CM Chandrababu: బంగారు కుటుంబాలే లక్ష్యం. దీని ద్వారా దారిద్రాన్ని సమూలంగా అంతమొందించడమే ధ్యేయం. ఇక మంత్రి మండలిలో కీలకాంశాలేంటి? ఆ వివరాలు ఎలాంటివి? ఎకనామిక్ రీజియన్ గా విశాఖ, పోలవరం బనకచర్ల ప్రాజెక్టు.. దాని సాధ్యాసాధ్యాలు.. ఆపై మామిడి పొగాకు రైతుల సమస్యల సాధనకై ప్రభుత్వ ఏర్పాట్లు వంటి అంశాలు ఈ వారం సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల ద్వారా వెలుగులోకి వచ్చిన విషయాలు.
జూన్ 2, సోమవారం(మైల్ స్టోన్ లాంటి అగ్రిమెంట్)
రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ కోసం అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి తమ ప్రభుత్వం ఇస్రోతో ఒప్పందం కుదుర్చుకుందని అన్నారు సీఎం చంద్రబాబు. ఉపగ్రహ చిత్రాలు, సైంటిఫిక్ ఇన్ పుట్స్ లో AWARE ప్లాట్ ఫామ్ ని మెరుగు పరచుకోడానికి.. ఇస్రోతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నామని అన్నారు సీఎం చంద్రబాబు.
AWARE ప్లాట్ ఫామ్ ని మెరుగు పరచుకోడానికి..
రియల్ టైం గవర్నెన్స్ కోసం.. స్పేస్ టెక్నాలజీ వాడుకోవడం ఒక మైలురాయిలాంటిదని అభివర్ణిచారు సీఎం చంద్రబాబు. జూన్ రెండున షార్ డైరెక్టర్ రాజరాజన్ సమక్షంలో ఆర్టీజీఎస్ చైర్మన్ ప్రఖార్ జైన్ మధ్య ఐదేళ్ల అవగాహనా ఒప్పందంపై సంతకం చేసినట్టు ఎక్స్ పోస్ట్ ద్వారా తెలియ చేశారు. ఈ సహకారంలో భాగంగా వ్యవసాయం, వాతావరణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక మొదలైన 42 అప్లికేషన్లకు పైగా ఉపగ్రహ చిత్రాలు సైంటిఫిక్ ఇన్ పుట్స్ ద్వారా.. ఈ AWARE ప్లాట్ ఫామ్స్ లో పొందు పరచనున్నారు.
ఉపగ్రహ చిత్రాలు,సైంటిఫిక్ ఇన్ పుట్స్ తో..
AWARE ఉపగ్రహాలు, డ్రోన్లు, IoT, సెన్సార్లు, మొబైల్ ఫీడ్‌లు, CCTVల నుంచి డేటాను అనుసంధానిస్తుందీ టెక్నాలజీ, ఇది పౌరులు, ప్రభుత్వానికి SMS, WhatsApp వంటి సోషల్ మీడియా రూపంలో రియల్-టైమ్ హెచ్చరికలు, సలహాలను అందిస్తుందని అన్నారు చంద్రబాబు.
ఏపీని ప్రపంచంలోనే ప్రముఖ టెక్ హబ్ గా నిలిపేలా అడుగులు
ఇదే జూన్ 2న మరో ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. ఏపీని ప్రపంచంలోనే ప్రముఖ టెక్ హబ్ గా నిలిపేలా అడుగులు వేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా రాష్ట్రాన్ని టెక్ హబ్ గా నిలబెట్టేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా నాస్కామ్ బృందంతో సమావేశమయ్యారు. సోమవారం నాడు సీఎంని కలసిన నాస్కామ్ బృందంలో అధ్యక్షుడు రాజేష్ నంబియార్, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ శ్రీనివాస్ ER&D అధిపతి శివ ప్రసాద్ పొలిమెట్ల తదితరులు ఉన్నారు.
