ఉగ్రవాదానికి మతం లేదు! ఇది తరచుగా వినిపించే మాట!
ఉగ్రవాదానికి మతం లేదు! ఇది తరచుగా వినిపించే మాట! మరి.. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడి ఏమిటి? హిందువులని లక్ష్యంగా చేసుకొని.. వందలాది మంది టూరిస్టుల్లో హిందువులను మాత్రమే సెలక్ట్ చేసుకొని మరీ కాల్పులు జరపడాన్ని ఎలా చూడాలి? మతాన్ని నిర్ధారించి చంపేవాడి మనస్తత్వం ఏమిటో ఇప్పటికైనా అర్థమవుతోందా? పహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివే. ఉగ్రవాదానికి మతం లేదని వాదించే వాళ్లందరికీ.. మంచుకొండల్లో జరిగిన ఈ మారణహోమమే బిగ్ ఎగ్జాంపుల్.
మతం పేరిట మంటలు రేపడమే టెర్రరిస్టుల లక్ష్యమా?
ఉగ్రవాదులకే కాదు.. ఉగ్రవాదానికి కూడా మతం ఉందని రుజువు చేసిన తీవ్రమైన దాడి ఇది. పహల్గాం తీవ్రవాదంలో మతం మాత్రమే ఉంది. ఉగ్రవాద సంస్థలన్నీ.. హిందూ మతాన్ని ద్వేషిస్తాయని, ఉగ్రవాదులంతా హిందూ సమాజానికి వ్యతిరేకంగానే పనిచేస్తారనే విషయం.. పహల్గాం ఉగ్రదాడితో తేలిపోయింది. హిందువులే లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడితో.. కశ్మీర్ సరిహద్దుల్లోకి చొరబడే ఉగ్రవాదుల లక్ష్యమేమిటో స్పష్టంగా తెలిసింది. మన దేశంలో మతం పేరిట మంటలు రేపడమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యమని అర్థమవుతోంది. అందుకోసమే.. పహల్గాంలో హిందూ టూరిస్టులను ఎంచుకొని మరీ చంపేశారనే వాదనలు బలపడుతున్నాయ్.
మతపరమైన భావాజాలం, హిందూ మతంపై నిలువెల్లా ద్వేషం
అల్‌ఖైదా, ఐసిస్, లష్కరే తోయిబా, ఇప్పుడు టీఆర్ఎఫ్. ఇలా.. ఉగ్రవాద సంస్థలు, జిహాదీ గ్రూపులన్నీ.. తమ హింసాత్మక చర్యలను మతపరమైన భావజాలం, హిందూ మతంపై నిలువెల్లా ద్వేషంతోనే నడిపిస్తున్నాయ్. ఈ టెర్రరిస్ట్ సంస్థల ఉగ్రవాద కార్యకలాపాలకు మతమే కేంద్ర బిందువు. హిందువులని లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడి.. పూర్తిగా మతపరమైన ద్వేషంతో చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మత గుర్తింపుతోనే.. కశ్మీర్‌లో విభజన సృష్టించేందుకు ప్రయత్నించారు ఉగ్రవాదులు. ఎందుకంటే.. ఉగ్రవాదంలో మతం ఓ డ్రైవింగ్ ఫోర్స్‌లా పనిచేస్తుంది.
హిందువులను గుర్తించి మరీ దాడులు చేయడమే షాక్
ఆ మత భావజాలమే.. ఉగ్రవాదుల్ని తీవ్ర దాడులకు ప్రేరేపిస్తోంది. పహల్గాంలో జరిగిన దాడి కూడా ఆ కోవకు చెందినదే. ఉగ్రవాదులు.. టూరిస్టుల పేర్లు, కల్మా చదవమని ఆదేశించడం, సున్తీ గుర్తింపు ద్వారా హిందువులను ఎంపిక చేశారు. ఇది.. జిహాదీ భావజాలంతో హిందువులను.. కాఫిర్‌లుగా లక్ష్యంగా చేసినట్లు సూచిస్తోంది. ఉగ్రవాదులు.. ఉద్దేశపూర్వకంగా హిందువులను గుర్తించి మరీ దాడులు చేయడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇది.. మతపరమైన ద్వేషంతో కూడిన హిందూ జెనోసైడ్ దాడిగా చెబుతున్నారు.
