Political Heat In Raptadu: ఒక్క మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడి ఎన్నిక అక్కడ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది .. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి ఎంపీపీ అధ్యక్షుడి విషయంలో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి … ఆసలు మండలాధ్యక్షుడి ఎన్నికపై టీడీపీ, వైసీపీలు ఎందుకంత పంతానికి పోతున్నాయి? పరిటాల, తోపుదుర్తి కుటుంబాలకు మండలాధ్యక్ష పదవి అంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తయారైంది?
రాప్తాడులో పరిటాల వర్సెస్ తోపుదుర్తి ఆధిపత్యపోరు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాప్తాడు నియోజకర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అక్కడ ఎప్పుడూ రాజకీయాలు ఎంతో ఆసక్తిని రేపుతూ ఉంటాయి. ఎందుకంటే అన్ని చోట్ల వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయం సాగితే రాప్తాడులో మాత్రం దశాబ్దాలుగా పరిటాల వర్సెస్ తోపుదుర్తి వర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తుంటుంది. టీడీపీ నుండి పరిటాల సునీత ఓటమి ఎరుగని నేతగా కొనసాగుతున్నారు…2009 , 2014 , 2024 ఎన్నికల్లో పరిటాల సునీత 3 సార్లు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై గెలుపొందారు.
పరిటాల కుటుంబం గెలిస్తే మీసం తీసేస్తానని ప్రకాష్‌రెడ్డి సవాల్
2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గెలవడంతో రాప్తాడులో తోపుదుర్తి బ్రదర్స్ ఒక రేంజ్లో చక్రం తిప్పారు. జగన్ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లు వాళ్ళు ఎలా చెప్తే అలా జరిగింది రాప్తాడులో. కానీ 2024 ఎన్నికల్లో ప్రకాష్ రెడ్డి ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్నారు. రాష్ట్రం అంతా వైసిపి ఓడిపోయినప్పటికీ రాపాడు లో ఓటమిని ప్రత్యేకంగా చూస్తున్నారు జనాలు. ఎందుకంటే అంతకుముందు ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రాప్తాడులో పరిటాల కుటుంబం గెలిస్తే మీసం తీసేస్తా అని ప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. అయితే ఓటమి తర్వాత ఆయన మీసం దాచుకుని, మాట మార్చడంతో జనాలు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఆడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులు పాటు రాప్తాడు పాలిటిక్స్ సైలెంట్ అయినప్పటికీ … రామగిరి మండలాధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా తలెత్తిన వివాదం కాస్తా అనేక మలుపులు తిరుగుతూ ఇప్పటికీ టెన్షన్ వాతావరణం కొనసాగుతూనే ఉంది
మార్చి 27 , 28న ఎన్నిక నిర్వహించడానికి నోటిఫికేషన్
రామగిరి ఎంపీపీ మరణించడంతో ఎంపీపీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది. దీంతో గత మార్చి 27 , 28న ఎన్నిక నిర్వహించుకోవడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ సందర్భంగా ఎంపీటీసీలకు విప్ జారీ చేసేందుకు కొంతమంది వైసీపీ నాయకులు రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ రోజు టీడీపీ నాయకులు రెచ్చగొట్టి తమపై దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. వైసీపీ శ్రేణులు తమ వాహనాల్లో మారణాయుధాలు పెట్టుకుని వచ్చారంటూ వారిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇక ఆ రోజు నుంచి రామగిరి మండలాధ్యక్షుడి ఎన్నిక విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ఎంపీటీసీలను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ ఆరోపణ
రామగిరి మండల ఎంపీటీసీలను వైసీపీ నాయకులు కిడ్నాప్ చేశారంటూ టీడీపీ ఆరోపించగా.. వారిని క్యాంపుకు తరలించామంటూ వైసీపీ వీడియోలు రిలీజ్ చేసింది. వారిని కర్ణాటక రాష్ట్రం బాగేపల్లి లో ఒక ఫామ్ హౌస్ లో ఉంచి సరిగ్గా ఎంపీపీ ఎన్నిక రోజు రామగిరి మండల కార్యాలయానికి తీసుకురావాలని వైసీపీ ప్లాన్ చేసింది. అయితే వైసీపీ ఎంపీటీసీలు టైం దాటిపోయాక రావడంతో వారిని వెనక్కు పంపించారు పోలీసులు. ఆ క్రమంలో ఆ ఎంపీటీసీలను వెంటబెట్టుకొని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి వెనక్కు తిరిగి వెళ్లే సమయంలో పెనుగొండ ఎమ్మార్వో కార్యాలయం కేంద్రంగా ఒక హైడ్రామా నడిచింది.
అజ్ఞాతంలోకి వెళ్లి.. తిరిగి జిల్లాలో అడుగుపెట్టిన ప్రకాష్ రెడ్డి
వైసీపీ ఎంపీటీసీల్లో ఒక మహిళా ఎంపీటీసీ టీడీపీ పంచన చేరడంతో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కోపోద్రిక్తుడై తమ మహిళా ఎంపీటీసీని కిడ్నాప్ చేశారంటూ పోలీసులపై విరుచుకుపడ్డాడు. ఇక అప్పటినుండి పోలీసులు వర్సెస్ ప్రకాష్‌రెడ్డిగా సీన్ మారిపోయింది. ప్రకాష్‌రెడ్డిపై వరుస కేసులు నమోదవడంతో కొన్ని రోజులు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లి.. హైకోర్టు కొన్ని సడలింపులు ఇవ్వడంతో తిరిగి అనంతపురం జిల్లాలో అడుగుపెట్టారు. మరోసారి రామగిరి మండలాధ్యక్షుడి ఎన్నిక త్వరలో ఉండే అవకాశం ఉండటంతో రాజకీయం తిరిగి వేడెక్కింది. ఈ టైంలో మరిన్ని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
Also Read: తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్ అతనేనా?
ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన ప్రకాష్‌రెడ్డి
రామగిరి మండలాధ్యక్ష పీఠాన్ని టీడీపీ, వైసీపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఆ స్థానం మహిళకు రిజర్వు కావడంతో మహిళా అభ్యర్థి కోసం రెండు పార్టీలు పాకులాడుతున్నాయి. ముగ్గురు వైసిపికి చెందిన ఎంపీటీసీలు టిడిపిలో చేరడంతో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. పేరూరు-1 ఎంపీటీసీ కరెన్న, పేరూరు-2 ఎంపీటీసీ భారతి , మాధాపురం ఎంపీటీసీ సంపత్, టీడీపీ కండువా కప్పుకున్నారు. కానీ ఏమైందో ఏమో ఒకరోజు గడవక ముందే పేరూరు-2 ఎంపీటీసీ భారతి వైసీపీ గూటికి చేరి ఒక వీడియో రిలీజ్ చేశారు. తనకు బలవంతంగా టీడీపీ కండువా కప్పారని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ లోనే ఉంటానని చెప్పి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రకాష్ రెడ్డి ఎన్నికలు బహిష్కరిస్తున్నామని ప్రకటించడం ఉత్కంఠ రేపుతోంది. ఇవాళో రేపూ మండలాధ్యక్ష ఎన్నిక జరగనుండటంతో రాప్తాడు పాలిటిక్స్‌లో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయో అన్నది ఆసక్తి రేపుతోంది.