E-Paper
Advertisement

Osmania University: ఉస్మా `నయా` 100 కోట్ల నిధులతో యూనివర్సిటీ ఎలా మారబోతుందంటే..

Osmania University: ఉస్మా `నయా` 100 కోట్ల నిధులతో యూనివర్సిటీ ఎలా మారబోతుందంటే..

నిధుల్లేవు.. నియామకాల్లేవు.. తెలంగాణ ఉద్యమ జ్వాలను రగిలించిన ఉస్మానియా యూనివర్సిటీ.. కొన్నేళ్లుగా కళ తప్పింది. అలాంటి ఓయూపై.. రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. యూనివర్సిటీని.. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సంకల్పించింది. భవిష్యత్ తరాలపై పెట్టుబడిగా భావిస్తూ.. రేవంత్ ప్రభుత్వం వెయ్యి కోట్లు మంజూరు చేసింది. మరి.. ఓయూని ఎలా మార్చబోతున్నారు? ఉస్మానియాకు.. పునర్వైభవం వస్తుందా?

ఓయూకు పూర్వ వైభవం.. సరికొత్త ప్రణాళిక

ఉవ్వెత్తున ఎగసిన మలిదశ తెలంగాణ ఉద్యమానికి.. ఉస్మానియా యూనివర్సిటీ ఊపిరిలూదింది. కానీ.. తెలంగాణ రాష్ట్ర సాధన సంకల్పం నెరవేరాక.. ఓయూ ప్రతిష్ట మసకబారింది. ఉద్యమాల పురిటిగడ్డ ఓయూని.. గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. అలాంటి ఓయూకు పూర్వ వైభవం తీసుకురావాలని.. రేవంత్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఉస్మానియాకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. వెయ్యి కోట్లు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వెయ్యి కోట్ల నిధుల విడుదల జీవోను.. విద్యార్థులకు అంకితమిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దశాబ్దాలుగా నిధులు, నియామకాల కొరతతో కళ తప్పిన ఓయూకు.. ఈ నిర్ణయం ఓ కొత్త ఊపిరి పోయనుంది.

ఓయూకు 1000 కోట్లు మంజూరు..

తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న స్థానం అలాంటిలాంటిది కాదు. అదొక విద్యాసంస్థగా మాత్రమే కాదు.. ఓ ఉద్యమ స్ఫూర్తి కేంద్రం. నిజాం అరాచకాలకు వ్యతిరేకంగా, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయాలకు ఎదురొడ్డి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఇది. పీవీ నరసింహారావు, గద్దర్, జార్జి రెడ్డి లాంటి ఎందరో మేధావులను, మరెందరో నాయకులను, ప్రజాప్రతినిధులను అందించిన ఈ యూనివర్సిటీ.. గడిచిన కొన్నేళ్లలో నిధులు లేక, తగిన సిబ్బంది నియామకాలు లేక ఓయూ ప్రతిష్ట మసకబారింది. హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్‌లు శిథిలావస్థకు చేరాయ్. అలా.. ఓయూ తన ప్రాభవంతో పాటు విద్యార్థులపై ప్రభావాన్ని చూపడం కూడా కోల్పోతూ వచ్చింది. అందుకోసమే.. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే.. ఓయూకు వీసీని నియమించింది. యూనివర్సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు.. నిధులు మంజూరు చేసింది. ఇది.. ఓయూలో మరమ్మత్తుల కోసమో, విద్యార్థి లోకం దృష్టిని ఆకర్షించడం కోసమో చేసింది కాదు. దీనిని.. భవిష్యత్ తరాలపై పెడుతున్న పెట్టుబడిగా చూస్తోంది రేవంత్ సర్కార్. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

ఓయూలో కొత్త డిపార్ట్‌మెంట్ భవనాల నిర్మాణం

ఓయూలో ఇప్పుడున్న భవనాలకు మరమ్మత్తులు చేయడంతో పాటు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త అకడమిక్ బ్లాక్‌లు, డిపార్ట్‌మెంట్ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. విద్యార్థుల వసతి కొరతను తీర్చేందుకు.. అంతర్జాతీయ స్థాయిలో మెగా హాస్టళ్లను నిర్మించడంతో పాటు పాత హాస్టళ్లని పునరుద్ధరించనున్నారు. కాన్ఫరెన్స్‌లు, అంతర్జాతీయ సదస్సులకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సమావేశ మందిరాలని నిర్మించనున్నారు. అంతేకాదు.. అత్యాధునిక పరికరాలు, మౌలిక వసతులతో కూడిన రీసెర్చ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి. దాంతో.. ఓయూని ఓ రీసెర్చ్ సెంటర్‌గా తీర్చిదిద్దాలనే ప్రణాళికలున్నాయ్. ఇప్పటికే.. తెలంగాణలో సరికొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు.. వెయ్యి కోట్లతో స్పెషల్ స్టార్టప్ ఫండ్‌ని ఏర్పాటు చేశారు. ఈ స్ఫూర్తి ఓయూలోని యువతకు హెల్ప్ అవుతుంది. అంతేకాదు.. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కొరతను తీర్చేందుకు.. స్టాఫ్ భర్తీ కోసం కమిటీ కూడా ఏర్పాటు చేశారు. నాణ్యమైన బోధనని అందించడానికి ఇదెంతో కీలకం. మొత్తంగా.. ఓయూకు పూర్వవైభవం తీసుకురావడంలో.. వెయ్యి కోట్ల నిధుల కేటాయింపు అనేది తొలి అడుగు మాత్రమే. ఈ నిధులను.. ప్రణాళికబద్ధంగా, పారదర్శకంగా నిర్ణీత గడువులోగా వినియోగించగలిగితే.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు ఏమాత్రం తగ్గకుండా ఓయూ సిద్ధమవుతుంది. ముఖ్యంగా.. అధ్యాపక నియామకాలు, నాణ్యమైన పరిశోధన, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా.. ఓయూ తిరిగి దేశంలోనే అగ్రగామి యూనివర్సిటీల్లో ఒకటిగా నిలుస్తుంది.

ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా మారే అవకాశం

ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గకుండా మార్చడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ చొరవతో.. ఓయూలో అనేక మార్పులు రాబోతున్నాయ్. ముఖ్యంగా.. ఉస్మానియాను.. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలకు దీటుగా అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధమయ్యాయ్. అందుకనుగుణంగానే.. యూనివర్సిటీని ఆధునీకరిస్తున్నారు. ఓయూ క్యాంపస్‌లో ఉన్న చారిత్రక నిర్మాణాలను కాపాడుతూనే.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కొత్త నిర్మాణాలు చేపట్టనున్నారు. అభివృద్ధి పనుల ప్రణాళిక, డిజైన్ నమూనాలపై విద్యార్థులు, ప్రొఫెసర్ల అభిప్రాయాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈ అభివృద్ధి కేవలం మేడలు, గోడల కోసం కాదు.. నాణ్యమైన విద్య ద్వారా పేద విద్యార్థుల తలరాతను మార్చడమే లక్ష్యం. వెయ్యి కోట్ల నిధుల కేటాయింపు, అత్యున్నత స్థాయిలో మౌలిక వసతలు, అకడమిక్ ప్రమాణాలు గణనీయంగా పెరిగి.. ఉస్మానియో ఓ ప్రపంచ స్థాయి విద్యా కేంద్రంగా మారే అవకాశం ఉంది.

పదేళ్లలో ఓయూని పట్టించుకోని బీఆర్ఎస్

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉన్నా.. ఓయూని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. దాంతో.. ఓయూ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వచ్చింది. చదువుల నిలయంగా ఉండాల్సిన క్యాంపస్‌‌లోనూ ఊహించని మార్పులొచ్చాయ్. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఘన కీర్తి, గత వైభవం గుర్తుకొచ్చేది. కానీ.. గడిచిన కొన్నేళ్లలో ఓయూ ప్రతిష్ఠ మసకబారింది. మరి.. యూనివర్సిటీకి మళ్లీ మంచి రోజులు రావాలంటే.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంది? మౌలిక సదుపాయాల కల్పన, కొత్త బిల్డింగ్‌లతోనే.. ఓయూకు ఉన్న బ్రాండ్ తిరిగొస్తుందా?

యావత్ దేశంలోనే చారిత్రక విద్యాసంస్థగా.. ఓయూ

ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణలోనే కాదు, యావత్ దేశంలోనే ఓ చారిత్రక విద్యా సంస్థ. విద్య, పరిశోధన, సామాజిక మార్పుల్లో తనదైన ముద్ర వేసిన ఈ యూనివర్సిటీ.. గడిచిన కొన్నేళ్లలో అనేక సవాళ్లను ఎదుర్కొంటూ.. తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోయింది. ఇందులో.. ఎలాంటి డౌట్ అక్కర్లేదు. గత వైభవం నుంచి ప్రస్తుత స్థితికి దిగజారడానికి.. అనేక కారణాలున్నాయ్. నిధుల కొరత, మౌలిక వసతుల పట్ల నిర్లక్ష్యం, అధ్యాపక పోస్టుల ఖాళీలు, పరిశోధనలకు ప్రోత్సాహం లేకపోవడం లాంటి అనేక అంశాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయ్. ఇప్పుడు ఓయూకు కావాల్సింది సరికొత్త నిర్మాణాలే కాదు.. యూనివర్సిటీలో సమూలమైన మార్పులు రావాలి. అప్పుడు.. ఓయూ పూర్వ వైభవాన్ని, జాతీయ స్థాయిలో తన ప్రతిష్ఠను తిరిగి పొందగలుగుతుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి.. ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలు, దృష్టి సారించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయ్. ఓయూకు మళ్లీ మంచి రోజులు రావాలంటే.. ప్రభుత్వం మరమ్మత్తులు కొత్త బిల్డింగ్‌లకే పరిమితం కాకుండా.. విద్యలో నాణ్యత, పరిశోధన సంస్కృతి, పీహెచ్‌డీ కోర్సులు, పాలనా విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఓయూలో సరికొత్త కార్యక్రమాలు