నాస్కామ్ బృందంతో సమావేశమైన సీఎం
దేశం టెక్నాలజీ పరంగా విశేషంగా దూసుకెళ్తోంది. ముఖ్యంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఇంజీనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే రద్దీగా ఉన్న నగరాలకు బదులు ఏపీ ఒక ప్రత్యామ్నంయంగా నిలుస్తుందని వారికి వివరించారు సీఎం చంద్రబాబు. అందుకు తగిన తోడ్పాటును అందించాల్సిందిగా వారిని కోరారు.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సమీక్షా సమావేశం నిర్వహించారు చంద్రబాబు. ప్రజల నుంచి ఎంతో మంచి స్పందన వస్తోందని.. ఈ సమీక్షా సమావేశం సందర్భంగా అన్నారు చంద్రబాబు. పూర్తి స్థాయి సన్నద్దతతో ప్రజల భాగస్వామ్యంతో అత్యధికులు ఈ కార్యక్రమంలో పాల్గొని గిన్నిస్ బుక్ రికార్డు క్రియేట్ చేయాలన్న టార్గెట్ రీచ్ అయితే బాగుంటుందని అన్నారు.
యోగా ఫర్ వన్ ఎర్త్- వన్ హెల్త్ థీమ్ తో యోగా డే
జూన్ 21న ప్రధాని మోడీ విశాఖ వస్తుండటంతో.. ఈ కార్యక్రమాన్ని యోగాంధ్ర ప్రదేశ్- 2025 పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగానిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నారు. యోగా ఫర్ వన్ ఎర్త్- వన్ హెల్త్ థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని.. వీటిని దృష్టిలో పెట్టుకుని ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. ఏర్పాట్లు చేయాలన్నారు చంద్రబాబు. ప్రీ ఈవెంట్ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అంతే కాదు ప్రతి విద్యా సంస్థతో పాటు అవకాశమున్న ప్రతి సంస్థను కలుపుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో.. మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, వంగలపూడి అనిత, డోలా బాలవీరాంజనేయ స్వామి, సత్యకుమార్ తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్త హాజరయ్యారు.
జూన్ 3, మంగళవారం(ఓడరేవుల అభివృద్ధే లక్ష్యంగా)
ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు చంద్రబాబు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట ఓడరేవుల ఫేజ్-1 పనులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు చంద్రబాబు. జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల ఫేజ్- 1 నిర్మాణాన్ని కూడా ఇదే సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఓడరేవులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై సమీక్ష
మంగళవారం ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం చంద్రబాబు.. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు ఏపీకి విలువైన ఆర్ధిక వనరులని అన్నారు. స్థానిక మత్స్యకార వర్గాలకు అసౌకర్యం కలిగించకుండా ఈ హార్బర్లను చిన్న ఓడరేవులుగా అప్ గ్రేడ్ చేసే అవకాశాలను అన్వేషించాలని తద్వారా ప్రాంతీయ ఆదాయాలు పెరుగుతాయని అధికారులకు వివరించారు.
కుప్పం, దగదర్తి, అమరావతి, పలాసలో కొత్త విమానాశ్రయాలు
కుప్పం, దగదర్తి, అమరావతి, పలాసలో కొత్త విమానాశ్రయాల కోసం ఫేజ్- 1 పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 20 ఓడరేవులు, 14 విమానాశ్రయాల అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని గుర్తు చేశారు. పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్ షిప్ కింద జాతీయ రహదారుల అనుసంధానం చేయాలని అన్నారు. పోర్టులు- విమానాశ్రయాలు- ఫిషింగ్ హార్బర్లను కలుపుతూ మౌలిక సదుపాయాల కల్పన చేయాలని అన్నారు. ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్ను త్వరలో స్థాపించేలా ప్రణాళికలకు సంబంధించి ప్రకటనలు చేశారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఏజెన్సీ ప్రాంతాలలో హెలిపోర్టులను సైతం ఏర్పాటు చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు.
ఏపీ లాజిస్టిక్ కార్పొరేషన్ త్వరలో ఏర్పాటు
మచిలీపట్నం పోర్టు నిర్మాణం 43 శాతం పూర్తయ్యిందని, వచ్చే ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. రామాయపట్నం పోర్టు తొలిదశ 63 శాతంపైగా పూర్తికాగా, మూలాపేట పోర్టు 46 శాతం పైగా, కాకినాడ గేట్ వై 30 శాతం పూర్తయ్యాయి. ఇక ఫిషింగ్ హార్బర్ల విషయానికి వస్తే.. జువ్వలదిన్నె 98శాతం, నిజాంపట్నం 81 శాతం, మచిలీపట్నం 69శాతం, ఉప్పాడ 79 శాతం పూర్తయిందని సీఎంకి రిపోర్ట్ చేశారు అధికారులు.
