ్, ఉమాశంకరరెడ్డి ఈ హత్య చేసినట్లు ఆయన సీబీఐకి, మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలమిచ్చారు. ఆ తర్వాతే శివశంకరరెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది. వివేకా హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్ర గంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చారు.
ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రంగన్న
వివేకా హత్య కేసులో అత్యంత కీలక సాక్షి అయిన రంగన్న ఈ నెల 5న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ తొలుత పులివెందుల ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి కడప రిమ్స్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ చనిపోయారు. అయితే రిమ్స్‌లో జరిగిన చికిత్సపై తమకు అనుమానాలున్నాయని రంగన్న భార్య, కుమారుడు కాంతారావు ఆరోపించారు. పోలీసులు కూడా ఇది అనుమానాస్పద మృతేనని తేల్చి దర్యాప్తు చేస్తున్నారు.
2022 జూన్‌లో మృతి చెందిన ప్రదాన సాక్షి కల్లూరు గంగాధర్ రెడ్డి
వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి 2022 జూన్‌లో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అయితే ఆ మరణమూ అనేక సందేహాలకు తావిచ్చింది. వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ బృందాలు పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి ఇళ్లు, ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి పరిసరాల్లో కొలతలు, గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాయి. అది జరిగిన వెంటనే.. ఈ కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు.
కేసులో అనుమానితుడైన కటికరెడ్డి శ్రీనివాసుల రెడ్డి 2019 మృతి
ఇదే కేసులో అనుమానితుడైన కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి 2019 సెప్టెంబరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. విషపుగుళికలు సేవించి, ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరిగింది. శ్రీనివాసులరెడ్డి వివేకా హత్య కేసులో అనుమానితుడు. ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి, అతని బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి.
అది హత్యేనని 2021 ఆగష్టుసలో సీబీఐకి అభిషేక్ రెడ్డి వాంగ్మూలం
వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో డా.వైఎస్ అభిషేక్‌రెడ్డి ఒకరు. వివేకా చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకరరెడ్డి నుంచి తనకు ఫోన్‌కాల్ వచ్చిందని, ఘటనాస్థలానికి వెళ్లి చూడగా.. మృతదేహం చుట్టూ రక్తపు మడుగు, ఆయన నుదుటిపై గాయాలున్నట్లు గుర్తించి, ఇది హత్యేనని భావించానంటూ 2021 ఆగస్టులో అభిషేక్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలమిచ్చారు. అవినాష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకరరెడ్డి, ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డే వివేకా గుండెపోటుతో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో ప్రస్తావించారు. స్వతహాగా వైద్యుడు, యువకుడైన అభిషేక్‌రెడ్డి ఈ వాంగ్మూలం వెలుగుచూసిన కొన్నాళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు.
2020 అక్టోబరులో అనారోగ్యంతో చనిపోయిన ఈసీ గంగిరెడ్డి
వైఎస్ భారతి తండ్రి, జగన్ మామ అయిన ఈసీ గంగిరెడ్డి 2020 అక్టోబరులో అనారోగ్యంతో చనిపోయారు. వివేకా హత్య కుట్ర గురించి ఆయనకు తెలుసనే ఫిర్యాదులున్నాయి. వివేకా హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి, బ్యాండేజీలు చుట్టారు. వివేకా హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులున్నాయి.
పరిటాల హత్యకేసులో జగన్‌ని విచారించి వదిలేసిన సీబీఐ
పరిటాల రవి హత్య కేసులో జగన్‌ని సీబిఐ అప్పట్లో విచారించి వదిలేసింది ..అప్పట్లో తండ్రి వైఎస్ సిఎం గా ఉండటంతో పాటు కేంద్రలో కాంగ్రెస్స్ ప్రభుత్వం ఉండటంతో సీబిఐ అధికారులు జగన్ ఇంటికే వెళ్ళి విచారించి వదిలేసారు. ఇప్పుడు పరిటాల హత్య కేసు నిందితుల తరహాలోనే వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు, సాక్షులు కూడా చనిపోతుండం కలకలం రేపుతోంది. ఈ మరణాలపై తాజాగా ఏపీ క్యాబినెట్‌లో కూడా చర్చకు వచ్చిందంట. వాటిపై సమగ్ర విచారణకు రంగం సిద్దమవుతోందంట మరి ఈ మరణాలు యాధృచ్చికమో? కుట్ర పూరితమో తేలాల్సి ఉంది.