హిందువులను లక్ష్యంగా చేసుకున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్
కేవలం కశ్మీర్‌లో మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో హిందూ-ముస్లిం విభజనని పెంచి.. అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ మారణహోమంలో ఉగ్రవాదులు మహిళలను చంపలేదు. చిన్నారుల జోలికి వెళ్లలేదు. కేవలం.. హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్‌ని అతని భార్య పల్లవి కళ్ల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. తనను కూడా కాల్చేయమని పల్లవి కోరింది.
ఈ దాడి గురించి మోదీకి చెప్పమన్న ఉగ్రవాదులు
అందుకు.. మేము.. నిన్ను చంపం. ఈ భయానక ఘటన గురించి మోడీకి చెప్పమని.. టెర్రరిస్ట్ ఆదేశించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ దాడి భారత ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు చేసిన ఓ ప్రయత్నంగానూ కనిపిస్తోంది. ప్రధానంగా కశ్మీర్‌లో హిందువుల సంఖ్య పెరుగుతోందనే సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి.. రాజకీయంగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే స్థానికుల మద్దతు పొందేందుకే.. ఉగ్రవాదులు హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.
అమర్ నాథ్ యాత్రకు కొద్ది రోజుల ముందు పహల్గాంలో ఉగ్రదాడి
అమర్‌నాథ్ యాత్రకు కొద్ది రోజుల ముందు.. పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఈ ఉగ్రదాడి.. భారత్‌లోని లక్షలాది మంది హిందూ యాత్రికుల్లో ఆందోళన పెంచుతుంది. హిందూ యాత్రికుల్లో భయం సృష్టించేందుకు.. ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడి ఉండొచ్చంటున్నారు. ఈ ఉగ్రదాడిని.. పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద చర్యగానూ ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతోనే.. లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. ఈ ఉగ్రదాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
పెహల్గాం దాడిపై కశ్మీర్ ప్రజలు ఏమంటున్నారు?
మతాన్ని నిర్ధారించి మారణహోమం సృష్టించడం వెనుక.. ఉగ్రవాదుల లక్ష్యం ఏమై ఉంటుంది? కశ్మీర్‌లో అశాంతి, అస్థిరత సృష్టించడానికే.. ఉగ్రదాడికి తెగబడ్డారా? కశ్మీర్‌ని మళ్లీ ఓ కల్లోలిత ప్రాంతంగా చూపించాలనుకుంటున్నారా? ఉగ్రదాడులతో నష్టపోయేదెవరు? పెహల్గాం దాడిపై కశ్మీర్ ప్రజలు ఏమంటున్నారు?
ఉగ్రదాడితో కశ్మీర్‌లో మళ్లీ కల్లోలం
ఒక్క ఉగ్రదాడితో కశ్మీర్‌లో మళ్లీ కల్లోలం చెలరేగింది. ఉగ్రమూకలు.. అదునుచూసి పెహల్గాంలో దెబ్బకొట్టాయ్. ఈ మారణహోమంతో వాళ్లు సాధించేదేమిటనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఈ ఉగ్రదాడి.. కశ్మీర్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న సంఘర్షణలో భాగంగా.. రాజకీయ, మతపరమైన లక్ష్యాలను సాధించేందుకు ఉగ్రవాదులను.. హిందువులను లక్ష్యంగా చేసుకున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా.. కశ్మీర్‌లో అస్థిరత సృష్టించేందుకే ఈ దాడి చేసి చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. కశ్మీర్‌లో శాంతి, టూరిజం, ఆర్థిక పురోగతిని దెబ్బతీసేందుకు.. వ్యూహాత్మక చర్యగా ఈ దాడి జరిగి ఉండొచ్చని చెబుతున్నారు. హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా.. ఉగ్రవాదులు భారత ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి.. కశ్మీర్‌ని మళ్లీ ఓ అస్థిరమైన ప్రాతంగా చిత్రీకరించాలని భావిస్తున్నారు.
