E-Paper
Advertisement

CM Revanth Reddy: సంక్రాంతి కానుక.. రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు

CM Revanth Reddy: సంక్రాంతి కానుక.. రైతులకు శుభవార్త.. ఖాతాల్లోకి డబ్బులు
Advertisement

CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త తెలిపింది. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా సాయాన్ని.. సంక్రాంతి కానుకగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఇక.. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అనర్హులందరినీ తొలగించి.. వారి స్థానంలో అర్హులైన వారికి పథకాలు అమలు చేసేందుకు సర్కార్ కార్యాచరణ మొదలుపెట్టింది. రాష్ట్రంలోని పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా.. రేవంత్ సర్కార్ కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌ను పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య కేంద్రాలుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

డిసెంబర్ 27 ఢిల్లీలో సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధానంగా దేశవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితులు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక.. తెలంగాణలో జనవరి 1 తర్వాతే మంత్రివర్గ విస్తరణ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. హైకమాండ్ పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీపైనా చర్చించారనే ప్రచారం సాగుతోంది.

డిసెంబర్ 26 సంక్రాంతికి రైతుభరోసా..

Advertisement

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యాసంగి సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో.. పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు భరోసా సాయాన్ని సంక్రాంతి కానుకగా.. రైతుల ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. ఈ మేరకు.. వ్యవసాయ శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టేసింది. రాష్ట్రంలో.. ఏటా రెండు సీజన్లకు కలిపి ఎకరాలకు 12 వేల పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వానాకాలం సీజన్‌లో కేవలం తొమ్మిది రోజుల్లోనే.. 9 వేల కోట్లను 69 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసి.. ప్రభుత్వం రికార్డు సృష్టించింది. రాబోయే యాసంగి సీజన్ కోసం కూడా అదే తరహాలో నిధుల పంపిణీ జరగనుంది. జనవరి తొలివారంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసి.. పండుగ లోపు నిధులు విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

రైతు భరోసా అమలులో కీలక మార్పు

ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కీలక మార్పులు చేస్తోంది. సాగు చేయని భూములకు కూడా నిధులు వెళ్తున్నాయనే విమర్శలతో.. ఈసారి టెక్నాలజీని జోడించింది. రాష్ట్రంలోని వ్యవసాయ భూములను.. శాటిలైట్ చిత్రాల ద్వారా పరిశీలిస్తున్నారు. ఏ భూమిలో పంట సాగు చేస్తున్నారు? ఏ భూమి ఖాళీగా ఉంది? అనే వివరాలను డిజిటల్ మ్యాపింగ్ ద్వారా సేకరించనున్నారు. కేవలం పంటలు సాగు చేసే రైతులకే పథకం వర్తించేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. సాగులో లేని రియల్ ఎస్టేట్ వెంచర్లు, గుట్టలు, బంజరు భూములకు సాయాన్ని నిలిపివేసే అవకాశం ఉంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గడంతో పాటు నిజమైన రైతులకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోటిన్నర ఎకరాల సాగు భూమికి మేలు జరగనుంది.

డిసెంబర్ 25 అనర్హులకు కట్

Advertisement

తెలంగాణ సర్కారు ఈ వారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అనర్హులైన పెన్షనర్లను తొలగించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. పేదలకు అందాల్సిన పెన్షన్లు పక్కదారి పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి రావడంతో.. సోషల్ ఆడిట్ నిర్వహించింది. ఇందులో.. వేలాది మంది అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లు తేలింది. వీళ్లందరికీ పెన్షన్ కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన పైలట్ ఆడిట్‌లో.. పెన్షన్ పంపిణీలో అనేక అవకతవకలు బయటపడ్డాయి. 20 నుంచి 25 వేల మంది లబ్ధిదారుల్లో.. 2 వేల మందికి పైగా అనర్హులని తేలింది. అర్హత నిబంధనల్లో.. అనేక ఉల్లంఘనలు బయటపడ్డాయ్.

