Sugavasi Balasubramanyam: కడప జిల్లా రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న చరిత్ర సుగవాసి కుటుంబానిది.. సుగవాసి బాలసుబ్రమణ్యం తండ్రి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీగా సేవలందించారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి సుబ్రమణ్యం ఓటమి పాలయ్యారు. అలాంటి కుంటుంబం నేడు పార్టీలో ఎదరవుతున్న అవమానాలు, వర్గపోరు భరించలేక రాజీనామా చేస్తున్నట్లు అధినేతకు లేఖ రాయడం జిల్లా రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. సుదీర్ఘ రాజకీయం అనుభవం కలిగిన ఆ కుటుంబం అసలు టీడీపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? వారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి?
ఉమ్మడి కడప జిల్లాలో సుగవాసి పాలకొండ్రాయుడు అంటే తెలియని వారుండరు.. అన్న ఎన్టీఆర్ కంటే ముందే రాజకీయ ఆరంగ్రేట్రం చేసి 1978లోనే తొలి సారి రాయచోటి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్టీఆర్ పిలుపుతో తెలుగు దేశం పార్టీలో చేరి జిల్లా రాజకీయాల్లో తనదైన మార్క్ చూపించారు. పాలకొండ్రాయుడు నాలుగు సార్లు రాయచోటి నుంచి ఎమ్మెల్యేగా, ఒకసారి రాజంపేట ఎంపీగా గెలిచారు . తండ్రి వారసత్వం అందిపుచ్చుకుని రాజకీయాల్లోకి వచ్చిన సుగవాసి బాలసుబ్రమణ్యం రాజంపేట నుంచి గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
సుగవాసి బాలసుబ్రమణ్యం ఒకసారి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పని చేశారు. అలాంటి సుగవాసి కుటుంబం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రజల అభిప్రాయాలు, సూచనలు, మనోభావాల మేరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సుగవాసి బాలసుబ్రమణ్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ రాశారు . రెండు రోజుల క్రితం తండ్రి సంస్మరణ సభలో కూడా ఆయన తమ్ముడు సుగవాసి ప్రసాద్ బాబు టీడీపీలో విభేదాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సుగవాసి కుటుంబం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం వెనుక పార్టీలో అంతర్గత విభేదాలే కారణం అంటున్నారు వారి అనుచరులు. గత ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసిన బాలసుబ్రమణ్యం ఓటమికి పార్టీలో ఓ సామాజిక వర్గం నేతలు వెన్నుపోటే కారణమని ఆరోపిస్తున్నారు. రాజంపేట టీడీపీలో ఆ సామాజికవర్గం నేతలు వైసీపీ అభ్యర్థితో కుమ్మక్కు అయ్యారని రాజంపేటలో జోరుగా ప్రచారం సాగింది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా నియోజకవర్గం ఇన్చార్జ్ విషయంలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయట.
నియోజకవర్గ లో జరుగుతున్న పరిణామాలపై అధినేతకు విన్నవించినా లైట్ తీసుకున్నారని సుగవాసి తీవ్ర అసంతృప్తి కి లోనయ్యారట. గత కొంత కాలంగా తమ భవిష్యత్తు పై అంతర్మధనం చెందుతూ చివరికి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల తండ్రి సంస్మరణ సభలో సుబ్రమణ్యం తమ్ముడు ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ ఏదైనా వచ్చే ఎన్నికల్లో సుగవాసి కుటుంబం రాయచోటి నుంచి పోటీలో ఉంటుందని ఆయన ప్రకటించారు. దాంతో సుగవాసి కుటుంబం తెలుగుదేశంపై పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. మరి సుగవాసి ఏ పార్టీ బాట పడతారనేది చూడాలి.
Also Read: ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం.. ఎకనామిక్ రీజియన్‌గా విశాఖ
ఏదేమైనా సుగవాసి రాజీనామా తెలుగుదేశం పార్టీకి పెద్ద షాకే అంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీకి చెందిన మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ, జనసేన, బీజేపీలో చేరుతున్నారు. అయితే ఇప్పుడు టీడీపీకే ఓ సీనియర్ నేత రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇటీవల కడపలో మహానాడు ముగిసిన కొద్దికాలానికే ఆ జిల్లాకి చెందిన ఓ కీలక నేత టీడీపీకి రాజీనామా చేయడం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది.
-Story By apparao, Bigtv Live