Somnath Temple Story: కోట్లాది మంది హిందువుల ఆత్మశక్తి.. అచంచలమైన విశ్వాసానికి నిదర్శనం.. సోమనాథ్ ఆలయం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొట్టమొదటిదైన సోమనాథ్ దివ్య క్షేత్రంపై జరిగిన తొలి దాడికి.. వెయ్యేళ్లు పూర్తయింది. ఈ అరుదైన క్షణాల్లో ప్రధాని నరేంద్ర మోడీ రాసిన ఓ ఆర్టికల్.. దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. గజనీ మహమ్మద్ దండయాత్రలో విధ్వంసమైన ఆలయానికి.. పూర్వ వైభవం తెచ్చింది సర్దార్ వల్లభాయ్ పటేలేనా? ఆనాటి ప్రధానిగా.. సోమనాథ్‌కు పండిట్ నెహ్రూ చేసిందేమీ లేదా? అసలేంటి.. సోమనాథ్ స్టోరీ?
తిరుగులేని ఆత్మస్థైర్యానికి ప్రతీక.. సోమనాథ్!
సోమనాథ్.. పేరు తలచుకుంటే చాలు కోట్లాది మంది హృదయాల్లో సగర్వ భావన నిండిపోతుంది. ఇది.. భారతీయ ఆత్మకు నిదర్శనం. సోమనాథ్ ఆలయం కేవలం ఓ పుణ్యక్షేత్రం మాత్రమే కాదు. భారతీయతకు, హిందూ ధర్మానికి ఉన్న తిరుగులేని ఆత్మస్థైర్యానికి ప్రతీక. వేల ఏళ్ల చరిత్రలో ఎన్నో దాడులు, విధ్వంసాలు ఎదుర్కొన్నా.. ప్రతిసారీ మరింత వైభవంగా పునర్నిర్మితమైన ఈ ఆలయ చరిత్ర ఓ అద్భుతం. ఈ క్షేత్రం.. గుజరాత్‌లోని ప్రభాస్ పటాన్ అనే ప్రదేశాన్ని పావనం చేస్తోంది. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో.. తొలి జ్యోతిర్లింగంగా సోమనాథ్ ఆలయం నాగరికత, ఆధ్యాత్మికత ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తుంది.
పాప విముక్తులై, స్వర్గప్రాప్తి పొందుతారనే విశ్వాసం
దివ్యమైన సోమనాథ్ శివలింగాన్ని దర్శించినంతనే.. జీవుడు పాప విముక్తుడై, మరణానంతరం స్వర్గప్రాప్తి పొందుతారనేది భక్తుల విశ్వాసం. కోట్లాది మంది భక్తజనం నీరాజనాలు అర్పించిన ఈ పవిత్ర క్షేత్రంపై.. అనేకమంది దురాక్రమణదారులు దండయాత్రలు చేశారు. ఆలయాన్ని అనేకసార్లు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో.. సోమనాథ్ ఆలయంపై తొలి దాడికి వెయ్యేళ్లు పూర్తవుతోంది. 1026వ సంవత్సరం జనవరిలో.. గజనీ మహమ్మద్ క్రూరమైన, హింసాత్మక దండయాత్రలో భాగంగా.. ఈ ఆలయంపై దాడి చేశాడు. ప్రజల భక్తి విశ్వాసాలకు, నాగరికతకు సుసంపన్న ప్రతీక అయిన ఈ ఆలయాన్ని ధ్వంసం చేయాలని చూశాడు. అయితే.. సోమనాథ్‌కు పూర్వ వైభవం దిశగా ఏళ్లపాటు సాగిన కృషి ఫలితంగా.. వెయ్యేళ్ల తర్వాత కూడా ఈ ఆలయ కీర్తి ప్రకాశవంతంగా వెలుగొందుతోంది. ఈ క్రమంలోనే.. ఓ ముఖ్యమైన ఘట్టానికి ఈ 2026 సంవత్సరంలోనే.. 75 సంవత్సరాలు పూర్తవుతాయి. ఆలయ పునరుద్ధరణ తర్వాత.. 1951 మే 11న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ సమక్షాన నిర్వహించిన కార్యక్రమంలో.. భక్తులకు జ్యోతిర్లింగ దర్శన భాగ్యం కల్పిస్తూ.. సోమనాథ్ ఆలయం తలుపులు మళ్లీ తెరచుకున్నాయ్.
