E-Paper
Advertisement

Political Funding Report: పార్టీల పైసా వసూల్ ! రెండు తెలుగు రాష్ట్రలో ఏ పార్టీ కలెక్షన్ ఎంతెంత..?

Political Funding Report: పార్టీల పైసా వసూల్ ! రెండు తెలుగు రాష్ట్రలో  ఏ పార్టీ కలెక్షన్ ఎంతెంత..?
Political Funding Report: పొలిటికల్ పార్టీస్.. పైసా వసూల్..! ఎస్.. ఇప్పుడు పరిస్థితి చూస్తే అచ్చంగా ఇదేనన్న టాక్ విన్పిస్తోంది. ఇదేదో ఆషామాషీగా చెబుతోంది కాదు. రికార్డు స్థాయిలో రాజకీయ పార్టీలకు వెల్లువలా వచ్చిన ఫండ్సే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. కార్పొరేట్ సంస్థలు, బడా పారిశ్రామిక వేత్తలు విరాళాల రూపంలో అందించిన కోట్లాది రూపాయలతో ఆయా పార్టీల ఖజానాలు గలగలలాడుతున్నాయి. ఈ కోవలో టాప్‌ ప్లేస్‌లో ఉంది అధికార బీజేపీ.

రాజకీయ పార్టీలకు విరాళాల వెల్లువ

రాజకీయ పార్టీల గల్లాపెట్టెలు విరాళాల వరదతో గలగలలాడుతున్నాయి. పదులు, వందలు కాదు వేలాది కోట్ల రూపాయల రిజర్వ్‌ ఫండ్స్‌తో కళకళలాడుతున్నాయి.  ఎలక్టోరల్ బాండ్స్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్ట్ 2024లో రద్దు చేసింది. దీంతో.. పొలిటికల్ పార్టీలకు విరాళాలు అందడం తగ్గిపోతుందని అంతా అంచనా వేశారు. కానీ, ఊహించని స్థాయిలో కొన్ని పార్టీలకు వచ్చిన డొనేషన్స్ వింటే ఆశ్చర్యపోవడం ఖాయమనే చెప్పాలి.

కొన్ని రాజకీయ పార్టీలకు ఊహించని స్థాయిలో విరాళాలు

ఎలక్టోరల్ బాండ్స్ అమలులో ఉన్న సమయంలో అత్యధికంగా బీజేపీకి 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3 వేల 967 కోట్ల రూపాయల మేర నిధులు సమకూరాయి. అయితే.. 2024-25 సంవత్సరానికి బాండ్స్ రద్దుతో ఎంత మేర ఎఫెక్ట్ పడుతుందన్న చర్చ అప్పట్లోనే జరిగింది. పైగా ఎన్నికల సీజన్ కావడంతో హాట్ డిస్కషన్స్ కూడా జరిగాయి. కానీ, ఎవరూ ఊహించని విధంగా.. ఏ విధమైన ఎలక్టోరల్ బాండ్స్ లేకపోయినా కేంద్రంలో అధికార పార్టీగా కొనసాగుతున్న బీజేపీకి విరాళాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఈ మొత్తం ఏకంగా 6 వేల 88 కోట్లు కావడం పొలిటికల్ అనలిస్ట్‌లను సైతం నెవ్వెరపోయేలా చేసిందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
వాస్తవానికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో కమలనాథులకు వచ్చిన ఫండ్స్‌ 3 వేల 967 కోట్లతో పోలిస్తే.. 2024-25 లోక్‌సభ ఎన్నికల సమయంలో వచ్చిన మొత్తం 53 శాతం ఎక్కువ కావడం ఇక్కడ గుర్తించాల్సిన ప్రధానమైన అంశం. ఇదేదో అల్లాటప్పాగా చెబుతున్న విషయం కాదు.. స్వయంగా బీజేపీయే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు అందచేసింది.

కాంగ్రెస్‌ పార్టీకి వచ్చింది రూ. 522 కోట్లే

ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 2024-25 ఫైనాన్షియల్ ఇయర్‌లో లభించిన విరాళాల మొత్తం 522 కోట్లే. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేకు 365 కోట్ల మేర ఫండ్స్ లభించగా.. బెంగాల్ అధికార పక్షం తృణమూల్ కాంగ్రెస్ కు వచ్చింది 184 కోట్ల రూపాయలు. ఈ క్రమంలోనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిందనే చెప్పాలి.