Jun 4న పీ4 కార్యక్రమం పై ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష
Jun 4న పీ4 కార్యక్రమం పై ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆగస్ట్ 15 నాటికల్లా 15 లక్షల బంగారు కుటుంబాలను దత్తతు తీసుకోవాలని అన్నారు సీఎం. మరింత వేగవంతంగా మార్గదర్శి నమోదు ప్రక్రియ చేయాలనీ అధికారులకు సూచించారు. రాజధాని భూసేకరణ, పీ4కు ఒక కేస్ స్టడీగా అభివర్ణించారు ముఖ్యమంత్రి. ఇప్పటివరకు 70వేల కుటుంబాలకు పీ4 ద్వారా సాయం చేశామని అన్నారు.
పీ4 కార్యక్రమం పై సీఎం చంద్రబాబు సమీక్ష
స్మార్ట్ ఏపీ ఫౌండేషన్‌ను స్వర్ణాంధ్ర- పీ4 ఫౌండేషన్‌గా మార్చాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. ఇందుకు అవసరమైన మార్గదర్శి రిజిస్ట్రేషన్, దత్తత ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. నాడు ఆర్థిక సంస్కరణల తర్వాత చేపట్టిన పీపీపీ విధానానికి కొనసాగింపుగానే నేడు పీ4 విధానం తీసుకువచ్చామని చెప్పారు.
రాజధాని భూ సేకరణ, పీ- 4కి ఒక కేస్ స్టడీ
రాజధాని నిర్మాణంలో 29వేల మంది రైతులను భాగస్వాములు చేయడం ద్వారా వారికి సంపద సృష్టి జరిగేలా చేశామని అన్నారు చంద్రబాబు. ఇదే స్ఫూర్తితో ప్రతి బంగారు కుటుంబాన్ని మార్గదర్శి దత్తత తీసుకుని వారి ఉన్నతికి కృషి చేయాలని అన్నారు. ప్రతి 10 రోజులకు ఒకసారి పీ4 పురోగతిని సమీక్షిస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు. మరోవైపు అధికారులు రూపొందించిన పీ4 లోగో డిజైన్లను పరిశీలించారు సీఎం.
ఇప్పటి వరకూ 70 వేల కుటుంబాలకు పీ-4 సాయం
పీ-4లో మిలాప్, ప్రాజెక్ట్ డీప్, రంగ్ దే, భార్గో వంటి సంస్థలు భాగస్వాములుగా పని చేసేందుకు ముందుకువచ్చినట్టు సీఎం చంద్రబాబుకి చెప్పారు అధికారులు. రాష్ట్రంలో 19,15,771 బంగారు కుటుంబాలు నమోదు కాగా.. వీరిలో ఇప్పటివరకు 70,272 కుటంబాలను మార్గదర్శులు దత్తత తీసుకున్నారని వివరించారు. వీరిలో అత్యధికంగా 26,340 బీసీ కుటుంబాలు, 14,024 ఎస్సీ కుటుంబాలు, 13,115 ఎస్టీ కుటుంబాలు ఉన్నాయని వివరించారు.
04- 06- 2025, బుధవారం(పలు కీలక నిర్ణయాల ఆమోదం)
సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఏపీ సచివాలయంలో కేబినేట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.
ఉద్దానం, కుప్పంలో ప్రజలకు రూ. 2 కే 20 లీటర్లు తాగునీరు
శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం, చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఎన్టీఆర్ సుజల స్రవంతి కింద నీటి శుద్ది చేసే ప్లాంట్‌లకు వయబులిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ క్రమంలో ఉద్దానంకు రూ. 5.75 కోట్లు, కుప్పంకు రూ. 8.22 కోట్లు కేటాయించనున్నారు. ఉద్దానం, కుప్పంలో ప్రజలకు రూ. 2 కే 20 లీటర్లు తాగునీరు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. వన్ టైం సెటిల్‌మెంట్ కింద వయబిలిటీ ఫండ్ ఇవ్వాలని నిర్ణయించింది ఏపీ కేబినేట్.
17మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టి విడుదల
2025, ఫిబ్రవరి 1వ తేదీ నాటికి యావ జీవ శిక్ష పడిన 17మంది ఖైదీలకు క్షమాబిక్ష పెట్టి విడుదల చేయాలని నిర్ణయించింది ఏపీ కేబినేట్. సత్ప్రవర్తన కల్గినందున ఈ యావజ్జీవ ఖైదీలకు క్షమాబిక్ష ప్రసాదించాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఖైదీల విడుదల చేయాలని నిర్ణయించారు.
248 మంది కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి
ఏపీఎస్పీలో 248 మంది కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పిస్తూ నిర్ణయించింది. వైఎస్ఆర్ జిల్లాను వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చుతూ మంత్రివర్గం ఆమోదించింది. ఫ్యాక్టరీల్లో మహిళా ఉద్యోగులకు ఇకపై రాత్రి పూట కూడా విధులు నిర్వహించేందుకు పూర్తి రక్షణతో కూడిన చట్ట సవరణలు చేసింది. కార్మిక చట్టాలు సరళంగా ఉంటే పెట్టుబడులు కూడా అధికంగా వస్తాయని మంత్రి మండలి అభిప్రాయపడింది. ఫ్యాక్టరీల్లో పని చేసే మహిళలకు ప్రస్తుతం ఒవర్ టైం 50 లేదా 75 గంటలు మాత్రమే పని చేసే అవకాశం ఉండేది. ఇకపై మహిళలు క్వాటర్‌లో 144 గంటలు ఒవర్ టైం చేసేందుకు నిబంధనలు మార్చుతూ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
విశాఖ యాత్రీ నివాస్ ఆధునీకరణకై రూ. 13. 50 కోట్లు
పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రోత్సహించడం కోసం నిబంధనలను సైతం సవరించామని స్పష్టం చేసింది ఏపీ కేబినేట్. విశాఖపట్నంలోని హరిత హోటల్‌లో యాత్రీ నివాస్‌ను అధునీకరించేందుకు పర్యాటక రంగం చేసిన ప్రతిపాదనకు రూ. 13 కోట్ల 50 లక్షల ఆమోదం తెలిపింది. విశాఖపట్నంలోని హరిత హోటల్ ఆధునీకరణకు టూరిజం శాఖ ఇచ్చిన ప్రతిపాదనలకు సైతం ఆమోదించింది.
50 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వ నిర్ణయం
రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజధానిలో క్వాంటం కంప్యూటర్, కృత్రిమ మేధ సంస్థల ఏర్పాటునకు మంత్రి మండలి ఆమోదించింది. క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థల ఏర్పాటునకు అమరావతిలో 50 ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్వాంటం కంప్యూటింగ్, ఏఐలో రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో ఏపీ నెంబర్ వన్ స్థానానికి చేరడమే లక్ష్యమని కేబినెట్ స్పష్టం చేసింది. క్వాంటం కంప్యూటింగ్, ఏఐ సంస్థల్లో స్కూళ్ల నుంచి యూనివర్సిటీ వరకు విద్యార్థులకు తర్ఫీదు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
జూన్ 21వ తేదీన విశాఖలో 5 లక్షల మందితో యోగా డే
ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21వ తేదీన విశాఖలో 5 లక్షల మందితో యోగా డే నిర్వహించాలని నిర్ణయించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అత్యధిక మందితో యోగా చేయించి గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పాలని భావిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపారు. ఈ పార్కుల్లో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన బడ్జెట్ విడుదలకు కేబినెట్ ఆమోదం లభించింది. ఈ ఏడాదిలో 25 ఈ- కేబినెట్లు నిర్వహించినందుకుఅనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం చంద్రబాబును అభినందించింది రాష్ట్ర కేబినేట్.
05- 06- 2025, గురువారం(మొక్కలు నాటండి- పర్యావరణం కాపాడండి)
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజధాని ప్రాంతంలోని అనంతవరం ఏడీసీఎల్ పార్క్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శించారు. వన మహోత్సవ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
06- 06- 2025, శుక్రవారం(పోలవరం- బనకచర్ల అనుసంధానం)
పోలవరం-బనకచర్ల అనుసంధానం, రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మంత్రి రామానాయుడు, జలవనరుల శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియ కూడా ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెలాఖరులోపు టెండర్లను పిలవాలనే దిశగా పూర్తి ప్రణాళికను రూపొందించాలన్నారు.
