Professor Nageshwar: ప్రొఫెసర్ నాగేశ్వర్.. ఇదీ తెలుగు రాష్ట్రాల్లో అందరూ పిలుచుకునే పేరు. కానీ గత కొన్ని రోజులుగా జరిగిందేంటో తెలుసా..? పులిహోర నాగ్ అని.. పులిహోర ప్రొఫెసర్ అని.. వాట్సాప్ యూనివర్శిటీ అని.. మేధావి ముసుగులో రాజకీయాలు అని.. ఒక్కటేమిటి అన్నీ జరిగాయ్. చెప్పాలంటే నాగేశ్వర్ చేసిన అనాలసిస్ పై జనసేన మండిపోయింది. మంట పెట్టింది.. పోలీస్ స్టేషన్ల దాకా మ్యాటర్ వెళ్లింది. కేసులూ నమోదయ్యాయ్.
అసలు ఫస్ట్ ఏం జరిగిందో ఈ ఎపిసోడ్ లో అన్నిటికంటే ముఖ్యం. ఇటీవలే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ ఢిల్లీ వెళ్లారు. అక్కడ హోంమంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
అందులో ఇంటర్నల్ గా ఏం చర్చ జరిగింది? ఎవరెవరు ఏం మాట్లాడారు.. చర్చకు వచ్చిన అంశాలేంటన్నది అధికారిక ప్రకటన ద్వారా చెప్పారు. కానీ ఆఫ్ ది రికార్డ్ ఏం జరిగి ఉంటుందన్న కోణంలో
రకరకాల విశ్లేషణలు పుకార్లు షికార్లు చేశాయి.
ఆల్ ఆఫ్ సడెన్ గా ఆ ఇద్దరూ ఢిల్లీ ఎందుకు వెళ్లారు..? అధికారిక పనులు ఓకే.. ఆఫ్ ది రికార్డ్ ఎందుకు వెళ్లారు.. ఇలాంటి హైపోథీసిస్ అంతా పుకార్లుగా మారాయ్. నిజానికి జనసేన అధినేత పవన్, మంత్రి నాదెండ్ల ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు. తమకు రకరకాల అజెండాలు లేవని, ప్రజల అజెండానే అని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే వీరిద్దరి ఢిల్లీ టూర్ పై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన అనాలసిస్ కాస్తా మిస్ ఫైర్ అయింది.
ఇటీవల ఓ డిబేట్ లో మాట్లాడిన ప్రొఫెసర్ నాగేశ్వర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని, మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఎలాగైనా అరెస్ట్ చేయాలని వారు కోరారని బాంబు పేల్చారు. అక్కడితో ఆగలేదు. దీనిపై స్పందించిన అమిత్ షా మీరు తొందరపడకండి.. చంద్రబాబు నాయుడు మాకు ఇన్‌స్టంట్ ఫ్రెండ్, కానీ జగన్ మోహన్ రెడ్డి లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నట్లుగా నాగేశ్వర్ తనదైన అనాలసిస్ చేశారు. ఇదే తీవ్ర దుమారంగా మారింది. అసలు ఈ లైన్ మీకు చెప్పిందెవరు.. ఎక్కడ విన్నారు.. వాట్సప్ యూనివర్శిటీలో వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్ లను అనలైజ్ చేశారా.. ఇదేనా మీ విశ్లేషణ అంటూ జనసైనికులు ఒక్కసారిగా తిరగబడ్డారు.
ఏపీ రాజకీయమంతా గత కొన్ని రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ విశ్లేషణ చుట్టూనే తిరిగింది. ఈ కామెంట్స్ జనసేనకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయ్. అసలు తాము అనని మాటలు, చెప్పని మాటల్ని ప్రొఫెసర్ ఎలా చెబుతారంటూ ఎదురుదాడి మొదలైంది. కూటమి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నమే ఇది అని అన్నారు. కేవలం ఊహాజనితమైన, అవాస్తవ మాటలను ప్రచారం చేయడం నాగేశ్వర్ కు తగదని నాదెండ్ల కామెంట్ చేయాల్సి వచ్చింది.
అటు జనసేన నేత పవన్ సోదరుడు నాగబాబు కూడా ఈ ఇష్యూపై రియాక్ట్ అయ్యారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యలు తమ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయని, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఒక పార్టీకి మేలు చేసేలా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని హితవు పలికారు. ఇంకా జనసేన నేతలెందరో రియాక్ట్ అయ్యారు. ప్రొఫెసర్ మాట్లాడిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఏదో చేద్దామనుకుని, ఎవరికో మేలు చేసేందుకు తమ పార్టీపై లేనిపోవని చెప్పడం కరెక్ట్ కాదని కాస్త స్మూత్ గానే రియాక్ట్ అయ్యారు. కొందరు సుతిమెత్తగా చెప్పారు. ఇంకొందరు ఘాటుగా వార్నింగ్స్ ఇచ్చారు.
కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించి, రాజకీయ అశాంతిని కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ జనసేన నాయకులు కాకినాడ జిల్లాలోని ఇంద్రపాలెం, సర్పవరం పోలీస్ స్టేషన్లలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఫిర్యాదులు చేయడంతో కేసులు నమోదయ్యాయి. మేధావి ముసుగులో అజ్ఞానాన్ని ప్రదర్శించవద్దు అంటూ జనసేన శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఘాటు వార్నింగ్ లు ఇచ్చారు.
