BigTV English

Tirupati Stampede Incident: ఏడు కొండలవాడా ఏంటీ ఘోరం.. తొక్కిసలాట ఘటనకు కారకులెవరు?

Tirupati Stampede Incident: ఏడు కొండలవాడా ఏంటీ ఘోరం.. తొక్కిసలాట ఘటనకు కారకులెవరు?

తిరుపతి తొక్కిసలాటతో తీరని విషాదం

తిరుమల శ్రీనివాసుడంటేనే ఆపద్భాందవుడు, భక్తవత్సలుడు, కష్టనివారకుడు.. మరి తన దర్శనానికి వచ్చే ఆ భక్తులను పరీక్షించాలనుకున్నాడో ఏమోగానీ ఆయన పాదాల చెంతనే ఘోరం జరిగిపోయింది. గరుడ వాహనాన్ని అధిరోహించి.. ముక్కోటి దేవతలతో కలిసి.. వైకుంఠ ఏకాదశి రోజున ఆ దివి నుంచి భువికి వచ్చే ఆ దేవ దేవున్ని కనులారా వీక్షించి, తరించాలనుకునేందుకు భక్తులు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వచ్చింది. నిత్యనిర్మలుడు, నీలమేఘశ్యాముడైన ఆ పురాణ పురుషున్ని రెప్పపాటు దర్శనం చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు క్యూలైన్లలోనే ఆగిపోయాయి. తోటి భక్తుల పాదాల కింద నిండు ప్రాణాలు బలైపోయాయి.


దేవదేవుని దర్శనం కోసం ఎదురుచూపులు

వైకుంఠ ఏకాదశి రోజున ఆ దేవదేవుని దర్శం కోసం భక్తజనకోటి వేయి కళ్లతో ఎదురుచూస్తుంటుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ ఏడుకొండలవాడిని స్మరించుకుంటూ రెప్పపాటు దర్శించుకుంటే చాలు అనుకుంటారు. ఉత్తర ద్వార దర్శనం ద్వారా పుణ్యఫలం వస్తుందనుకుంటారు. కానీ ఆ శుభ ఘడియల కోసం ఎదురుచూసిన భక్తజనానికి నిరాశే ఎదురైంది. టోకెన్ల కోసం క్యూలైన్లో నిలబడి, తొక్కిసలాటలో నలిగిపోయి ఆరుగురి నిండు ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి.

దర్శనాలకు భక్తులు పోటెత్తుతారని తెలియదా?

తిరుమల, తిరుపతిలో ఎంత మంది భక్తులు వచ్చినా గతంలో ఇలాంటి ఘటనలు జరగలేదు. మరి ఇప్పుడే ఎందుకు జరిగింది? ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి వస్తుంటుంది. దర్శనాలకు భక్తులు పోటెత్తుతారు. ఇదంతా సహజమే. జరగాల్సిన ఏర్పాట్లు జరుగుతాయి. మరి ఇప్పుడే టీటీడీకి ఏమైంది? తప్పు ఎక్కడ జరిగినా.. ఎవరు చేసినా మొత్తం వ్యవస్థకే ఇబ్బందికరంగా మారింది. భక్తుల రాకపై లెక్క తప్పిందా? లేక శ్రద్ధ తగ్గిందా? లేక అలసత్వం పెరిగిందా..? కారణాలు ఆ దేవుడికే ఎరుక. కానీ జరగరాని ఘోరమైతే జరిగిపోయింది.

