Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు అంటి ముట్టినట్లుగా ఉంటున్నారా..? మంత్రి పదవిపై అధిష్టానం మాట తప్పిందని ఆగ్రహంగా ఉన్నారా..? పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే పాల్గొన్న మీటింగ్ కు రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టడానికి కారణం అదేనా? సీఎం, మంత్రులు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉండటానికి అధిష్టానంపై ఆగ్రహమే కారణమా? అసలు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి లెక్కలేంటి?
ఏడాదిన్నర అయినా రాజగోపాల్ రెడ్డికి దక్కని మంత్రి పదవి
తెలంగాణ కాంగ్రెస్‌లో ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఉమ్మడి జిల్లాలో హేమాహేమీలైన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డిలు రాష్ట్ర కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి జిల్లా నుండి రేవంత్ సర్కార్ లో కీలక మంత్రులుగా ఉత్తమ్, కోమటిరెడ్డిలు ఉన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2023లో తిరిగి పార్టీలో చేరే సమయంలో హైకమాండ్ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చిందట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంగా మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రెండో విడత విస్తరణలో క్యాబినెట్ బెర్త్ దక్కకపోవడంతో ఆయన తీవ్ర నిరాశకు గురయ్యారు.
అధిష్టానం, పార్టీ పెద్దలపై గుర్రుగా ఉన్న రాజగోపాల్
మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెట్టుకున్న ఆశలు ఆడియాశలయ్యాయి. దీంతో తనకు ఇచ్చిన మాట తప్పుతున్నారంటూ పార్టీ అధిష్టానంతో పాటు ప్రభుత్వ పెద్దల తీరుపై ఆయన గుర్రుగా ఉన్నారట. దీంతో పార్టీ కార్యక్రమాలతో పాటు సీఎం, మంత్రులు పాల్గొంటున్న ప్రభుత్వ కార్యక్రమాలకు సైతం రాజ గోపాల్‌రెడ్డి దూరంగా ఉంటున్నారట. తాజాగా సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీని సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సభకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలందరూ హాజరు కాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు.
ఖర్గె వచ్చినప్పుడు కన్నెత్తి చూడని రాజగోపాల్ రెడ్డి
ఈ నెల 2వ నల్లగొండలో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. దానికి తొలిసారిగా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వచ్చినా రాజగోపాల్ హాజరు కాలేదు. గత నెలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే హైదరాబాద్‌కు వచ్చినా రాజగోపాల్ రెడ్డి అటు వైపు కూడా కన్నెత్తి చూడకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఉమ్మడి జిల్లాలో సీఎం పర్యటించినప్పుడు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలంతా హాజరవు తుంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న హుజూర్ నగర్, ఆలేరు, తిరుమలగిరి బహిరంగ సభలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం దూరంగా ఉన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో జరిగే కీలక ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ఆయన పట్టించు కోవడం లేదట.
మునుగోడుకి ఒక్క మంత్రిని కూడా ఆహ్వానించని ఎమ్మెల్యే
స్వతంత్రంగా ముక్కుసూటిగా వ్యవహరించే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నేనే రాజు నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట.18 నెలల ప్రభుత్వ కాలంలో ఇప్పటివరకు తన మునుగోడు నియోజకవర్గానికి ఒక్క మంత్రిని కూడా ఆయన ఆహ్వానించలేదట. జిల్లాకు చెందిన మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు ఎంట్రీ పాస్ ఇవ్వలేదట. జిల్లా మంత్రులే కాదు మిగిలిన మంత్రులు ఎవరు కూడా మునుగోడు వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదట. పార్టీ కార్యక్రమాలకు అంటీ ముట్టనట్లుగా ఉంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజక వర్గానికే పరిమిత అవుతున్నారట. సమస్యలపై దృష్టి సారిస్తూ సంబంధిత విభాగాల అధికారులతో మాత్రం రెగ్యులర్‌గా సమీక్షలు నిర్వహిస్తున్నారట.
Also Read: హిందూపురంలో అంతర్గత పోరు.. చతికిల పడుతున్న వైసీపీ
స్థానిక సంస్థల ఎన్నికల వరకు వేచి చూస్తారా?
ఆ క్రమంలో అసలు రాజగోపాల్‌రెడ్డి వ్యూహమేంటి..? ఆయన లెక్కలేంటి అన్న దానిపై రాష్ట్ర పార్టీలో పెద్ద చర్చే జరుగుతోందట. అయితే స్థానిక సంస్థల ఎన్నికల వరకు నియోజక వర్గాన్ని అంటిపెట్టుకుని ఉండి తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లాలని రాజగోపాల్‌రెడ్డి భావిస్తున్నారట. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు సైలెంట్‌గా పార్టీ అధిష్టానానికి కూడా తగినంత సమయం ఇచ్చినట్లు అవుతుందని ఆయన భావిస్తున్నారట. అప్పటికీ మంత్రి పదవిపై పార్టీ ఎటూ తేల్చకపోతే తనకు మంత్రి పదవి దక్కకుండా అడ్డుపడుతున్న ప్రభుత్వ లేదా పార్టీ పెద్దలపై పోరాటం చేయడమా? లేదా ప్రత్యామ్నాయం చూసుకోవడమా? అన్నది తేల్చుకోవాలనే నిర్ణయానికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వచ్చారంట.
Story by Rami Reddy, Bigtv