జనసేన అధికారిక హ్యాండిల్స్ అలాగే జనసేన కార్యకర్తలు.. ప్రొఫెసర్ నాగేశ్వర్ టార్గెట్ గా సోషల్ మీడియాలో చేసిన టార్గెట్ అంతా ఇంతా కాదు. సూడో ఇంటలెక్చువల్ నాగేశ్వర్ అని, మేధావి ముసుగులో రాజకీయాలు ఇలాంటి హ్యాష్ ట్యాగ్‌లను ట్రెండ్ చేశారు. న్యూట్రల్ విశ్లేషకుడిలా నటించే నాగేశ్వర్, తెరవెనుక ఓ పార్టీ ఎజెండాను మోస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. పాత వీడియోలతో కౌంటర్లు వేశారు. నాగేశ్వర్ గతంలో వేర్వేరు సందర్భాల్లో మాట్లాడిన వీడియో క్లిప్పులను జనసైనికులు బయటకు తీశారు. నాడు అలా నేడు ఇలా అబద్ధాలు అంటూ ట్రోల్ చేశారు.
అంతే కాదు వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లను చూసి లైవ్ డిబేట్‌లో మాట్లాడే స్థాయికి ఒక ప్రొఫెసర్ దిగజారిపోయారన్నారు. మీమ్స్, వేసిన సెటైర్లకు లెక్కే లేదు. నాగేశ్వర్‌ను ఒక కల్పిత కథల రచయితగా చిత్రీకరిస్తూ వందలాది మీమ్స్ క్రియేట్ చేశారు. అమిత్ షా ఇంట్లో ఉండి ఆ మీటింగ్ సమాచారం విన్నారా? ఆయనకు అంతర్గత సమాచారం ఇచ్చేందుకు అమిత్ షా ఏమైనా ఫోన్ చేశారా? ఇలాంటి వ్యంగ్యాస్త్రాలతో కార్టూన్లు, మీమ్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తారు. సో ప్రొఫెసర్ మే 19న వివాదాస్పద విశ్లేషణ చేశారు. మే 21న తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంటే 19, 20, 21 తేదీల్లో జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది.
ఒకవైపు సోషల్ మీడియాలో రచ్చ.. ఇంకోవైపు డైరెక్ట్ డైలాగ్ వార్ లతో కథ చాలా దూరం వెళ్లిపోయింది. ఇదేంటి పిచ్చి విశ్లేషణ అంటూ స్మూత్ గా చెప్పే వారు స్మూత్ యాంగిల్ లో ఘాటుగా చెప్పే వాళ్లు ఘాటు యాంగిల్స్ లో రియాక్షన్ ఇచ్చారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి జగన్ ను అరెస్టు చేయాలని కోరినట్లు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలను బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఖండించారు. మంచి అనలిస్ట్ గా పేరు ఉన్న ప్రొఫెసర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. కొన్ని పార్టీల నేతలు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు బాలినేని. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు ప్రొఫెసర్ విన్నారా అని క్వశ్చన్ చేశారు.
ఎవర్ని అడిగినా చెబుతారు.. ఎవరు ఎలాంటి వారో అని జగన్ చెప్పుకొచ్చారు. అటు ఈ ఎపిసోడ్ ముగిసింది అనుకున్న టైంలో లేటెస్ట్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్-జనసేన మధ్య వివాదంపై సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టాలని ఆదేశించినట్టు తెలుస్తోందన్నారు. ఇక మీదట అలాంటి వ్యాఖ్యలు చేస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. ఒక రకంగా ఇది బ్లాక్ మెయిల్ చేయడమేనన్నారు. బయట గానీ, సోషల్ మీడియాలోగానీ ఎవరి వాదనలు వారికి ఉంటాయని, వాటికి రిప్లై ఇవ్వాలని, అంతేగానీ వ్యతిరేకంగా మాట్లాడేవారి ఆపాలని ప్రయత్నిస్తే నోరు నొక్కడమే అవుతుందన్నారు. ఇలాంటి బెదిరింపులు మానుకోవాలన్నారు. వీలైతే ఆయన్ని అరెస్టు చేయాలన్నారు. అదే జరిగితే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా బయటకొస్తారన్నారు. అప్పుడు కాక్రోచ్‌లంతా బయటకు వస్తాయని, కాక్రోచ్‌ల ఉద్యమం కూడా పెరుగుతుందని, ఒకవిధంగా ఇది మంచిదేనని అన్నారు.
రెండు మూడు రోజుల్లోనే చాలా డ్యామేజ్ జరిగాక…. జనసేన పార్టీ నుంచి తీవ్ర నిరసనలు, చట్టపరమైన చర్యలు, పోలీస్ కేసులు ఇలాంటివి పెరగడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనక్కి తగ్గారు. తాను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా అన్నవే తప్ప తనకు ఎలాంటి వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. పవన్ కళ్యాణ్, అమిత్ షా భేటీపై తాను చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ఆయన లైవ్ టీవీలోనే ప్రకటించారు. తాను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నాదెండ్ల సభాపతిగా ఉన్నారని, ఆయన కోరిక మేరకు తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. సో ఫైనల్ గా ప్రొఫెసర్ నాగేశ్వర్ తన తప్పును ఒప్పుకుంటూ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో, జనసేన పార్టీ ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించాలని, సోషల్ మీడియాలో దీనిపై ఎలాంటి పోస్టులు పెట్టవద్దని తమ జనసైనికులకు కూటమి కార్యకర్తలకు సూచించింది. దీంతో ఈ వివాదాన్ని జనసేన పార్టీ ప్రొఫెషనల్ గా ముగించింది. సో ఒక చిన్న విశ్లేషణ, మిస్ ఫైర్ అయి బ్యాక్ ఫైర్ అయ్యేదాకా వెళ్లింది.
Also Read: జగన్ ‘మావిగన్’ డ్రామా.. కామెడీ పీస్ అంటూ కేశినేని చిన్ని ఓ రేంజ్‌లో ఆటాడుకున్నారుగా!