సంపన్నులు, 50 ఏళ్లు లోపు వారు, వైకల్యం లేకున్నా వికలాంగ పెన్షన్లు పొందుతున్నవారు, లబ్ధిదారులు చనిపోయినా.. అక్రమంగా పెన్షన్లు పొందుతున్న వాళ్లంతా ఉన్నట్లు ఆడిట్‌లో తేలింది. త్వరలోనే.. ఈ ప్రాజెక్టుని అన్ని జిల్లాలకు విస్తరించనుంది. పేదలకు అందించే పథకాల్లో.. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు సైతం లబ్ధిదారులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాంతో వాళ్లందరినీ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, చివరకు ఉపాధి హామీ కూలీ డబ్బులను కూడా పొందుతున్నట్లు లెక్కల్లో తేలింది. దాదాపు 37 వేల మందికి పైగా ఉద్యోగులు వివిధ పథకాల్లో లబ్ధి పొందుతున్నట్లు బయటపడింది. వీరిలో.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇలాంటి అనర్హులందరినీ తొలగించి.. వారి స్థానంలో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

డిసెంబర్ 25 గ్రేటెస్ట్ గ్రేటర్

జీహెచ్‌ఎంసీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ పరిధిని ఔటర్ రింగ్ రోడ్‌ వరకు విస్తరించడంతో పాటు, జోన్లు సర్కిల్స్ సంఖ్యను పెంచుతూ అధికారిక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిల్స్‌ను 60కి పెంచారు. కొత్తగా ఏర్పాటైన జోన్లలో.. ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్‌గిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ ఉన్నాయి. ఈ కొత్త జోన్లలో ప్రత్యేక జోనల్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే, వార్డు ఆఫీసుల్లో కొత్త సర్కిల్ కార్యాలయాలు ఏర్పాటవుతాయి. త్వరలోనే కొత్త జోనల్, సర్కిల్ కార్యాలయాల ద్వారా పరిపాలన కొనసాగనుంది. జీహెచ్‌ఎంసీ వార్డుల డీ లిమిటేషన్‌పై కూడా ప్రభుత్వం ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 వార్డులను ఖరారు చేశారు. ఈ నిర్ణయంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిపాలన మరింత విస్తృతమవుతుంది. ప్రజలకు సమీపంలోనే జోనల్, సర్కిల్ కార్యాలయాలు ఉండటం వల్ల స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం కానున్నాయి. కొత్త వార్డుల ఏర్పాటుతో ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయ్.

డిసెంబర్ 25 అందరికీ నాణ్యమైన వైద్యం

తెలంగాణలో పేదలకు నాణ్యమైన వైద్యాన్ని అందించే దిశగా.. రేవంత్ సర్కార్ కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లాంటి ఆస్పత్రులపై భారం తగ్గించేలా.. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌ను పూర్తిస్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య కేంద్రాలుగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో.. అత్యున్నత వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆయన సూచించారు.

తెలంగాణలో ప్రస్తుతం 36 మెడికల్ కాలేజీలున్నాయ్. ప్రతి కాలేజీకి అనుబంధంగా టీచింగ్ హాస్పిటల్ ఉంది. వీటిలో కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ లాంటి విభాగాలకు సంబంధించిన నిపుణులైన ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ, అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయాల కొరతతో.. పూర్తి స్థాయిలో సేవలు అందించలేకపోతున్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు.. ప్రభుత్వం భారీ కార్యాచరణను రూపొందించింది. జిల్లాల్లోని టీచింగ్ హాస్పిటల్స్‌కు అవసరమైన క్యాథ్ ల్యాబ్‌లు, ఎండోస్కోపీ యూనిట్లు, డయాగ్నస్టిక్ పరికరాలు తక్షణమే సమకూర్చాలని నిర్ణయించింది. జిల్లా స్థాయిలో చికిత్స చేయగల కేసులను హైదరాబాద్‌కు పంపకుండా, అక్కడే మెరుగైన వైద్యం అందేలా స్పష్టమైన నిబంధనలు అమలు చేయనున్నారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు ఆర్థికంగా, మానసికంగా పెద్ద ఊరట లభించనుంది.