రోజూ 70 వేల మంది భక్తులతో కిటకిట

తిరుమల అంటేనే నిత్యకల్యాణం పచ్చతోరణం. ప్రతి రోజూ 60-70 వేలకు తగ్గకుండా భక్తజనకోటితో ఎప్పుడూ శ్రీనివాసుని సన్నిధి కిటకిటలాడుతూ కనిపిస్తుంది. ఇక పండుగలు, ఇలాంటి ముక్కోటి ఏకాదశి వచ్చినప్పుడు రద్దీ గురించి చెప్పనవసరం లేదు. రద్దీని తప్పించేందుకు టోకెన్ల వ్యవస్థ వచ్చింది. టైమ్ స్లాట్ దర్శనాలు వచ్చాయి. గంటల తరబడి క్యూల్లో నిల్చోకుండా, ఉండకుండా వ్యవస్థలు తీసుకొచ్చారు. మరి భక్తుల ప్రయాసను తగ్గించే క్రమంలో జారీ చేసే టోకెన్ సిస్టమ్ ఎలా ఉండాలి? ఎలా ఉండొద్దో, ఎలా నిర్వహించకూడదో.. ఇప్పటి ఘటనలో ఆ లోపాలు బయటపడ్డాయి.

తిరుమల కొండపై సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం అని పాలకమండలి ఎప్పుడూ చెప్పే మాట. ముఖ్యంగా టైం స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల విషయంలో జరిగిన ఈ లోపాలు ఇప్పుడు సరి చేసుకోవాల్సిన టైం వచ్చేసింది.

అసలు జనవరి 8న తిరుపతిలో ఏం జరిగింది?

తిరుపతిలో 8 కేంద్రాల దగ్గర ముక్కోటి ఏకాదశి టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు ఇవ్వాలని టీటీడీ డిసైడ్ అయింది. ఒక్కో సెంటర్‌లో 10 టోకెన్‌ జారీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి మొత్తం ఒక లక్షా 20 వేల టోకెన్లు జారీ చేస్తామని ముందే క్లారిటీ ఇచ్చేశారు. దీంతో తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. జనవరి 9 గురువారం ఉదయం 5 గంటలకు కౌంటర్లు ఓపెన్ చేస్తామన్నారు.

10, 11, 12 తేదీలకు 1.20 లక్షల టోకెన్లు రెడీ

మరి లక్ష 20వేల టోకెన్లు జారీ అంటే ఏ స్థాయిలో పబ్లిక్ ఉంటారో టీటీడీ అధికారులు ఊహించలేకపోయారా? ప్రతి సెంటర్ లో దగ్గర దగ్గర 10 వేల మందికి పైగానే భక్తులు పోగయ్యారంటున్నారు. బుధవారం అంతా ముక్కోటి ఏకాదశి సర్వదర్శనం టోకెన్ల కోసమే జనం తిరుపతి అంతా తిరిగారు. అక్కడ జనం తక్కువగా ఉన్నారంటే ఇక్కడ తక్కువగా ఉన్నారని, ఈజీగా దర్శనం టోకెన్లు దొరుకుతాయంటూ భక్తులు తిరుపతిలో టోకెన్ కౌంటర్ల చుట్టూ చక్కర్లు కొట్టారు.

బైరాగిపట్టెడ తొక్కిసలాటలో ఐదుగురు మృతి

8 సెంటర్లలో టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తే.. జీవకోన, బైరాగిపట్టెడ, విష్ణునివాసం, అలిపిరిలో తొక్కిసలాట జరిగింది. ఇందులో బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలోనే ఐదుగురు చనిపోయారు. విష్ణు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కేంద్రం దగ్గర మరొకరు చనిపోయారు.

మొదట జీవకోన జెడ్పీ స్కూల్ దగ్గర తోపులాట

మొదట జీవకోన వద్ద ఉన్న జెడ్పీ స్కూల్ దగ్గర స్వల్ప తోపులాట జరిగింది. రాత్రి 7 గంటల టైంలో భక్తులు ఒక్కసారిగా క్యూలైన్లలోకి వచ్చేందుకు ముందుకొచ్చారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా తోసుకుంటూ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఎస్పీ సుబ్బారాయుడు అక్కడికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. జీవకోన వద్ద సిచ్యువేషన్ కంట్రోల్ లోకి వచ్చిందని అనుకోగానే.. బైరాగిపట్టెడలోని రామానాయుడు హైస్కూల్‌ వద్ద రాత్రి 8 గంటల 15 నిమిషాలకు తొక్కిసలాట మొదలైంది.

