Prashant Kishor: వివిధ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలను సునాయాసంగా గెలుపుబాట పట్టించారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్. నరేంద్రమోడీ తొలిసారి ప్రధాని మంత్రి అవ్వడంలోనూ తనవంతు పాత్ర పోషించారు. అలాంటాయన సొంత రాష్ట్రం బీహార్‌లో సొంత పార్టీ పెట్టి బొక్కబోర్లా పడ్డారు. ఆ ఎఫెక్ట్‌తో పీకే .. తిరిగి వ్యూహకర్తగానే కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు. తాజాగా తెలంగాణలో ఎంట్రీ ఇస్తున్న ఆ స్ట్రాటజిస్ట్ కొత్త పార్టీ పెడతానంటున్న కవితను తరచు కలుస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.
రాజకీయ అవగాహన ఉన్న వారికెవరైనా పరిచయం అక్కర్లేని పేరు పీకేగా పాపులర్ అయిన ప్రశాంత్‌కిషోర్. ఢిల్లీ, పశ్చిమబెంగాల్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఇలా వివిధ రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలను అధికార పీఠంపై కూర్చోపెట్డడంలో ఆ ఎన్నికల వ్యూహకర్తా ప్రధాన పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 151 స్థానాలతో అధికారంలోకి రావడంలో ఆయనదే కీరోల్. తర్వాత జగన్ పాలనా తీరు, విధానాలతో విభేదించి గత ఎన్నికల్లో వైసీపీ ఘోరపరాజయం పాలవుతుందని ముందే చెప్పిన ఘనత ఆయనది.
ఆ పార్టీని ఈ పార్టీని అధికారపీఠాలు ఎక్కించడం ఎందుకనుకున్నారో ఏమో.. పీకే తన సొంత రాష్ట్రం బీహార్‌లో సొంతగా జనసురాజ్ పార్టీ స్థాపించి ఆ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేశారు. దానికి ముందు ప్రశాంత్‌కిషోర్ పాదయాత్ర మొదలుపెట్టి వందల కిలోమీటర్లు నడిచారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్ల సమస్యలు అడిగి తెలుసుకుని, సమస్యలను తీర్చుతామని హామీ ఇచ్చారు. ఛాయ్ పే చర్చా అంటూ ప్రధాని మోడీకి కొత్త నినాదం ఇచ్చిన ప్రశాంత్.. తర్వాత యూపీలో యోగి ఆదిత్యనాథ్, పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ, తమిళనాడులో స్టాలిన్, ఢిల్లీలో కేజ్రీవాల్, బీహార్లో నితీష్, మహారాష్ట్రలో ఉద్దవ్‌ఠాక్రేలతో పాటు ఏపీలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌లకు వ్యూహకర్తగా ఉండి ఆయా రాష్ట్రాల్లో వాళ్ల పార్టీలను గెలిపించారు.
అదే వ్యూహంతో బీహార్ ఎన్నికల్లో బరిలోకి దిగిన పీకే అనూహ్యంగా చతికిలపడ్డారు. ఆయన పార్టీ రాష్ట్రంలోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేసి బోణీ కూడా కొట్టలేకపోయింది. పలు స్థానాల్లో జనసురాజ్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కలేదు. ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ .. ఐ – ప్యాక్ పేరిట ఎన్నికల వ్యూహాలు, సిద్దాంతాలు, పథకాలకు రూపకల్పన చేసే పీకే తన పార్టీ బొక్కాబోర్లా పడ్డాక తిరిగి వ్యూహకర్తగానే కొనసాగడానికి నిర్ణయించుకున్నట్లు కనిపిస్తున్నారు.
సొంత పార్టీతో ఓటర్లను ఆకట్టుకోలేకపోయిన ప్రశాంత్‌కిషోర్ తాజాగా తెలంగాణలో ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారంట. బీఆర్ఎస్‌తో విభేదించి సొంత పార్టీ స్థాపన దిశగా అడుగులు వేస్తున్న కల్వకుంట్ల కవిత పెట్టబోయే పార్టీకి ఆయన పనిచేయనున్నారంట. కవితతో కలిసి పనిచేసేందుకు పీకే ఆసక్తి కనబరుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలోనే రెండు నెలల వ్యవధిలో హైదరాబాద్ వచ్చి కవితను కలిసి వెళ్లారాయన.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు పీకేతో కవిత సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజానీకం కోసం పార్టీ ఏర్పాటు చేస్తానంటున్న కవిత, ప్రజల కోణంలో ఎలా పని చేయాలి? వారు తన పార్టీని ఓన్ చేసుకునేలా ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలి? వంటి అంశాలపై పీకేతో సుదీర్ఘంగా చర్చించారంట. ఉగాదికి కొత్త పార్టీ ప్రకటిస్తానంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ విధానాల రూపకల్పనకు ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసి అధ్యయనం చేయిస్తున్నారు. మరి పీకేతో ఆమెకు ఏ మాత్రం లక్ కలిసివస్తుందో చూడాలి.