పంచాయతీ పాలకవర్గాలకు సీఎం శుభాకాంక్షలు

కొత్తగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి పాలన అందించి, ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దాలన్నారు. పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అదనపు నిధులిస్తామని ప్రకటించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం.. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై అన్ని శాఖల ఉన్నతాధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో.. ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకూడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 26 లోగా అద్దె భవనాల్లో ఉన్న ఆఫీసులు ఖాళీ చేయాలని ఆదేశించారు.

డిసెంబర్ 24 సర్పంచ్‌లతో ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. సీఎం ప్రత్యేక నిధి నుంచి.. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు అందిస్తామని ప్రకటించారు. రాబోయే కొత్త సంవత్సరంలో.. మేజర్ గ్రామ పంచాయతీలకు 10 లక్షల చొప్పున, చిన్న గ్రామ పంచాయతీలకు 5 లక్షల చొప్పున నిధులు అందజేస్తామన్నారు.

గ్రామ సభలు పెట్టుకుని అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని, ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాలని.. సీఎం సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్ల కోసం.. కోస్గి కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయతీ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి.. దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం సర్పంచులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. మార్చి 31 లోపు గ్రామ పంచాయతీలకు రావలసిన 3 వేల కోట్లు తెప్పించే బాధ్యత తాను తీసుకుంటానన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకాలు ప్రకటించిన సీఎం

రాష్ట్రంలో పడావు పెట్టిన ప్రాజెక్టులకు అనుమతులు సాధిస్తూ.. ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, ఎస్‌ఎల్‌బీసీ, పాలమూరు- రంగారెడ్డి, మక్తల్‌-నారాయణపేట ప్రాజెక్టులేవీ గత పదేళ్లలో పూర్తి చేయలేదని.. వాటన్నింటిని తమ ప్రభుత్వం చేపడుతుందన్నారు. చదువు ఒక్కటే నిరుపేదల జీవితాలను మార్చగలదన్నారు సీఎం. అందుకే.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం అందించే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్తగా రేషన్‌ కార్డులు ఇచ్చామన్నారు సీఎం. ఇంకా ఎవరికైనా రాకపోతే సర్పంచులు ఇళ్లిళ్లు తిరిగి తేల్చితే.. ఇంకా రేషన్ కార్డులు రానివారికి ఇప్పించే బాధ్యత ప్రభుత్వానిదన్నారు. కొడంగల్ ప్రజలు నిండుమనసుతో ఆశీర్వదించినందువల్లే.. ముఖ్యమంత్రిని కాగలిగానన్నారు సీఎం రేవంతర్ రెడ్డి.

డిసెంబర్ 23 తెలంగాణ రైజింగ్

రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం.. తెలంగాణ రైజింగ్‌ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ఈవారం దిశానిర్దేశం చేశారు. పక్కా భవిష్యత్తు ప్రణాళికతో.. తెలంగాణని కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరీ-అర్బన్ రీజియన్ ఎకానమీ, రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ ప్రాంతాల వారీగా సమగ్రమైన అభివృద్ధికి.. అన్ని విభాగాలు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. విజన్ డాక్యుమెంట్‌ కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా.. ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించామని.. మరికొన్ని అంశాల్లో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నామని తెలిపారు.

