BigTV English

Parliament : 17 రోజులపాటు పార్లమెంట్ సమావేశాలు.. తెరపైకి మహిళా రిజర్వేషన్‌ బిల్లు..

Parliament : 17 రోజులపాటు పార్లమెంట్ సమావేశాలు.. తెరపైకి మహిళా రిజర్వేషన్‌ బిల్లు..

Parliament : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటి నుంచి డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. మొత్తం 17 రోజులపాటు సమావేశాలు జరుగుతాయి. 16 కొత్త బిల్లులు ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 25 బిల్లులకు పార్లమెంట్ లో ఆమోదం పొందాలని మోదీ సర్కార్ భావిస్తోంది. అయితే 3 ముఖ్యమైన బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పంపాలని కాంగ్రెస్ పట్టుబడుతోంది.


ఎంతోకాలంగా పెండింగ్ లో ఉన్న చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ఈసారైనా ఆమోదించాలని ఇప్పటికే పలుపార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. మంగళవారం జరిగిన అఖిలపక్ష భేటీలో ఈ అంశం చర్చకు వచ్చింది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీలో బీజేడీ నేత సస్మిత్‌ పాత్ర … మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించాలని కోరారు. టీఎంసీ, కాంగ్రెస్‌, ఎన్సీపీ, టీఆర్ఎస్ పార్టీల నేతలు మద్దతు పలికారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలోనూ టీఎంసీ నేత సుదీప్‌ బందోపాధ్యాయ, కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. డీఎంకే, జేడీ(యు), శిరోమణి అకాలీదళ్‌ నేతలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలికారు. ఈ బిల్లుపై ఏకాభిప్రాయానికి అఖిల పక్ష భేటీ నిర్వహించాలన్నారు. గతంలో ఈ బిల్లును వ్యతిరేకించిన జేడీ(యు) ఇప్పుడు తన వైఖరి మార్చుకుంది.

విపక్షాల వ్యూహమిదే..!
అధిక ధరలు, నిరుద్యోగం, దేశ సరిహద్దు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని విపక్షాలు యోచిస్తున్నాయి. ఇప్పటికే అభిలపక్ష భేటీలోనూ కేంద్రంపై విమర్శలు గుప్పించాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. 2 గంటలపాటు కొనసాగిన అఖిలపక్ష భేటీకి 30కిపైగా పార్టీల నేతలు వచ్చారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, కొలీజియం వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరి, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి అంశాలను పార్లమెంట్ లో చర్చించాలని ప్రతిపక్షాలు సూచించాయి. దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలపై విస్తృత చర్చ జరగాలని కాంగ్రెస్‌ కోరింది. ప్రతిపక్షాలు ప్రస్తావించే ఏ అంశంపైనైనా నిబంధనలకు లోబడి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. బీఏసీ భేటీల్లో అంగీకరించిన అంశాలపై ఉభయ సభల్లో చర్చ జరుగుతుందన్నారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని కాంగ్రెస్‌, టీఎంసీ, ఆప్‌, ఎన్సీపీ ప్రతినిధులు విమర్శించారు. ఆ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. మొత్తంమీద పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని చాలా అంశాల్లో గట్టి నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.


క్రిస్మస్‌ సమయంలో సమావేశాలా?
క్రిస్మస్ సమయంలో పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడంపై కాంగ్రెస్ నేత అధీర్‌ రంజన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికలే ప్రజాస్వామ్య పండుగలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. 2 రాష్ట్రాల ఎన్నికలు జరిగిన నేపథ్యంలో సమావేశాలను ఈ నెల 7 నుంచి 29 వరకు ఖరారు చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 24న శనివారం, 25న ఆదివారం కాబట్టి ఆ రెండు రోజుల్లో పార్లమెంట్ ఉండదని స్పష్టం చేశారు. అందరూ క్రిస్మస్‌ చేసుకోవచ్చన్నారు. కాంగ్రెస్‌ నేతలు 26న కూడా సెలవు కావాలని కోరితే బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×