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌కు తొలగిన ప్రత్యేక హోదా
2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, కశ్మీర్‌లో రాజకీయ, సామాజిక పరిస్థితులు గణనీయంగా మారాయి. 370రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించబడింది, పహల్గామ్ అటాక్ కేవలం ఒక ఉగ్రదాడిగానే కాదు…ఇది కశ్మీర్ సోల్‌పై జరిగిన దాడిగా కశ్మిర్ సమాజం చూస్తోంది. స్థానికుల జీవనోపాధిని, పర్యాటకుల భద్రతను, కశ్మీర్ శాంతిని ప్రశ్నార్థకం చేసింది. అయితే కశ్మీర్ ప్రజలు, భారత ప్రభుత్వం, అంతర్జాతీయ సమాజం ఉగ్రవాదులను ఎదిరించేందుకు ఒక్కటయ్యాయి.
హిందూ-ముస్లింల మధ్య విభజన పెంచాలనే ఆలోచన
హిందువులనే లక్ష్యంగా చేసుకోవడం వల్ల.. కశ్మీర్‌లో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టి, హిందూ-ముస్లింల మధ్య విభజన పెంచాలనే ఆలోచనతోనే ఈ దాడులకు పాల్పడ్డారు. ఇది.. కశ్మీర్ ప్రజల్లో భయాన్ని పెంచి.. ఉగ్రవాదులకు మద్దతునిచ్చేలా చేస్తుందని భావించి ఉండొచ్చంటున్నారు. పైగా.. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి.. ప్రపంచం దృష్టిని ఆకర్షిచింది. ఈ అటాక్.. వారి సందేశాన్ని వ్యాప్తి చేసేందుకు ఓ వేదికగా పనిచేసింది. హిందువులని టార్గెట్ చేయడం ద్వారా.. దీనిని మతపరమైన దాడిగా చిత్రీకరించి.. తమ భావజాలాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేశారు.
టూరింజంని దెబ్బతీసి.. ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే లక్ష్యం
పహల్గాం.. ఓ పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్. ఇది.. కశ్మీర్‌కు ఆర్థికంగా కీలకమైన రంగం. హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా, ఉగ్రవాదులు టూరిజం రంగాన్ని దెబ్బతీసి.. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దాడి.. కశ్మీర్‌ని సందర్శించాలనుకునే టూరిస్టుల్లోనూ భయాన్ని సృష్టిస్తుంది. ఆ ప్రాంతంలో శాంతితో పాటు సాధారణ స్థితిని దెబ్బతీసి.. కశ్మీర్ టూరిజంపై కోలుకోలేని దెబ్బకొడుతుందని ఉగ్రమూకలు భావించి ఉండొచ్చంటున్నారు. వాస్తవానికి.. ఆర్టికల్ 370 ఎప్పుడైతే రద్దయ్యిందో.. అప్పట్నుంచే కశ్మీర్ సరైన ట్రాక్‌లోకి వచ్చింది.