గతంలో విద్యుత్, విద్య, ఇరిగేషన్, ఆరోగ్యం లాంటి శాఖలకు సంబంధించి.. నిర్దిష్టమైన పాలసీ లేని కారణంగా సమస్యలొచ్చాయన్నారు. అందుకోసమే.. కీలక విభాగాలకు ప్రత్యేక పాలసీ తీసుకొచ్చినట్లు తెలిపారు. లక్ష్యాలను సాధించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదన్నారు. పనితీరులో మార్పు రావాలని సూచించారు. ఇకపై.. వివిధ శాఖల కార్యదర్శులు ప్రతి నెలా తెలంగాణ సీఎస్‌కి నివేదికలు సమర్పించాలన్నారు. ఐఏఎస్ అధికారులు ప్రతి 10 రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లి.. పరిస్థితులను పరిశీలించాలన్నారు. నెలలో కనీసం మూడు సార్లు తమ శాఖ పరిధికి సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలన్నారు. శాఖల మధ్య, అధికారుల మధ్య సమన్వయం కోసం ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తెలంగాణ రైజింగ్‌ లక్ష్యాల సాధన దిశగా అన్ని విభాగాలు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

జనవరి 26లోపు ఖాళీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం

రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకూడదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 26 లోపు అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలు ఖాళీ చేసి.. అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్నారు. ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే.. ఖాళీ స్థలాలను గుర్తించి నిర్ణీత గడువులోగా సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలన్నారు. ఇతర విభాగాలు, శాఖలకు చెందిన భవనాలుంటే వాటిని వినియోగించుకోవాలన్నారు. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టళ్లు, అంగన్వాడీలు అన్నింటికీ సొంత భవనాలు ఉండేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు సీఎం. సీఎస్ఎస్ నుంచి వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పెట్టుబడులు, విద్య–వైద్యంపై సీఎం కీలక ఆదేశాలు

జనవరి 31 లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ ఫైలింగ్ విధానం అమలు చేయాలన్నారు సీఎం. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులకు సంబంధించి.. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ, భూ కేటాయింపులకు అవసరమైన మేరకు ప్రత్యేకంగా అధికారులన నియమించాలన్నారు. కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, టీచింగ్ హాస్పిటల్స్ అన్నింటిలోనూ.. మెరుగైన వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దాలన్నారు. నిమ్స్ తరహాలో సనత్‌నగర్‌, కొత్తపేట, అల్వాల్‌ టిమ్స్‌, వరంగల్ హాస్పిటల్, ఉస్మానియా కొత్త ఆసుపత్రి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఉండాలన్నారు.

డిసెంబర్ 22 బాధ్యులై ఉండాలి!

గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల విధులు, బాధ్యతలకు సంబంధించి సమగ్ర సమాచారంతో రూపొందించిన.. గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధుల కరదీపికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఈ వారం ఆవిష్కరించారు. పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం.. గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలకు సంబంధించి 292 పేజీలతో తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ ఈ పుస్తకాన్ని తయారుచేసింది. ఈ కరదీపికను ప్రభుత్వం గ్రామ పంచాయతీ ప్రజా ప్రతినిధులకు అందించనుంది.

డిసెంబర్ 21 మేడారం జాతరకు వేళాయె

అతిపెద్ద ఆదివాసీ ఆధ్యాత్మిక వేడుక.. మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర 2026 పోస్టర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. మేడారం మహా జాతర వచ్చే జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. చరిత్రలో పేద జనుల కోసం పోరాడి, బలహీనుల పక్షాన నిలిచి త్యాగాలు చేసిన వాళ్లు.. సమ్మక్క-సారలమ్మ. వారి సంస్కృతే మన అస్థిత్వం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారి పోరాటాలే తెలంగాణ చరిత్ర అని, వారి త్యాగాలు తరతరాల స్ఫూర్తి అని స్పష్టం చేశారు. సమ్మక్క-సారక్క మనుషుల్లో దేవుళ్లన్నారు. వన దేవతల చరిత్రను మరింత గొప్పగా.. రేపటి తరాలకు అందించే దైవ సంకల్పంతో.. ప్రజాప్రభుత్వం మేడారం అభివృద్ధి పనులను చేపట్టినట్లు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Story by Anup, Big Tv 

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×