CM Chandrababu: బడా పారిశ్రామికవేత్త అదానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్ లింకులపై ఏపీ సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జగన్‌కు అదానీ సంస్థల నుంచి భారీ ఎత్తున లంచాలు అందాయన్న ఆరోపణలపై టీడీపీ నేతలు సహా అందరూ రచ్చరచ్చ చేస్తున్నా.. చంద్రబాబు మాత్రం దానిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం లేదు.. దాంతో అసలు ఆయన మౌనం వెనుక లెక్కేలేంటి అన్నదానిపై పెద్ద చర్చే జరుగుతుంది. అదానీకి మోడీతో ఉన్న బంధం సీఎంని కట్టిపడేస్తుందా? ఇప్పటికే ఒప్పందాలు కుదిరిన ప్రాజెక్టులు వెనక్కి వెళ్లిపోతాయనా? ఓవరాల్‌గా ఈ మొత్తం వ్యవహారం చంద్రబాబు అనుభవానికి పరీక్షగా మారిందా?
బడా ఇండస్ట్రియలిస్ట్ గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ డిస్ట్రిక్ కోర్టులో నమోదైన లంచాల కేసులో జగన్ సర్కార్ పాత్ర వెలుగు చూడటం రాజకీయంగా కలకలం రేపుతుంది. సోలార్ విద్యుత్ ఒప్పందాల కాంట్రాక్టులు దక్కించుకునేందుకు ఐదు రాష్ట్రాల్లో ప్రభుత్వాధికారులకు 2,029 కోట్ల రూపాయలు లంచాలు ఇవ్వాలని అదానీ గ్రూపు నిర్ణయించిందని అమెరికా ప్రాసిక్యూటర్ కేసు పత్రాల్లో పేర్కొన్నారు. ఆనాటి వైసీపీ ప్రభుత్వ పెద్ద జగన్‌కే రూ.1750 కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరిందని ఎఫ్‌బీఐ లాంటి అంతర్జాతీయ నిఘా సంస్థ అభియోగాలు మోపింది.
సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా..సెకీతో 7 గిగావాట్ల సౌర విద్యుత్ కొనేందుకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థలు కుదుర్చుకున్న పవర్ సేల్ అగ్రిమెంట్‌తో ఈ లంచాలకు అంకురార్పణ జరిగిందంటున్నారు. 2021- 2022 మధ్య సోలార్ విద్యుత్ కొనుగోలు చేసేందుకు సెకీతో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్‌గడ్, జమ్మూకశ్మీర్ ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందాల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్ డిస్కంలు 7 వేల మెగావాట్లను సరఫరా చేసేందుకు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. 2025 జనవరి నుంచి విద్యుత్ సరఫరా చేస్తామని సెకీ ఒప్పందంలో పేర్కొంది. అయితే అదానీ పవర్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌ను ఏపీకి సరఫరా చేయాలని సెకీ నిర్ణయించింది.
2021లో నాటి సీఎం జగన్ నివాసానికి వచ్చిన గౌతమ్ అదానీ చర్చలు జరిపిన తర్వాతే డిస్కంలు సెకీతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే ఆ ఒప్పందాలు కుదరడానికి తెరవెనక పెద్ద భాగోతమే జరిగిందని అమెరికా కోర్టులో నమోదైన కేసు పత్రాల ద్వారా తెలుస్తోంది. అధిక ధరల కారణంగా సెకీ నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏ ప్రభుత్వ సంస్థా ముందుకు రాకపోవడంతో అదానీ గ్రూపు ప్రతినిధులు లంచాలు ఎరవేసినట్లు అమెరికన్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. ఆ క్రమంలో జగన్‌తో అదానీ ఎప్పుడెప్పుడు తాడేపల్లి ప్యాలెస్‌లో భేటీ అయ్యారో అమెరికా సంస్థలు తమ దర్యాప్తు నివేదికల్లో తేదీలతో సహా స్పష్టం చేశాయి. ఆ భేటీల వివరాలన్నీ జగన్ ప్రభుత్వం సీక్రెట్‌గా ఉంచింది. ఆ భేటీ తర్వాతే అదానీ గ్రూపుతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల జరిగాయి. అప్పుడే గంగవరం పోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాటాను అదానీకి విక్రయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
Also Read: జమిలి ఎన్నికలు.. మోదీకి, చంద్రబాబు షాక్
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అదానీ 1,750 కోట్ల రూపాయలు జగన్‌కే ఆఫర్ చేశారంటే వారి మధ్య బంధం అర్థమవుతుందంటున్నారు. గత ఐదేళ్లలో అదానీకి కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, పలు విద్యుత్ ప్రాజెక్టులు, 27 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అమర్చే కాంట్రాక్ట్‌లు ఇలా చాలానే కట్టబెట్టింది జగన్ ప్రభుత్వం. గత ఐదేళ్లలో ఏపీలో అదానీకి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ 2 లక్షలా 76 వేల 333 కోట్లు రూపాయలంట. మరి వాటికి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయల ముడుపులు అందాయోనన్న చర్చ మొదలైంది.
ప్రస్తుతం ఎక్కడ చూసినా అదానీ గ్రూప్ గురించి తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి. ఏపీలో ఈ సెగ మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా జగన్ కూడా ముడుపులు తీసుకున్నారు అంటూ వచ్చిన వార్తలు.. అమెరికాలో నమోదైన కేసుల నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు కాస్త వేడెక్కాయి. ఈ విషయంపై కూటమి నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే అందరికంటే దూకుడుగా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. జగన్ అవినీతి రాష్ట్రాన్ని, దేశాన్ని దాటి అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది అని పలువురు సభ్యులు సభలో ప్రస్తావించారు. చంద్రబాబు మాత్రం ఈ విషయంపై నేరుగా స్పందించడం లేదు.
తమ ప్రభుత్వం పరిస్థితిని అంచనా వేసి, సాక్ష్యాధారాల ఆధారంగా చర్యలు తీసుకుంటుందని చంద్రబాబు అంటున్నారు. ఈ విషయంపై ఎంతో సున్నితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఓ ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అదానీ గుజరాత్ కి చెందిన వ్యాపార సంస్థ.. పైగా అదానీ ఇటు మోడీకి, అటు అమిత్ షాకు ఆప్తుడు. కాబట్టి ఆయనకు బీజేపీ తో అవినాభావ సంబంధం ఉంది. అందుకే చంద్రబాబు ఈ విషయంపై డైరెక్ట్ గా స్పందించడం లేదు అన్న వాదన ఉంది. అదే సమయంలో జగన్‌ని టార్గెట్ చేస్తే .. అదానీ గ్రూపుతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల అమలు ప్రశ్నార్ధకమవుతుంది. అప్పుడు పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి..అందుకే చంద్రబాబు వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబిస్తున్నట్లు కనిపిస్తుంది.