ప్రాజెక్టు వ్యయం రూ. 81,900 కోట్లు
ఈ ప్రాజెక్టు 81 వేల 900 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్టు చెప్పారు చంద్రబాబు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాటు విదేశీ ఆర్ధిక సంస్థల నుంచి నిధులు సమకూరనున్నాయి. ఇందులో యాభై శాతం విదేశీ నిధుల ద్వారా రుణం లభిస్తుండగా.. 20 శాతం కేంద్ర గ్రాంట్ రూపంలో, 10 శాతం రాష్ట్ర ప్రభుత్వ ఈక్విటీ రూపంలో మరో 20 శాతం హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ విధానంలో ఉంటాయని అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని సాగునీటి అవసరాలపై పెద్ద ఎత్తున సమస్య తీరుతుందని అన్నారు చంద్రబాబు. మరీ ముఖ్యంగా రాయలసీమ, దక్షిణాంధ్ర ప్రాంతాలకు ఇది జీవనాడిగా మారే అవకాశముందని అన్నారు. తాగునీరు, సాగునీరు అవసరాలను తీరుస్తూ రాష్ట్రం వ్యవసాయ ప్రగతికి మార్గం సుగమం చేయగల ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
06- 06- 2025, శుక్రవారం(ఎకనామిక్ రీజియన్ గా విశాఖ)
ఇదిలా ఉండగా విశాఖను విశాఖ ఎకనామిక్ రీజియన్ గా రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా తీర్చిదిద్దాలని సచివాలయంలో జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో సంబంధిత అధికారులను ఆదేశించారు.. సీఎం చంద్రబాబు. దేశంలోని టాప్ 3 స్టీల్ ప్లాంట్లతో విశాఖను స్టీల్ హబ్‌గా తీర్చిదిద్దడం, అలాగే పెట్రో కెమికల్స్, గ్యాస్ గ్రిడ్, పోర్టుల అభివృద్ధి, పెట్రోకెమికల్స్-మెడికల్ టెక్, షిప్ బిల్డింగ్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్, క్లీన్ టెక్, లేబర్ ఇంటెన్సివ్ మాన్యుఫాక్చరింగ్‌పై దృష్టి సారించాలని కోరారు.
6- 6- 2025(మామిడి, పొగాకు, కోకో పంటలకై)
మామిడి, పొగాకు, కోకో పంటలపై ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. పొగాకు రైతుల సమస్యలకు చెక్ పెట్టేలా.. మార్క్ ఫెడ్ నుంచి కొనుగోలు చేసేలా నిర్ణయించారు. రాష్ట్రంలో ఎఫ్సీవీ రకాన్ని ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనేది టొబాకో బోర్డు నిర్ణయించాలన్నారు. వైట్ బర్లీ పొగాకు రకాన్ని ఒప్పందం మేరకే సాగు చేయించి కంపెనీలే కొనుగోలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ దిశగా ఎలాంటి ఏర్పాట్లు చేశారో సీఎం చంద్రబాబుకు వివరించారు మంత్రి అచ్చెన్నాయుడు. ఇక 43 వేల మెట్రిక్ టన్నుల మ్యాంగో పల్స్ నిల్వలు కంపెనీల దగ్గర నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో వ్యాపారులు కేజీ మామిడి 12 రూపాయలకు కొనుగోలు చేయాలని ఆదేశించింది ప్రభుత్వం. వ్యాపారులు కనీసం 8 రూపాయలు ఇస్తే ప్రభుత్వం 4 రూపాయలు నేరుగా రైతులకే చెల్లించనుంది. అలాగే కోకో పంటలకు కనీసం 500 గిట్టుబాటు ధర చెల్లించేలా చూడాలని నిర్ణయించారు.
08- 06- 2025, ఆదివారం(దత్తాత్రేయ పుస్తకావిష్కరణలో సీఎం)
హర్యానా గవర్నర్, సీనియర్ రాజకీయవేత్త బండారు దత్తాత్రేయ రచించిన ప్రజల కథే నా ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాదులో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. దశాబ్దాల ప్రజాజీవితంలో దత్తాత్రేయ సాధించిన విజయాలు, ఆయన వ్యక్తిగత మైలురాళ్లు, సామాజిక సేవ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ఈ పుస్తకం కళ్లకు కడుతుందని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు.
-Story By Adinarayana, Bigtv Live