Srikakulam Politics: ఒక కేంద్రమంత్రి, ఒక రాష్ట్రమంత్రి, ఓ పీఏసీ చైర్మన్, ఓ విప్.. ఇలా శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ నేతలు కీలక పదవుల్లో ఉన్నారు. ఆ నలుగురు మంచి వాగ్దాటి, సబ్జెక్ ఉన్న నేతలే. ప్రభుత్వాన్ని, పార్టీని ఎవరైన టార్గెట్ చేస్తే చీల్చి చెండాడుతుంటారు. మరి అలాంటి వారిని ఎదుర్కొవాలంటే జిల్లా వైసీపీ నాయకులు ఎంత షార్ప్ గా ఉండాలి? కానీ శ్రీకాకుళంలో వైసీపీ నేతలు ఏం చేస్తున్నారు? మాజీ ముఖ్యమంత్రి జగన్ పార్టీ బలోపేతానికి నానా పాట్లు పడుతుంటే.. సిక్కోలు జిల్లాలో ఆయన టీమ్ అసలేం చేస్తోంది?
శ్రీకాకుళం జిల్లా.. రాష్ట్ర రాజకీయాలను డిసైడ్ చేసే ప్రాంతంగా పేరున్న ప్రాంతాల్లో ఒకటి. సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. సిక్కోలు జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీనే రాష్ర్టంలో అధికారంలోకి వస్తుంది. రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా ఓటర్లు అధికారపక్షానికి దాదాపు 80 శాతానికి పైగా సీట్లు కట్టపెట్టడం ఈ ప్రాంతం ఆనవాయితీ. గత ఎన్నికల్లో అయితే వైసీపీ సీనియర్లను కూడా మట్టికరిపించి కూటమి జిల్లాలో క్లీన్ స్పీప్ చేసింది. అందుకే ఈ జిల్లాకు పదవులు కూడా అలాగే లభిస్తాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కేంద్ర, రాష్ట్రమంత్రి పదవులతో పాటు పీఏసీ చైర్మన్, ప్రభుత్వ విప్ పదవులు కూడా సిక్కోలు నేతలకే అప్పగించింది.
కేంద్రమంత్రి రామ్మోహననాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, పీఏసీ చైర్మన్ కూన రవి, అసెంబ్లీ విప్ బెందాళం అశోక్ … ఈ నలుగురు మంచి వాయిస్, సబ్జెక్ట్ ఉన్న నేతలే. ప్రభుత్వంపైనా, టీడీపీపైనా విమర్శలు చేస్తే ప్రత్యర్ధులను ఎండగట్టడంలో ముందుంటారు. అలాంటి అధికారపక్షాన్ని ధీటుగా ఎదుర్కొని, జిల్లాలో ఉనికి కాపాడుకోవాలంటే ప్రతిపక్షం వైసీపీ మరింత బలంగా పని చేయాలి. ఓ రకంగా చెప్పాలంటే అన్ని పదవులు జిల్లాకు ఉండటం ప్రతిపక్షానికి ఓ బలమైన అస్త్రంగా కూడా ఉపయోగపడుతుంది. ఇన్ని పదవులు ఉన్నా ప్రజలకు ఏం చేస్తున్నారని? ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కానీ, శ్రీకాకుళంలో వైసీపీ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. దానికి కారణం గ్రూపు రాజకీయాలు.
గత కొన్నాళ్ల నుంచి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి, ధర్మాన బ్రదర్స్ కి గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు బలం చేకూరేలా ఈ నేతల తీరు కనిపిస్తోంది. కాంగ్రెస్ టైంలో అయినా వైసీపీ హయాంలోనైనా జిల్లాలో ధర్మాన సోదరులదే పై చేయి. వారిని కాదని జిల్లా వైసీపీలో ఏం జరగదన్న టాక్ ఉంది. ఆ క్రమంలో తమ్మినేనికి పార్టీలో ప్రాధాన్యత ఉండటం లేదని కొంత ప్రచారం ఉంది. అధికారంలో ఉన్నపుడు మంత్రి పదవి కోసం సీతారం శతవిధాల ప్రయత్నించినా స్పీకర్ పదవికి మాత్రమే పరిమితం అయ్యారు. ఇప్పుడు వైసీపీకి అధికారం లేకపోయినా కూడా తమ్మినేని వాయిస్ వినపడకుండా కుట్రలు జరుగుతున్నాయని చర్చ నడుస్తోంది.
తమ్మినేనిని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా తొలగిస్తారని ధర్మాన కృష్ణదాస్ 2 నెలల క్రితం చేసిన కామెంట్స్ ఇటు శ్రీకాకుళాన్ని, అటు తాడేపల్లిని కుదిపేశాయి. ఆ తర్వాత ఆయన్నే శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా కొనసాగిస్తూ అధిష్టానం ఓ ప్రకటన విడుదల చేసినా ఆ ఎఫెక్ట్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది. కృష్ణదాస్ కామెంట్స్ తర్వాత ధర్మాన సోదరులతో తమ్మినేని అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
లడ్డు ప్రసాదానికి సంబంధించిన వివాదంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారం తన ప్రెస్ మీట్ ను జిల్లా పార్టీ కార్యాలయంలో కాకుండా ఓ ప్రైవేట్ హోటల్ లో నిర్వహించారు. ధర్మాన కృష్ణదాస్ జిల్లా అధ్యక్షుడిగా ఉండటంతోనే పార్టీ కార్యాలయానికి తమ్మినేని వెళ్లడానికి ఇష్టపడటం లేదంట. అంతేకాదు.. ఇటీవల జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా ముఖ్యనేతల సమావేశానికి కూడా ఆయన దూరంగానే ఉన్నారు. దీంతో తమ్మినేని అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారానికి బలం చేకూరుతోంది.
అధికార పార్టీ బలంగా ఉన్నప్పుడు అంతకు మించిన ఉత్సాహంతో పని చేయాల్సిన శ్రీకాకుళం వైసీపీ నేతలు వారి అనుభవాన్ని ఆదిపత్యం కోసమే వాడుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. నిజానికి ధర్మాన ప్రసాదరావు కొన్నాళ్లు సైలంట్ గా ఉన్నారనే సమాచారంతో జగన్ ఆయనకు పెద్దపీట వేస్తున్నారు. ఇటు తమ్మినేనికి కూడా వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ సీటు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇద్దరికి మంచి ప్రియారిటీ ఇచ్చి పార్టీని బలోపేతం చేయాలని వైసీపీ అధ్యక్షుడు చూస్తుంటే.. ఇక్కడ నేతలు మాత్రం ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు వ్యవహరిస్తున్నారని వైసీపీ శ్రేణులు చిర్రుబుర్రులాడుతున్నాయి. మరిలాంటి పరిస్థితుల్లో సిక్కోలు జిల్లాలో వైసీపీ భవితవ్యం ఎలా ఉండబోతుందో? కాలమే నిర్ణయించాలి.
Story by: Apparao, Big Tv