ఎలక్టోరల్ బాండ్ల రద్దు…3,811 కోట్లు, 82% BJPకి 

ఎలక్టోరల్ బాండ్స్ రద్దు తర్వాత అసలు.. ఈ స్థాయిలో రాజకీయ పార్టీలకు విరాళాలు అందుతాయని ఎవరూ పెద్దగా ఊహించలేదనే చెప్పాలి. కానీ, ఎవరూ ఊహించనిదే జరిగింది. గతంతో పోలిస్తే విరాళాలు అందించే ట్రస్ట్ ల సంఖ్య పెరగడం, కార్పొరేట్లు విరాళాలను వందల కోట్ల మేర ఇవ్వడంతో ఈ స్థాయిలో ఫండ్స్ జంప్ అయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం ఐదు భారీ ట్రస్ట్‌లు 12 వందల18 కోట్ల మేర ఫండ్స్ ఇవ్వగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అవి కాస్తా 9 ట్రస్ట్‌లు అయ్యాయి. అంతేనా.. విరాళాల రూపంలో వచ్చిన మొత్తం ఏకంగా 3 వేల 811 కోట్లకు పెరిగింది. వీటిలోనూ ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ఏకంగా 2 వేల 668 కోట్లు ఫండ్స్ ఇవ్వగా.. అందులో ఏకంగా 2 వేల 181 కోట్ల మేర ఒక్క బీజేపీకి వెళ్లాయి. అంటే సుమారుగా 82 శాతం అన్నమాట.

టాటా, మహింద్రా, ఇతర కార్పొరేట్స్ భారీ విరాళాలు

ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు భారీగా విరాళాలు అందించిన కార్పొరేట్ సంస్థలు, వ్యక్తుల వివరాలను ఓసారి పరిశీలిస్తే.. ఎలివేటెడ్ అవెన్యూ రియాల్టీ ఎల్‌ఎల్‌పీ ఏకంగా 5 వందల కోట్ల రూపాయలు ఇచ్చింది. మెగా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 175 కోట్లు అంద చేసింది. ఇక, ఇదే సంస్థ ఎండీ పీవీ కృష్ణారెడ్డి వ్యక్తిగతంగా మరో 145 కోట్ల రూపాయలు అందచేశారు. ఓపీ జిందాల్ 157 కోట్లు, DLF, అశోక్‌ లేలాండ్ తలో వంద కోట్లు, టైగర్ అసోసియేట్స్ అనే లాటరీ కంపెనీ 147 కోట్ల మేర ఫండ్స్ ఇచ్చాయి. ఇక, ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు టాటా గ్రూప్ కంపెనీలు మరింత భారీగా విరాళం ఇచ్చారు. సుమారు 915 కోట్ల మేర ఫండ్స్ ఇచ్చింది టాటా సంస్థ.న్యూడెమోక్రటిక్ ఎలక్టోరల్ ట్రస్ట్‌కు మహింద్రా సంస్థ 160 కోట్లు విరాళం రూపంలో అందించింది.

కమలదళానికి అండగా నిలిచిన కార్పొరేట్ కంపెనీలు 

ట్రస్ట్‌లే కాదు.. కార్పొరేట్ కంపెనీలు కూడా కమలదళానికి నిధుల రూపంలో అండగా నిలిచాయి. బీజేపీ గల్లాపెట్టెను గలగలలాడించాయి. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంద కోట్లు, రుంగ్తా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 95 కోట్లు, వేదాంత లిమిటెడ్ 67 కోట్లు, ఐటీసీ లిమిటెడ్ 39 కోట్లు, మ్యాన్ కైండ్ ఫార్మా లిమిటెడ్ 30 కోట్లు.. హిందిస్తాన్ జింక్ లిమిటెడ్ 27 కోట్లు.. ఇలా చెబుతూ పోతే లిస్ట్ చాలా పెద్దదే ఉంది.
ఒక్కమాటలో చెప్పాలంటే 2019-20 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి చూస్తే.. గత ఆరేళ్లలో మునుపెన్నడూ లేనంత స్థాయిలో 2024-25లోనే బీజేపీకి అత్యధికంగా విరాళాలు వెల్లువెత్తాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఇక, తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్‌ సీన్ రివర్సైంది.

