E-Paper
Advertisement

CM Revanth: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. టెన్త్, ఇంటర్‌కు ఒకటే బోర్డ్

CM Revanth: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. టెన్త్, ఇంటర్‌కు ఒకటే బోర్డ్

గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ ఆచరణలోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాఠశాల విద్యా విధానంలో కీలక సంస్కరణలు అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది. యువత.. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా రవాణాని మరింత పెంచాలనే లక్ష్యం దిశగా.. ఆర్టీసీ బస్టాండ్లని ఆధునీకరించేందుకు నిధులు కేటాయించారు. ఇక.. ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో కలిసి.. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ఆడిన గేమ్.. అందరినీ ఆకర్షించింది.

శనివారం, డిసెంబర్ 13 మెస్సీ Vs సీఎం

ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం.. ది గోట్ లియోనల్ మెస్సీ.. తన ఇండియా టూర్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ఉప్పల్ స్టేడియంలో జరిగిన.. స్పెషల్
ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం వేలాది మంది అభిమానులు తరలివచ్చారు. మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతారని తెలియడంతో.. స్టేడియం కిక్కిరిసిపోయింది. మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరూ.. మ్యాచ్ చివరి ఐదు నిమిషాలు తమ జట్ల తరపున ఆడారు. ముందుగా చిన్నారులతో కూడిన జట్ల మధ్య 20 నిమిషాల పాటు ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. ఫుట్‌బాల్‌పై తనకున్న మమకారాన్ని పలుమార్లు చాటుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మెస్సీతో కలిసి ఆడటం.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరై మెస్సీ ఆటను వీక్షించారు. మెస్సీ టూర్ హైదరాబాద్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కి.. లైఫ్ టైమ్ మెమొరీగా మిగిలిపోయింది.

శుక్రవారం, డిసెంబర్ 12 బస్టాండ్లకు కొత్త లుక్

రాష్ట్రంలో అతి త్వరలో ఆర్టీసీ బస్టాండ్ల రూపురేఖలు మారనున్నాయి. దశాబ్దాల నాటి బస్టాండ్లను ఆధునీకరించడానికి, కొత్తవి నిర్మించడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 200 కోట్లు కేటాయించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక హంగులతో బస్టాండ్లు సిద్ధం కానున్నాయి. కోదాడ, హుజుర్‌నగర్ లాంటి ప్రాంతాల్లో కొత్త బస్టాండ్లు, మరికొన్ని చోట్ల విస్తరణ, పునర్నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. 2047 నాటికి ప్రజా రవాణాను 70 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఈ ప్రణాళిక అమలు కానుంది. ఇందులో భాగంగా.. వేల కోట్లతో రహదారుల నిర్మాణం, అభివృద్ధి చేపడుతోంది. రాష్ట్రంలోని చాలా చోట్ల బస్టాండ్‌లు దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయంతో బస్ స్టేషన్‌ల అభివృద్ధి పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాగా.. మరి కొన్ని ప్రాంతాల్లో టెండర్ల ప్రక్రియ, డిజైన్ తయారీ దశల్లో ఉన్నాయి. వీటితో పాటు వినియోగంలో లేని బస్టాండ్‌లను కూడా ప్రయాణీకుల కోసం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించుకుంది. అలానే మరి కొన్ని ఏరియాల్లో ప్రయాణీకుల రద్దీ, ఆదాయ మార్గాలను దృష్టిలో పెట్టుకొని కొత్త బస్టాండ్‌లను నిర్మించడంతో పాటు కొన్ని ఏరియాల్లో బస్సు డిపోలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గురువారం, డిసెంబర్ 11 టెన్త్, ఇంటర్‌కు ఒకే బోర్డు!