ఒక్క ఉగ్రదాడితో కశ్మీర్‌లో మారిపోయిన సీన్
ఉగ్రవాదులు ఎంతగా పర్యాటకులను భయపెట్టారంటే.. నిజమైన భారత ఆర్మీని చూసినా ప్రజలు గజగజవణికిపోయేంతలా..! ఉగ్రదాడులు సమాచారం అందగానే భారత్ ఆర్మీ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకుంది. అయితే పర్యాటకులను రక్షించడానికి ప్రయత్నిస్తుండగా అక్కడున్న మహిళలు, పిల్లలు సైనికులను కూడా ఉగ్రవాదులే అనుకుని భయంతో వణికిపోయారు. ఉగ్రవాదులు మళ్లీ ఆర్మీ దుస్తుల్లో తమపై దాడి చేయడానికి వచ్చారని వణికిపోయారు. సైనికులను చూసిన ఓ మహిళ తన పిల్లలను ఏమీ చేయవద్దంటూ చేతుల జోడించి వేడుకుంది. ఇతర పర్యాటకులు కూడా భయంతో తమ పిల్లలను దాచేందుకు ప్రయత్నించారు. అయితే ఓ సైనికుడు వారికి ధైర్యం చెప్తూ.. తాము భారత ఆర్మీగా పరిచయం చేసుకుంటూ..మిమ్మల్ని రక్షించడానికే ఇక్కడికి వచ్చామని భరోసా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.
కశ్మీర్ ఎప్పటికీ ప్రశాంతంగా ఉండకూడదనే ఆలోచన
కశ్మీర్ ఎప్పటికీ ప్రశాంతంగా ఉండకూడదనేది ఉగ్రవాదుల ఆలోచన. కశ్మీర్ ప్రశాంతంగా ఉంటే.. ఉగ్రవాద సంస్థలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటాయి. అందుకే.. ఇలాంటి ఉగ్రదాడులకు తెగబడుతుంటాయ్. టెర్రరిస్టులకు.. కశ్మీర్ ఎప్పటికీ రగులుతూనే ఉండాలి. ఇక్కడ ప్రశాంతత నెలకొంటే.. కశ్మీర్ పూర్తిగా ఇండియా కంట్రోల్‌లోకి వెళ్లిపోతుందనే ఆలోచనతో ఉన్నాయి ఉగ్రవాద సంస్థలు. ఇప్పటికే కశ్మీర్‌లో పరిస్థితులు మారిపోయాయి. లోయలో స్థిరత్వం నెలకొంది. టూరిజం పెరిగింది. స్థానికంగా ఉన్న ముస్లింలు కూడా బాగుపడుతున్నారు. ఇదిలాగే కొనసాగితే కశ్మీర్ తమకు కాకుండా పోతుందనే లెక్కల్లో ఉన్నారు. కశ్మీర్ ఎప్పటికీ.. ముస్లింల రాజ్యమేననే భావనలో ఉన్నాయి ఉగ్రమూకలు.
కశ్మీర్ ముస్లింల భావనలో ఉగ్రమూకలు
అందుకోసమే.. హిందువులు అక్కడ అడుగుపెడితే.. ప్రాణాలకు గ్యారంటీ లేదనే భయాన్ని సృష్టించేందుకే.. పెహల్గాంలో ఈ స్థాయిలో దాడికి తెగబడ్డారు. కానీ.. ఈ ఉగ్రదాడులు అక్కడి ముస్లింలకే నష్టం చేస్తున్నాయ్. టూరిజం పడిపోతే.. వారి ఉపాధి దెబ్బతింటుంది. కశ్మీర్ ఆర్థిక వ్యవస్థ బలహీనమైపోతే.. స్థానికుల బతుకులు దుర్భరంగా మారతాయ్. ఇది.. కశ్మీర్‌లోని స్థానికులకు కూడా అర్థమైంది. ఈ ఉగ్రదాడులను వాళ్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఉగ్రవాదులకు మద్దతిచ్చే చర్యలు కూడా చాలా వరకు తగ్గించారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి.. కేవలం మతపరమైనదే కాదు. మత భావజాల వ్యాప్తి, రాజకీయ వ్యతిరేకత, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం లాంటి ఉద్దేశాలతో కూడుకున్నది. ఇదిలాగే కొనసాగితే అంతిమంగా నష్టపోయేది కశ్మీరీలే. ఆ ప్రాంతం బాగుపడాలంటే.. ఉగ్రదాడులు పూర్తిగా ఆగిపోవాలి. కశ్మీర్‌లో మళ్లీ స్థిరమైన ప్రాంతంగా మారాలి.