కొత్త చర్చను రేకెత్తించిన ప్రధాని మోడీ కథనం
సోమనాథ్ ఆలయంపై గజనీ మహమ్మద్ దండయాత్రకు వెయ్యేళ్లు పూర్తయిన క్రమంలో.. భారత ప్రధాని నరేంద్రమోడీ రాసిన కథనం.. ఆనాటి చారిత్రక పరిణామాలపై కొత్త చర్చను రేకెత్తించింది.
సోమనాథ్ పునర్నిర్మాణంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రతో పాటు ఈ చారిత్రక ఘట్టం విషయంలో.. ఆనాటి భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచన, దృక్పథం ఎలా ఉందనేది.. ఇప్పుడు ఇండియా మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత.. జునాగఢ్ సంస్థానం భారత్‌లో విలీనమైన తరుణంలో, సర్దార్ వల్లభాయ్ పటేల్ దీపావళి సమయంలో సోమనాథ్ క్షేత్రాన్ని సందర్శించారు.
సోమనాథ్ ఆలయానికి పూర్వ వైభవం తెస్తామన్న పటేల్
శిథిలావస్థలో ఉన్న జ్యోతిర్లింగ ఆలయాన్ని చూసి పటేల్ చలించిపోయారు. అక్కడి సముద్ర తీరంలో దోసిట నీళ్లు తీసుకుని.. సోమనాథ్ ఆలయానికి పూర్వ వైభవం తెస్తామని ప్రతిజ్ఞ చేశారు. అయితే.. ఈ ఆలయ నిర్మాణం ప్రభుత్వ నిధులతో కాకుండా.. ప్రజల భాగస్వామ్యంతో జరగాలని వల్లభాయ్ పటేల్ భావించారు. ఇందుకోసం.. ఓ ట్రస్ట్‌ని ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారని.. అయితే ప్రభుత్వ ఖజానా నుంచి కాకుండా ప్రజా విరాళాలతోనే ఆలయాన్ని తిరిగి నిర్మించాలని సూచించినట్లు చరిత్ర చెబుతోంది.
ఆలయ నిర్మాణం ప్రభుత్వం శ్రద్ధ సరికాదని నెహ్రూ వాదన
సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం విషయంలో.. అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కొంత అభ్యంతరం చెప్పారనే చర్చ ఉంది. ఈ విషయంలో.. నెహ్రూకు, సర్దార్ పటేల్‌కు మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలున్నాయ్. నెహ్రూ దృష్టిలో సెక్యులర్ దేశం అంటే.. ప్రభుత్వం మతపరమైన కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఓ పురాతన ఆలయ పునర్నిర్మాణంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం సరికాదని ఆయన ఆందోళన చెందారు. అంతేకాదు.. సోమనాథ్ ఆలయ ప్రారంభోత్సవానికి అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్ వెళ్లడాన్ని నెహ్రూ వ్యతిరేకించారు. రాష్ట్రపతి హోదాలో ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లడం సరికాదని లేఖ కూడా రాశారు. కానీ.. రాజేంద్రప్రసాద్.. నెహ్రూ అభ్యంతరాన్ని తోసిపుచ్చి, వ్యక్తిగత హోదాలో వెళ్లి ఆలయాన్ని ప్రారంభించారు.
సోమనాథ్ ఆలయం భారతీయ ఆత్మగౌరవమన్న మోడీ
అలా.. 1951 మే 11న ఆలయం తిరిగి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. కానీ.. ఈ గొప్ప ఘట్టాన్ని చూసేందుకు సర్దార్ పటేల్ భూమి మీద లేరు. మాజీ ప్రధాని నెహ్రూ.. ఈ ఆలయ పరిణామంపై పెద్దగా ఉత్సాహంతో లేరని.. ప్రధాని మోడీ తన వ్యాసంలో రాసుకొచ్చారు. రాష్ట్రపతి, కేంద్రమంత్రులు కూడా ఈ ప్రత్యేక కార్యక్రమానికి వెళ్లకూడదని ఆయన కోరుకున్నట్లు మోడీ చెప్పారు. అయితే.. బాబూ రాజేంద్రప్రసాద్ మాత్రం ధృడంగా నిలబడ్డారన్నారు. సోమనాథ్.. కేవలం ఓ ఆలయం కాదని.. అది భారతీయ ఆత్మగౌరవమని ప్రధాని మోడీ చెప్పారు. వేల ఏళ్ల నాటి బానిసత్వ చిహ్నాలను చెరిపేసి, సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించడమనేది.. దేశ ప్రగతికి సంకేతమని మోడీ చెబుతున్నారు. గజనీ మహమ్మద్ దండయాత్రలో ఆలయం కూలిపోయినా.. భారతీయుల విశ్వాసం చెక్కుచెదరలేదన్నారు.
సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణం.. భారతీయ నాగరికత అజేయ సంకల్పానికి, బలానికి గొప్ప నిదర్శనం. విదేశీ దురాక్రమణదారులు ఎన్నిసార్లు దాడి చేసినా.. ప్రతిసారీ ఈ క్షేత్రం మరింత వైభవోపేతంగా తిరిగి పుంజుకుంది. అసలు.. సోమనాథ్ ఆలయంపై ఎన్ని దాడులు జరిగాయ్? పడగొట్టిన ప్రతిసారీ.. తిరిగి ఎలా నిలబెట్టగలిగారు? సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో.. ఈ ఏడాదంతా ఏం చేయబోతున్నారు?
సోమనాథ్ క్షేత్రానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం
సోమనాథ్ క్షేత్రానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది. తొలిదాడి జరిగిన వెయ్యేళ్ల సోమనాథ్ గాథ.. విధ్వంసం ద్వారా కాకుండా కోట్లాది మంది భారతీయుల అచంచల ధైర్యసాహసాల ద్వారా నిర్వచించొచ్చని.. సగర్వంగా చెబుతానన్నారు ప్రధాని మోడీ. గజనీ మహమ్మద్ దండయాత్ర తర్వాత.. సోమనాథ ఆలయంపై అనేక దాడులు జరిగాయ్. దాడి జరిగిన ప్రతిసారీ.. ఆలయాన్ని కాపాడుకునేందుకు ప్రజలు అడ్డుపడ్డారు. ఇంకొందరు ప్రాణత్యాగం చేశారు. సోమనాథ్ ఆలయం భారతదేశ సంస్కృతి, ఆధ్యాత్మిక పట్టుదలకు సజీవ సాక్ష్యం. అనేకసార్లు విదేశీ దండయాత్రలకు, విధ్వంసాలకు గురైనా.. ప్రతిసారీ మరింత వైభవంగా పునర్నిర్మించారు.
17 సార్లు దాడులకు, దోపీడీలకు గురైన సోమనాథ్ ఆలయం
సోమనాథ్ ఆలయం సుమారు 17 సార్లు దాడులకు, దోపిడీలకు గురైంది. 1026వ సంవత్సరంలో గజనీ మహమ్మద్ జరిపిన దాడిలో ఆలయ సంపదను దోచుకెళ్లారు. జ్యోతిర్లింగాన్ని ముక్కలు చేశారు. ఆ తర్వాత 1299లో అల్లావుద్దీన్ ఖిల్జీ, 1395లో జాఫర్ ఖాన్, 1451లో మహమూద్ బెగ్డా ఆలయాన్ని ధ్వంసం చేశారు. చివరికి.. ఔరంగజేబు కూడా ఆలయాన్ని పునరుద్ధరించలేని విధంగా ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఇలాంటి ఎన్నో దాడులు జరిగినా.. ఆలయం తిరిగి నిలబడింది. అందుకే.. సోమనాథ్ ఆలయాన్ని.. వినాశనం లేని అక్షర ధామంగా పిలుస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం.. రాళ్లు, రప్పలు కాదు. భారతీయుల అచంచలమైన భక్తి, సంకల్పమే. దాడి జరిగినప్పుడల్లా.. స్థానిక రాజులు, భక్తులు వెనకడుగు వేయకుండా ఆలయాన్ని మళ్లీ నిర్మించారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో.. సోమనాథ్ మొట్టమొదటికి కావడం వల్ల.. హిందూ ధర్మంలో ఈ ఆలయానికి అత్యున్నత స్థానం ఉంది. అందువల్ల ఎన్ని అడ్డంకులు ఎదురైనా.. క్షేత్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చాక.. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో.. ఇప్పుడున్న అద్భుతమైన ఆలయాన్ని పునర్నిర్మించారు. నాశనం చేసే శక్తి కంటే.. సృష్టించే శక్తి ఎప్పుడూ గొప్పదేని సోమనాథ్ ఆలయ పునరుద్ధరణ నిరూపిస్తూ వచ్చింది.
