ఉత్తర ప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఉన్నావ్ లో పెంపుడు కుక్కపై రాయి విసిరినందుకు14 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, కొట్టి, విద్యుత్ షాక్ ఇచ్చి, విషం తాగించి చంపారు. ఈ సంఘటన ప్రస్తుతం ఆ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. న్యాయం కోసం బాలుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగగా, పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.
ఉన్నావ్ కు చెందిన హృతిక్ యాదవ్ అనే 14 ఏళ్ల బాలుడు, పక్క ఊళ్లో రామ్ కథ చెప్తుంటే వెళ్లాడు. అక్కడ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా, తన ఇంటి సమీపంలో ఉన్న విశ్వంభర్ త్రిపాఠి పెంపుడు కుక్క అతడిని వెండించింది. భయపడిన హృతిక్ కుక్కపై రాయి విసిరి అక్కడి నుండి పారిపోయాడు. తన కుక్క మీదే రాయి విసురుతాడా? అని కోపం పెంచుకున్నాడు. తర్వాతి రోజు తన ఇద్దరు స్నేహితులు, చిన్న కొడుకుతో కలిసి హృతిక్ ను వారి ఇంటి నుంచి కిడ్నాప్ చేసి బయటకు తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. అతడి బూట్లు నాకించారు. ఆ తర్వాత కరెంట్ షాక్ పెట్టారు. చివరగా విషం తాగించారు. ఆ తర్వాత వదిలేశారు.
ఇంటికి తిరిగి వచ్చిన హృతిక్ ఒక రోజు తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడిని తొలుత ఉన్నావ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మరో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. కొడుకు మృతితో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.
అటు బాలుడి తల్లి ఆశా పోలీసుల తీరుపై సంచలన ఆరోపణలు చేసింది. నిందితుడు త్రిపాఠి ఒక గ్యాంగ్ స్టర్ అని, అతడు కేసును తారుమారు చేసే అవకాశం ఉందన్నారు. అటు ఈ ఘటనపై స్థానిక సమాజ్‌వాదీ పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ రాజేష్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత బాలుడి ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను పరామర్శించాడు. బాధితుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. పోలీసులు నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే, లోక్ సభలో ఈ అంశాన్ని లెవనెత్తేలా తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తో మాట్లాడుతానని చెప్పారు.
Read Also: రైల్వే స్టేషన్‌లో మహిళను అక్కడ తాకిన యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే?
అటు ఈ ఘటనపై పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. బాధితుడి కుటుంబం ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేశామని సీనియర్ అధికారి దీపక్ యాదవ్ వెల్లడించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపామని చెప్పారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Also: రైల్వే ట్రాక్ మీద రీల్స్.. దూసుకొచ్చిన రైలు, గాల్లోకి ఎగిరిపడ్డ యువకుడు!