ఏ విద్యా సంస్థ అభివృద్ధికైనా.. నిధులే ప్రధాన ఆధారం. గత ప్రభుత్వం ఈ విషయం మర్చిపోయిందనే వాదనలున్నాయ్. అందువల్ల.. ఓయూ అభివృద్ధి, పరిశోధన అవసరాల కోసం తగిన నిధులు కేటాయించాలి. దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక ఆధారంగా నిధులు విడుదల చేయాలి. విద్యా ప్రమాణాల పతనానికి ప్రధాన కారణం.. అర్హత కలిగిన అధ్యాపకుల కొరత కూడా ఒకటి. వెంటనే.. ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. కేవలం.. సంఖ్య కోసం కాకుండా అర్హత, పరిశోధన అనుభవం ఉన్నవారిని మాత్రమే నియమించాలి. లెక్చరర్లు, ప్రొఫెసర్లు తమ బోధనా నైపుణ్యాలను, పరిశోధనా జ్ఞానాన్ని మెరుగుపరుచుకునేందుకు వీలుగా.. జాతీయ, అంతర్జాతీయ శిక్షణా కార్యక్రమాలకు నిధులు సమకూర్చాలి. రీసెర్చ్ చేసిన వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ఓయూకు పూర్వ వైభవం రావాలంటే.. పరిశోధనలకే కీలకపాత్ర పోషిస్తాయ్. ఆధునిక, అత్యాధునికమైన సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి. ప్రయోగశాలలకు నిరంతరం నిధులు సమకూర్చాలనే సూచనలు వినిపిస్తున్నాయ్. అదేవిధంగా.. పరిశ్రమలతో బంధాన్ని బలోపేతం చేయాలి. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా కోర్సులు డిజైన్ చేయాలి. వాటికి అనుబంధమైన రీసెర్చ్ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా.. విద్యార్థులకు, యూనివర్సిటీకి ప్రయోజనం కలుగుతుంది. విద్యార్థుల స్టార్టప్‌లకు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించే.. ఇన్నోవేషన్ సెంటర్, ఇంక్యుబేషన్ హబ్‌ని ఏర్పాటు చేసి.. వారికి మెంటార్‌షిప్ అందించాలి.

విద్యార్దులకు ఉచితంగా ప్రవేశం

ఓయూలో సెంట్రల్ లైబ్రరీని డిజిటలైజ్ చేయాలి. ఇంటర్నేషనల్ జర్నల్స్, ఆన్‌లైన్ డేటాబేస్‌లకు విద్యార్థులకు, పరిశోధకులకు ఉచితంగా ప్రవేశం కల్పించాలి. క్యాంపస్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్, స్మార్ట్ క్లాస్‌రూమ్స్ పరిపాలనా విధానంలో పూర్తి డిజిటలైజేషన్‌ని అమలు చేయాలి. ముఖ్యంగా సుస్థితరమైన అడ్మినిస్ట్రేషన్, స్టూడెంట్ సెంట్రిక్ విధానాలు అవసరం. యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గిచి.. విద్యా రంగ నిపుణుల నేతృత్వంలో.. పరిపాలనా స్వయంప్రతిపత్తిని పెంచాలి. ఉద్యోగావకాశాలకు తగ్గట్లుగా, లేటెస్ట్ ట్రెండ్‌కి అనుగుణంగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలి. క్యాంపస్‌లో శాంతియుతమైన, నిర్మాణాత్మకమైన వాతావరణాన్ని ప్రోత్సహించాలి. క్యాంపస్ పాలిటిక్స్ విద్యారంగం నుంచి వేరుగా ఉంచే ప్రయత్నం చేయాలి.

ఓయూ పురోగతిపై ఎప్పటికప్పుడు రివ్యూ

ఓయూకు ఉన్న బ్రాండ్‌ను తిరిగి తీసుకురావడం.. కేవలం మౌలిక సదుపాయాల కల్పనతో సాధ్యమయ్యే పని కాదు. ఇదొక.. సంపూర్ణ సంస్కరణ ప్రక్రియ. ప్రభుత్వం నిరంతర నిధుల కేటాయింపుతో పాటు, సమర్థవంతమైన పాలన, నాణ్యమైన అధ్యాపకుల నియామకం, పరిశోధనకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే ఓయూ తిరిగి దేశంలోనే అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ఒకటిగా నిలవగలుగుతుంది. గడిచిన కొన్నేళ్లలో పోగొట్టుకున్న ప్రతిష్ఠను తిరిగి సంపాదించాలంటే.. విజన్, కమిట్‌మెంట్ ఉన్న ఓ దీర్ఘకాలిక ప్రణాళికను అమలు చేయాలి. దాని పురోగతిపై.. ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం ఎంతో అవసరం. ఓయూ అంటే ఓ యూనివర్సిటీ కాదు. అదొక ఉద్యమం. ఓ చరిత్ర. భవిష్యత్ తెలంగాణకు ఓ ముఖచిత్రం. దాని వైభవాన్ని తిరిగి తీసుకురావడం.. రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గొప్ప అవకాశం. అంతకుమించిన బాధ్యత!

Story by Anup, Big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×