గ్లోబల్ సమ్మిట్ తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నీ ఆచరణలోకి వస్తున్నాయి. ఈక్రమంలోనే పాఠశాల విద్యా విధానంలో కీలక సంస్కరణలు అమలు చేయడానికి రేవంత్ సర్కార్ రెడీ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్, ఇంటర్‌ని.. ఒకే బోర్డు కిందకు తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు.. రాష్ట్రంలో పదో తరగతికి SSC, ఇంటర్ విద్యార్థుల కోసం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్‌ పనిచేస్తున్నాయి. ఈ విద్యార్థులకు ఈ రెండు బోర్డులు పరీక్షలు నిర్వహించి ఫలితాలను విడుదల చేసేవి. అయితే రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ పద్ధతిలో సరికొత్త మార్పులు రానున్నాయి. రాష్ట్రంలో ఇంటర్, పదో తరగతి బోర్డులను కలిపేసి తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు పేరిట ఒకటే బోర్డుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ 2047లో రేవంత్ సర్కార్ తెలిపింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సైతం దీనిపై స్పందిస్తూ.. రెండు బోర్డులు ఎందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పైగా దేశవ్యాప్తంగా కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఇలా పది, ఇంటర్ విద్యార్థుల కోసం రెండు వేర్వేరు బోర్డులున్నాయ్. అందువల్ల.. తెలంగాణ కూడా పది, ఇంటర్ రెండింటిని కూడా ఒకే బోర్డు కిందకు తెచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. దీనితో పాటు.. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించే విధానాలు, ఎగ్జామ్స్ నిర్వహణకు సంబంధించి అనేక మార్పులు చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలకు సంబంధించి నాణ్యత, విద్యా ప్రమాణాల గుర్తింపు కోసం తెలంగాణ స్కూల్‌ స్టాండర్డ్స్‌ అథారిటీని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా టీచర్ల మిగులు, కొరత లేకుండా చర్యలు తీసుకోనున్నారు. టీచర్-స్టూడెంట్ నిష్పత్తి ఆధారంగా.. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వినియోగించుకుంటారు.

గురువారం, డిసెంబర్ 11 వోక్సెన్‌లో సీఎం

యువత.. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ వారం ముఖ్యమంత్రి.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట కంకోల్‌లోని వోక్సెన్ యూనివర్సిటీని సందర్శించారు. అక్కడ విద్యార్థులు ఏర్పాటు చేసిన వివిధ విభాగాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ స్టాళ్లను సందర్శించి.. వారిని అభినందించారు. అదేవిధంగా.. వోక్సెన్ స్పోర్ట్స్ అకాడమీని కూడా పరిశీలించారు. ఇక.. ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీతో పోరు కోసం వోక్సెన్ యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి ప్రాక్టీస్ కోసం ఫుట్ బాల్ మ్యాచ్ ఆడారు. ఆటలో భాగంగా సీఎం రేవంత్‌ కొట్టిన కిక్‌లు, చేసిన పాస్‌లకు విద్యార్థులు కేరింతలు కొట్టారు.

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో.. రేవంత్ సర్కార్ కుంభస్థలాన్ని కొట్టింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ భవిష్యత్‌ని నిర్ణయించబోయే ఫ్యూచర్ సిటీలో.. ఈ వారం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్.. గ్రాండ్ సక్సెస్ అయింది. రెండు రోజుల ఆర్థిక సదస్సులో.. 5 లక్షల 75 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో ఉన్న కంపెనీల దగ్గర్నుంచి అంతర్జాతీయ కంపెనీలన్నీ.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ప్రభుత్వంతో ఎంవోయూలు కుదుర్చుకున్నాయ్. ఇక.. ఓయూకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు.. సీఎం రేవంత్ రెడ్డి వెయ్యికోట్లు మంజూరు చేశారు. అదేవిధంగా.. స్టార్టప్‌లని ప్రోత్సహించేందుకు వెయ్యి కోట్ల ఫండ్ కేటాయించారు.