ముందు వరుసలో ఏపీ, తెలంగాణలోని పార్టీలు

రాజకీయ పార్టీలకు లభించే ఫండ్స్ విషయంలో ఏపీ, తెలంగాణలోని పార్టీలు సైతం ముందు వరుసలో ఉన్నాయి. అయితే.. తెలంగాణతో పోలిస్తే ఏపీకి దక్కిన వాటా చాలా ఎక్కువ. కానీ, ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పొలిటికల్ పార్టీల మధ్య మాత్రమే చూస్తే ఆసక్తికరమైన సంగతులు బయటపడ్డాయి.

టీడీపీ కి డొనేషన్ల రూపంలో 83 కోట్లు 

ఏపీలోని అధికార కూటమిలో భాగమైన టీడీపీకి 83 కోట్లు డొనేషన్ల రూపంలో లభించగా.. జనసేనకు 25 కోట్లు ఫండ్ల రూపంలో వచ్చాయి. అయితే.. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చిన విరాళాలు వంద కోట్లు కాగా.. 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు లభించినవి కేవలం 83 కోట్లు మాత్రమే కావడం ఆసక్తికరంగా మారింది.
ఇక, జనసేనకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం పలువురు 25 కోట్ల రూపాయల మేర అందించారు.

హాట్‌టాపిక్‌గా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విరాళాలు

ఏపీలోని పొలిటికల్ పార్టీలకు దక్కిన విరాళాల్లో అన్నింటికంటే ముఖ్యమైనది వైసీపీకి వచ్చిన డొనేషన్లు. అధికారంలో లేకపోయినా జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 140 కోట్ల రూపాయలు పార్టీ ఫండ్‌ కింద విరాళంగా లభించాయి. ఇదేఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. పవర్‌లో లేకపోయినా విరాళాల సేకరణలో ఏ స్థాయిలో పవర్‌ఫుల్‌గా వైసీపీ మారిందో అన్నదానిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ సైతం జరుగుతోంది.

టీడీపీ ఖాతాలో కోట్ల వర్షం

పార్టీల వారీగా టీడీపీకి వచ్చిన విరాళాలను ఓసారి పరిశీలిస్తే.. ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా టీడీపీకి 40 కోట్లు లభించాయి. నాట్కో ఫార్మా 7 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వగా.. వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ 5 కోట్లను డొనేషన్ల రూపంలో ఇచ్చింది. తమిళనాడుకు చెందిన క్రిస్ట్రీ ఫ్రైడ్‌గ్రామ్ ఇండస్ట్రీ, బెంగళూరు బేస్‌డ్‌గా నడిచే యునైటెడ్ టెలీ లింక్స్, ప్రకాశం జిల్లా కేంద్రంగా కార్యకాలాపాలు సాగించే ప్రియా ఆక్వా ఫామ్స్ తలో రెండు కోట్లు ఫండ్స్ రూపంలో అందించాయి.

జనసేనకు ఎలక్టోరల్ ట్రస్ట్‌ల విరాళాలు.. 

జనసేనకు మాత్రం ఎలక్టోరల్ ట్రస్ట్‌ల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం కింద లభించలేదు. కార్పొరేట్ల పరంగా చూస్తే నాట్కో ఫార్మా కోటి రూపాయలు, ఆర్వీఎం కన్‌స్ట్రక్షన్స్ మూడు కోట్లు, డీవీకే కన్‌స్ట్రక్షన్స్ 2 కోట్లు డొనేషన్ రూపంలో అందించాయి. వ్యక్తుల పరంగా చూస్తే షాద్‌నగర్‌కు చెందిన రవికుమార్ ఆకుల జనసేన పార్టీకి ఐదు కోట్ల విరాళం అందించారు.

తెలంగాణ బీఆర్ఎస్ పరిస్థితి రివర్స్

ఏపీలో అలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం రివర్సైంది. ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నప్పుడు విరాళాల సేకరణలో మంచి దూకుడు చూపించిన గులాబీ పార్టీ.. ఆ తర్వాత వెనుకబడింది. పైగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పరిస్థితి మరింత దిగజారిందన్న వాదన విన్పిస్తోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్‌కు కేవలం 15 కోట్ల రూపాయల మేర మాత్రమే డొనేషన్లు రావడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
Story By Y. Rajashekar, Big Tv 

Related News

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

Big Stories

×