Telangana BJP: ఇప్పుడు తెలంగాణ బీజేపీలో జరుగుతున్న ఇంటర్నల్ వార్ కాకులు, గద్దల యుద్ధంలా మారిందన్న టాక్ వినిపిస్తోంది… ఇంతకు ఆ పార్టీలో గద్దలు ఎవరు..? కాకులెవరు..? పార్టీలో కొత్తగా చేరిన వారిని గద్దల్లా పొడుచుకు తింటున్నదెవరు..? అసలు పార్టీని నడిపించేది గ్రూపులా..? సిద్ధాంతమా..? వ్యక్తుల అహంకారమా? ఇంతకూ కాషాయ వనంలోకి గద్దలు ఎలా వచ్చాయి..? కాకులు ఎలా దూరాయి..? అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా మారి పొలిటికల్ హీట్ ను పెంచుతోంది.
తెలంగాణ బీజేపీలో ఆ పార్టీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు సొంతవారే చిర్రెత్తిస్తున్నారంట.. అందుకే ఆయన పదే పదే అసహనాన్ని వెళ్లగక్కుతున్నారంట. ఆ క్రమంలో ఈటల రాజేందర్ వారికి వార్నింగులు ఇస్తూ .. పార్టీని వీడే దిశగా సంకేతాలు ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. బీజేపీలో కాకులు, గద్దలున్నాయంటూ, అవి రోజు కొత్త, పాత నేతల పేరుతో చిచ్చు పెడుతూ, కొత్త వారిని నిత్యం పొడుచుకుతింటున్నాయని, ఆ క్రూరత్వం చాలా ప్రమాదమని తాజాగా ఈటల రాజేందర్ డేంజర్ బెల్స్ మోగిచారు.
కాకులు, గద్దలంటూ మజీ మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ అంతర్గత పోరుకు అద్దం పడుతున్నాయన్న టాక్ మళ్ళీ మొదలైంది. తెలంగాణ బీజేపీలో నేతల మధ్య మళ్లీ అంతర్గత వార్ కలకలం రేపుతోంది. ఎవరెన్ని ట్రీట్మెంట్ లు చేసిన నేతల మధ్య జగడం చల్లారడం లేదన చర్చ జరుగుతుంది. ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలతో పార్టీలో సంఘ్ నేతల అనవసర పెత్తనాన్ని రాజకీయంగా బహిర్గతం చేస్తున్నాయన్న టాక్ నడుస్తోంది. ఈటల వ్యాఖ్యలు గ్రూపు రాజకీయాలపై వేసిన విమర్శలా..? లేక పార్టీలో గ్రూపు రాజకీయాలను పెంచి పోషిస్తున్న వారికి హెచ్చరికలా…? అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయట.. అసలు పదేపదే ఈటల పార్టీపై, పార్టీ నేతలపై సంధిస్తున్న విమర్శనాస్త్రాల వెనుక అసలు రాజకీయ సంకేతాలేంటి..? అన్న చర్చ ఆ పార్టీతో పాటు, పొలిటికల్ సర్కిల్లో జోరుగా జరుగుతోంది.
తెలంగాణ బీజేపీ ఎన్నో ఏళ్ల కల రాష్ట్రంలో అధికారంలోకి రావడం.. ఆ కలను సాకారం చేసుకోవడంలో విఫలం అవుతున్నా … అంతర్గత రాజకీయాలు, కుమ్ములాటలు మాత్రం అధికార పార్టీల స్థాయిలోనే నడుస్తున్నాయి. పార్టీలో కొత్త, పాత నేతల కుమ్ములాటల పంచాయతీలను ప్రోత్సహిస్తున్న నేతలను కాకులు గద్దలతో పోల్చుతూ బహిరంగంగా ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.
తనకు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అంటూనే, సొంత పార్టీ నేతలనే కాకులు, గద్దలు, పొడుచుకుతినే రాబందులు అన్నంత రేంజ్ లో ఈటల విమర్శలు గుప్పించారు. ఆ సోకాల్డ్ పక్షులు ఎవరవుతున్నారో తెలీదు కానీ, కమలం పార్టీ రాష్ట్రంలో సాధించినదాని కంటే, కుమ్ములాటలతో అపవాదులు ఎక్కువగా మూటగట్టుకుంటుందన్న టాక్ నడుస్తోంది.