బుధవారం, డిసెంబర్ 10 ఉస్మానియాకు మహార్దశ

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి.. పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ వారం ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన ముఖ్యమంత్రి.. వెయ్యి కోట్లు మంజూరు చేశారు. నిధుల విడుదల జీవోను.. విద్యార్థులకు అంకితమిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దశాబ్దాలుగా నిధులు, నియామకాల కొరతతో కళ తప్పిన ఓయూకు.. ఈ నిర్ణయం ఓ కొత్త ఊపిరి పోయనుంది. ఎందరో మేధావులను, మరెందరో నేతలను, ప్రజాప్రతినిధులను అందించిన ఓయూ.. గడిచిన కొన్నేళ్లలో నిధులు లేక, తగిన నియామకాలు లేక వెనకబడిపోయింది. హాస్టళ్లు, అకడమిక్ బ్లాక్‌లు శిథిలావస్థకు చేరాయ్. అలా.. ఓయూ తన ప్రాభవాన్ని, ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. అందువల్ల.. యూనివర్సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు.. నిధులు మంజూరు చేసింది. ఇది.. ఓయూలో మరమ్మత్తుల కోసమో, విద్యార్థి లోకం దృష్టిని ఆకర్షించడం కోసమో చేసింది కాదు. దీనిని.. భవిష్యత్ తరాలపై పెడుతున్న పెట్టుబడిగా చూస్తోంది రేవంత్ సర్కార్. ఉస్మానియా యూనివర్సిటీని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

సీఎం రేవంత్ రెడ్డి .. ఓయూకు 1000 కోట్లు మంజూరు గురించి..

ఓయూలో ఇప్పుడున్న భవనాలకు మరమ్మత్తులు చేయడంతో పాటు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త అకడమిక్ బ్లాక్‌లు, డిపార్ట్‌మెంట్ భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. విద్యార్థుల వసతి కొరతను తీర్చేందుకు.. అంతర్జాతీయ స్థాయిలో మెగా హాస్టళ్లను నిర్మించడంతో పాటు పాత హాస్టళ్లని పునరుద్ధరించనున్నారు. కాన్ఫరెన్స్‌లు, అంతర్జాతీయ సదస్సులకు అనుగుణంగా ప్రపంచ స్థాయి సమావేశ మందిరాలని నిర్మించనున్నారు. అత్యాధునిక పరికరాలు, మౌలిక వసతులతో కూడిన రీసెర్చ్ ల్యాబ్‌లతో.. ఓయూని రీసెర్చ్ సెంటర్‌గా తీర్చిదిద్దాలనే ప్రణాళికలున్నాయ్. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది కొరతను తీర్చేందుకు.. స్టాఫ్ భర్తీ కోసం కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఓయూకు పూర్వవైభవం తీసుకురావడంలో.. వెయ్యి కోట్ల నిధుల కేటాయింపు అనేది తొలి అడుగు మాత్రమే. అధ్యాపక నియామకాలు, నాణ్యమైన పరిశోధన, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారా.. ఓయూ తిరిగి దేశంలోనే అగ్రగామి యూనివర్సిటీల్లో ఒకటిగా నిలుస్తుంది.

బుధవారం, డిసెంబర్ 10 స్టార్టప్ హబ్

స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు.. వెయ్యి కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్ కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నిధులను సద్వినియోగం చేసుకుని స్టార్టప్ కంపెనీలను ప్రారంభించడమే కాకుండా కనీసం 1 బిలియన్ డాలర్ల కంపెనీలుగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాల క్రితం స్టార్టప్‌గా ప్రస్థానం ప్రారంభించిన గూగుల్‌.. ఇప్పడు ప్రపంచస్థాయిలో నిలిచిందన్నారు. ఆ సంస్థను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. టీహబ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన గూగుల్‌ ఫర్‌ స్టార్టప్‌ కేంద్రాన్ని సీఎం ప్రారంభించారు. హైదరాబాద్‌ను స్టార్టప్‌లకు కేంద్రంగా చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ నుంచి కనీసం 100 స్టార్టప్‌లు.. యూనికార్న్‌ కంపెనీలుగా ఎదగాలని ఆశించారు. దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌లో గూగుల్‌ ఫర్‌ స్టార్టప్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేయడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే ఎన్నో జీసీసీలు నగరంలో పెట్టుబడులు పెడుతున్నాయని.. స్టార్టప్‌లు కూడా ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకువెళ్లాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి

మంగళవారం, డిసెంబర్ 9 తెలంగాణ అన్‌బీటబుల్

రేవంత్ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గ్రాండ్ సక్సెస్ అయింది. కేవలం.. ఓ ఆర్థిక సదస్సుగా కాకుండా, భవిష్యత్ తెలంగాణకు ఒక రోడ్ మ్యాప్‌ని, భరోసాని ఇచ్చింది. ఈ సమ్మిట్ ఇంతటి గ్రాండ్ సక్సెస్ అవడానికి, ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు అట్రాక్ట్ అవడానికి.. రేవంత్ సర్కార్ అనుసరించిన విధానాలే కారణం. రానున్న రోజుల్లో.. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదనే నమ్మకాన్ని ఇచ్చాయ్. గ్లోబల్ సమ్మిట్‌తో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి.. సీఎం రేవంత్ ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ కూడా మరో కారణం. సమగ్ర అభివృద్ధి, లాంగ్ టర్మ్ విజన్ వేదికగా.. తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్‌ని తీర్చిదిద్దింది. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగడం మొదటి టార్గెట్ అయితే.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే లక్ష్యాన్ని, స్పష్టమైన రోడ్ మ్యాప్‌ని ఆవిష్కరించారు. అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి, తెలంగాణ సమగ్రాభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో రూపొందించిన.. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు పెట్టుబడుల సునామీ

గ్లోబల్ సమ్మిట్‌లో రెండో రోజు పెట్టుబడుల సునామీ కొనసాగింది. దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయి. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టార్, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, ఫిల్మ్ రంగాల్లో భారీ ప్రాజెక్టులు వచ్చాయ్. ఈ సమ్మిట్ ఇంతలా సక్సెస్ కావడానికి కారణం.. త్రీ జోన్ గ్రోత్ స్ట్రాటజీ. రాష్ట్రంలో సమతుల్య అభివృద్ధి కోసం, ఆర్థిక వ్యవస్థను మూడు ప్రత్యేక జోన్‌లుగా విభజించారు. క్యూర్ జోన్‌లో.. హైదరాబాద్‌ కేంద్రంగా హై-ఎండ్ సర్వీసెస్, టెక్నాలజీ, అర్బన్ ఇన్నోవేషన్ రంగాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ప్యూర్ జోన్‌లో.. నగర శివారు ప్రాంతాల్లో మ్యానుఫాక్చరింగ్, దాని అనుబంధ రంగాలను అభివృద్ధి చేయనున్నారు. రేర్ జోన్‌లో.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఉత్పాదకత, అగ్రి ప్రాసెసింగ్, గ్రామీణాభివృద్ధి చేపట్టనున్నారు. సమగ్ర తెలంగాణ అభివృద్ధి కోసం.. వ్యూహాత్మకంగా రాష్ట్రాన్ని సర్వీసెస్, ప్రొడక్షన్, అగ్రికల్చర్ పేరిట.. 3 జోన్లుగా విభజించింది ప్రభుత్వం. ఇదే.. ఇన్వెస్టర్లను బాగా అట్రాక్ట్ చేసింది. ఇంతటి స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేలా మార్చింది. ఇప్పటికే.. దేశ జనాభాలో దాదాపు 3 శాతం ఉన్న తెలంగాణ.. నేషనల్ జీడీపీలో 5 శాతం సమకూరుస్తోంది. 2047 నాటికి.. ఈ మొత్తాన్ని 10 శాతానికి పెంచడాన్నే లక్ష్యంగా పెట్టుకున్నారు.