బ్రహ్మదేవుని సలహా మేరకు సోమనాథ్ క్షేత్రానికి చంద్రుడు
సోమనాథ్ ఆలయ పురాణ గాథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. పురాణాల ప్రకారం.. దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. వీరినే.. 27 నక్షత్రాలుగా భావిస్తారు. వీళ్లందరినీ చంద్రుడు వివాహం చేసుకున్నాడు. అయితే.. చంద్రుడు తన భార్యలందరినీ సమానంగా చూడకుండా.. కేవలం రోహిణి పట్ల మాత్రమే అమితమైన ప్రేమాభిమానాలు చూపేవాడు. మిగిలిన కుమార్తెలు తండ్రి దక్షుడికి ఫిర్యాదు చేయడంతో.. ఆయన చంద్రుడిని హెచ్చరించాడు. అతనిలో మార్పు రాకపోవడంతో.. క్షయ రోగంతో కాంతిహీనుడివై నశించిపోతావని దక్షుడు శపించాడు. శాప ప్రభావంతో చంద్రుడిలో కాంతి కోల్పోవడం మొదలైంది. లోకమంతా అంధకారం అలముకుంటోంది. దాంతో.. కలత చేందిన చంద్రుడు.. బ్రహ్మదేవుని సలహా మేరకు సోమనాథ క్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ.. సరస్వతీ నది సముద్రంలో కలిసే చోట మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ పరమశివుని కోసం తపస్సు చేశాడు.
చంద్రుడిపై దక్షుని శాపం ప్రభావాన్ని తగ్గించిన శివుడు
చంద్రుడి భక్తికి మెచ్చిన శివుడు.. దక్షుని శాపాన్ని పూర్తిగా తొలగించలేనని, దాని ప్రభావాన్ని తగ్గిస్తానని చెప్పాడు. అలా.. చంద్రుడు కృష్ణ పక్షంలో తన కాంతిని కోల్పోతూ ఉంటాడు. మళ్లీ శుక్ల పక్షంలో క్రమంగా తన కళని పెంచుకుంటూ.. పౌర్ణమి నాటికి పూర్తి కాంతితో వెలిగిపోతాడు. తనకు శాప విమోచనం కలిగించినందుకు కృతజ్ఞతగా.. చంద్రుడు ఇక్కడ శివాలయాన్ని నిర్మించాడు. చంద్రుడిని సోముడని పిలుస్తారు కాబట్టి.. ఈ స్వామికి సోమనాథుడు అనే పేరు వచ్చింది. శివుడు.. ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా కొలువై ఉంటానని చంద్రుడికి మాట ఇచ్చాడు. అప్పటి నుంచి భక్తులకు దర్శనమిస్తూ.. పాపాల నుంచి విముక్తి కలిగిస్తున్నాడు.
Also Read: స్టాలిన్ సర్కారుకు ఎదురుదెబ్బ..! కార్తీక దీపంపై ఇష్యూ క్లియర్..
సోమనాథ్ ఆలయ ప్రాంగణంలో బాణ స్తంభం
సోమనాథ్ ఆలయానికి ఓ విశిష్టత ఉంది. ఆలయ ప్రాంగణంలో సముద్ర తీరాన ఓ బాణ స్తంభం ఉంటుంది. దానిపై ఉన్న శాసనం ప్రకారం.. ఆ స్తంభం ఉన్న చోటు నుంచి దక్షిణ ధ్రువం వరకు మధ్యలో ఎక్కడా ఎలాంటి భూభాగం అడ్డు రాదు. అంటే.. ఆ బాణ స్తంభం నుంచి నేరుగా సౌత్ పోల్ వరకు కేవలం సముద్రమే ఉంటుంది. ప్రాచీనకాలంలో భారతీయులకు భూగోళంపై ఉన్న అవగాహనకు ఇదే నిదర్శనం. భారత ప్రధాని నరేంద్రమోడీ ఈ నెల 11న గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయంపై విదేశీయులు తొలిసారి దాడి చేసి, ధ్వంసం చేసిన దురాగతానికి వెయ్యేళ్లవుతున్న క్రమంలో.. సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ పేరుతో ఈ ఏడాదంతా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ వరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ఉత్సవాలు జరగనున్నాయి. సోమనాథ్ ఆలయ చరిత్ర.. కేవలం ఓ కట్టడం గురించిన కథ కాదు. అణిచివేతలను తట్టుకొని ఓ జాతి తిరిగి లేచి నిలబడిన తీరుకు నిదర్శనం. మన సంస్కృతిని, నాగరికతను కాపాడిన కోట్లాది మంది భారతీయుల అజేయమైన సాహసగాథే.. సోమనాథ్ జ్యోతిర్లింగ క్షేత్రం.
Story By Anup, Bigtv