రాష్ట్రంలో బీజేపీకి ఉన్న బలం తక్కువే. బీసీ ముఖ్యమంత్రి అన్నా, డబుల్ ఇంజన్ సర్కార్ అన్నా, అయోధ్య శ్రీ రాముడన్నా, ముస్లిం మైనారిటీ వర్గాలను విభేదించి, హిందుత్వాన్ని జాగృతం చేసినా తెలంగాణ రాష్ట్రంలో పట్టుమని పది సీట్లు గెలవలేని పరిస్థితుల్లో కాషాయపార్టీ ఉంది. అయినా గ్రూపులకు మాత్రం కొదవలేదు. గ్రూపులు బువ్వ పెట్టవు., గ్రూపు రాజకీయాలు ఎవరికీ లాభం చేయవని, అధికారంలోకి తీసుకురావనీ, అవి ఎండ్ ఆఫ్ ది డే ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉన్నా నేతల తీరు మాత్రం మారడం లేదు. రాష్ట్రంలో పార్టీ ఎదిగే అవకాశం ఉన్న సమయంలో వ్యక్తిగత ఎజెండాలు, పాత, కొత్త లెక్కలు, అహంకార రాజకీయాలు, బీజేపీకి శత్రువులకంటే ప్రమాదకరమంటున్నారు విశ్లేషకులు.
ఇంతకీ ఆ కాకులు ఎవరు..? ఆ గద్దలు ఎవరు..? పొడుచుకు తింటున్నదెవరు..? మొన్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మేకప్ మెన్ అన్నారు..? హైదరాబాద్ దాటని వ్యక్తులు అధ్యక్షుడిగా పనికి రారన్నారు..? పాత ఇనుప సామాన్లతో నేతలను పోల్చారు..? టేబుల్ తుడిచే వ్యక్తులకే పదవులు అన్నారు..? మంచి ప్యాకేజీలొస్తే అమ్ముడు పోయే దొంగలు అన్నారు ? దొంగలంతా కలిసి కుమ్మక్కు రాజకీయాలతో పార్టీని భ్రస్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు..? అంతే కాదు సప్సెండ్ చేస్తే చేసుకోండి, మీ జాతకాలన్నీ బయటపెట్టి వెళ్తానంటూ పుష్ప లెవల్లో వార్నింగ్ లు సైతం ఇచ్చారు. తాజాగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తె రాజాకీయ సన్యాసం తీసుకుంటాననీ సవాల్ విసిరారు. అంతేకాదు రాజీనామా చేసి, పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణం ఎవరో రాజాసింగ్ చెప్పేశారు. మీడియా సాక్షిగా రాష్ట్ర బీజేపీ డ్యామేజీ అవడానికి కారణం పాత సీనియర్ నేతలే కారణమని తేల్చిపడేశారు..
ఇక తాజాగా ఈటల రాజేందర్ కాకులు, గద్దలు అంటూ, కొత్తవారిని పొడుచుకుతింటున్నారంటూ నేతలపై తీవ్ర విమర్శలు చేయడంతో ఆ పార్టీ హిందుత్వ అంధకారానికి నిదర్శనంగా నిలుస్తుందన్న చర్చ నడుస్తోంది. అంతేకాదు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడికి హలో రామచంద్ర రావు అంటూ ఒకరు వార్నింగ్ లేస్తే, మరొకరు రబ్బర్ స్టాంప్ అంటూ హేళన చేశారు. ఇంకొకరు కాకులు గద్దలు అంటూ నేతలను ఏకి పారేస్తే రాష్ట్రంలో పార్టీ ఏ విధంగా బలపడుతుంది..? ఏ విధంగా అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుంది..? అన్న టాక్ ఒకవైపు నడుస్తోంది. మరోవైపు వీటన్నింటికి కారణం బండి సంజయ్ లాంటి పాత నేతలే ప్రధాన కారణం అవుతున్నారన్న టాక్ సైతం ఆ పార్టీలో వినిపిస్తోంది. బండి సంజయ్ లాంటి వారే రాష్ట్ర బీజేపీలో కాకుల్లా, గద్దల్లా తయారయ్యారని, కొత్త వచ్చిన వారిని అక్కున చేర్చుకునే గుణం ఆ గద్దలకు లేదని, నిత్యం పొడుచుకు తినడమే లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ఈటల చురకలు అంటించారంటున్నారు.
కొంతకాలంగా తెలంగాణ బీజేపీలో పాత నేతలు , కొత్తగా చేరిన నేతల మధ్య మంటలు రాజేస్తుందన్న ప్రచారం ఉంది. గత కొంతకాలంగా ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రాజాసింగ్ లతో పాటు మరికొంత మంది కొత్త నేతల వ్యాఖ్యలు ఆ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతోనే బీజేపీకి గెలిచిన చరిత్ర ఉందని ఈటల గుర్తు చేశారు. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే.. 1992 నుంచే మల్కాజిగిరి ప్రాంతంలో ఉంటున్న తనను సొంత పార్టీ నేతలే ‘నాన్ లోకల్’ అంటూ ప్రచారం చేయడం హాస్యాస్పదమని ఈటల ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా చర్చానీయాంశంగా మారింది. మొత్తానికి పార్టీకి హెచ్చరికా..? అధిష్టానానికి సంకేతమా..? అన్నది అటుంచితే… ఈటల రాజేందర్ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీలోని అంతర్గత పోరును మరోసారి బహిర్గతం చేశాయి.
Story by Vamshi, Big Tv