సోమవారం, డిసెంబర్ 8 తెలంగాణ అన్‌స్టాపబుల్

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఊహించని స్థాయిలో పెట్టుబడుల వెల్లువ కనిపించింది. ఆర్థిక సదస్సు మొదలైన తొలి రోజు.. 2 లక్షల 43 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి.. కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నాయి. లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు చూశాక అందరికీ అనిపించింది ఒక్కటే.. తెలంగాణ రైజింగ్ అన్‌స్టాపబుల్‌ అని! ఈ జర్నీలో.. కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వం, మార్కెట్ ఎక్స్‌పర్ట్స్, పాలసీ మేకర్స్, కార్పొరేట్లు భాగస్వాములయ్యారు. చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా, సింగపూర్‌ని ఆదర్శంగా తీసుకుని.. ఆ దేశాలతో పోటీపడేందుకు తెలంగాణని సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. 2047 తెలంగాణ రైజింగ్‌ ప్రయాణంలో భాగంగా.. ఆ దేశాల పెట్టుబడులు, సహకారం, సమన్వయం కోసం వారిని ఆహ్వానించారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత.. దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం, ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రాంతంగా మారేందుకు.. ఇప్పుడిప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

కీలక రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

గ్లోబల్ సమ్మిట్‌తో.. పెట్టుబడుల సునామీ వచ్చింది. ఇది.. రాష్ట్ర ఆర్థిక చరిత్రలో ఓ మైల్ స్టోన్‌గా నిలిచింది. రాష్ట్ర భవిష్యత్తుని సరికొత్త దిశకు తీసుకెళ్లేలా, అంచనాలకు మించి భారీ పెట్టుబడులను ఆకర్షించింది. దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు.. కీలక రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయ్. రెండు రోజుల సమ్మిట్‌లో ఆకర్షించిన మొత్తం పెట్టుబడుల విలువ 5 లక్షల 75 వేల కోట్లు. ఒక్క పవర్ సెక్టార్‌లోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయ్. ఇండియాలో మరే రాష్ట్రం సాధించని విధంగా.. రెండు రోజుల్లో ఇంత భారీ మొత్తంలో పెట్టుబడుల్ని ఆకర్షించడం.. రికార్డుగా నిలిచింది. ఈ పెట్టుబడులన్నీ.. తెలంగాణ రైజింగ్-2047 విజన్ సాధనలో కీలకపాత్ర పోషించనున్నాయ్. గ్లోబల్ సమ్మిట్ ద్వారా వచ్చిన పెట్టుబడులు.. ప్రధానంగా రాష్ట్రం ఫోకస్ చేసిన.. డీప్ టెక్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, డేటా సెంటర్లు, విద్యుత్, కోర్ ఇన్‌ఫ్రా లాంటి భవిష్యత్ రంగాలమీదే ఉన్నాయ్. ఈ భారీ పెట్టుబడుల ద్వారా.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయ్. లక్షల కోట్ల పెట్టుబడులు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షకు పైగా ఉద్యోగాలను సృష్టిస్తాయనే అంచనాలున్నాయ్. ఈ పెట్టుబడులు కేవలం.. సంఖ్యలకే పరిమితం కాకుండా.. వివిధ రంగాల్లో ఉద్యోగాలను సృష్టించి.. రాష్ట్ర యువతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడుతుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకర్షించింది. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న మద్దతు, సుస్థిర విధానాలు పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగించాయ్. ఇది కేవలం.. పెట్టుబడుల సదస్సు మాత్రమే కాదు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తుకు కీలక మైల్ స్టోన్. ఈ ఇన్వెస్ట్‌మెంట్లు రాష్ట్రాభివృద్ధికి, ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పనకు, ఉద్యోగాల సృష్టికి బలమైన పునాదులు వేయనున్నాయ్. తెలంగాణ భవిష్యత్‌కి భరోసాగా నిలవనున్నాయ్.

Story By Anup, Big Tv 

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×