రాజకీయంలో రంకు లింకులు పెట్టడం ద్వారా మనకు మైలేజీ అవతలోడికి డ్యామేజీ చాలా ఈజీగా అవుతుందనే ఫార్మూలా ఇప్పుడు బాగా పాటిస్తున్నారు. ప్రతిపక్షాలకు అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ఇదో బ్రహ్మాస్త్రం. కానీ దీన్ని హద్దులు మీరి.. పేర్లను బయట పెట్టి… మహిళలను కించపరిచేలా, అవమానపరిచేందుకూ వెనుకాడని రాజకీయం ఇప్పుడు పతాకస్థాయికి చేరుకున్నది.
ప్రస్తుతం మనం తమిళనాడు స్టేట్‌లో జరుగుతున్న తాజా పరిణామాల గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ తెలంగాణా అందుకు ఏం తీసిపోదు. ఇక్కడి విషయానికి వచ్చే ముందు అక్కడి తాజా అంశాలు ఒకసారి చెప్పుకుందాం. త్రిష పేరును వాడుకున్నాడు పరోక్షంగా ఉదయ్‌నిధి మారన్. సీఎం విజయన్‌ను నైతికంగా దెబ్బకొట్టేందుకు డబుల్ మీనింగ్ డైలాగును వాడి.. విజయ్‌కు, త్రిషకు మధ్య సంబంధాలున్నాయని ప్రజలకు చెప్పడం అతని ఉద్దేశం.
రాజకీయాల్లో నైతికతను దెబ్బకొట్టడమంటే చిన్న విషయమేమీ కాదు. దాని తాలూకు ప్రభావం, ప్రమాదం నుంచి కోలుకోవాలంటే కూడా చాలా కష్టమే. జనం ఒక్కసారి కనెక్టయిపోయి.. క్యారెక్టర్ లేదని ఫిక్సయిపోతే.. ఎన్ని తంటాలు పడ్డా.. రాజకీయాల్లో నిలదొక్కుకోవడం ఒక్కొక్కప్పుడు కష్టమైపోతుంది.
విజయ్‌పై ఇప్పుడు అంత పెద్ద ప్రభావమేమీ పడకపోవచ్చు. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు నుంచే అతన్ని అన్ని రకాలుగా టార్గెట్ చేశారు. కానీ తమిళ ప్రజలు విజయ్‌ను గెలిపిద్దామని డిసైడ్ అయిపోయారు. అతనికి ఓసారి అధికారమిద్దామనుకున్నారు. అంతే. మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడే మనం చెప్పలేం. అయితే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న ఉదయనిధి స్టాలిన్.. ఈ విధంగా ఓ ప్రముఖ హీరోయిన్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వెనుకాడకపోవడానికి కారణం.. ఏకంగా సీఎం కుర్చీలో ఉన్న విజయ్‌ను దెబ్బకొట్టేందుకు ఇంతకు మించిన మార్గం లేదనే దిగజారుడు అభిప్రాయానికి ఫిక్స్ కావడం.
హీరో మీద కోపముండొచ్చు. సీఎం అయినందుకు కచ్చగా కూడా ఉంది కావొచ్చు. కానీ అతన్ని మానసికంగా ఇబ్బంది పెట్టేందుకు, క్యారెక్టర్‌ను దెబ్బ తీసేందుకు ఓ సినీ తారను, మహిళను కూడా రాజకీయ రొంపిలోకి లాగడం దివాళకోరు రాజకీయమే అవుతుంది. మళ్లీ అధికారంలోకి రావాలంటే విమర్శలు, ఆందోళనలు, ప్రజలతో మమేకం కావడం, ప్రజా వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుని ఉద్యమాలు చేయడం.. ఎలా ఉన్నో దారులున్నాయి. కానీ ఇలాంటి చీప్ కామెంట్స్ ద్వారా రాజకీయాల్లో రాణించాలని అనుకుంటే .. లాంగ్ రన్‌లో బోల్తా పడాల్సిందే.
ఇప్పుడు తెలంగాణకు వద్దాం. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి కూడా కేటీఆర్‌ను ఇదే తరహాలో విమర్శించాడు. రకుల్ రావు అంటూ కేటీఆర్‌ను సంబోధించడం ద్వారా .. కేటీఆర్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం.. ఆ సినీ హీరోయిన్ పేరును రాజకీయాల్లోకి లాగి తద్వారా మైలేజీ పొందాలని అనుకోవడం.. రెండూ తప్పే. ఇది కూడా ప్రత్యర్థి నైతికతను దెబ్బకొట్టడం ద్వారా ఇక రాజకీయాల్లో అతనిపై జనాలకు పూర్తిగా విశ్వాసం పోవాలనేది రేవంత్ వ్యూహమై ఉండొచ్చు. కానీ అది చీప్ వ్యూహంగానే చూడాలి.
ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత కూడా కేటీఆర్‌ను ఇదే తరహాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడింది సర్కార్. ఫోన్ ట్యాపింగ్ చేసి హీరోయిన్ల మాటలు విన్నాడని, బెదిరించాడని ఇలా ప్రచారాలు చేసుకున్నది. దీన్ని నిరూపించలేకపోయింది. కానీ డ్యామేజీ మాత్రం చేయగలిగింది. ఇప్పటి రేవంత్ సీఎం హోదాలో అంటున్నాడు.. పెండ్లాంమొగళ్ల మాటలు విన్నారని. ఇది కేటీఆర్‌ను ఉద్దేశించే. నిజానికి ఈ రకం ఆరోపణలు, ప్రచారాలు, విమర్శలు.. దిగజారుడు రాజకీయాల కిందకే వస్తాయి.
ఈ విషయంలో కేటీఆర్ బాధితుడే. కానీ అతగాడూ ఏం తక్కువ తినలేదు. కండలు తిరిగి ఉన్న మొగోడైనా మూడు నెలల్లో పిల్లల్ని కనగలడా? అని అన్న సీఎం మాటలను .. తన పొలిటికల్ మైలేజీ కోసం.. మరి ముప్పై మూడు నెలలైనా పిల్లల్ని కనకపోతే నిన్నేమనాలె? అని కించపరిచే విధంగా కామెంట్ చేయడం దిగజారుడు రాజకీయం కిందకే వస్తుంది.
మొదట సీఎం హోదాలో రేవంత్ తీసుకున్న ఈ పోలికే కరెక్టు కాదు..ఇగ దీన్ని సాగదీసి.. సీఎం మొగోడు కాదు.. సంసారానికి పనికిరాడు అనే అర్థం వచ్చేలా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడిన కేటీఆర్‌వి చీప్ రాజకీయాలే. ఇక్కడ ఇద్దరూ గమనించాల్సింది ఏంటంటే.. మీ రాజకీయాల కోసం ఇందులోకి మహిళలను లాగడం. వారిని సంతానానికి మాత్రమే పనికి వచ్చే మిషన్లుగా చూడటం. వారి మనోభావాలను దెబ్బతీయడం.. ఈ కనీస స్పృహ కూడా ఇద్దరిలో లోపించడం ఇక్కడ విషాదం.