Hanamkonda: హనుమకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. స్కూల్ యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా బాలుడు మృతి చెందాడని అతడి బంధువులు గురువారం పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.
హనుమకొండలోని నయీమ్ నగర్ తేజస్వి హై స్కూల్ లో గురువారం ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. నాలుగో తరగతి చదువుతున్న బానోతు సుజిత్ ప్రేమ్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లోనే కింద పడిపోవడంతో స్కూల్ యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి విద్యార్థి బ్రెయిన్ డెడ్ కావడంతో మృతి చెందాడని తెలిపారు.
పాఠశాల యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థి మృతిపై అనుమానం వ్యక్తం చేశారు. పాఠశాలలో ఏదో జరిగిందని, యాజమాన్యమే పిల్లాడిని కొట్టి చంపారని ఆరోపించారు. ఆరోగ్యంగా ఉన్న తమ కుమారుడు ఏ విధంగా చనిపోతాడని అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు నచ్చజెప్పేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. ఆరోగ్యంగా, చురుకుగా ఉన్న తమ కొడుకు ఎలా చనిపోతాడని తల్లిదండ్రులు ప్రశ్నించారు. పాఠశాల యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని కోరారు.
నయీమ్ నగర్ లోని తేజస్వి పాఠశాల విద్యార్థుల వరస మరణాలు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. 45 రోజుల క్రితం పదో తరగతి చదువుతున్న జయంతి వర్ధన్ అనే విద్యార్థి పాఠశాల గ్రౌండ్ లో ఆడుకుంటుండగా హార్ట్ ఎటాక్ రావడంతో కింద పడి మృతి చెందాడు. ఆ ఘటన నుంచి విద్యార్థులు తేరుకోకముందే మరో విద్యార్థి మృతి చెందడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు భయందోళన చెందుతున్నారు.
Also Read: Medak News: రూటు మార్చిన గంజాయి స్మగ్లర్లు.. పోలీసులపై దాడి, మెదక్‌లో రాత్రి ఏం జరిగింది?
హనుమకొండలోని తేజశ్రీ పాఠశాల ముందు పలు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పాఠశాలలో వరుస ఘటనలు చోటుచేసుకుంటున్న విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల అనుమతి రద్దు చేసి పాఠశాలను వెంటనే మూసివేయాలని విద్యార్థి సంఘాల నాయకులను డిమాండ్ చేశారు.