భద్రత పెంచి ఉంటే ప్రాణాలు దక్కేవన్న వాదన

అక్కడ జనం ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో వచ్చారు. వారిని పద్మావతి పార్కులోకి పంపించారు. కనీసం మధ్యాహ్నం వరకైనా భద్రత పెంచి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలోనే ఐదుగురు చనిపోయారు. చనిపోయిన వారిని గుర్తించారు. అందులో నర్సీపట్నానికి చెందిన బుద్దేటి నాయుడుబాబు, విశాఖపట్నానికి చెందిన రజని, లావణ్య, శాంతి ఉన్నారు. అటు కర్ణాటకలోని బళ్లారికి చెందిన నిర్మల, తమిళనాడు సేలంకు చెందిన మల్లిగగా గుర్తించారు.

తొక్కిసలాట జరగడంపై రకరకాల ప్రచారాలు

బైరాగిపట్టెడ రామానాయుడు స్కూల్ క్యూలైన్లలో ఉన్న భక్తురాలికి అస్వస్థతగా ఉండడంతో రాత్రి 8.15కు ఓ డీఎస్పీ గేట్లు తెరిచాడని, అయితే టోకెన్ల కోసమే తెరిచారనుకుని జనం ఎగబడ్డారని, కొందరు భక్తులే అత్యుత్సాహం ప్రదర్శించారని, పోలీసులు అడ్రస్ లేకుండా పోయారని, కౌంటర్లలో భక్తులకు మంచినీళ్లు కూడా అందించలేకపోయారని, అందరినీ అలా వదిలేశారని, కనీసం తొక్కిసలాట జరిగాక అంబులెన్స్ డ్రైవర్లు కూడా వాహనాల దగ్గర లేకుండా పోయారని ఇలా రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. వాస్తవం ఏదైనా నిండు ప్రాణాలు పోయాయి. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి అంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, చూసుకోనక్కర్లేదా అని ఫైర్ అయ్యారు.

సర్వదర్శనం టోకెన్ సెంటర్ల దగ్గర వైఫల్యాలు

వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల కోసం ఈసారి తిరుపతిలో కొత్త టోకెన్ సెంటర్లు పెట్టారు. ఇది మంచిదే. అయితే ఆ సెంటర్లలో ఏర్పాట్లు కూడా సరిగా ఉండాలి కదా. కానీ అలా జరగలేదు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు మంచినీళ్లు, పిల్లలుంటే ఆహారం ఇలాంటివి అందించాలి. బారికేడ్లు పెట్టాలి. తగినంత భద్రతా సిబ్బంది ఉండాలి. అత్యవసర టీములను పెట్టాలి. కానీ ఇవేవీ జరగలేదని గుర్తించారు. పైగా కొన్ని సెంటర్లలో రెండు మూడు వేల మందే పట్టే అవకాశం ఉంటే అక్కడ పది వేలకు పైగా పోగై ఉన్నారు. అందులోనూ చాలా మందిని క్యూల్లోకి వదిలేశారు. కనీసం అలాంటి సందర్భంలోనైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేది. కానీ అది కూడా జరగలేదు.

క్యూలైన్లలో భక్తుల్ని కంట్రోల్ చేసేదెవరు?

జీవకోన టోకెన్ సెంటర్ లో మొదట అలజడి జరిగింది. దీంతో క్యూలైన్లు ఓపెన్ చేసేశారు అన్న సమాచారం మిగితా టోకెన్ సెంటర్లకూ వెళ్లిందన్న డౌట్లు ఉన్నాయి. దాంతో టోకెన్లు ఎక్కడ అయిపోతాయన్న ఆందోళన భక్తుల్లో పెరిగి తొక్కిసలాటకు దారితీసిందా అన్నది దర్యాప్తు చేస్తున్నారు. పైగా చాలా మంది కొత్త టోకెన్ సెంటర్లు ఎవరికీ తెలియవు అక్కడైతే ఈజీగా టోకెన్లు దొరుకుతాయనుకున్న భక్తులు ఎవరికీ తెలియకుండానే అక్కడే పెద్ద సంఖ్యలో పోగయ్యారు.

టోకెన్లు అయిపోతాయన్న ప్రచారంతోనే జరిగిందా?

ఇదో మైనస్ గా మారింది. నిజానికి వైకుంఠ ఏకాదశి అంటే రద్దీ విపరీతంగా ఉంటుంది. అందుకు తగ్గట్లు ఏర్పాటు చేయాల్సింది టీటీడీనే. ఎందుకంటే వేల కోట్ల ఆదాయం, దేవుడికి భక్తుల సమర్పించుకున్న హుండీ మొక్కులు వీటితోనే టీటీడీ నడుస్తుంది. మరి అలా భక్తులు సమర్పించుకున్న నిధులను వారి సంక్షేమం కోసం ఎలా ఉపయోగించాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి?

1.20 లక్షల టోకెన్ల జారీకి ఏర్పాట్లు సరిపోయాయా?

నిజానికి భక్తుల రద్దీ ఎక్కువుంటుందని తెలుసు కాబట్టి 8 చోట్ల కంటే ఎక్కువ కౌంటర్లు పెట్టినా పెద్దగా నష్టం ఉండకపోయేది. దీంతో భక్తుల సంఖ్య తగ్గి ఉండేది. మూడు రోజుల్లోనే 1.20 లక్షల టోకెన్లు జారీ చేయాలని అనుకున్న అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవడమే అసలు సమస్యగా మారింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నా.. వారి గురించి ముందుగా అంచనా వేయలేకపోవడం మరో మైనస్. రామానాయుడు స్కూల్ దగ్గర పద్మావతి పార్క్ లో కూర్చున్న వారిని ఒక్కసారిగా వదలడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడమే అక్కడ ఐదుగురి మృతికి కారణమైంది.

భక్తులు క్యూలో ఉంటే సౌకర్యాలు కల్పించారా?

ఇదే కాదు.. గంటల తరబడి క్యూలైన్లలో ఉన్న భక్తులు అస్వస్థతకు గురైన పరిస్ధితులు ఉన్నా.. కనీసం వాటర్ సౌకర్యం కూడా ఎందుకు కల్పించలేదన్నది పాయింట్. వేలసంఖ్యలో భక్తులు కిక్కిరిసినా.. సరైన పోలీస్ ఫోర్స్ గానీ, అత్యవసర సర్వీసులు గానీ ఏర్పాటు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న మాట. భక్తులను ఉంచే పార్క్, క్యూ లైన్లలో ఎవరికైనా అస్వస్థత జరిగితే అత్యవసర మార్గాలు, భక్తులకు సౌకర్యాలు కల్పించే ఏర్పాటు చేయకపోవడంపై విపక్షం మండి పడుతోంది. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఇలాంటి ఘటన జరగనివ్వబోమన్నారు. దర్యాప్తు జరుగుతుందన్నారు. బాధ్యులపై చర్యలుంటాయన్నారు మంత్రులు.

మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా

టీటీడీ చరిత్రలో ఇదో పెద్ద గుణపాఠమే. ఎందుకంటే ఆఫ్ లైన్ టిక్కెట్ కౌంటర్లు ఎలా పెట్టాలి? ఎలా పెట్టకూడదు. టెక్నాలజీ ఉపయోగించి ఎలా ఇవ్వాలి.. తొక్కిసలాట జరగకుండా ఏం చేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. టోకెన్ దొరుకుతుందా దొరకదా అన్న డౌట్లతో ఉన్న భక్తుల్ని కంట్రోల్ ఎలా చేయాలి? ఎంత ఫోర్స్ పెట్టాలి.. ఎన్ని టోకెన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.. ఇవన్నీ కీలకమే. అయితే ఆరుగురు చనిపోయిన ఈ ఘటనలో ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×